‘మా జర్నలిస్టులను కాపాడండి’: ఐరాసను కోరిన బీబీసీ

బీబీసీ పర్షియన్ సర్వీస్ జర్నలిస్టులను, వారి కుటుంబ సభ్యులను ఇరాన్ ప్రభుత్వం వేధిస్తోందనీ, వాళ్లను బెదిరించడం, అరెస్టులు చేయడం పెరిగిందనీ బీబీసీ పేర్కొంది.
తమ జర్నలిస్టులు, వారి కుటుంబీకుల హక్కులను కాపాడాలని ఐరాసను బీబీసీ కోరింది.
‘ఐరాసను ఇలా కోరాల్సి వస్తుందని మేం అనుకోలేదు. కానీ అన్ని ప్రయత్నాలూ విఫలమయ్యాయి. బీబీసీ పర్షియన్ సర్వీసులో పనిచేసే జర్నలిస్టులను, వారి కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకొని ఇలా వేధించడం సరికాదు’ అని బీబీసీ డైరెక్టర్ జనరల్ టోనీ హాల్ అన్నారు.
2009 నుంచి బీబీసీ తమ పర్షియన్ టీవీ సేవల్ని లండన్ నుంచి అందిస్తోంది. దాదాపు 1.8 కోట్ల మంది ఇరానియన్లు, అంటే.. దేశంలోని పావు వంతు జనాభా బీబీసీ పర్షియన్ ఆన్‌లైన్, టీవీ, రేడియో సేవల్ని పొందుతున్నారు.
2009లో వివాదాస్పదమైన అధ్యక్ష ఎన్నికల అనంతరం బీబీసీ పర్షియన్ సర్వీసును ఇరాన్ ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుంది. దేశంలో విదేశీ శక్తుల జోక్యం పెరిగిందని ప్రభుత్వం ఆరోపించింది.
ఇప్పటిదాకా 20 మందికి పైగా పర్షియన్ సర్వీసు జర్నలిస్టులు, వారి కుటుంబీకులకు చంపేస్తామనే బెదిరింపులు అందాయి.
ఒకసారి ఓ జర్నలిస్టు బంధువైన పదేళ్ల పిల్లాడిని తీసుకెళ్లి ఇంటరాగేట్ చేశారు. మరోసారి ఓ జర్నలిస్టు తండ్రయిన 90ఏళ్ల వృద్ధుడిని ఇంటరాగేట్ చేశారు.

‘పర్షియన్ సర్వీసులో పనిచేసే వారందరి ఆస్తులను ఫ్రీజ్ చేశారు. దేశ భద్రతకు వ్యతిరేకంగా కుట్రపన్నుతున్నామనే ఆరోపణలపై మమ్మల్ని విచారిస్తున్నారు’ అని బీబీసీ పర్షియన్ సర్వీసులో పనిచేసే రానా రహీమోపుర్ అంటున్నారు.
ఇరాన్ ప్రభుత్వం మాత్రం బీబీసీ ఆరోపణలు తప్పని చెబుతోంది.
ప్రస్తుతం ఇరానియన్ మీడియా భారీగా సెన్సార్‌షిప్‌ను ఎదుర్కొంటోంది.
ఇరాన్ ప్రభుత్వ తీరు మారేలా ఐరాస మానవ హక్కుల మండలి ఒత్తిడి చేయగలదని బీబీసీ ఆశిస్తోంది.
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









