పుజారా లేకుంటే ఆస్ట్రేలియాలో భారత్ పరిస్థితి ఎలా ఉండేది?

ఫొటో సోర్స్, Getty Images
ఆగస్ట్, 2018. భారత క్రికెట్ జట్టు విరాట్ కోహ్లీ నేతృత్వంలో ఇంగ్లండ్‌లో పర్యటిస్తున్న సమయం అది.
కోహ్లీ మొదటి టెస్టుకు టీమ్‌ను ప్రకటించినపుడు దానిలో ఛతేశ్వర్ పుజారా పేరు లేదు.
అప్పుడు పుజారా ఫామ్‌లో లేడు. కౌంటీ క్రికెట్‌లో యార్క్‌షైర్ తరపున ఆడిన పుజారా అక్కడ పెద్దగా పరుగులు చేయలేకపోయాడు.
అందువల్ల పుజారా స్థానంలో కోహ్లీ కేఎల్ రాహుల్‌ను తీసుకున్నాడు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
దటీజ్ పుజారా
అయితే, మొదటి టెస్టులో లేకున్నా, పుజారా మాత్రం జట్టుకు తన సేవలు అందజేస్తూనే ఉన్నాడు.
రెండో రోజు ఆట ప్రారంభానికి ముందు, ఓపెనర్ మురళీ విజయ్‌తో కలిసి అతను చాలా సేపు ప్రాక్టీస్ చేశాడు.
పుజారా స్వభావం ఎలాంటిదో చెప్పేందుకు ఇది ఒక ఉదాహరణ.
బర్మింగ్‌హామ్‌లో రాహుల్ విఫలం కావడంతో భారతదేశ క్రికెట్ అభిమానులు పుజారాను తీసుకోకపోవడంపై భారత టీమ్ మేనేజ్‌మెంట్‌పై సోషల్ మీడియాలో విరుచుకుపడ్డారు. చివరకు పుజారా లార్డ్స్ టెస్ట్‌లో జట్టులోకి రావడం.. సిరీస్‌లో ఒక సెంచరీ, మరో అర్థ సెంచరీ చేయడం జరిగాయి.
అయితే టెస్టుల్లో నెంబర్ వన్ స్థానంలో ఉన్న భారత్ ఆ సిరీస్‌లో ఇంగ్లండ్ చేతిలో ఘోరంగా ఓడిపోయింది.

ఫొటో సోర్స్, Getty Images
ఆస్ట్రేలియా టూర్‌లో ఒత్తిడి
భారత్ ఆస్ట్రేలియా టూర్ ప్రారంభించినపుడు ఇంగ్లండ్ సిరీస్ వైఫల్యమే కోహ్లీని వెంటాడుతూ ఉంది.
రాహుల్, మురళీ విజయ్‌ల ఓపెనింగ్ జంట క్రమం తప్పకుండా విఫలమౌతోంది. అలాంటి సమయంలో ఎక్కువ సేపు క్రీజ్‌లో పాతుకుపోయి, బౌలర్లు అలసిపోయేలా చేసే బ్యాట్స్‌మ్యాన్ అవసరం భారత్‌కు చాలా ఉంది.
అడిలైడ్‌లో జరిగిన మొదటి టెస్టులోనే పుజారా కోహ్లీ చింత తీర్చేశాడు. ఆ టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో పట్టుదలగా ఆడి 123 పరుగులు చేశాడు.
ఆ ఇన్నింగ్స్ చాలా ప్రత్యేకం. ఎందుకంటే అతను ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే క్రీజులోకి వెళ్లి, మొత్తం 246 బంతులు ఎదుర్కొన్నాడు. చివరికి తొమ్మిదో ఆటగాడిగా ఔటయ్యాడు. రెండో ఇన్నింగ్స్‌లో భారత ఆటగాళ్లలో అత్యధిక రన్స్ చేసిన ఆటగాడిగా నిలిచిన పుజారా భారత్ మొదటి టెస్టులో విజయం సాధించడంలో ముఖ్యపాత్ర పోషించి, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.

ఫొటో సోర్స్, Getty Images
'గోడ'గా నిలిచిన పుజారా
మొదటి టెస్టు మ్యాచ్ తర్వాతే టీమ్ మేనేజ్‌మెంట్‌కు, కెప్టెన్‌కు పుజారా ప్రాధాన్యం తెలిసివచ్చింది.
గతంలో పుజారా మరీ నెమ్మదిగా ఆడుతున్నాడని, అతనిపై ఒత్తిడి ఉండేది.
అయితే, అడిలైడ్ టెస్టుతో పుజారా టెస్టు మ్యాచుల్లో వేగంగా ఆడడం కన్నా, ఎక్కువ సేపు నిలబడి వికెట్ కాపాడుకోవడం ముఖ్యమని నిరూపించాడు.
రెండో టెస్ట్ మ్యాచ్‌లో పుజారా రెండు ఇన్నింగ్స్‌లో సరిగా ఆడలేకపోయాడు. దీంతో మ్యాచ్ కంగూరూల వశమైంది.
ఆ తర్వాత మెల్‌బోర్న్‌లో పుజారా మరోసారి విరాట్ కోహ్లీతో కలిసి మారథాన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఇద్దరూ కలిసి 400కు పైగా బంతుల్ని ఎదుర్కొని, 170 పరుగుల భాగస్వామ్యం పంచుకున్నారు. భారత బ్యాట్స్‌మెన్‌ను ఔట్ చేయడానికి ఆస్ట్రేలియా బౌలర్లు మూడు కొత్త బంతులు తీసుకోవాల్సి వచ్చింది.
పుజారా ఇక్కడ కూడా మొత్తం 319 బంతుల్ని ఎదుర్కొని 106 పరుగులు చేశాడు.

ఫొటో సోర్స్, Getty Images
నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 2-1 ఆధిక్యంలో నిలిచాక, ఆస్ట్రేలియా ఒకవైపు కోహ్లీ, రహానేలాంటి బ్యాట్స్‌మెన్ కోసం వ్యూహాలు పన్నుతుంటే మరోవైపు పుజారా తాపీగా బంతి మెరుపును తగ్గించడంలో నిమగ్నమయ్యాడు.
రన్స్ విషయానికి వస్తే ఇప్పటివరకు సిరీస్‌లో పుజారా 458 రన్స్‌తో మొదటి స్థానంలో ఉన్నాడు. 282 పరుగులు చేసిన కోహ్లీ అతని తర్వాత స్థానంలో ఉన్నాడు. అంటే పరుగుల రేసులో పుజారా కోహ్లీ కన్నా చాలా ముందున్నాడు.
కేవలం రన్స్ విషయంలోనే కాదు, బాల్స్ విషయంలో కూడా. పుజారా ఇప్పటివరకు 1135 బంతులు ఎదుర్కొన్నాడు.
పరుగుల విషయంలో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ పుజారాతో పోలిస్తే చాలా వెనుకబడి ఉన్నారు. ఆ జట్టులో ట్రావిస్ హెడ్ 217 పరుగులతో మొదటి స్థానంలో ఉన్నాడు. అది పుజారా పరుగుల్లో సగం కూడా కాదు.
బాల్స్ విషయంలో కూడా అంతే. ఆస్ట్రేలియా తరపున ఉస్మాన్ ఖ్వాజా అత్యధికంగా 509 బంతులు మాత్రమే ఎదుర్కొన్నాడు.

ఫొటో సోర్స్, Getty Images
స్పిన్ ఆడడంలో స్పెషలిస్ట్
ఈ సిరీస్‌లో ఇప్పటివరకు ఆస్ట్రేలియా బౌలర్లలో అత్యంత ప్రభావం చూపిన బౌలర్ - ఆఫ్ స్పిన్నర్ నాథన్ లయాన్. అయితే పుజారా అతని బౌలింగ్‌ను కూడా ఎలాంటి ఇబ్బందీ లేకుండా ఆడాడు. పుజారా లయాన్ నుంచి 364 బంతులు ఎదుర్కొని 164 పరుగులు సాధించాడు.
మెల్‌బోర్న్‌లో విజయం సాధించాక విరాట్ కోహ్లీ పుజారాకు టీమ్‌కు చాలా ముఖ్యమైన వాడని ప్రశంసించాడు. ఒకపక్క పుజారా పాతుకుపోయి ఆడుతుంటే అవతలి వైపు బ్యాట్స్‌మ్యాన్ ఎలాంటి వత్తిడి లేకుండా ఆడవచ్చని కోహ్లీ అన్నాడు.
''పుజారా టీమ్‌లో ఉంటే మిగతా ఆటగాళ్లు తమ సహజసిద్ధమైన ఆటను ఆడొచ్చు. అందుకే ఈ సిరీస్‌లో మేం విజయవంతమయ్యాం'' అన్నాడు.

ఫొటో సోర్స్, Getty Images
సిడ్నీ టెస్టులో పుజారా తన కెరీర్‌లో 18వ సెంచరీ నమోదు చేశాడు. ఈ సిరీస్‌లో అతనికిది మూడో సెంచరీ. గణాంకాల విషయానికి వస్తే, అతను ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్‌లో అత్యధిక సెంచరీలు సాధించిన మూడో బ్యాట్స్‌మ్యాన్‌గా నిలిచాడు.
సిడ్నీ టెస్టులో మరో విశేషం ఏమిటంటే, ఇక్కడ పుజారా కొంచెం దూకుడుగా ఆడాడు. మొత్తం 250 బంతులను ఎదుర్కొన్న పుజారా 16 ఫోర్లతో 130 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.
బహుశా ఇకపై పుజారాను నిర్లక్ష్యం చేయడం కోహ్లీకి కానీ, అవతలి టీమ్‌కు కానీ అసాధ్యమేమో.
ఇవి కూడా చదవండి:
- ఇటలీలో ఉత్తర కొరియా రాయబారి 'కనిపించుట లేదు'
- శబరిమల: బీజేపీ హిందుత్వ వాదాన్ని సీపీఐ(ఎం) ఎదుర్కోగలదా?
- పాస్‌పోర్టు ఎలా పుట్టింది... ఏ దేశం పాస్‌పోర్టును ఫోర్జరీ చేయడం అసాధ్యం?
- ఒక్క వంటపాత్ర లేకుండానే నోరూరించే బిర్యానీ రెడీ
- చైనా - తైవాన్ దేశాలు ఎందుకు విడిపోయాయి...
- బెజవాడ అంటే ఆటోనగరే కాదు, అది పుస్తకానికి మరో పేరు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








