‘హాస్పిటల్ నుంచి రాగానే తమ్ముడిని ఎత్తుకుందామని వెళ్లాను... నాకు చేతుల్లేవని గుర్తొచ్చి అక్కడే ఆగిపోయాను’

బీబీసీ తెలుగు

పాకిస్తాన్‌కు చెందిన ఈ బాలిక పేరు సబా గుల్. అయిదేళ్ల వయసు ఉన్నప్పుడు ప్రమాదవశాత్తు రెండు చేతులూ కోల్పోయింది. అయితే, ఆమెలోని ఆత్మస్థైర్యం మాత్రం వీసమెత్తు కూడా చెదరలేదు.

ప్రస్తుతం సబా వయసు 15 ఏళ్లు.

"నాకు చేతులు లేవు. కానీ, కాళ్లు ఉన్నాయ్ కదా!’’ అంటూ అన్ని పనులనూ కాళ్లతోనే చక్కగా చేసేస్తోంది సబా. అందరితోపాటే బడికి వెళ్లి చదువుకుంటోంది.

బాగా చదువుకుని పాకిస్తాన్‌ సమాజంలో మార్పు తెస్తానని, మానవ హక్కుల పరిరక్షణ కోసం పనిచేస్తానని అంటోంది.

ఆమె కాళ్లు ఎలా కోల్పోయింది? తన లక్ష్యాలేమిటి? అన్నది ఆమె మాటల్లోనే...

వీడియో క్యాప్షన్, వీడియో: బాగా చదువుకుని పాకిస్తాన్ సమాజంలో మార్పు తీసుకొస్తా

"అప్పుడు నాకు అయిదేళ్లు. ఓ రోజు ఆడుకునేందుకు మా ఇంటి మిద్దె మీదకు వెళ్లాను. మిద్దె మీద కరెంట్ తీగ ఉంది. పొరపాటున రెండు చేతులతో ఆ తీగను పట్టుకుని లాగాను. దాంతో షాక్ కొట్టి నా రెండు చేతులూ కమిలిపోయాయి. వెంటనే మావాళ్లు నన్ను ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఏం చేయాలో డాక్టర్లకు కూడా అర్థం కాలేదు. నా చేతులను బాగు చేయలేకపోయారు. రెండింటినీ తొలగించారు.

ఆ ప్రమాదం జరిగినప్పుడు నాకు మూడు నెలల తమ్ముడు ఉన్నాడు. కొన్ని రోజులకు ఆస్పత్రి నుంచి ఇంటికి రాగానే వాడిని ఎత్తుకుని ముద్దాడేందుకు పరుగెత్తుకుంటూ వెళ్లాను. నాకు చేతులు లేవు కాబట్టి వాడిని ఎత్తుకోలేకపోతున్నానని అప్పుడు అర్థమైంది. కొంతసేపు అక్కడే నిలబడిపోయాను. ఆ బాధను ఎప్పటికీ మరచిపోలేను.

కాలుతో ఫోన్ వాడుతున్న బాలిక

నా పరిస్థితిని చూసి మా అమ్మ తట్టుకోలేకపోయింది. ఎప్పుడూ బోరున ఏడుస్తుండేది. ఏడవొద్దమ్మా.. అని నేను చెబుతుండేదాన్ని.

చేతులు లేని అమ్మాయిని బడికి పంపినా ఫలితం ఉండదని ఇరుగుపొరుగువాళ్లు మా అమ్మానాన్నలతో అనేవారు. ఆ మాటలు నాలో పట్టుదలను మరింత పెంచాయి. వాళ్ల అభిప్రాయం తప్పు అని నిరూపించాలనుకున్నా. అందరితోపాటూ, నేను కూడా ఏదైనా సాధించగలను అని చాటి చెప్పాలనుకున్నా.

బాలిక కాళ్లు

లా చదివి మహిళల హక్కులు, మానవ హక్కుల కోసం పనిచేయాలని ఉంది. వివిధ ప్రాంతాలు తిరిగి మా సంస్కృతికి, వారి సంస్కృతులకు మధ్య ఎలాంటి వ్యత్యాసాలు ఉన్నాయో తెలుసుకోవాలని ఉంది. పాకిస్తాన్ సమాజంలో సానుకూల మార్పులు తేవాలని అనుకుంటున్నాను.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)