‘ఆ 40 కిలోమీటర్లు దాటితే రూ.20 టమోటా రూ.300’

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, దల్జీత్ అమీ, రవీందర్ సింగ్ రాబిన్
- హోదా, బీబీసీ ప్రతినిధులు
భారత్, పాకిస్తాన్ మధ్య వాణిజ్యానికి పుష్కలమైన అవకాశాలు ఉన్నా, ఆ స్థాయిలో జరగడం లేదు. దీనికి కారణాలు ఏమిటి?
భారత్, పాకిస్తాన్ మధ్య ఏటా 3,700 కోట్ల డాలర్ల (రూ.2,59,100 కోట్ల) వాణిజ్యానికి అవకాశముందని, కృత్రిమమైన అడ్డంకుల వల్ల ఇది 200 కోట్ల డాలర్లకే (రూ.14 వేల కోట్లకే) పరిమితమవుతోందని కొన్ని వారాల కిందట ప్రపంచ బ్యాంకు విడుదల చేసిన అధ్యయనం చెబుతోంది.
భారత్, పాకిస్తాన్ సరిహద్దుల్లోని వాఘా/అటారీ సమీకృత తనిఖీ కేంద్రం(ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్) వద్ద వాణిజ్యంలో ఒడిదుడుకులు ప్రపంచ బ్యాంకు వ్యాఖ్యలకు అద్దం పడుతున్నాయి.
కూరగాయలు, పండ్లు, డైరీ ఉత్పత్తులు వంటి ఆహార పదార్థాలను భారత్ నుంచి పాకిస్తాన్‌లోకి రవాణా చేయడంలో అడ్డంకులు ఎదురవుతున్నాయి. వీటివల్ల సరిహద్దుకు ఇవతలి వైపు భారతీయ రైతులు నామామాత్రపు ధరలకే తమ ఉత్పత్తులను అమ్ముకోవాల్సి వస్తుండగా, అవతల పాకిస్తానీ వినియోగదారులు అవే ఉత్పత్తులను ఆశాకాన్నంటే ధరలకు కొనక తప్పడం లేదు.

ఫొటో సోర్స్, Getty Images
కూరగాయలు, పండ్లు, ఇలాంటి ఇతర ఉత్పత్తుల రవాణాపై 2017-18 ఆర్థిక సంవత్సరం నుంచి పాకిస్తాన్ అప్రకటిత నిషేధం అమలు చేస్తుండటంతో భారత రైతులు, ఎగుమతిదారులు నష్టపోతున్నారు.
భారత్, పాకిస్తాన్ మధ్య వాణిజ్యం అభివృద్ధి కోసం 2012 ఏప్రిల్ 13న భారత్ వాఘా ఐసీపీని ప్రారంభించింది.
2015-16లో దీని గుండా జరిగిన పండ్లు, కూరగాయల ఎగుమతుల విలువ రూ.338 కోట్లు. ఆ తర్వాతి సంవత్సరం అంటే 2016-17లో ఇది రూ.369 కోట్లుగా ఉంది.

ఫొటో సోర్స్, MAJID JAHANGIR
2015-16లో 6057 ట్రక్కులు రూ.273.26 కోట్ల విలువైన 1,24,277 టన్నుల కూరగాయలను భారత్ నుంచి పాక్‌లోకి తీసుకెళ్లాయి. అదే సమయంలో 646 ట్రక్కులు రూ.65.27 కోట్ల విలువైన 20,608 మెట్రిక్ టన్నుల సోయాబీన్‌ను పాక్‌కు తరలించాయి.
2016-17లో 10,495 ట్రక్కులు రూ.360.67 కోట్ల విలువైన 1,86,149 టన్నుల కూరగాయలను భారత్ నుంచి పాకిస్తాన్‌కు తీసుకెళ్లాయి. ఆ తర్వాత సోయాబీన్ ఎగుమతులు భారీగా పడిపోయాయి.
2017-18లో 94 ట్రక్కులోడ్లలో కేవలం 3,056 టన్నుల సోయాబీన్ సరిహద్దు దాటి అవతలికి వెళ్లింది. దీని విలువ కేవలం రూ.147.9 కోట్లు.

ఫొటో సోర్స్, MAJID JAHANGIR
పాకిస్తాన్ ఎగుమతి చేసేవి ఇవీ
డ్రైఫ్రూట్స్, సిమెంట్, జిప్సమ్, గ్లాస్, సోడా, సున్నపురాయి, ఉప్పు,అల్యూమినియం, ఇతర వస్తువులను వాఘా ఐసీపీ గుండా పాకిస్తాన్ భారత్‌కు ఎగుమతి చేస్తుంది.
2015-16లో 39,823 ట్రక్కులు రూ.2,414.08 కోట్ల విలువైన 18,43,600 టన్నుల వస్తువులను పాకిస్తాన్ నుంచి ఈ సరిహద్దు గుండా భారత్‌కు తరలించాయి.
2017-18లో భారత్‌లోకి ఎగుమతులు మరింత పెరిగాయి. 44,890 ట్రక్కులు రూ.3403.95 కోట్ల విలువైన 22,97,932 టన్నుల వస్తువులను పాకిస్తాన్ నుంచి ఇవతలకు తీసుకొచ్చాయి.
2018-19 ఆర్థిక సంవత్సరంలో నవంబరు వరకు 34,009 ట్రక్కులు 17,00,715 టన్నుల వస్తువులను భారత్‌లోకి చేరవేశాయి. వీటి విలువ రూ.2,471.72 కోట్లు.
టమోటా సంక్షోభం సమయంలో ధరల్లో భారీ వ్యత్యాసం
వాఘా ఐసీపీ గుండా పాకిస్తాన్‌లోకి కూరగాయల ఎగుమతులపై పాకిస్తాన్ అనధికార నిషేధం విధించిందని, ఈ నిర్ణయం సాంకేతికమైనది కాదని, రాజకీయమైనదేనని అమృత్‌సర్‌లో భారత్-పాక్ ఎగుమతిదారుల సంఘం అధ్యక్షుడు రాజ్‌దీప్ ఉప్పల్ బీబీసీతో చెప్పారు.
ఈ నిర్ణయం ప్రభావాన్ని ఆయన వివరిస్తూ 2017లో సరిహద్దుకు రెండు వైపుల టమోటా ధరలను ప్రస్తావించారు.
2017లో పాకిస్తాన్‌లో టమోటా సంక్షోభం తలెత్తినప్పుడు అక్కడ కేజీ టమోటా రూ.300 వరకు పలికిందని, అప్పుడు పాకిస్తానీ నగరం లాహోర్‌కు కేవలం 40 కిలోమీటర్ల దూరంలోని భారత నగరం అమృత్‌సర్‌లో దీని ధర కేవలం రూ.20 మాత్రమేనని చెప్పారు.
సీమాంతర వాణిజ్యంపై పాకిస్తాన్ నిర్హేతుక ఆంక్షలు పెట్టిందని, వీటివల్ల పాక్ వినియోగదారులూ ఇబ్బంది పడుతున్నారని ఆయన అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, MAJID JAHANGIR
భారత్, పాకిస్తాన్ మధ్య వాణిజ్యం అవకాశమున్నంత స్థాయిలో జరగకపోవడానికి ఉభయ దేశాల మధ్య పరస్పర విశ్వాసం లేకపోవడం, పారదర్శకత లోపించడం, కొన్ని విధానపరమైన చర్యలే కారణమని ప్రపంచ బ్యాంకు నివేదిక 'ఎ గ్లాస్ హాఫ్ ఫుల్, ద ప్రామిస్ ఆఫ్ రీజనల్ ట్రేడ్ ఇన్ సౌత్ ఏసియా' వెల్లడించింది.
టమోటా, ఉల్లి సాగుకు పాకిస్తాన్‌లోని పరిస్థితులు అంత అనుకూలించవని, కానీ భారత్ నుంచి కాకుండా ఇతర దేశాల నుంచి పాకిస్తాన్ వీటిని దిగుమతి చేసుకొంటోందని రాజ్‌దీప్ అసంతృప్తి వ్యక్తంచేశారు.
పాకిస్తాన్‌కు కూరగాయలు, పండ్ల ఎగుమతులు తగ్గడం వాస్తవమేనని భారత కస్టమ్స్, ఎక్సైజ్ విభాగం సంయుక్త కమిషనర్ దీపక్ కుమార్ బీబీసీతో చెప్పారు. వాఘా ఐసీపీ గుండా దిగుమతులను తగ్గించుకోవడానికి పాకిస్తాన్ అధికారిక కారణమేదీ చెప్పలేదని ఆయన తెలిపారు.
భారత్ నుంచి కూరగాయలను దిగుమతి చేసుకొంటే భారత రైతులకే కాదు, పాకిస్తాన్ వినియోగదారులకు కూడా ప్రయోజనం కలుగుతుందని రైతు నాయకుడు సర్వన్ సింగ్ పాంధర్ వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, Getty Images
వాఘా సరిహద్దు గుండా అఫ్గానిస్థాన్‌కు సరకులు తీసుకెళ్లేందుకు కూడా భారత ట్రక్కులకు పాకిస్తాన్ అనుమతి ఇవ్వలేదు. కానీ అఫ్గానిస్తాన్ నుంచి కొన్ని సరకులను ఇదే సరిహద్దు గుండా భారత్‌లోకి రవాణా చేయడాన్ని మాత్రం అనుమతిస్తోంది.
''పరస్పర నమ్మకం ఉంటే వాణిజ్యం పెరుగుతుంది. వాణిజ్యం వల్ల ఒకరిపై ఒకరు ఆధారపడటం పెరుగుతుంది. ఇది అంతమంగా శాంతికి దోహదం చేస్తుంది'' అని ఈ నివేదిక రాసిన సంజయ్ కథూరియా వ్యాఖ్యానించారని పాకిస్తాన్ పత్రిక 'డాన్' డిసెంబరులో తెలిపింది.
భారత్, పాక్ మధ్య ఇటీవల ప్రారంభమైన కర్తార్‌పూర్ కారిడార్ ఉభయ దేశాల మధ్య పరస్పర విశ్వాసాన్ని పెంపొందించగలదని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు.
ఇవి కూడా చదవండి:
- పాకిస్తాన్ జైల్లో ముంబయ్ యువకుడు.. ఫేస్‌బుక్ చాటింగ్‌తో మొదలైన కథ
- ప్రధాని నరేంద్ర మోదీ ఇంటర్వ్యూ
- తల్లిని, భార్యను కలిసిన కుల్‌భూషణ్ జాదవ్
- బోయింగ్ 777 పిన్న పైలెట్.. బెజవాడ అమ్మాయే
- చరిత్ర: మొదటి ప్రపంచ యుద్ధం ప్రపంచాన్ని ఎలా మార్చేసిందంటే..
- బలహీన వ్యవస్థతో ఆరోగ్య బీమా పథకం అమలు సాధ్యమేనా?
- ఆరోగ్యం: హిప్ రీప్లేస్మెంట్ అవసరం ఎప్పుడు వస్తుంది?
- 'గాంధీ జాత్యహంకారి'
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








