కుంభమేళా: అలహాబాద్‌లో ట్రాన్స్ జెండర్ గురువుల భారీ ర్యాలీ

అలహాబాద్ నగరంలో ఆదివారం ఒక చరిత్రాత్మక ర్యాలీ జరిగింది. హిజ్రాల హిందూ సమూహం నిర్వహించిన ర్యాలీ ఇది. ఫొటో జర్నలిస్ట్ అంకిత్ శ్రీనివాస్ కథనం...
హిజ్రా సాధువుల ఆశీస్సులు పొందటానికి వేలాది మంది ప్రజలు అలహాబాద్ వీధుల్లోకి వచ్చారు.
జనవరి 15వ తేదీ నుంచి కుంభమేళా మొదలుకానున్న నేపథ్యంలో హిందువుల 13 అధికారిక అఖాడాలు భారీ ప్రదర్శనలు నిర్వహిస్తున్నాయి.
అందంగా అలంకరించిన వేదికలపై ఆశీనులైన మత గురువులను వీక్షించటానికి జనం పెద్ద ఎత్తున వరుసకడతారు.

అయితే ఆదివారం జరిగిన ర్యాలీ భిన్నమైనది. వేదికలు, సంగీతం, గుర్రాలు, ఒంటెలు వంటివన్నీ మామూలుగానే ఉన్నాయి. కానీ.. అందులో పాల్గొన్న సాధువులందరూ ట్రాన్స్ జెండర్లు.
భారతదేశంలో దాదాపు 20 లక్షల మంది ట్రాన్స్ జెండర్లు ఉన్నట్లు ఒక అంచనా. అయితే.. వీరిని స్త్రీ, పురుషుల తర్వాత మూడో లింగంగా 2014లో సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు ద్వారా గుర్తించింది.
మళ్లీ 2018లో.. వలస పాలన నాటి చట్టాన్ని రద్దు చేస్తూ.. స్వలింగ సంపర్కం నేరం కాదని అదే సుప్రీంకోర్టు స్పష్టంచేసింది.
''అవి గణనీయమైన విజయాలే. కానీ.. సామాజిక అంగీకారం పొందటానికి ఇప్పుడు పోరాడుతున్నాం. ఆ దిశలో కుంభమేళాలో మేం పాల్గొనటం మరో అడుగు'' అని కిన్నెర అఖాడా అధిపతి లక్ష్మీ నారాయణ్ త్రిపాఠి చెప్తున్నారు. ఇది ట్రాన్స్ జెండర్ హిందూ సమూహం.

హిందూ పురాణాలు, ఇతిహాసాల్లో ట్రాన్స్ జెండర్ల ప్రస్తావన చాలా చోట్ల ఉంది. కొంతమంది హిందూ దేవుళ్లు, దేవతలు సైతం స్వయంగా ట్రాన్స్ జెండర్లు. కానీ ట్రాన్స్ జెండర్లు వారి లింగ గుర్తింపు కారణంగా బహిష్కరణకు గురయ్యారని, తీవ్ర వివక్షకు గురవుతున్నారని హక్కుల సంస్థలు అంటున్నాయి.
ఇటువంటి ప్రదర్శన నిర్వహించటానికి కిన్నెర అఖాడా ఇతర సమాజాలతో పోరాడుతోంది. చివరికి అధికారిక గుర్తింపు ఇవ్వటానికి నిరాకరించినా కూడా తమ సొంత ప్రదర్శన చేపట్టాలని నిర్ణయించుకుంది.
''హిందూ పురాణాలన్నింటిలోనూ ట్రాన్స్ జెండర్ల గురించిన ప్రస్తావన ఉంది. మమ్మల్ని విస్మరించజాలరు. పురుషులు, మహిళలకు 13 అఖాడాలు ఉన్నపుడు.. ట్రాన్స్ జెండర్లకు ఒక అఖాడా ఎందుకు ఉండకూడదు?'' అని కిన్నెర అఖాడా సభ్యుడు అథర్వ్ ప్రశ్నించారు.
అయితే.. తమవి శతాబ్దాల కిందటి అఖాడాలని.. కొత్త సమూహాన్ని ఏర్పాటు చేయటానికి అంత సులభంగా అంగీకరించలేమని కొన్ని ఇతర అఖాడాలు అంటున్నాయి.

''కుంభమేళాకు అందరూ ఆహ్వానితులే. ట్రాన్స్ జెండర్లను కూడా ఆహ్వానిస్తాం. కానీ వారిని ఒక అఖాడాగా గుర్తించలేం'' అని 13 అఖాడాల్లో అతి పెద్దదైన జునా అఖాడా అధికార ప్రతినిధి విద్యానంద్ సరస్వతి పేర్కొన్నారు.
''ఆధ్యాత్మికతను, మతాన్ని విస్తరించాలని ఎవరు కోరుకున్నా మేం దానికి వ్యతిరేకం కాదు. కానీ కొన్ని నిర్దిష్ట అంశాలను వారు మాకు వదిలివేయాలి'' అని వ్యాఖ్యానించారు.
అయితే.. కిన్నెర అఖాడాకు కొందరు మత పెద్దలు మద్దతిస్తున్నారు.
''హిజ్రాలను హిందూ మతం ఎల్లప్పుడూ గుర్తించింది. వారిని అంగీకరించింది. వారు తమకు హక్కుగా ఉన్నదానినే అడుగుతున్నారు. దానిని మనం ఎందుకు నిరాకరించాలి?'' అని ఉత్తర భారతదేశంలోని ఒక ప్రముఖ ఆలయంలో పూజారి ఆత్మానంద మహరాజ్ నాతో పేర్కొన్నారు.

కిన్నెర అఖాడా ఇటువంటి ప్రదర్శన నిర్వహించటం ఇదే మొదటిసారి కాదు. ఉజ్జయినిలో జరిగిన 2016 కుంభమేళాలో కూడా వీరు ర్యాలీ నిర్వహించారు.
''హిందూమతంలో అత్యంత పవిత్రమైన నగరాల్లో ఒకటైన అలహాబాద్‌లో ప్రదర్శన నిర్వహించటం ప్రత్యేకమైన విషయం. ఇక్కడ జరిగే కుంభమేళా చాలా పవిత్రమైనదే కాదు. అత్యంత భారీది కూడా'' అంటారు అథర్వ్.
అయితే.. ఈ ఏడాది కుంభమేళాలో స్థలం పొందటానికి తమకు రెండు సంవత్సరాలు పట్టిందని కిన్నెర అఖాడా సభ్యులు చెప్పారు. ఇక్కడ ప్రతి సమూహానికి శిబిరం ఏర్పాటు చేసుకోవటానికి స్థలం కేటాయిస్తారు.

''మమ్మల్ని వ్యతిరేకించే అఖాడాలను మేం గౌరవిస్తాం. ఏదో ఒక రోజు హిందూమతం.. హిజ్రాలు సహా ప్రతి ఒక్కరినీ గౌరవిస్తుందని వారు తెలుసుకుంటారని మేం నమ్ముతున్నాం. ఇప్పటికైతే మా పోరాటం ఒక అఖాడాగా గుర్తింపు పొందటం కోసం కాదు. మా మత, ఆధ్యాత్మిక, సామాజిక గుర్తింపును ప్రజలు అంగీకరించటం కోసం. మమ్మల్ని ఆహ్వానిస్తున్న ప్రజలను చూస్తుంటే మేం సరైన పని చేస్తున్నామని నాకు అనిపిస్తుంది'' అని అథర్వ్ చెప్పారు.
ట్రాన్స్ జెండర్ సాధువుల ఆశీస్సులు పొందటానికి, వారితో సెల్ఫీలు, వీడియోలు తీసుకోవటానికి భక్తులు చాలా ఉత్సాహంగా ముందుకొచ్చారు.
''హిజ్రాలను మేం ఎల్లప్పుడూ గౌరవిస్తాం. పిల్లలు పుట్టినపుడు, పెళ్లిళ్లు వంటి శుభకార్యాల్లో వారి ఆశీస్సులు తీసుకుంటుంటాం. కానీ వారిని గురువులుగా ఎప్పుడుగా అనుకోలేదు. ఇది భిన్నమైన అనుభవం'' అని అలహాబాద్ నివాసి అభయ్‌శుక్లా పేర్కొన్నారు.

భారతదేశంలో ట్రాన్స్ జెండర్ల హక్కుల పోరాటంలో ఈ ర్యాలీ ఒక మైలు రాయి అని కిన్నెర అఖాడా సభ్యులు భావిస్తున్నారు.
''మార్పు సాధ్యమని మేం విశ్వసించేలా చేశారీ జనం. ప్రజల నుంచి మాకు ఇంతలా మద్దతు వస్తుందని మేం ఎన్నడూ అనుకోలేదు'' అని అఖాడా మరో సభ్యురాలు భవానీ మా పేర్కొన్నారు.
ఈ మాటతో శుక్లా ఏకీభవిస్తున్నారు. ''నావరకూ.. ఆధ్యాత్మికత ముఖ్యం. నా గురువు పురుషుడా, మహిళా, హిజ్రా అనే దానితో నాకు నిమిత్తం లేదు. అయితే చాలా మంది ఇలాగే భావించరని నాకు తెలుసు. కానీ వారు కుంభమేళాకు వచ్చి కిన్నెర అఖాడాను చూసినపుడు మారతారు'' అని ఆయన చెప్పారు.
ఫొటోలు: అంకిత్ శ్రీనివాస్
- అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్లు.. అర్హతలు ఇవీ
- అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్ల అమలు సాధ్యమేనా.. ఎవరేమంటున్నారు?
- ‘నరేంద్ర మోదీ తరంగాలు’: విద్యావేత్తల వ్యాఖ్యలపై శాస్త్రవేత్తల అసహనం
- BBC SPECIAL: ‘దేశంలో అతిపెద్ద మారణకాండను నేను ఆరోజే చూశాను’
- #HisChoice: హిజ్రాను పెళ్లాడిన ఒక మగాడి కథ
- హిజ్రాల గురించి మీకేం తెలుసు?
- ‘కన్నతండ్రి వదిలేశాడు.. ఓ హిజ్రా పెంచి పెద్ద చేసింది’
- స్వలింగ సంపర్కం నేరం కాదు: ఎల్జీబీటీ... తేడాలేంటి?
- నేను మగాడు కాదంటే నమ్మరే!
- ‘కొందరు నన్ను దేవతంటారు.. ఇంకొందరు వేశ్య అంటారు’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








