హోమియోపతి మందులు: అవి ఒట్టి చక్కెర గోళీలేనా?

ఫొటో సోర్స్, Getty Images
హోమియోపతి వైద్యం అందిస్తున్న లండన్‌లోని ఒక ప్రధాన వైద్య కేంద్రానికి ప్రభుత్వ నిధులు నిలిచిపోనున్నాయి.
ఏప్రిల్ 1 నుంచి రాయల్ లండన్ హాస్పిటల్ ఫర్ ఇంటిగ్రేటెడ్ మెడిసిన్‌లోని హోమియోపతి విభాగానికి జాతీయ ఆరోగ్య సేవల (ఎన్‌హెచ్‌ఎస్) కింద అందుతున్న నిధులను నిలిపివేయనున్నారు.
హోమియోపతి వ్యతిరేకులు ఈ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు. ఇది ఎన్నాళ్ల క్రితమో చేయాల్సిన పని అని వారు అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, Getty Images
ఒక జబ్బు దేని వల్ల వస్తుందో, దానికి విరుగుడు కూడా అదే అన్న సూత్రం మీద హోమియోపతి వైద్యం పని చేస్తుంది. అయితే సైంటిస్టులు మాత్రం రోగులు కేవలం చక్కెర గోళీలు తింటున్నారని అంటున్నారు.
జబ్బుకు ఏ పదార్థమైతే కారణమవుతుందో, అలాంటి పదార్థాన్నే డైల్యూట్ చేసి ఉపయోగిస్తే జబ్బు నయం అవుతుందని హోమియోపతి వైద్యులు అంటారు. ఉదాహరణకు పుప్పొడికి, గడ్డికి హే-ఫీవర్‌ను నయం చేసే లక్షణాలు ఉంటాయని హోమియోపతి అంటుంది.
జబ్బుకు విరుగుడుగా పని చేసే పదార్థం ఒక భాగానికి, 99 భాగాల నీళ్లు లేదా ఆల్కాహాల్ కలుపుతారు. ఈ పద్ధతిని ఆరుసార్లు అనుసరిస్తే దాన్ని 6సీ ఫార్ములేషన్ అని, 30 సార్లు అనుసరిస్తే 30సీ ఫార్ములేషన్ అని అంటారు.
దాన్ని ఎంత ఎక్కువగా డైల్యూట్ చేస్తే, దాని వల్ల అంత ఎక్కువగా ఫలితం ఉందని హోమియోపతి వైద్యులు చెబుతారు.

ఫొటో సోర్స్, Getty Images
ఆస్తమా, ఎలర్జీ, హే ఫీవర్, డిప్రెషన్, ఆర్థరైటిస్‌లాంటి అనేక జబ్బులకు చాలా మంది హోమియోపతి వైద్యాన్నే నమ్ముతున్నారు.
అయితే ఎన్‌హెచ్‌ఎస్, 'హోమియోపతి పని చేస్తుందని విశ్వసించడానికి కచ్చితమైన ఆధారాలు లేవు' అని చెబుతోంది.
ఎన్‌హెచ్‌ఎస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సైమన్ స్టీవెన్స్, హోమియోపతి కేవలం మానసిక భావన మీద ఆధారపడుతుందని, అసలే తక్కువగా ఉన్న ఎన్‌హెచ్‌ఎస్ నిధులను ఇలా దుర్వినియోగం చేయలేమని అన్నారు.
హోమియోపతికి నిధులు ఇవ్వడానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న 'గుడ్ థింకింగ్ సొసైటీ' ఈ పరిణామాన్ని ఆహ్వానించింది.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








