ఇటలీలోని ఉత్తర కొరియా రాయబారి 'కనిపించుట లేదు'

ఉత్తర కొరియా

ఫొటో సోర్స్, Getty Images

ఇటలీలోని ఉత్తర కొరియా రాయబారి అదృశ్యమయ్యారని దక్షిణ కొరియా గూఢచర్య విభాగం వెల్లడిచేసింది.

ఉత్తర కొరియా దేశానికి చెందిన ఉన్నత స్థాయి దౌత్యవేత్త ఒక పాశ్చాత్య దేశాన్ని ఆశ్రయం కోసం అర్థించారనే నిరాధార వార్తలు వినిపిస్తున్న తరుణంలో ఈ ప్రకటన వెలువడింది.

ఇటలీ రాజధాని రోమ్ నగరంలో ఉన్న ఉత్తర కొరియా రాయబారి జో సాంగ్-గిల్. ఆయన తండ్రి, మామ ఇద్దరూ ఉత్తర కొరియాలో చాలా ఉన్నతమైన పదవుల్లో ఉన్నారు.

యాంగ్-హో

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, బ్రిటన్‌లోని ఉత్తర కొరియా రాయబారి యాంగ్-హో 2016 నుంచి దేశాన్ని వదిలేశారు

ఇటీవల చివరిసారిగా దేశం విడిచి వెళ్ళిపోయిన ఉన్నతాధికారి లండన్‌లోని డిప్యూటీ అంబాసిడర్ థే యాంగ్-హో 2016లో తన పదవిని వదిలేసి భార్య, పిల్లలతో దక్షిణ కొరియాకు వెళ్ళిపోయారు.

ఉన్నత శ్రేణి అధికారి ఒకరు అలా దేశం విడిచి వెళ్ళిపోవడం ఉత్తర కొరియాలోని కిమ్ జోంగ్-ఉన్ ప్రభుత్వానికి చెంపపెట్టులా మారింది. దేశ ప్రజల్లో కిమ్‌కు ఉన్న స్థానం ఏమిటో గుర్తు చేసేందుకు ఈ విషయాన్ని ఉత్తర కొరియాలో ప్రచారం చేయాలని కూడా ఆయన ప్రపంచ దేశాలను కోరారు.

గురువారం నాడు గూఢచర్య విభాగం నుంచి సమాచారాన్ని తెలుసుకున్న ప్రభుత్వ ఎం.పి కిమ్ మిన్-కీ విలేఖరులతో మాట్లాడుతూ, జో సాంగ్-గిల్ రోమ్ రాయబార కార్యాలయం నుంచి పారిపోయి నెల రోజులకంటే ఎక్కువే అవుతోందని తెలిపారు.

"తాత్కాలిక అంబాసిడర్ జో సాంగ్-గిల్ పదవీ కాలం గత ఏడాది నవంబర్‌తో ముగిసింది. నవంబర్ నెల మొదట్లోనే ఆయన దౌత్య కార్యాలయం నుంచి తప్పించుకున్నారు" అని ఎం.పి చెప్పారు.

జో సాంగ్-గిల్

ఫొటో సోర్స్, Google

ఫొటో క్యాప్షన్, జో సాంగ్-గిల్ ఇటలీలో ఉత్తర కొరియాకు చెందిన అత్యున్నత అధికారి

ఉత్తర కొరియా దేశం నుంచి పారిపోతున్న వాళ్ళను దక్షిణ కొరియాకు చెందిన నేషనల్ ఇంటలిజెన్స్ సర్వీస్ విచారిస్తుంది. ఈ సంస్థ జో సాంగ్-గిల్ మరో దేశానికి పారిపోయే ప్రయత్నంలో ఉన్నారని మాత్రం ధ్రువీకరించలేదు.

జో సాంగ్-గిల్ భార్య కూడా ఆయనతో పాటే ఉన్నట్లు భావిస్తున్నారు.

అయితే, ఆయన ఆశ్రయం కోసం అభ్యర్థన పెట్టుకున్నట్లు తమ వద్ద రికార్డు ఏమీ లేదని ఇటలీ విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.

జో సాంగ్-గిల్‌ స్థానంలో మరొకరిని నియమిస్తున్నట్లు గత ఏడాది ఉత్తర కొరియా ప్రభుత్వం నుంచి లేఖ అందిన తరువాత ఆయనతో తమ అధికారులు మాట్లాడింది లేదని ఇటలీ దౌత్యవర్గాలు వివరించాయి.

కాగా, జో సాంగ్ తమ కుటుంబంతో పాటు "సురక్షిత ప్రదేశంలో" ఉన్నారని దౌత్య వర్గాల ద్వారా తమకు సమాచారం అందిందని దక్షిణ కొరియా దినపత్రిక జూంగ్ఆంగ్ రిపోర్ట్ చేసింది.

జో సాంగ్-గిల్ ఎక్కడున్నారు?

సియోల్‌లోని బీబీసీ ప్రతినిధి లారా బికర్ ఈ పరిణామాన్ని విశ్లేషిస్తూ, ఉత్తర కొరియాకు చెందిన ఒక ఉన్నత స్థాయి అధికారి దేశం నుంచి వెళ్ళిపోవాలనుకోవడం ఆ దేశ అధినేత కిమ్ జోంగ్-ఉన్‌ను చాలా ఇబ్బందికర పరిస్థితిలో పడేస్తుందని అన్నారు. దౌత్యవేత్తలు ఎవరైనా దేశం వదలి వెళ్ళిపోతే దాని వెనుక దక్షిణ కొరియా, అమెరికా దేశాలే ఉన్నాయంటూ ఉత్తర కొరియా అధికారిక మీడియా తరచూ ఆరోపిస్తుంటుంది.

ఇటాలియా

ఫొటో సోర్స్, Getty Images

అలాంటివారిని.. తమ దేశాన్ని, ప్రజలను వంచించిన ద్రోహులుగా ఉత్తర కొరియా చూస్తుంది. పారిపోయిన వాళ్ళేమో, తమ కుటుంబ సభ్యులెవరైనా దేశంలో ఉంటే వారిని ప్రభుత్వం అనేక రకాలుగా వేధిస్తుందని చెబుతుంటారు.

ఇంతకీ, 48 ఏళ్ళ జోసాంగ్-గిల్ ఎక్కడున్నారు? ఆయన నిజంగానే ఏదైనా దేశాన్ని ఆశ్రయం కోసం అర్థించారా? సాంగ్, ఆయన కుటుంబ సభ్యులు సురక్షితంగా ఉన్నట్లు స్పష్టమయ్యేంత వరకు ఏ దేశం కూడా ఆయన వివరాలు వెల్లడించే అవకాశం లేదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)