ఆస్ట్రేలియా: స్ట్రాబెర్రీ పండ్లలో సూదులు ఎందుకు దాస్తున్నారు? 'ద్రోహులెవరో' గుర్తించేందుకు దేశవ్యాప్తంగా దర్యాప్తు

పండ్లలో సూది

ఫొటో సోర్స్, QUEENSLAND POLICE

    • రచయిత, ఫ్రాన్సెస్ మావో
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఆస్ట్రేలియాలో స్ట్రాబెర్రీ పండ్లలో దుండగులెవరో సూదులు దాచిపెట్టడం, అది తెలియని కొందరు వాటిని తిని గాయపడటంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. దుస్తులు కుట్టే సూదులను స్ట్రాబెర్రీల్లో దాచిన 'ద్రోహులెవరో' గుర్తించేందుకు ప్రభుత్వం దేశవ్యాప్తంగా దర్యాప్తు జరిపిస్తోంది.

ఈ ఉదంతాలు తొలిసారిగా గత వారం వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో, ఇలాంటి నేరాలకు పురిగొల్పే కారణాలేమిటనే అంశంపై నేరాల అధ్యయనవేత్తలు (క్రిమినాలజిస్టులు), మానసిక శాస్త్ర నిపుణులు(సైకాలజిస్టుల)తో బీబీసీ మాట్లాడింది.

ఆస్ట్రేలియాలో ఆహార పదార్థాలతో ఇలాంటి నేరాలకు పాల్పడటం చాలా అరుదని, ఈ నేరం తీరు కూడా చాలా భిన్నంగా ఉందని నిపుణులు అభిప్రాయపడ్డారు. అందువల్లే ప్రజల్లో దీనిపై చాలా ఆగ్రహం వ్యక్తమవుతోందని యూనివర్శిటీ ఆఫ్ న్యూ సౌత్ వేల్స్‌కు చెందిన ఫోరెన్సిక్ సైకాలజిస్టు అనితా మెక్‌గ్రెగర్ చెప్పారు.

పండు, సూది

ఫొటో సోర్స్, JOSHUA GANE

ఈ నేరం మూలాల గురించి పోలీసు అధికారులు బహిరంగంగా ఏమీ చెప్పలేదు. స్ట్రాబెర్రీ పండ్ల పరిశ్రమలో సరఫరా గొలుసు సంక్లిష్టంగా ఉందని, దీనిపై పరిశీలన జరుపుతున్నామని వారు తెలిపారు.

ఈ నేరానికి పాల్పడడానికి వేర్వేరు కారణాలు ఉండొచ్చని క్రిమినాలజిస్టులు చెప్పారు.

ప్రజలకు హాని కలిగించాలనే ఉద్దేశం ఈ పనిచేసినవారికి ఉంటుందని చెప్పలేమని యూనివర్శిటీ ఆఫ్ సిడ్నీకి చెందిన ప్రొఫెసర్ ముర్రే లీ తెలిపారు. ఎవరైనా స్ట్రాబెర్రీ తోటల యజమాని లేదా వ్యాపారి తీరు పట్ల సదరు వ్యక్తులు తీవ్రమైన అసంతృప్తితో ఉండొచ్చని, అది ఒక కారణమై ఉండొచ్చని అభిప్రాయపడ్డారు.

ప్రజల్లో భయాందోళనలు కలిగించాలనే దురుద్దేశం కూడా ఉండొచ్చని ఆయన చెప్పారు.

దుకాణం

ఫొటో సోర్స్, EPA

కార్లు, విమానాలను ఆయుధాలుగా వాడి కొందరు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తుంటారని, ఆహార పదార్థాన్ని వాడి ఇలా చేయడం కూడా ఈ కోవలోకే వస్తుందని ఆయన వ్యాఖ్యానించారు.

'మానసిక వైకల్యమూ కారణమే'

కొందరు నేర ప్రవృత్తితో కాకుండా, మానసిక వైకల్యంతో ఇలా చేస్తుండొచ్చని అనితా మెక్‌గ్రెగర్ చెప్పారు.

సూదిని దాచిన స్ట్రాబెర్రీని చూసుకోకుండా తిన్న ఒక వ్యక్తి సూది లోపలికి పోవడంతో ఇటీవల ఆస్పత్రి పాలయ్యాడు. పలువురు చిన్నారులు, పెద్దవాళ్లు తృటిలో ప్రమాదాన్ని తప్పించుకున్నారు.

ఈ ఘటనల నేపథ్యంలో, ఆహార పదార్థాలను కలుషితం చేస్తే విధించే శిక్షలను ప్రభుత్వం కఠినతరం చేసింది.

ముందు జాగ్రత్తగా, స్ట్రాబెర్రీలను చిన్నచిన్న ముక్కలుగా కోసుకొనే తినాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

స్ట్రాబెర్రీ పండ్ల డబ్బా

ఫొటో సోర్స్, EPA

స్ట్రాబెర్రీలో సూదులు దాయడం లాంటి పనులు అమ్మకాలపై ప్రభావం చూపిస్తాయని రైతులు, పండ్ల అమ్మకందారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఆస్ట్రేలియాలో స్ట్రాబెర్రీల వ్యాపారం విలువ ఏడాదికి 13 కోట్ల ఆస్ట్రేలియా డాలర్లు (సుమారు రూ.677 కోట్లు).

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)