‘నాన్న ఫొటోను చూస్తూ నా కొడుకు రోజంతా ఏడుస్తున్నాడు’

మేఘాలయాలోని ఒక అక్రమ బొగ్గు గనిలో 15 మంది కార్మికులు చిక్కుకుని 25 రోజులు కావస్తోంది. ఇప్పటికీ వారి జాడ లేదు. దాంతో వారి కుటుంబాల్లో అంతులేని విషాదం నెలకొంది.
ఒక బాధితుడి ఇంటికి వెళ్లి ఆ కుటుంబం పడుతున్న వేదనను తెలుసుకునేందుకు ప్రయత్నించారు బీబీసీ ప్రతినిధి సల్మాన్ రవి.
అబ్దుల్ కలాం అనే బాధితుడి భార్య (7 నెలల గర్భిణి) తన ఆవేదనను బీబీసీతో పంచుకున్నారు. ఉపాధి అవకాశాలు లేకపోవడం వల్లే పొట్టకూటి కోసం తన భర్త ప్రమాదకరమైన గనుల్లో పనికి వెళ్లాల్సి వచ్చిందని ఆమె చెప్పారు.
తన భర్త సంపాదిస్తేనే తమకు పూట గడుస్తుందని, అతడు లేకపోతే తమ పరిస్థితి అగమ్య గోచరంగా మారుతుందంటూ ఆమె రోధిస్తున్నారు.
ఆ బాధిత కుటుంబ పరిస్థితి ఆమె మాటల్లోనే..
నాకు ఏమీ తోచట్లేదు. ఎప్పుడూ నా భర్త గురించే ఆలోచిస్తున్నాను. నాన్న కోసం నా కొడుకు ఏడుస్తున్నాడు.
నా పేరు అఫ్రోజా, నా భర్త పేరు అబ్దుల్ కలామ్ షేక్.
ఇప్పుడు నేను 7 నెలల గర్భిణిని. నాకు 10 నెలల కొడుకు కూడా ఉన్నాడు.
ఆరోజు నా భర్త పనిచేసే గని ప్రాంతాన్ని నది ముంచెత్తిందని మా ఊరివాళ్లు చెబితే తెలిసింది.
మా ప్రాంతంలో వ్యవసాయ పనులు దొరకడంలేదు. దాంతో మా కుటుంబ పోషణ కోసం ఆయన గనుల్లో పనికి వెళ్లాల్సి వచ్చింది.
నా భర్త సురక్షితంగా బయటకు రావాలని కోరుకుంటున్నా.
నాన్న ఫొటోను చూస్తూ నా కొడుకు రోజంతా ఏడుస్తున్నాడు. వాళ్ల నాన్న తప్ప వాడు ఇంకెవరి దగ్గరికీ వెళ్లడు.
ఇప్పుడు సంపాదించే వారెవరూ లేక ప్రస్తుతం మా కుటుంబం దిక్కుతోచని పరిస్థితిలో ఉంది.

నా భర్త సంపాదిస్తేనే మాకు పూట గడిచేది. ఇకపై మా పరిస్థితి ఏమవుతుందో అర్థం కావట్లేదు.
మా మామయ్య వృద్ధుడు. మా మరిదికి వైకల్యం ఉంది.
ఆ గనుల్లో సహాయక చర్యల గురించి ప్రభుత్వం నుంచి మాకు ఎలాంటి సమాచారం లేదు.
ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోకపోతే మేం బతికేదెలా?
నా భర్త సురక్షితంగా ఉండాలని అల్లాను ప్రార్థిస్తున్నాను.
ఇవి కూడా చదవండి:
- కాంక్రీటుకు గిన్నిస్ రికార్డు ఎలా సాధ్యపడింది? ఇంత కాంక్రీటు పోశారని ఎలా లెక్కిస్తారు?
- అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్ల అమలు సాధ్యమేనా.. ఎవరేమంటున్నారు?
- నెపోలియన్ 80 టన్నుల బంగారాన్ని ఈ చెరువులోనే దాచారా?
- అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్లు.. అర్హతలు ఇవీ
- విరాట్ కోహ్లీ: ‘నా జీవితంలో ఇదే అతిపెద్ద విజయం.. ప్రపంచకప్ విజయం కంటే ఎక్కువ’
- ‘నరేంద్ర మోదీ తరంగాలు’: విద్యావేత్తల వ్యాఖ్యలపై శాస్త్రవేత్తల అసహనం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









