టాలీవుడ్‌లో థియేటర్ల వివాదం.. ఎవరేమన్నారు

థియేటర్ల వివాదం

ఫొటో సోర్స్, Nbk films

సంక్రాంతి సందర్భంగా విడుదల కానున్న సినిమాల విషయంలో టాలీవుడ్‌ నిర్మాతల మధ్య వివాదం పెద్దదవుతోంది.

రజనీకాంత్‌ 'పేట' చిత్రానికి థియేటర్లు దొరకడంలేదంటూ ఆ చిత్ర నిర్మాత అశోక్ వల్లభనేని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలపై మరుసటి రోజే మరో నిర్మాత దిల్‌రాజు ఘాటుగా స్పందించారు.

ఈ సంక్రాంతికి ప్రధానంగా బాలకృష్ణ నటించిన 'యన్‌.టి.ఆర్‌' కథానాయకుడు, వెంకటేశ్‌- వరుణ్‌ తేజ్‌ నటించిన 'ఎఫ్‌2 (ఫన్‌ అండ్‌ ఫ్రస్ట్రేషన్‌)', రామ్ చరణ్ నటించిన 'వినయ విధేయ రామ' సినిమాలు విడుదల కానున్నాయి.

సినిమా థియేటర్

ఫొటో సోర్స్, Getty Images

ఎవరి వాదన వారిది

ఇదే సమయంలో రజనీకాంత్ నటించిన 'పేట' తమిళ అనువాద చిత్రాన్ని కూడా విడుదల చేస్తున్నట్లు ఆ చిత్ర బృందం ప్రకటించింది.

హైదరాబాద్‌లో ఆదివారం 'పేట' సినిమా ప్రీ రిలీజ్‌ వేడుక నిర్వహించారు. ఆ కార్యక్రమంలో చిత్ర నిర్మాత అశోక్‌ వల్లభనేని మాట్లాడుతూ సినిమా విడుదల చేయడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, కొందరి చేతుల్లోనే థియేటర్లు ఉంటున్నాయని ఆరోపించారు.

"సినిమా విడుదల విషయంలో ఎన్నో ఇబ్బందులు పెడుతున్నారు. యూవీ క్రియేషన్స్, అల్లు అరవింద్, దిల్‌రాజు వీళ్లందరూ థియేటర్లతోనే పుట్టారా? థియేటర్లు ఇస్తే వీళ్లకేంటి బాధ? ఒకేసారి వందలాది సినిమాలు ఒకే థియేటర్‌లో వేసేసి, మంచి సినిమాలు వచ్చినప్పుడు థియేటర్లు లేకుండా చేస్తున్నారు. ప్రభుత్వాలు స్పందించి ఇలాంటి వాళ్లకు బుద్ధి చెప్పాలి. నయీమ్‌ను చంపించి కేసీఆర్ ఎంతోమందికి మేలు చేశారు. అలా థియేటర్ల మాఫియాను కూడా ఎందుకు షూట్ చేయరు?" అంటూ మధ్యలో కొన్ని పరుష పదాలు వాడారు.

థియేటర్ల వివాదం

ఫొటో సోర్స్, Peta/fb

అశోక్ వల్లభనేని వ్యాఖ్యలకు మరో నిర్మాత దిల్‌రాజు స్పందించారు. ప్రస్తుతం మూడు తెలుగు సినిమాలకే థియేటర్లు సరిపోని పరిస్థితి నెలకొందన్నారు.

"సంక్రాంతికి మూడు పెద్ద తెలుగు సినిమాలు విడుదలవుతున్నాయి. ఆ మూడింటికే థియేటర్లను సర్దుబాటు చేసుకునేందుకు ఇబ్బందులు పడుతున్నాం. ఇలాంటి సమయంలో వాళ్లు(అశోక్ వల్లభనేని) కేవలం 15 రోజులు, నెల క్రితం ఒక సినిమాను కొనుక్కొని సంక్రాంతికి విడుదల అంటూ ప్రకటించారు. మూడు తెలుగు సినిమాలు ఉన్నప్పుడు పక్క రాష్ట్రం నుంచి వచ్చే సినిమాకు థియేటర్లు ఎలా సర్దుబాటు అవుతాయి? ఆ నిర్మాతే నాలుగు నెలల్లో మూడు సినిమాలు విడుదల చేశారు. 'సర్కార్' సినిమాను తెలుగు రాష్ట్రాల్లో వాళ్లకు అవసరమైనన్ని థియేటర్లలో విడుదల చేసుకున్నారు. ఇప్పుడు థియేటర్లు దొరకడంలేదంటూ అనవసర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ సీజన్‌లో తెలుగు సినిమాలకు కాకుండా వేరే సినిమాలకు థియేటర్లు ఇచ్చే పరిస్థితి లేదు" అని అన్నారు.

థియేటర్ల వివాదం

ఫొటో సోర్స్, Ramcharan/fb

‘ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాలి’

ప్రేక్షకుల అభిరుచి మేరకే థియేటర్ల యాజమాన్యాలు ఏ సినిమాను ఎప్పుడు విడుదల చేయాలనేది నిర్ణయించుకుంటాయని ఏపీ ఫిల్మ్ చాంబర్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడు, నిర్మాత కె. సురేశ్ బాబు అన్నారు.

ఈ వివాదంపై ఆయన బీబీసీతో మాట్లాడుతూ, ‘‘థియేటర్లు దొరకడం లేదని వివాదం చేయడం సరికాదు. ఎక్కడైనా ఏ గ్రేడ్ హీరో సినిమాలకే థియేటర్ యాజమాన్యాలు మొదట ప్రాధాన్యం ఇస్తాయి.

ఒకే రోజు ఎక్కువ సినిమాలు విడుదల అవడం వల్ల ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నాయి. వీటిని సామరస్యంగా పరిష్కరించుకోవాలి’ అని అన్నారు.

సరైన ఆదరణ లేక చాలా చోట్ల థియేటర్లు కల్యాణ మండపాలుగా మారుతున్న తరుణంలో సినిమా మీద ఇష్టంతో కొంతమంది ఇంకా థియేటర్లను నడిపిస్తున్నారని, వారు కూడా ప్రజల అభిరుచి మేరకే సినిమాలను విడుదల చేస్తున్నారని సురేశ్ బాబు చెప్పారు.

సినిమాల విడుదలపై ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి వారు చెప్పిన ప్రకారం నడుచుకుంటే ఈ సమస్య పరిష్కారం అవుతుందని ఆయన సూచించారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)