ప్రధాని నరేంద్ర మోదీ ANI ఇంటర్వ్యూ: ‘తెలంగాణలో మేం అధికారంలోకి వస్తామని ఎవ్వరూ చెప్పలేదు.. బీజేపీ కూడా చెప్పలేదు’

ఫొటో సోర్స్, Getty Images
'న్యాయ ప్రక్రియ పూర్తయ్యాకే రామ మందిరంపై ఆర్డినెన్స్ గురించి ఆలోచిస్తాం' అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు.
ఏఎన్ఐ వార్తా సంస్థకు ఆయన ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఏఎన్ఐ ఎడిటర్ స్మితా ప్రకాశ్ ఈ ఇంటర్వ్యూ చేశారు. 2019 సార్వత్రిక ఎన్నికలు, పెద్ద నోట్ల రద్దు, రామ మందిర నిర్మాణం మొదలైన అంశాలపై ఆయన తన భావాలను పంచుకున్నారు.
పెద్ద నోట్ల రద్దు ఆర్థిక వ్యవస్థను కుదేలు చేసిందన్న వార్తలను మోదీ ఖండించారు. నల్లధనం ఉంటే దానిని బ్యాంకులలో డిపాజిట్ చేయాలని ఏడాది ముందే హెచ్చరించామన్నారు. అయితే మోదీ కూడా ఇతరుల్లాగే అనుకుని చాలా తక్కువ మంది మాత్రమే ముందుకు వచ్చారని ఆయన తెలిపారు.
2019 ఎన్నికలు 'మోదీ' వర్సెస్ 'ఇతరులు' కావని, 'ప్రజలు' వర్సెస్ 'మహాకూటమి' అని మోదీ అన్నారు. తాను కేవలం ప్రజల ప్రేమ, ఆశీస్సులకు ప్రతిరూపమని మోదీ తెలిపారు.
ఉర్జిత్ రాజీనామా వెనుక ఒత్తిళ్లు లేవు
ఆర్‌బీఐ మాజీ గవర్నర్ ఉర్జిత్ పటేల్ 6-7 నెలల క్రితమే తాను రాజీనామా చేయాలనుకుంటున్నట్లు తెలిపారని ప్రధాని వెల్లడించారు. వ్యక్తిగత కారణాలతోనే ఆయన రాజీనామా చేశారన్న మోదీ.. ఆయనపై రాజకీయ ఒత్తిడి లేదని స్పష్టం చేశారు.
‘‘తెలంగాణ, మిజోరం రాష్ట్రాల్లో మేం అధికారంలోకి వస్తామని ఎవ్వరూ ఊహించలేదు.. ఎవ్వరూ ఈ మాట చెప్పలేదు. బీజేపీ కూడా చెప్పలేదు’’ అని మోదీ అన్నారు.
5 రాష్ట్రాల ఎన్నికల్లో పరాజయం గురించి మాట్లాడుతూ.. తెలంగాణ, మిజోరంలో తాము విజయం సాధిస్తామని ఎవరూ ఊహించలేదని, అయితే మిగతా రాష్ట్రాల్లో తమ పరాజయం గురించి సమీక్షించుకుంటామన్నారు.
మోదీ మేజిక్ తగ్గుతోందని అన్నవారికి దానికి అంగీకరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
ఒక్కసారితో పాక్ బుద్ధి మారదు
సర్జికల్ స్ట్రైక్స్ తర్వాత కూడా పాక్ వైపు నుంచి దాడులు జరుగుతున్నాయన్న ప్రధాని... ఒక్కసారితో పాక్ తన బుద్ధి మార్చుకోదని అన్నారు. దానికి ఇంకొంత సమయం పడుతుందన్నారు.
ఏ ఒక్క భారత ప్రధాని కూడా పాకిస్తాన్‌తో శాంతి చర్చలను వ్యతిరేకించలేదన్నారు. టెర్రరిజం ఆగిపోవాలన్నదే తమ కోరిక అని మోదీ తెలిపారు.
దేశంలో అక్రమాలకు పాల్పడి విదేశాలకు పారిపోయిన వారిని భారతదేశం రప్పించడానికి ఉన్న అన్ని మార్గాలను ఉపయోగించుకుంటామని మోదీ తెలిపారు. భారతదేశం నుంచి దొంగలించిన ప్రతి పైసానూ కక్కిస్తామని అన్నారు.
రైతుల సమస్యలు పరిష్కరించడానికి రుణమాఫీ సరైన పరిష్కారం కాదన్నారు. అయితే కొన్ని బీజేపీ రాష్ట్రాలు కూడా ఇదే విధానాన్ని అనుసరిస్తున్నాయన్న మోదీ.. ఈ విషయంలో తాము కలుగజేసుకోలేమని, అది రాష్ట్రాల ఇష్టమన్నారు.
కేసీఆర్ మహాకూటమి ప్రయత్నాలు తన దృష్టికి రాలేదని మోదీ తెలిపారు. అయితే తనను పదవి నుంచి దించడానికే మహాకూటమి ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు.
తెలంగాణలో ప్రజాకూటమి ప్రయోగం విఫలమైందన్న మోదీ.. దాని గురించి ఎందుకు చర్చించడం లేదని ప్రశ్నించారు.
విదేశీ పర్యటనలు ఎక్కువగా చేశారన్న విమర్శలను మోదీ కొట్టిపారేశారు. లెక్కలు తీస్తే ఇతర ప్రధానులు కూడా తను చేసినన్నటి విదేశీ పర్యటనలు చేసి ఉంటారని అన్నారు.
అయితే గతంలో భారత ప్రధాని విదేశాలకు వెళితే ఎవరూ గుర్తించేవారు కారని, తాను ఆ పరిస్థితిని మార్చానన్నారు.
ఇవి కూడా చదవండి:
- అయోధ్య: రామ మందిర వివాదంతో మోదీకి లాభమా? నష్టమా?
- అయోధ్య వాసులకు రామ మందిరం అంటే ఆసక్తి ఎందుకుండదు?
- అయోధ్యలో రామ మందిరం నిర్మాణంపై బీజేపీ వర్సెస్ సంఘ్ పరివార్
- అభిప్రాయం: పార్లమెంట్ ద్వారానే రామమందిరం నిర్మిస్తామన్న భగవత్ ప్రకటనలో అర్థమేంటి?
- ప్రధాని మోదీ ప్రభ క్షీణిస్తోందా?
- ఇప్పటికీ నరేంద్ర మోదీని చూసే బీజేపీకి ఓట్లు వేస్తున్నారు.. ఎందుకు?
- జనవరి 1నే కొత్త సంవత్సర వేడుకలు ఎందుకు జరుపుకొంటాం?
- ట్రంప్‌కు కిమ్ న్యూ ఇయర్ వార్నింగ్: ఆంక్షలు కొనసాగిస్తే అడ్డం తిరుగుతా
- రోడ్డు మీద వదిలేసిన పాపకు అర్ధరాత్రి వెళ్లి పాలిచ్చిన కానిస్టేబుల్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








