హలో.. మీరు ఈ చికెన్‌ని తింటారా?

- రచయిత, క్రిస్ బరానియక్
- హోదా, టెక్నాలజీ రిపోర్టర్
ఆదివారం వచ్చిందంటే చాలు.. చాలా తెలుగు లోగిళ్లలో కోడి మాంసం ఉండాల్సిందే. దాన్ని వండాల్సిందే. మరి మీరు ల్యాబ్‌లో తయారు చేసిన చికెన్‌ను తింటారా?
అమ్మో.. అందులో ఏముందో అని భయపడతారా?
ఆ సంగతి అటుంచుదాం.
ఈ శతాబ్దం ఆఖరుకు ప్రపంచ జనాభా 1100 కోట్లకు చేరుతుండటంతో అందరికీ పౌష్టికాహారం పెద్ద సమస్య కానుంది.
దీంతో రైతులకు.. శాస్త్రవేత్తలకు మరింత పండించాలని, ఉత్పత్తి చేయాలన్న ఒత్తిడి పెరుగుతోంది.
దీంతో సైఫై ఆహారం తెరపైకి వచ్చింది. భవిష్యత్తులో ఇది ఆహార రంగంలో చాలా మార్పులు తెస్తుందని భావిస్తున్నారు.
అప్పటికి ఫుడ్ డిజైనర్లు కూడా పుట్టుకొస్తారని శాస్త్రవేత్తలు అంటున్నారు. రుచితో పాటు మంచి పోషక విలువలు కూడా ఉండేలా ఆహారాన్ని ల్యాబ్‌లో తయారు చేస్తారని అంటున్నారు.
అందులో భాగంగానే.. ఇప్పుడు అమెరికాలోని కాలిఫోర్నియాలో జోష్ టెట్రిక్ అనే శాస్త్రవేత్త బృందం చికెన్‌ను, ఇతర ఖరీదైన.. బలవర్ధకమైన నాన్ వెజ్ పదార్థాలను ల్యాబ్‌లో వృద్ధి చేస్తోంది.
ఈ ల్యాబ్ మాంసానికి మంచి భవిష్యత్తు ఉన్నట్లు శాస్ర్తవేత్తలు చెబుతున్నారు. మనం మాంసం కోసం కోళ్లను.. ఇతర జంతువులను పెంచుతుంటాం. వీటికి బందులు స్టెమ్ సెల్స్ ఇతర టెక్నాలజీ సాయంతో వీరు ప్రయోగశాలలో మాంసాన్ని ఉత్పత్తి చేస్తున్నారు.
దీంతో భవిష్యత్తులో మనకు కావాల్సిన పోషకాలతో ఆహారాన్ని డిజైన్ చేసేవారు కూడా తెరపైకి రానున్నట్లు తెలుస్తోంది.

ఫొటో సోర్స్, Just
టూనా చేపలు, చికెన్, పాలు.. వెన్న అన్నీ ఇప్పుడు తమ పరిశోధనదశలో ఉన్నాయని టెట్రిక్ తెలిపారు.
ఈ ఏడాది ఆఖరుకల్లా జస్ట్ బ్రాండ్ పేరిట ల్యాబ్‌లో అభివృద్ధి చేసిన మాంసాన్ని మార్కెట్లోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
అంతే కాదండోయ్.. టెట్రిక్ ప్రయోగం విజయవంతమైతే.. భవిష్యత్తులో చికెన్.. మటన్.. ఫిష్ కలిపిన మాంసం ముక్కలను కూడా రుచి చూసే రోజులు రావొచ్చు.

ఫుడ్ డిజైనర్లు మాంసానికి కాయగూరలను కూడా జత చేసి 'శాకామాంసాన్ని' అభివృద్ధి చేసినా ఆశ్చర్యపోనక్కరలేదని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు.
ఇక ఈ మాంసంలో అధిక ప్రొటీన్లు, తక్కువ కొవ్వు, పలు పోషకాలు.. ఇలా తమకు ఇష్టం వచ్చినట్లు కలపొచ్చని తెలిపారు.
అయితే మీరు ఊహించినంత భారీ ఎత్తున ఈ కృత్రిమ మాంసం అందుబాటులోకి రాకపోవచ్చు.
మొదట్లో ఇది తక్కువ స్థాయిలోనే అందుబాటులోకి వచ్చే అవకాశముంది.

ఫొటో సోర్స్, Getty Images
మరి అందరూ దీన్ని తింటారా? అంటే తినే అవకాశమే లేదు.
ఎందుకంటే, ఎవరైనా సహజంగా లభించే పదార్థాలనే తింటారు కానీ సైన్స్‌ని తినాలని అనుకోరు.
అలాగే భవిష్యత్తులో కచ్చితమైన పోషకాలు, కెలొరీల ఆహారాన్ని అందించేందుకు త్రీడీ ప్రింటర్లు కూడా అందుబాటులోకి రానున్నాయి.
మొత్తానికి ఎంత చేసినా.. ఆహారంతో ప్రయోగాలంటే మాత్రం చాలా మందికి భయం వేయొచ్చు.
చూద్దాం మరి.. భవిష్యత్తులో ఏం జరుగుతుందో..!!
ఇవి కూడా చూడండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








