Fact Check: బీజేపీ కార్యకర్తలు నిజంగానే గోమాంసాన్ని తరలించారా... ఆ వైరల్ వీడియో నిజమేనా?

ఫొటో సోర్స్, Facebook
గుజరాత్‌లో బీజేపీ కార్యకర్తలు కొందరు అక్రమంగా గోమాంసాన్ని తరలిస్తున్నారంటూ చూపించే వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఒక్క ఫేస్‌బుక్‌లోనే దానికి దాదాపు పది లక్షల వ్యూస్ వచ్చాయి.
ఆ వీడియో మొదటి భాగంలో వీధిలో కూర్చున్న ఓ వ్యక్తి, పక్కనే మాంసపు కుప్పలు కనిపిస్తాయి. అతడి చుట్టూ చాలామంది మూగి చూస్తున్నట్లు కూడా కనిపిస్తుంది. ఆ వీడియో వెనక కామెంటరీలో ‘బ్రేకింగ్ న్యూస్. బీజేపీ కార్యకర్తలు అక్రమంగా గోమాంసాన్ని తరలిస్తూ దొరికిపోయారు’ అన్న మాటలు వినిపిస్తాయి.
వీడియో రెండో భాగంలో ఓ కారు డిక్కీ మొత్తం మాంసంతో నిండినట్లు కనిపిస్తుంది. ఆ మాంసం ఆవుది అనే చెప్పే మాటలు వెనక నుంచి వినిపిస్తాయి.
ఈ వీడియోలోని అంశాలు నిజమా కాదా అనే విషయాన్ని బీబీసీ పరిశీలించింది. మా పరిశీలనలో ఈ వీడియోలోని అంశాలు పూర్తిగా ఫేక్ అని తేలింది.
మూడు నెలల క్రితం సాక్షి శర్మ అనే వ్యక్తి పబ్లిక్ ఎకౌంట్‌లో మొదట ఈ వీడియోను షేర్ చేశారు. ఆ తరువాత దాన్ని లక్షల మంది చూశారు. చాలామంది ఆ వీడియోను పంచుకున్నారు.

ఫొటో సోర్స్, Facebook
ఆ వీడియోలోని మొదటి ఫొటో ఝార్ఖండ్‌లో జరిగిన ఒక మూకదాడికి సంబంధించింది. 2017 జూన్ 29న గోమాంసాన్ని తరలిస్తున్నాడనే అనుమానంతో అలీముద్దిన్ అన్సారీ అనే వ్యక్తిపై మూక దాడి చేసింది. ఆ దాడిలో అతడు చనిపోయాడు.
కొందరు హిందూ అతివాద కార్యకర్తలను ఆ కేసులో అరెస్టు చేశారు. కోర్టు వారికి శిక్ష కూడా విధించింది.
అలీముద్దిన్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడని, తనకు ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదని అతని భార్య చెప్పారు.
వీడియో రెండో భాగంలో కనిపించే కారు నంబర్ ప్లేట్‌ను బట్టి అది గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన కారుగా తెలుస్తోంది. ఆ నంబర్ ప్లేట్ పైన బీజేపీ ‘కమలం’ గుర్తులు కూడా కనిపిస్తాయి.
కానీ, బీజేపీ కార్యకర్తలు నగరంలో అలాంటి ఘటనలో పాల్గొన్నట్లు ఇటీవలి కాలంలో తమ దృష్టికీ ఎన్నడూ రాలేదని గుజరాత్ సీనియర్ పోలీసు అధికారులు చెప్పారు.
తమ కార్యకర్తలపై ఇటీవలి కాలంలో అలాంటి కేసులేవీ నమోదు కాలేదని అహ్మదాబాద్ నగర బీజేపీ వర్గాలు కూడా చెబుతున్నాయి.
‘అహ్మదాబాద్‌లో బీజేపీ కార్యకర్తలు గోమాంసం తరలిస్తున్నట్లు మాకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు’ అని అహ్మదాబాద్ బీజేపీ అధ్యక్షుడు జగదీశ్ పాంచల్ తెలిపారు.
ఇవి కూడా చదవండి
- రాయలసీమ కరవు: అంత్యక్రియలకు అన్ని ఏర్పాట్లు చేసుకుని ఆత్మహత్య చేసుకున్న రైతు కథ
- హిందుత్వ అజెండా గురి తప్పిందా? అందుకే బీజేపీ ఓడిందా?
- చైనా నుంచి టీ రహస్యాన్ని ఆంగ్లేయులు ఎలా దొంగిలించారు?
- #UnseenLives: వెనక 40 మంది పురుషులున్నా, నేను ఆ మరకను దాచుకోలేదు
- ఈదీ అమీన్: మనిషి రక్తం తాగిన నియంత
- నెహ్రూ కాలర్ పట్టుకుని నిలదీసిన మహిళ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








