చైనాలో కిమ్ పర్యటన: పుట్టిన రోజు కూడా ఇక్కడేనా, కిమ్‌కు విమానం అంటే భయమా?..

కిమ్, బీజింగ్

ముందస్తుగా ఎలాంటి ప్రకటన లేకుండానే చైనా పర్యటనకు వెళ్లారు ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్. చైనా అధ్యక్షుడితో శిఖరాగ్ర సమావేశంలో పాల్గొననున్నారు.

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌తో రెండవ శిఖరాగ్ర సమావేశం విషయంలో సంప్రదింపులు జరుగుతున్న సమయంలోనే కిమ్ చైనా పర్యటన ఆసక్తికరంగా మారింది.

గురువారం వరకు కిమ్, ఆయన భార్య, ఇతర కీలక అధికారులు చైనాలో ఉంటారని చైనా అధికారిక మీడియా తెలిపింది.

బీజింగ్, కిమ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, జనవరి 9న బీజీంగ్‌లో కిమ్ కాన్వాయ్ ముందు వెళ్తున్న పోలీసులు

రైలులో ప్రయాణం

"గతంలో ఇలాంటి పర్యటనలు రహస్యంగా జరుగుతుండేవి. కొన్ని సార్లు సమావేశాలు జరిగిన తరువాత కిమ్ మళ్లీ సురక్షితంగా స్వదేశానికి చేరుకునేంత వరకూ అధికారికంగా ఎలాంటి సమాచారమూ బయటకు వచ్చేది కాదు. గత ఏడాది కూడా కిమ్ చైనా పర్యటన ముగించుకుని ఉత్తర కొరియా చేరుకున్న తర్వాతే ఆ పర్యటన గురించి తెలిసింది" అని బీజింగ్‌లోని బీబీసీ ప్రతినిధి జాన్ సడ్వర్త్ చెప్పారు.

అయితే, ప్రస్తుత పర్యటన పూర్తి భిన్నంగా సాగుతోంది. ఉత్తర కొరియా నుంచి కిమ్ జోంగ్- ఉన్ రైలులో వచ్చారు. ఆ రైలు సరిహద్దు దాటి చైనాలోకి ప్రవేశించగానే రెండు దేశాల అధికారిక మీడియా సంస్థలు ఈ పర్యటనకు సంబంధించి ప్రకటన విడుదల చేశాయి.

ఆయన చైనా రాజధాని బీజింగ్‌ చేరుకున్నారన్న విషయం అందరికీ తెలుసు. కిమ్ కాన్వాయ్ చైనా రాజధాని రోడ్లపై వెళుతున్న దృశ్యాలు కూడా అందరూ చూశారు.

ఉత్తర కొరియా పాలకుడిగా బాధ్యతలు చేపట్టిన తొలి ఆరేళ్లలో కిమ్ ఎలాంటి విదేశీ పర్యటనలు చేయలేదు. కానీ, గత ఏడాది కాలంలోనే ఆయన నాలుగు సార్లు చైనాలో పర్యటించారు.

కిమ్, రైలు

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, 2018 మార్చిలో కిమ్ చైనా పర్యటన

విమానం అంటే భయమా?

ఒక విదేశీ పర్యటనలకు కిమ్ రైలులో వెళ్లడం చాలామందిని ఆశ్చర్యపరిచే విషయం. గతేడాది మార్చిలో చైనాకు వెళ్లినప్పుడు కూడా కిమ్ రైలులోనే ప్రయాణించారు.

ఉత్తర కొరియా పాలకులు ఇలా రైలులో విదేశాలకు వెళ్లడం ఇదేమీ కొత్త కాదు. కిమ్ తండ్రి ఉ.కొరియా మాజీ పాలకుడు కిమ్ జోంగ్- ఇల్ కూడా రైలులోనే చైనా, రష్యా పర్యటనలకు వెళ్లేవారు. అప్పుడు కూడా వారి పర్యటన ముగిసే వరకూ ఆ విషయాలు బయటకు వచ్చేవి కాదు.

2011లో తన తండ్రి రష్యా, చైనా పర్యటనకు వినియోగించిన ఆకుపచ్చ, పసుపు రంగు రైలునే ఇప్పుడు కిమ్ వాడుతున్నారని జపాన్‌ మీడియా తెలిపింది.

ఈ రైలులో దాదాపు 90 బోగీలు ఉన్నట్లు దక్షిణ కొరియా పత్రిక చోసుమ్ పేర్కొంది. ఈ రైలులో విలాసవంతమైన కాన్ఫరెన్స్ గదులు, పడక గదులు, ఆడిటోరియం, శాటిలైట్ ఫోన్లు, టీవీలు ఉంటాయని ఆ పత్రిక వివరించింది.

గగనతల ప్రయాణమంటే కిమ్ తండ్రికి, తాతకు భయం ఉండేదని.. అందుకే వాళ్లు రష్యా, చైనాలకు వెళ్లాలంటే విమానాల కంటే రైళ్లకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారన్న కథనాలు కూడా ఉన్నాయి.

ప్రస్తుత పాలకుడు కిమ్ మాత్రం అప్పుడప్పుడు విమానాల్లోనూ వెళ్తున్నారు.

తన భార్యతో కలిసి చైనా వెళ్లిన కిమ్

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, చైనా పర్యటనలో కిమ్‌తో పాటు ఆయన భార్య కూడా ఉన్నారని ఉత్తర కొరియా అధికారిక మీడియా సంస్థ తెలిపింది.

పుట్టిన రోజు బీజింగ్‌లోనేనా?

ఈ జనవరి 8న కిమ్ 35వ పుట్టినరోజు అని కొన్ని సామాజిక మాధ్యమాలలో ప్రచారం జరిగింది. అందులో వాస్తవమెంతో మాత్రం తెలియదు.

కిమ్ తండ్రి, తాత పుట్టిన రోజులను ఉత్తర కొరియాలో జాతీయ సెలవు దినాలుగా పరిగణిస్తూ క్యాలెండర్‌లో పేర్కొంటారు. అయితే, కిమ్ మాత్రం తన పుట్టిన రోజును క్యాలెండర్‌లో పేర్కొనట్లేదు, సెలవు రోజుగా పరిగణించడంలేదు.

తన పుట్టిన తేదీని ఎందుకు వెల్లడించట్లేదో కూడా కిమ్ చెప్పలేదు.

అయితే, కొన్ని సందర్భాలను బట్టి కిమ్ పుట్టిన రోజు జనవరి 8 అని చాలామంది ఒక అంచనాకు వస్తుంటారు.

2014 జనవరి 8న అమెరికా బాస్కెట్‌బాల్ క్రీడాకారుడు డెన్నిస్ రోడ్‌మన్ ఉత్తర కొరియా రాజధాని ప్యాంగ్యాంగ్‌లో ఒక ఎగ్జిబిషన్ మ్యాచ్ తర్వాత కిమ్ జాంగ్-ఉన్‌ను ఉద్దేశించి బర్త్‌డే పాట పాడారు.

కిమ్, జిన్‌పింగ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కిమ్ తొలిసారిగా గతేడాది మార్చిలో చైనా పర్యటనకు వెళ్లారు.

చైనాతో ఎందుకంత స్నేహం?

దౌత్యపరంగా ఉత్తర కొరియాకు అత్యంత కీలక భాగస్వామి చైనా. వాణిజ్యానికి సంబంధించి కూడా ముఖ్యమైన మిత్ర దేశం. కేవలం 2018లోనే కిమ్ మూడుసార్లు చైనాలో పర్యటించారు. షీ జిన్ పింగ్‌తో ఆయనకిది నాలుగో సమావేశం.

దౌత్యపరంగా, ఆర్థికపరంగా అమెరికా, దక్షిణ కొరియాలే కాదు.. తమకు ఇతర మార్గాలు కూడా ఉన్నాయన్న సంకేతాలివ్వడమే కిమ్ చైనా పర్యటన వెనుకున్న ఉద్దేశమని విశ్లేషకులు భావిస్తున్నారు.

అణు ఒప్పందం లాంటివి కుదుర్చుకోవడంలో ఉత్తర కొరియాకు చైనా ఎంత ప్రాధాన్యత ఉన్న దేశమో ఈ పర్యటన ద్వారా సంకేతాలిస్తున్నారు.

తన నూతన సంవత్సర సందేశంలో కిమ్ తమ ఓపికను పరీక్షించొద్దనే హెచ్చరిక స్వరం కూడా వినిపించారు. అదే సమయంలో రెండవ శిఖరాగ్ర సమావేశం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తెలిపారు.

ట్రంప్, కిమ్‌ల సమావేశం గతేడాది సింగపూర్‌లో జరిగింది. ఇప్పుడు ఎక్కడ జరగొచ్చు అన్న విషయం మీద ఎన్నో ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

అయితే, ఉత్తర కొరియా అణ్వస్త్రాలను త్యజించేందుకు ఎంతవరకు సిద్ధంగా ఉంది? అన్నది అసలైన ప్రశ్న. ఈ విషయంలో ఆ దేశం ఎంత పురోగతి సాధించింది? అన్నది మరొక ప్రశ్న.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)