ట్రంప్‌కు కిమ్ న్యూ ఇయర్ వార్నింగ్: ఆంక్షలు కొనసాగిస్తే అడ్డం తిరుగుతా

ఫొటో సోర్స్, Reuters
కొత్త సంవత్సరం తొలి రోజునే ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ అమెరికాకు వార్నింగ్ ఇచ్చారు. అణు నిరాయుధీకరణకు తాను కట్టుబడి ఉన్నానని, కానీ.. అమెరికా ఇలాగే ఆంక్షలు కొనసాగిస్తే మాత్రం తన ఆలోచనలు మారిపోవచ్చని ఆయన హెచ్చరించారు.
కొత్త సంవత్సరం రోజున ప్రజలనుద్దేశించి మాట్లాడిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
గత ఏడాది తన నూతన సంవత్సర ప్రసంగంలో ఆయన దక్షిణ కొరియా, అమెరికాలతో దౌత్యానికి కొత్త దారులు తెరిచారు.
ఉత్తర కొరియా అణు నిరాయుధీకరణపై 2018 జూన్‌లో కిమ్, అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ మధ్య చర్చలు జరిగినప్పటికీ ఇంతవరకు ఆ దిశగా చర్యలు లేవు.
2017లో ఆ రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. అమెరికాను చేరే సామర్థ్యం ఉన్న శక్తిమంతమైన క్షిపణులను ఉత్తర కొరియా పరీక్షించడం.. రెండు దేశాల అధినేతల మధ్య మాటల యుద్ధం, వాణిజ్య సమరం వంటివన్నీ ప్రపంచానికి యుద్ధ భయం కలిగించాయి.
అయితే... అంతటి ఉద్రిక్తతల అనంతరం 2018 తొలి రోజున కిమ్ పంపిన సానుకూల సంకేతాలు పరిస్థితిని పూర్తిగా మార్చాయి. ఉప్పునిప్పు లాంటి కిమ్, ట్రంప్‌ల మధ్య సమావేశం కూడా 2018లో సాధ్యమైంది. కానీ, ఆ స్ఫూర్తి, చర్యావేగం అక్కడితో ఆగిపోయింది.

ఫొటో సోర్స్, Getty Images
ఏటా నూతన సంవత్సరాదిన ప్రజలనుద్దేశించి మాట్లాడడం కిమ్‌కు అలవాటు. తన తాత కిమ్-2 సుంగ్ నుంచి ఆయన వారసత్వంగా ఈ రివాజును స్వీకరించారు.
సాధారణంగా దేశ ప్రజలకు సంబంధించిన అంశాలపైనే మాట్లాడుతుంటారు, కానీ.. గత ఏడాది అంతర్జాతీయ శాంతిసామరస్యాలకు దారులు వేసేలా మొట్టమొదటిసారి అణు నిరాయుధీకరణపై సానుకూలంగా స్పందించారు.
ఈ ఏడాది కిమ్ జోంగ్ ఉన్.. ''ప్రపంచమంతా చూస్తుండగా అమెరికా చేసిన బాసలు నిలబెట్టుకోకుండా మమ్మల్ని ఇంకా ఆంక్షల చట్రంలో బిగించి ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తే కనుక మా దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి, ప్రయోజనాలను రక్షించుకోవడానికి వేరే మార్గం ఎంచుకోవడం తప్ప మాకు గత్యంతరం ఉండదు'' అన్నారు.

ఫొటో సోర్స్, AFP
ఇచ్చిన మాట ప్రకారం ఉత్తర కొరియా కొత్తగా అణ్వాయుధాలు తయారుచేయరాదని.. ప్రయోగించరాదని.. వ్యాప్తికి సహకరించరాదని ప్రతిన పూనడమే కాకుండా అందుకు గట్టి చర్యలు కూడా తీసుకుందని కిమ్ చెప్పారు.
అంతేకాదు, ఎక్కడైనా, ఎప్పుడైనా డోనల్డ్ ట్రంప్‌ను మరోసారి కలవడానికి తాను సిద్ధమని కూడా కిమ్ అన్నారు.
అమెరికా ఇలాగే వ్యవహరిస్తే కనుక తాను అడ్డం తిరగడం ఖాయమన్న సంకేతాలిచ్చారు.
ఇవి కూడా చదవండి:
- చంద్రశేఖర్ ఆజాద్ తనను తాను కాల్చుకొని చనిపోయాడనేది నిజమేనా?
- అమ్మాయిలు నలుగురిలో చెప్పుకోలేని ఆ విషయాలు!
- పాకిస్తాన్ 'దుర్మార్గమైన అజెండా': చర్చల రద్దుకు దారి తీసిన ఈ స్టాంపులపై ఏముంది?
- హిందూ రాజ్యాన్ని అంబేడ్కర్ అతి పెద్ద ప్రమాదంగా ఎందుకు భావించారు?
- శుక్రవారం ప్రార్థనలు ముస్లింలకు ఎందుకంత ప్రత్యేకం?
- సీబీఐ వర్సెస్ సీబీఐ: డైరెక్టర్ అలోక్ వర్మ తొలగింపునకు.. రఫేల్ విచారణకు సంబంధముందా?
- 'పంజరంలో చిలక' సీబీఐలో ఏం జరుగుతోంది?
- వంటింటి చిట్కాలు పనిచేస్తాయా? చికెన్ సూప్ తాగితే, వెల్లుల్లి తింటే జలుబు తగ్గిపోతుందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








