అగ్రవర్ణ పేదలకు పది శాతం కోటా ఆచరణ సాధ్యమేనా?: అభిప్రాయం

రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో మోదీ ఎన్నికల ప్రచార సభలో ఆయన మాస్కులో వచ్చిన మద్దతుదారు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, మాడభూషి శ్రీధర్
    • హోదా, కేంద్ర సమాచార మాజీ కమిషనర్, బెన్నెట్ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్

ఎన్నికలు సమీపిస్తున్నవేళ మళ్లీ పాగా వేయడానికి కోటా రాజకీయ ఎత్తుగడతో నరేంద్ర మోదీ జాతీయ రాజకీయరంగాన్ని బ్రహ్మాండంగా అదరగొట్టారు. అగ్రవర్ణాలు సహా అన్నిమతాలవారిలో ఆర్థికంగా వెనుకబడిన వారికి పది శాతం రిజర్వేషన్లు ఇస్తామని అందుకు రాజ్యాంగాన్ని సైతం సవరిస్తామని ప్రకటించి సంచలనం సృష్టించారు.

ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రభుత్వ విద్యాసంస్థలలో పదిశాతం కోటా ఇస్తామన్న మోదీ ప్రకటన మతాతీతంగా అన్ని అగ్ర వర్ణాల పేదలకు ఆశల శిఖరాలు చూపిస్తోంది. ఏదో ఇస్తారు, ఇంకేదో వస్తుందనే ఆశలు వెల్లువెత్తే నిర్ణయం అని అందరూ ఊహిస్తున్నారు, ఆశిస్తున్నారు.

అసలు ప్రభుత్వ ఉద్యోగాలలో నియామకాలే లేని దశలో, ప్రభుత్వరంగ విద్యాసంస్థలు నిధులు, నియామకాలు లేక అలమటిస్తున్న తరుణంలో ఈ పది శాతం ఎందులో.. ఎంతవరకు ఎలా వస్తాయో ఎవరూ చెప్పలేరు. నియమించని ఉద్యోగాలలో కోటా చట్టం ఎంతవరకు జనాన్ని నమ్మించగలుగుతుంది?

మోదీ

ఫొటో సోర్స్, Getty Images

ఎన్నికల పాచికే అయినా.. కాదనే ధైర్యం ఎవరికి ఉంది?

ఎన్నికల వేళ, దిక్కుతోచని దశలో అధికార పక్షం వేస్తున్న పాచిక అని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నప్పటికీ, ఇది తమను ఇరుకున పెట్టే నిర్ణయమని ఈ పాటికి అర్థమయ్యే ఉంటుంది.

రాజ్యాంగంలోని సమానతా ప్రాథమిక హక్కును నిర్ధారించే ఆర్టికల్ 14 నుంచి 16 వరకు ఉన్న మూడో భాగాన్ని సవరించి, అగ్రవర్ణాల పదిశాతం కోటాను రాజ్యాంగబద్ధం చేయక తప్పదు.

ప్రభుత్వం రాజ్యాంగ సవరణ బిల్లు సిద్ధం చేసి పార్లమెంటు ముందుకు తెచ్చింది కూడా. ఆర్టికల్ 15(6) అనే కొత్త నియమాన్ని చేర్చి, ఆర్థిక ప్రాతిపదికన కూడా రిజర్వేషన్లు ఇచ్చే అధికారాన్ని తమకు ఇవ్వాలని పార్లమెంటును ప్రభుత్వం కోరుతోంది.

ఇది కాదనే ధైర్యం, దమ్ము ఎవరికీ లేదు. కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలన్నీ దారిలోకి రాక తప్పదు.

రాహుల్, సోనియా

ఫొటో సోర్స్, Getty Images

ఇరకాటంలో పెట్టేశారు

రఫేల్ గిఫేల్ గొడవలన్నీ పక్కకుపోయి, పదిశాతం కోటా తాలూకా రాజ్యాంగ సవరణను ఆమోదిస్తే మోదీ పథకం ఫలిస్తుంది. ఒకవేళ కాంగ్రెస్, వారి మిత్రులు దీన్ని వ్యతిరేకిస్తే అగ్రవర్ణాల ఆగ్రహానికి గురికావలసి వస్తుంది. ఇరకాటంలో పెట్టడం అంటే ఇదే.

ప్రతిపక్షాల ఎలుకలను కుడితిలో పడదోసే పెద్ద చర్య ఈ పది శాతం నిర్ణయం. కాంగ్రెస్ కూడా పది శాతం కోటా ఇస్తానని ఎన్నికల ప్రణాళికలో వాగ్దానం చేసింది కాబట్టి ఇప్పుడు కాదనలేని పరిస్థితి.

సుప్రీంకోర్టు రిజర్వేషన్లు సగానికి మించకూడదనే ఇంగిత జ్ఞాన సూత్రాన్ని నిర్ధారించింది. తమిళనాడు, రాజస్థాన్ వంటి రాష్ట్రాలలో కోటా 69, 68 శాతం దాటింది. కాని సుప్రీంకోర్టు సగం సూత్ర ప్రకటనకు ముందే ఈ రిజర్వేషన్లు ఇచ్చారు కనుక ఆ నిర్ణయం నిలబడి పోయింది.

ఈ అడ్డంకిని దాటడానికి ప్రభుత్వం తన బిల్లులో ఏ నియమమూ చేర్చలేదు. ఇది అడ్డంకి కాదని వారు భావిస్తున్నారు. కానీ ఇదే అవరోధంగా మారుతుందేమోనని నిపుణులు అనుమానిస్తున్నారు.

ఈ అవరోధాన్ని దాటడానికి ఏ చర్యా లేకపోవడం వల్ల ప్రభుత్వ చిత్తశుధ్ధిని అనుమానించే పరిస్థితి కూడా ఏర్పడుతోంది.

మోదీ ప్రభుత్వం ఈ 10 శాతం కోటా నిర్ణయాన్ని చిత్తశుద్ధితో అమలు చేస్తుందని ఆశించినప్పటికీ సుప్రీంకోర్టు సగాన్ని మించరాదనే నీతి సూత్రం ఆధారంగా కొట్టివేసే అవకాశాలు లేకపోలేదు.

రాజ్యాంగ సవరణ ఆమోదం పొంది, సుప్రీంకోర్టులో సవాళ్లు దాఖలై, తుది తీర్పు వచ్చేదాకా దేశ ప్రజలు దీనిపై చర్చిస్తూనే ఉంటారు. తుది తీర్పు వచ్చేనాటికి ఎన్నికలు ముగిసిపోతాయి. ఒకవేళ ఈ కోటా పాచిక పారి మోదీ మళ్లీ గద్దెనెక్కినా, కోటా అమలు కావడానికి కనీసం రెండుమూడేళ్లు పట్టకపోదు.

ఏదో నెపం మీద సుప్రీంకోర్టు కొట్టివేస్తే, బీజేపీ సహా అంతా సంతోషించినా ఆశ్చర్యంలేదు.

ఉద్యోగార్థులు

ఫొటో సోర్స్, Getty Images

నిజానికి పదిశాతం కోటాను అమలు చేసి తీరే చిత్తశుధ్ధి మోదీ సర్కార్‌కు ఉందనుకున్నా.. కోటా చట్టం అన్ని అడ్డంకులు దాటి కోర్టు పరీక్షకు నిలబడి బతుకుతుందనుకున్నా, దాని వల్ల నిజంగా ఎవరికైనా లాభం ఉంటుందా లేదా అన్నదీ ఆలోచించవలసిన అసలు సిసలు ప్రశ్న.

ఎస్సీ, ఎస్టీ వర్గాలకు కోటాలు అమలవుతూ దశాబ్దాలు గడిచాయి. ప్రభుత్వ సర్వీసులలో గణనీయంగా వారి సంఖ్య పెరిగింది. ప్రభుత్యోద్యోగాలలో వారి లాబీ బలవత్తరంగా ఎదిగింది. కానీ దళిత గిరిజన వర్గాల్లో పేదరికం మాత్రం తొలగిపోలేదు.

రాజకీయ పాలనా రంగాల్లో వారి సమగ్ర ప్రగతి అంచనాలు వేసిన వారు లేరు. ఆర్థిక స్వావలంబన ఆ వర్గాల్లో ఏర్పడిందో లేదో తెలియదు. వారు వారి కాళ్లపై నిలబడడానికి ఈ రిజర్వేషన్లు ఎంతవరకు దోహదం చేశాయనేది ఇంకా పరిశోధించాల్సిన అంశమే.

వారికి తోడు బీసీల రిజర్వేషన్లు కూడా వచ్చాయి. రిజర్వేషన్లు కాదన్న వాడు దేశ ద్రోహిగా నిందలకు గురయ్యే పరిస్థితి ఉంది. అగ్రవర్ణాల వారికి రిజర్వేషన్ల డిమాండ్లన్నీ ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లను నీరుగార్చడానికేనన్న విమర్శలు కూడా వెల్లువెత్తాయి.

రిజర్వేషన్లను వ్యతిరేకిస్తే లాభం లేదని, అగ్రవర్ణాల వారు తమకు కూడా రిజర్వేషన్ కావాలని ఆందోళన మొదలు పెట్టారు.

ప్రతి కులం తమకు కోటా కావాలనే స్థితికి వచ్చింది. ఇలాంటి ఉద్యమాలన్నీ నిజానికి బడుగువర్గాల కోటా కోటలను బద్దలు కొట్టడానికేనా అనే సందేహాలు తలెత్తాయి.

పదిశాతం అగ్రవర్ణాల కోటా పరిణామాలు కూడా అదే విధంగా ఉండవచ్చు. ఈ పదిశాతం కోటాతో అగ్రవర్ణాల ప్రజలంతా బీజేపీకి ఓటేస్తారా? ఒకవేళ వారు ఆ విధంగా సమర్థించే సమీకరణం మారితే, ఇది కుట్ర అని అనుమానించి బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలు వ్యతిరేకిస్తాయా?

అన్ని పార్టీలు ఈ చర్యను సమర్థిస్తున్నప్పుడు ఒక్క బీజేపీనే వ్యతిరేకించే అవకాశాలు ఉంటాయా? ఈ అనుమానాలను తోసి పారేయలేం.

మొత్తానికి కుల మత కోటాలపై ఆధారపడిన ఓటు బ్యాంకులన్నీ కూలిపోయి.. ఎటూ అర్థం కాని గందరగోళం కూడా ఏర్పడొచ్చు. ఇదంతా ఓటు రాజకీయ అయోమయ మాయ.

ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువత

ఫొటో సోర్స్, Getty Images

ఉద్యోగ విద్యారంగాల్లో పదిశాతం కోటా ప్రభావం ఏ విధంగా ఉంటుంది?

సివిల్ సర్వీసు పరీక్షలు జరిపి నియామకాలు చేయడం తప్ప ప్రభుత్వ ఉద్యోగాలలో భర్తీలు జరగడమే లేదు.

లక్షల ప్రభుత్వోద్యోగాల ఖాళీలు పాపాల వలె పెరిగిపోతున్నా ఎవరూ నియామకాలు చేపట్టడం లేదు.

యూపీఎస్‌సీ తప్ప.. రాష్ట్ర సర్వీసు కమిషన్లన్నీ పనిలేకుండా సభ్యులకు పెద్ద జీతాలు ఇచ్చుకుంటూ కాలం గడుపుతున్నాయి.

విద్యార్థులు

ఫొటో సోర్స్, Getty Images

విద్యావకాశాలేమయినా మెరుగవుతాయా?

ఇక విద్యాసంస్థల సంగతి కూడా అంత గొప్పగా ఏమీ లేదు. ప్రభుత్వ రంగ విద్యాలయాలని సర్కారు వారు స్వయంగా ఆకలితో మాడ్చేస్తున్నారు. వారికి నిధులు ఇవ్వరు. నియామకాలకు అంగీకరించరు. విస్తరణ లేదు. కొత్త విశ్వవిద్యాలయాలు రావు. విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, పాఠశాలలతో ప్రభుత్వ రంగం కళ తప్పి చాలా కాలమైంది.

అందులో కోటా ఉంటేనేం లేకుంటేనేం? మరో వైపు ప్రైవేటు రంగంలో కూడా రిజర్వేషన్లు ఉండాలనే ఆందోళన మొదలైంది.

మైనారిటీ విద్యాసంస్థల్లో తప్ప ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు అమలుచేయాలని అంటున్నా ప్రభుత్వం అమలు చేయదు. ప్రైవేటు కార్పొరేట్ వర్తక ప్రముఖులు లక్షల కోట్ల పెట్టుబడిదారులకు భయపడి ప్రభుత్వాలు అటువంటి నిర్ణయాలు తీసుకొనకపోతే ఈ ప్రపంచీకరణ ప్రైవేటీకరణ చీకటి కీకారణ్యాలలో ప్రైవేటు రంగంలో కోటాలు వెలుగులిస్తాయా?

కార్మిక చట్టాలు, ప్రభుత్వోద్యోగాల భద్రతా నియమాలు పకడ్బందీగా తయారు చేసిన తరువాత రెగ్యులర్ ఉద్యోగుల నియామకాలు భారీ ఎత్తున తగ్గించారు. కాంట్రాక్టు ఉద్యోగాలు, ఔట్ సోర్స్ కాంట్రాక్ట్ ఉద్యోగాలు, పెరిగిపోయాయి. అక్కడెక్కడా కోటాలకు స్థానమే లేదు.

పదిశాతం అగ్రవర్ణాల కోటా అంటూ ఎవరి చెవిలో పూలు పెడతారో ఆలోచించుకోవలసిందే.

ఈ పదిశాతం కోటాతో తాము బాగుపడతామని ఎవరైనా అనుకుంటే అందులో వాస్తవం పాలెంత?

రఫేల్ విమానాలు

ఫొటో సోర్స్, Getty Images

అన్ని సమస్యలూ పక్కకుపోయాయి

ఎన్నికలపైన ప్రభావం ఏ విధంగా ఉన్నా రిజర్వేషన్ల రాజకీయాలకు పదిశాతం నిర్ణయం ఓ బలీయమైన కుదుపు. ప్రస్తుతం ఉన్న అన్ని సమకాలీన సమస్యలు, ఎజెండాలకు ఒక పెను తుపాను దెబ్బ. ప్రతిపక్షాలను ఆలోచనలో పడేసే కీలకమైన చాణక్యం.

అంబేడ్కర్ కూడా రిజర్వేషన్లను పదేళ్లకే పరిమితం చేయాలన్నారు. మొదటి దశాబ్దంలో కోటాలు ఎంతవరకు అమలయ్యాయో చెప్పలేరు. కనుక కొనసాగించారు.

ఇప్పడు కోటాలు చాలా రొటీన్‌గా రాబోయే పదేళ్లకు పెంచుతూనే ఉంటారు.

కోటాల తేనె తుట్టెను తట్టి లేపే ధైర్యం దమ్ము ఎవరికీ లేవు. భిన్నంగా ఉంటున్నట్టు పోజులు కొట్టిన బీజేపీ కూడా చివరకు కోటా రాజకీయాల ఉచ్చులో పడిపోయింది.

రిజర్వేషన్లను వ్యతిరేకిస్తున్నట్టు కనిపిస్తూ, అడపాదడపా వ్యాఖ్యానాలు విసురుతూ, ఫలితాలను పరీక్షించుకుంటూ బీజేపీ, ఆరెస్సెస్ వర్గాల వారు రిజర్వేషన్లతో రాజకీయాల వైకుంఠపాళి ఆడుకోకతప్పదనే నిర్ణయానికి వచ్చినట్టు ఈ పరిణామం రుజువు చేస్తోంది. దీన్ని సమర్థించేవారు, వ్యతిరేకించేవారూ పార్లమెంటు, శాసనసభ, టీవీ, వీధి వేదికల్లో భీకరంగా పోరాడుతూ మనకు కనిపిస్తుంటారు.

పేదరిక నిర్మూలనకు రిజర్వేషన్లు ఒక్కటే మార్గమా?

అన్ని మతాల, అగ్ర వర్ణాల వారిలో పేదరికం ఉందన్న మాట నిజం. కాని ఎక్కడ ఏ మేరకు ఏ వర్గాల వారిలో పేదరికం ఉందో ఎవరికీ తెలియదు. ఏవో కొన్ని అంచనాలు తప్ప. ఆ పేదరికాన్ని అందుకు కారణాలను అధ్యయనం చేయాలని ఎవరికీ లేదు.

పేదరికం తొలగించడానికి రిజర్వేషన్లు ఒక్కటే మార్గమా? మరే ప్రణాళిక, విధానం, చట్టం, పనిచేయదా?

పేదరిక నిర్మూలన చేయలేని అసమర్థ ప్రభుత్వాలు, కోటాల కుంపటి రాజేస్తున్నాయి. ప్రతిపక్షాలు విమర్శించినట్టు సరిగ్గా ఎన్నికలకు మూడు నెలల ముందు పదిశాతం కోటా నిర్ణయం ప్రభుత్వ చిత్తశుద్ధిని శంకించేందుకు ఉపయోగపడుతుంది.

ఈ నిర్ణయం అమలు కావడం కష్టం అనీ, దీనితో పేదరికం నిర్మూలన ప్రయోజనం నెరవేరుతుందనుకోవడం ఇంకా కష్టం అని జనం తెలుసుకోనంత కాలం నేతలు లాభపడుతూనే ఉంటారు.

ఓటు మీట నొక్కే సమయంలో మెదడును మొద్దుబారేలా చేసేందుకు, ఆశల నిచ్చెనలు వేసేందుకే ఈ ప్రయత్నాలనీ తెలుసుకోలేకపోతే, బ్యాలెట్ యంత్రాల వలె ఓటర్లు కూడా యాంత్రికంగా ఓటు వేయవచ్చు. జనం మేలుకోకుంటే.. మేలు చేస్తున్నట్టు కనిపించే ఈ మేలిమి రంగులు పైపై పూతలే అని చెప్పేవారూ ఉండరు.

జనం చైతన్యవంతులయితేనే జనస్వామ్యం బతుకుతుంది. లేకపోతే మోసాలు మీసాలు తిప్పుతూ ఉంటాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)