మేఘాలయ ర్యాట్ హోల్ గని: ''ఇరుకైన సొరంగంలో పాకుతూ బొగ్గును తవ్వుతాం''

ర్యాట్ హోల్ మైన్

ఫొటో సోర్స్, Getty Images

వందల అడుగుల లోతులో గని... అందులో సమాంతరంగా ఎలుక బొరియలను తలపించేలా చిన్నపాటి సొరంగాలు.. వాటిలో పాకుతూ వెళ్లి.. పక్కకు తిరిగి పడుకొని బొగ్గును వెలికితీసే కార్మికులు- ఇదీ ర్యాట్ హోల్ గనిలో కనిపించే దృశ్యం.

ఈశాన్య భారత రాష్ట్రం మేఘాలయలో ర్యాట్ హోల్ (ఎలుక బొరియలాంటి) బొగ్గుగనిలో డిసెంబరు 13 నుంచి 15 మంది చిక్కుకుపోయారు. ఇలాంటి గనుల్లో ఎలా పనిచేస్తారు? అదెంత ప్రమాదకరంగా ఉంటుంది?

వీటిలో పనిచేయడం ఎంత ప్రమాదకరమో గ్రహించి ఈ ప్రమాదానికి మూడు రోజుల ముందు ఈ పనిని వదిలేసిన కార్మికుడు అబ్దుల్ అలీమ్‌తో జర్నలిస్టు ప్రియాంకా బోర్పుజారి మాట్లాడారు. ఇదే పనిలో కొనసాగి ఉంటే తాను చనిపోయేవాడినని ఆయన చెప్పారు.

గనిలో చిక్కుకుపోయిన కార్మికుల్లో అబ్దుల్ కజిన్స్ ఒమర్, షిరాపత్ అలీ కూడా ఉన్నారు. వీరిద్దరూ చనిపోయి ఉండొచ్చని ఆయన ఆందోళన చెందుతున్నారు.

అబ్దుల్, ఆయన భార్య అంజూరా

ఫొటో సోర్స్, Priyanka Borpujari

ఫొటో క్యాప్షన్, అబ్దుల్, ఆయన భార్య అంజూరా

ర్యాట్ హోల్ గని అంతర్భాగంలో వరద రావడంతో కార్మికులు బయటకు రాలేకపోతున్నారు. వీరిని కాపాడేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. దీనిపై అబ్దుల్ స్పందిస్తూ- ''లోపలకు వెళ్తే పైనుంచి వెలుతురు ఏమీ ఉండదు. నేను గతంలో పనిచేసిన గనుల లోతు దాదాపు 30 అడుగులు(తొమ్మిది మీటర్లు) . ఇప్పుడు ప్రమాదం జరిగిన గని లోతు దాదాపు 400 అడుగులు'' అని చెప్పారు.

మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌కు 80 కిలోమీటర్ల దూరంలో ఈస్ట్ జైంథియా హిల్స్ జిల్లా లుంథారీ గ్రామంలోని క్సాన్ ప్రాంతంలో ఈ గని ఉంది.

ఈ రాష్ట్రంలో అత్యధిక శాతం భూములు ప్రైవేటు వ్యక్తులు, సామాజిక సమూహాల చేతిలో ఉంటాయి. ఈ భూముల్లో అక్రమంగా బొగ్గు తవ్వకాలు సాగుతున్నాయి.

గని

ఫొటో సోర్స్, Getty Images

అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో, అశాస్త్రీయ విధానంలో జరిగే ఈ ర్యాట్‌ హోల్ మైనింగ్‌‌పై 2014లో జాతీయ హరిత ట్రైబ్యునల్(ఎన్‌జీటీ) నిషేధం విధించింది. పర్యావరణ సమస్యలతోపాటు కార్మికుల ప్రాణాల పరిరక్షణను దృష్టిలో ఉంచుకొని నిషేధం విధిస్తున్నట్లు చెప్పింది.

నిషేధం ఉన్నప్పటికీ మేఘాలయలో ముఖ్యంగా ఈస్ట్ జైంథియా హిల్స్ జిల్లాలో ర్యాట్ హోల్ మైనింగ్ కొనసాగుతోంది. ఇలాంటి గనులు రాష్ట్రంలో ఎన్ని ఉన్నాయనే లెక్క లేదు.

అబ్దుల్‌కు పాతికేళ్లు. మేఘాలయ పశ్చిమ సరిహద్దుల్లోని మాగుర్మరి గ్రామంలో వెదురు, మట్టితో నిర్మించిన ఇంట్లో భార్య అంజూరాతో కలిసి ఆయన నివసిస్తున్నారు.

క్సాన్ ర్యాట్ హోల్ గనిలో చిక్కుకుపోయిన 15 మందిలో ఏడుగురు అబ్దుల్ గ్రామానికి చెందినవారే.

చేతులు చూపిస్తున్న అబ్దుల్ అలీం

ఫొటో సోర్స్, Priyanka Borpujari

ఫొటో క్యాప్షన్, ర్యాట్ హోల్ మైన్‌లో అబ్దుల్ అలీం రెండేళ్లపాటు పనిచేశారు

క్సాన్ ప్రాంతంలోని గనిలో కార్మికులను కాపాడేందుకు లోపలకు చేరుకొనేందుకు వివిధ సంస్థల సిబ్బంది అష్టకష్టాలు పడ్డారు. అనేక ప్రయత్నాల తర్వాత ఎట్టకేలకు డిసెంబరు 31న నౌకాదళ డైవర్లు గని అడుగుకు చేరుకున్నారు. అయితే అక్కడ తమకేమీ కనిపించడం లేదని, గనిలోంచి నీటినంతటినీ బయటకు తోడేసిన తర్వాతే సహాయ చర్యల్లో ముందుకెళ్లగలమని చెప్పి వారు బయటకు వచ్చారు.

డిసెంబరు మొదట్లో అబ్దుల్ తన ఇద్దరు కజిన్స్‌తో కలిసి ట్యాక్సీ మాట్లాడుకొని, 16 గంటలు ప్రయాణించి క్సాన్ ప్రాంతానికి చేరుకుని పనిలో చేరారు.

బొగ్గు గనుల్లో పనిచేయడం అబ్దుల్ సుమారు రెండేళ్ల క్రితం మొదలుపెట్టారు. అంతకుముందు తాపీ పనిచేసేవారు. తాపీ పనికి రోజుకు రూ.400 వస్తే, ర్యాట్ హోల్‌ గనిలో పనిచేస్తే నెలకు రూ.30 వేల వరకు వచ్చేవి. ఈ గనుల్లో అంత వేతనాలు ఇవ్వడానికి ఇక్కడ పనిచేయడం అత్యంత ప్రమాదకరం కావడమే ప్రధాన కారణం.

బొగ్గు ఉత్పత్తిలో భారత్ ప్రపంచంలోనే మూడో స్థానంలో ఉంది. దేశ ఇంధన అవసరాల్లో 60 శాతం బొగ్గే తీరుస్తుంది. బొగ్గు తవ్వకాలపై నియంత్రణ సరిగా లేదు.

సహాయ చర్యలు

ఫొటో సోర్స్, Sannio Siangshai

ఫొటో క్యాప్షన్, సహాయ సిబ్బంది గనిలోంచి నీటిని తీడేస్తున్నారు

30 అడుగుల దూరం వెళ్తాం

''8-10 మందిని లోహపు కంటైనర్‌లో ఉంచి క్రేన్ సాయంతో గని బావిలోకి దించుతారు. మేం అడుగుకు చేరుకున్న తర్వాత వివిధ దిక్కుల్లో ఉండే సొరంగంలాంటి గనిలోకి ఒక్కొక్కరం పాక్కుంటూ వెళ్తాం. సమాంతరంగా 30 అడుగుల దూరం వరకు వెళ్తాం. ఒక్కో గని ఇంచుమించు రెండు అడుగుల ఎత్తు ఉంటుంది. మా నాయకుడు ఎక్కడ తవ్వాలని చెబితే అక్కడ తవ్వుతాం. వచ్చే బొగ్గు మా కాళ్ల కింద ఉండే పుష్‌కార్ట్‌లో పడుతుంది. అది నిండిన తర్వాత అందరం సేకరించిన బొగ్గును ఒక చోటకు తీసుకొచ్చి వేస్తాం'' అని అబ్దుల్ వివరించారు.

కార్మికుడి చెవికి అమర్చిన చిన్న టార్చి లైట్ నుంచి వచ్చే కాంతి తప్ప మరే వెలుగూ అక్కడ ఉండదు.

ర్యాట్ హోల్‌ గనిలో ఎంత మంది కార్మికులు పనిచేస్తున్నారు, ఎవరు ఎంత తరచుగా కార్టులో బొగ్గు నింపుకొని వస్తున్నారు అనే వివరాలను పర్యవేక్షకుడు(సూపర్‌వైజర్) రాసుకొంటుంటారని అబ్దుల్ తెలిపారు. ఎంత బొగ్గు తీసుకొస్తారనేదాన్ని బట్టి వేతనం ఉంటుంది.

తాను విరామం లేకుండా ఏకబిగిన నాలుగు గంటలు పనిచేసేవాడినని అబ్దుల్ చెప్పారు. తెల్లవారుజామున ఐదు గంటలకే పని మొదలుపెట్టేవాడినని, మధ్యాహ్నం వరకు చేసేవాడినని తెలిపారు. శీతాకాలంలో బయట ఎముకలు కొరికే చలి ఉంటుందని, గని లోపల మాత్రం వెచ్చదనం ఉంటుందని చెప్పారు.

మేఘాలయ బొగ్గు గనులు

ఫొటో సోర్స్, Getty Images

శరీరం దెబ్బతిందా?

ఎక్కువ సేపు గనిలో పాకడం, ఒక పక్కగా పడుకొని పనిచేయడం వల్ల శరీరంపై ప్రభావం ఏమైనా పడిందా అని అబ్దుల్‌ను అడగ్గా, ఆయన భార్య అంజూరా స్పందిస్తూ- ''అబ్దుల్‌కు వీపు మీద చర్మం మొద్దుబారిపోయింది. కమిలిపోయి నల్లగా అయిపోయింది'' అని వాపోయారు. కుడివైపు మాత్రమే అలా అయ్యిందని, ఎందుకంటే గనిలో తాను ఆ వైపే పడుకొని పనిచేసేవాడినని అబ్దుల్ చెప్పారు.

ఒక్కో ర్యాట్ హోల్ గనిలో 200 మంది వరకు మగవారు వివిధ షిఫ్టుల్లో పనిచేస్తారు.

ప్రమాదం జరిగిన గనిలో డిసెంబరులో సిబ్బంది కొరత ఏర్పడిందని అబ్దుల్ తెలిపారు. అక్కడ పనిచేసేవారిలో చాలా మంది పొరుగు రాష్ట్రం అస్సాం వారేనని చెప్పారు. డిసెంబరు మొదటి వారంలో అస్సాం స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు వేసేందుకు వీరిలో ఎక్కువ మంది సొంత రాష్ట్రానికి వెళ్లిపోయారు. వెళ్లనివారు అదనపు షిఫ్టులు పనిచేశారు.

మేఘాలయ గనుల్లో అక్రమంగా తవ్వే కార్మికుల్లో అత్యధికులు మెరుగైన వేతనాల కోసం ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన కార్మికులే.

డైవర్లు

ఫొటో సోర్స్, Getty Images

ఆ గని లోతు నన్ను భయపెట్టింది

క్సాన్ ర్యాట్ హోల్ గనిలో వారంపాటు పనిచేసిన అబ్దుల్, అది వదిలేయాలనుకున్నారు. అక్కడ పని తాను అంతకుముందు చేసిన ర్యాట్ హోల్ గనుల్లో మాదిరే ఉండేదని ఆయన తెలిపారు. ఈ గనిలో లోతు తనను భయాందోళనకు గురిచేసిందని, అందుకే అక్కడ మానేసి ఇంటికి వచ్చేశానని చెప్పారు.

ఇప్పుడు గనిలో చిక్కుకుపోయి ఉన్న ఇద్దరు కజిన్లకు తాను వెళ్లిపోవాలనుకొంటున్నానని చెబితే, ఇక్కడ జీతం బాగా ఇస్తున్నారని, వెళ్లొద్దని వారించారని అబ్దుల్ తెలిపారు. ''ఓ రోజు మధ్యాహ్నం భోజనం తర్వాత, బెల్టు కొనుక్కోవడానికి మార్కెట్‌కు వెళ్తున్నానని వాళ్లిద్దిరికీ చెప్పి మార్కెట్‌కు వచ్చా. అక్కడ బెల్టు కొనుక్కొని నాకు కనిపించిన మొదటి బస్సు ఎక్కేసి ఇంటికి వచ్చేశా'' అని ఆయన చెప్పారు.

ఆ బెల్టు ఇదేనంటూ తాను పెట్టుకున్న ముదురు గోధుమ రంగు బెల్టును అబ్దుల్ చూపించారు. ఈ బెల్టు తనకు నిజంగానే అవసరమన్నారు.

ప్రమాదం గురించి అబ్దుల్ మాట్లాడుతూ- సమీపంలోని జలపాతం నుంచి దగ్గర్లోని గనిలోకి నీరు వచ్చి ఉండొచ్చన్నారు.

''ఈ గనిలోని ఒక బొరియ, పక్క గనిలోని మరో బొరియ ఒక చోట కలిసిపోయి ఉంటాయి. పక్క గనిలోంచి ఈ బొరియల గుండా నీరు ఈ గనిలోకి వచ్చి ఉండొచ్చు. పక్క గని వైపుకు తవ్వొద్దని మా సూపర్‌వైజర్ హెచ్చరించేవారు. కొందరు ఆయన మాటలను వినిపించుకున్నట్లు లేరు'' అని ఆయన వివరించారు.

ఇలా తవ్వకూడని విధంగా బొగ్గును తవ్వడం, సమీపంలోని నదిలోంచి నీరు రావడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని అధికారులు చెబుతున్నారు.

బొగ్గుగని

ఫొటో సోర్స్, Getty Images

డబ్బు కాదు, ప్రాణాలే ముఖ్యం

నీరు వస్తున్న చప్పుడు విని అప్రమత్తమైనా, తప్పించుకొనేందుకు కార్మికుడికి సమయం ఉండదని అబ్దుల్ చెప్పారు. గనిలో చిక్కుకుపోయినవారిని ప్రాణాలో రక్షించగలిగే అవకాశాలు చాలా తక్కువని అభిప్రాయపడ్డారు. ''కార్మికులను కాపాడాలంటే చుట్కుపక్కల ఉన్న 15 గనుల్లోంచి ఏకకాలంలో నీటిని తోడేయాల్సి ఉంటుంది'' అని ఆయన తెలిపారు.

అధికారులు నీటిని తోడేస్తున్నారు. ఆపరేషన్ చేపట్టడానికి సమయం పడుతుందని చెబుతున్నారు.

గనిలో పని మానేసి వచ్చేటప్పుడు అబ్దుల్ గుర్తింపు కార్డు మాత్రమే వెంట తెచ్చుకున్నారు. బట్టలు, ఏడు రోజుల వేతనం ఆయన వదిలేసి వచ్చారు. ''నేను ఆ డబ్బు గురించి ఆలోచించట్లేదు. నాకు నా ప్రాణాలే ముఖ్యం'' అని అబ్దుల్ వ్యాఖ్యానించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)