జలుబుకు వంటింటి చిట్కాలు పనిచేస్తాయా?... చికెన్ సూప్ తాగితే, వెల్లుల్లి తింటే జలుబు తగ్గిపోతుందా?

ఫొటో సోర్స్, Getty Images
ఆరెంజ్ జ్యూస్ నుంచి చికెన్ సూప్ వరకూ ఎన్నో వంటింటి చిట్కాలు ఉన్నాయి. వీటివల్ల జలుబు నుంచి ఉపశమనం లభిస్తుందని చెబుతారు.
కానీ వీటిలో నిజంగా మీ జలుబు తగ్గించేది ఏది. అవి తగ్గిస్తాయని చెప్పడానికి ఆధారాలు ఉన్నాయా?
జలుబు ప్రపంచంలో అందరికీ ఎప్పుడో ఒకప్పుడు కచ్చితంగా వచ్చుంటుంది. జలుబు రావడానికి దాదాపు 200 వైరస్‌లు కారణం అంటారు.
కానీ దీన్నుంచి ఉపశమనం పొందడానికి కూడా దాదాపు అదే సంఖ్యలో వంటింటి చిట్కాలు ఉన్నాయి.
ఈ చిట్కాల్లో జలుబు తగ్గించేది ఏది?
ఎలాంటి అనారోగ్యం వచ్చినా, వంటింటి చిట్కాలు ఉపయోగించడం వెనుక, మనలోని వ్యాధి నిరోధక శక్తిని పెంచాలనే ఉద్దేశమే అసలు కారణం.
ఒక వైరస్ మన శరీరంలోకి చేరినప్పుడు, అది తనను అడ్డుకుంటున్న రెండు వ్యవస్థలతో పోరాడాల్సి ఉంటుంది.
సరిగ్గా అప్పుడే మన శరీరంలో ఉన్న వ్యాధి నిరోధక వ్యవస్థ లోపలికి చొరబడే ఆ వైరస్ కణాలను వెనక్కు పంపించాలని చూస్తుంది.
అదే సమయంలో అడాప్టివ్ సిస్టమ్ శరీరంలోకి అప్పటికే ప్రవేశించిన వ్యాధి కారక క్రిములను లక్ష్యంగా చేసుకుంటుంది.
వాటికి మెమరీ కణాలను సృష్టిస్తుంది. అలా చేయడం ద్వారా ఆ క్రిములు మళ్లీ వచ్చినపుడు శరీరం వాటితో పోరాడగలుగుతుంది.

ఫొటో సోర్స్, Getty Images
అందుకే మనకు అమ్మవారు లాంటి వైరల్ వ్యాధుల వంటివి ఒకేసారి వస్తుంటాయి.
ఇక సాధారణ జలుబు ఒకరి నుంచి ఇంకొకరికి వ్యాపించేటపుడు తన రూపం మార్చుకుంటూ ఉంటుంది.
అది అప్పటికే శరీరంలో ఉన్న మన మెమరీ కణాల్లో గందరగోళం సృష్టిస్తుంది. అలాంటి స్థితిని మనం చాలాసార్లు ఎదుర్కునే ఉంటాం.
మన జీవనశైలి, అలవాట్లు, ఆహారం అనేవి మన రోగనిరోధక శక్తిపై ప్రభావం చూపుతాయని అందరికీ తెలుసు.
"కానీ రోగనిరోధక శక్తి అనేదే లేకపోతే ఆరోగ్యంగా ఉన్న వారు కూడా బలహీన పడతారు. ఎందుకంటే మనకు విటమిన్ లేదా మినరల్ లోపం ఉన్నప్పుడు, జలుబును దూరం చేసే ఆహారం తీసుకున్నప్పుడు... మంచి ఆహారం తీసుకోకునప్పుడు వచ్చే ప్రభావంతో పోలిస్తే వ్యత్యాసం తక్కువగానే ఉంటుంది’’ అని లండన్ ఇంపీరియల్ కాలేజ్‌లో ఇన్ఫెక్షన్ వ్యాధుల విభాగం హెడ్ చార్లెస్ బంఘామ్ అంటారు.
మనకు విటమిన్, జింక్, ఐరన్ లాంటి కీలక పోషకాల లోపం మాత్రమే ఉంటే.. కేవలం వాటినే తీసుకోవడం వల్ల చాలా ఉపయోగం ఉంటుంది.
కానీ మనం బ్యాలెన్స్ డైట్ తింటూ, దానికి మరికొన్ని జోడించడం వల్ల రోగ నిరోధక శక్తి మరింత సమర్థంగా మారడం అనేది జరగదు.

ఫొటో సోర్స్, Getty Images
జలుబు తగ్గడానికి కొన్ని పరిష్కారాలు
అయినా, సాధారణ జలుబు నివారణపై జరిగిన కొన్ని అధ్యయనాల్లో వీటి వల్ల వ్యత్యాసం ఉందని గుర్తించారు.
వీటిలో మెజారిటీ అధ్యయనాలు ఆహారానికి బదులు ప్లేసిబో(రోగి మానసిక ప్రయోజనం కోసం సూచించే ఒక మందు లేదా ప్రక్రియ)లపైనే జరిగాయి.
నిజానికి చికెన్ సూప్ తాగడం వల్ల జలుబు తగ్గుతుంది అనే పాపులర్ చిట్కా గురించి ఎలాంటి విశ్వసనీయ పరిశోధనలూ జరగలేదు.
కానీ వెల్లుల్లి, మనకు జలుబు తగ్గడానికి సాయం చేసే సమర్థమైన ఇంటి మందుగా తేలింది.
ఒక అధ్యయనంలో ఆరోగ్యంగా ఉన్న 146 మందికి చలికాలంలో 12 వారాలపాటు రోజూ ఒక ప్లేసిబో, వెల్లుల్లితో చేసిన మందు ఇచ్చారు.
ప్లేసిబో తీసుకున్నవారిలో 65 మందికి జలుబు వచ్చింది. అదే వెల్లుల్లి మందు తీసుకున్న వారికి 24 మందికి మాత్రమే జలుబు చేసింది.
జలుబు లక్షణాలు ఉన్నట్లు అనిపించినప్పుడు చాలా మంది విటమిన్ సి తీసుకుంటారని చెబుతారు. కొంతమంది పరిశోధకులు అది కూడా పని చేసిందని చెప్పారు.
కానీ మనం అనుకున్నంతగా మాత్రం లేదు. విటమిన్ సి పదార్థాలపై జరిగిన 29 అధ్యయనాలను విశ్లేషించిన ఒక శాస్త్రవేత్త సి సప్లిమెంట్స్ జలుబు సమస్యలు, లేదా ఆ లక్షణాలను బాగా తగ్గిస్తాయని చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
ఆరెంజ్ జ్యూస్ తాగితే జలుబు తగ్గుతుందా?
కానీ జలుబు ఉన్న వాళ్లు ఆరెంజ్ జ్యూస్ తాగడం వల్ల అంత ఫలితం ఉండకపోవచ్చు.
ఆరెంజ్ జ్యూస్ జలుబును నివారిస్తుందని, ఉపశమనం అందిస్తుందని లేదా జలుబు ఉండే కాలాన్ని తగ్గిస్తుందని చెప్పడానికి పక్కా ఆధారాలేవీ లేవు.
జలుబుపై ప్రభావం చూపించేందుకు ఆరెంజ్‌లో తగినంత విటమిన్ సి లేదని హెల్సింకి యూనివర్సిటీ పరిశోధకురాలు హారీ హెమిలా అంటారు.
జింక్ బిళ్లలతో జలుబు బంధం
తర్వాత జలుబు చేస్తే జింక్ బిళ్లలు చప్పరించే విషయానికి వద్దాం.
సాధారణ జలుబు ఉన్నవాళ్లు రోజూ జింక్ బిళ్లలు చప్పరించడం వల్ల ఎలాంటి ప్రభావం ఉంటుందని పరిశీలించారు.
వారిలో ముక్కు కారడం, ముక్కు దిబ్బడ దాదాపు మూడో వంతు తగ్గినట్టు గుర్తించారు. అంతే కాదు జింక్ బిళ్లల వల్ల తుమ్మడం, దగ్గడం నుంచి కూడా దాదాపు సగం ఉపశమనం లభించింది.
ఈ అధ్యయనం ప్రకారం జలుబు లక్షణాలు కనిపించిన మొదటి 24 గంటల్లో రోజూ 80 ఎంజీ జింక్ అసిటేట్ బిళ్లలు తీసుకోవడం వల్ల సాధారణ జలుబు నయం అవుతుందని తేలింది.

ఫొటో సోర్స్, Getty Images
సప్లిమెంట్లతో జలుబు నుంచి ఉపశమనం
జలుబు లక్షణాలు, అది ఉన్నప్పుడు పరిశోధనలు చేయడం కంటే, జలుబు నుంచి పూర్తిగా కోలుకున్న వారిపై పరిశోధనలు చేయడం వల్ల ఫలితాలు మరింత కచ్చితత్వంతో ఉంటాయని హెమిలా భావించారు.
అలా చేయడం వల్ల జలుబు నుంచి కోలుకున్న వారు పరిశోధనల నుంచి తప్పుకోవడం. ఆ ప్రభావం గణాంకాలపై పడడం ఉండదన్నారు. అలా ఫలితాలు కూడా వక్రీకరణకు గురికావని తెలిపారు.
ఆయన జలుబు నుంచి పూర్తిగా కోలుకున్న 199 మంది రోగులపై అధ్యయనం చేశారు. వారిలో జింక్ బిళ్లలు తీసుకున్నవారికి జలుబు మూడు రెట్లు వేగంగా తగ్గినట్టు గుర్తించారు.
సప్లిమెంట్లు తీసుకోవడం కంటే ఆహారం ద్వారా విటమిన్లు, ఖనిజాలు తీసుకోవడం మంచిదని శాస్త్రవేత్తలు తరచూ చెబుతూనే ఉన్నారు.
విటమిన్ సి లాగే, సప్లిమెంట్ ద్వారా విటమిన్లు తరచూ హై డోసుల్లో పొందుతామని అన్నారు.
పరిశోధకులకు ఇందులో మరో సమస్య కూడా ఎదురవుతోంది. ఈ సప్లిమెంట్లు తీసుకునే ముందు వారికి విటమిన్ సి, జింక్ లాంటి విటమిన్ల లోపం ఉందేమో చూసుకోవాల్సి వస్తోంది. అంటే సప్లిమెంట్ తీసుకోవడం వల్ల జలుబు నుంచి ఉపశమనం లభించవచ్చు.

ఫొటో సోర్స్, Getty Images
చికెన్ సూప్ తాగితే జలుబు తగ్గుతుందా?
కానీ, చికెన్ సూప్, ఆరెంజ్ జ్యూస్ లాంటి కొన్నింటికి మాత్రం జలుబును నయం చేస్తాయా అనేదానిపై ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.
ప్లేసిబో లాంటివి చాలా లక్షణాలను నివారిస్తాయని గుర్తించారు. పేగుల్లో నొప్పి, మంట లాంటి సమస్యల నుంచి వాటితో ఉపశమనం ఎలా లభిస్తుంది అనేది తేలలేదు.
ఇక విటమిన్ సి, లేదా చికెన్ సూప్, ప్లేసిబోల వల్ల జలుబు నుంచి బయటపడచ్చా అనేది కూడా ఇంకా పూర్తిగా తెలీలేదు.
"చికెన్ సూప్ లాంటి కొన్ని ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల కొందరికి జలుబు నుంచి కాస్త ఉపశమనం లభించినట్టు అనిపించవచ్చని, వారికి అది సౌకర్యంగా ఉండచ్చని" డైటీషియన్ సారా స్కెన్కర్ చెబుతారు.
కొంతమందిలో విటమిన్ సి ఎంతుంది అనేదానికంటే, శీతాకాలంలో జలుబు క్రిములను వారు ఎంతవరకూ అడ్డుకోగలరు, వారికి ప్లేసిబోలపై ఎంత నమ్మకం ఉంది అనేదానిపై చికిత్స ఆధారపడి ఉంటుంది.
జలుబుతో పోరాడే లక్షణాలు ఉన్న ఎచినాసియా లాంటి కొన్ని మూలికలను రోజూ చిన్న మొత్తంలో తీసుకోవడం వల్ల జలుబు తగ్గుతుందని కొన్ని అధ్యయనాల్లో తేలింది.

ఫొటో సోర్స్, Getty Images
నమ్మకంపై పనిచేసే ప్లేసిబో
మనకు జలుబు వచ్చినపుడు పాలు తాగడం వల్ల కూడా జలుబుతో ముక్కు కారడం తగ్గుతుందని చాలా కాలం నుంచీ అనుకుంటున్నారు.
కానీ ఒక అధ్యయనం ప్రకారం పాలు తాగిన తర్వాత అది శ్వాసకు సంబంధించిన మరిన్ని లక్షణాలకు కారణమైనట్టు తేలింది.
ప్లేసిబోలను సాధారణంగా డాక్టర్లు ఆస్పత్రిలో పరీక్షిస్తుంటారు. "ఇంటి చిట్కాలకు ఈ ప్లేసిబో శక్తి మన రోజువారీ జీవితం నుంచే వచ్చింది" అని సౌతాంప్టన్ యూనివర్సిటీ హెల్త్ సైకాలజీ ప్రొఫెసర్లు చెప్పారు.
ప్లేసిబో ప్రభావం రోగులు, డాక్టర్ల మధ్య ఒక నమ్మకమైన బంధంపై ఆధారపడుతుంది.
ఎవరైనా మెరుగైన చికిత్స అందిస్తారని నమ్మితే వారు ఇచ్చిన ప్లేసిబోలు ఉపయోగించిన వారిపై వాటి ప్రభావం బలంగా ఉంటుంది.
ఇంట్లో చిట్కాలు కూడా ప్లేసిబోల లాంటివేనని తెలిసినా, వాటి వల్ల మనకు ఉపశమనం లభిస్తుంటే వాటిని ఆపాల్సిన అవసరం లేదు.

ఫొటో సోర్స్, PAUL WOOTTON SPL
మన జీన్స్‌లో వ్యాధి నిరోధక శక్తి
కొంతమందిలో జన్యువులు వారికి వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉండేలా చేస్తాయి. జన్యుపరంగా మనకు ఎలాంటి తేడాలు ఉన్నాయి తెలుసుకోవడం చాలా ముఖ్యం.
కొంతమందికి ఫ్లూ వచ్చినపుడు, అది ఎందుకొచ్చిందో కూడా వారికి తెలీదు. కొంతమందికి ఇంకా తీవ్రమైన వ్యాధులు రావచ్చు. ఇది పాక్షికంగా మనలోని జన్యువుల ద్వారా తేలుతుంది.
మనలో ఎక్కువ మందికి ఆరోగ్యకరమైన వ్యాధి నిరోధక శక్తి ఉంటుంది. మనం శీతకాలంలో జలుబును తట్టుకోడానికి ప్లేసిబోలపై కాస్త ఎక్కువే ఆధారపడవచ్చు. జింక్ లేదా వెల్లుల్లి పదార్థాలను చప్పరించడం వల్ల కాస్త ఉపశమనం కూడా లభింవచ్చు.
ఇవి కూడా చదవండి:
- ఆ సబ్బులతో మగవాళ్లలో వక్షోజాలు పెరుగుతాయా?
- ఆస్తమా ఎందుకొస్తుంది? ఏ జాగ్రత్తలు తీసుకోవాలి?
- ఈ వీడియో చూస్తే ఇక ఎన్నడూ ఆహారం వృధా చేయరు!
- చిన్న పిల్లల ఆహారాన్ని తీసుకెళ్లి చైనాలో అమ్ముకుంటున్నారు
- ఎన్ఐఎన్: హైదరాబాద్ ఆహారంలో ఎక్కువగా ‘పురుగు మందులు’, పిల్లలపై అధిక ప్రభావం
- బ్రేక్‌ఫాస్ట్ నిజంగానే ఆరోగ్యానికి మేలు చేస్తుందా?
- అన్నం ఎక్కువగా తింటే ముందుగానే మెనోపాజ్..!
- ఆస్ట్రేలియా: స్ట్రాబెర్రీ పండ్లలో సూదులు ఎందుకు దాస్తున్నారు?
- జన్యు బ్యాంక్‌లో భద్రంగా లక్షల రకాల వరి వంగడాలు
- చైనా ఎందుకు ఏటా 600 కోట్ల బొద్దింకలను ఉత్పత్తి చేస్తోంది?
- వ్యాయామం చేస్తే కరిగే కొవ్వు ఎటు వెళుతుంది?
- మైనస్ 60 డిగ్రీల చలిలో ప్రజలు ఎలా జీవిస్తారో తెలుసా!!
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








