వేతనాల్లో కోతకు అంగీకరించిన బీబీసీ పురుష న్యూస్ ప్రెజెంటర్లు

వేతనాల్లో అసమానతల వార్తలపై ప్రతిస్పందిస్తూ బీబీసీకి చెందిన నలుగురు పురుష న్యూస్ ప్రెజెంటర్లు తమ వేతనాలను తగ్గించుకోవడానికి అంగీకారం తెలిపారు.
జెరెమీ వైన్, జాన్ హంప్రీస్, హ్యూ ఎడ్వర్డ్స్, జాన్ సోపెల్‌లు తమ వేతనాల్లో కోతకు అంగీకరించారు.
పురుష, మహిళా అంతర్జాతీయ ఎడిటర్ల వేతనాలలో అసమానతలకు నిరసనగా బీబీసీ చైనా ఎడిటర్ క్యారీ గ్రేసీ తన పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో వారు ఈ నిర్ణయం తీసుకున్నారు.
ప్రస్తుతం గ్రేసీ లండన్ లోని బీబీసీ న్యూస్ రూమ్‌కు తిరిగి వెళుతున్నారు. భవిష్యత్తులో తమ వేతనాలు సమానంగా ఉంటాయని ఆమె భావిస్తున్నారు.
బీబీసీలో సమాన వేతనాలపై ఒక స్వతంత్ర ఆడిట్ నివేదిక వచ్చే వారం విడుదల కానుంది.
జులై, 2017లో బీబీసీ తమ సంస్థలో 150,000 పౌండ్ల(సుమారు రూ.1.35 కోట్లు)కు పైగా వేతనాలు పొందుతున్న వారి జాబితాను విడుదల చేసింది.
ఆ జాబితాలో క్రిస్ ఎవాన్స్ 2016/2017లో రూ.19.84 కోట్ల నుంచి రూ.22.54 కోట్ల వేతనంతో మొదటి స్థానంలో నిలిచారు.
అదే సమయంలో మహిళల్లో అత్యధికంగా క్లాడియా వింకెల్‌మ్యాన్ రూ.4 కోట్ల నుంచి రూ.4.5 కోట్లు మాత్రమే వేతనంగా పొందారు.

ఫొటో సోర్స్, PA
వేతనాల్లో కోతకు అంగీకరించిన నలుగురు ప్రెజెంటర్ల వివరాలు:
- జెరెమీ వైన్, రేడియో 2 ప్రెజెంటర్: 2016/2017 లో రూ.6.3 కోట్ల నుంచి రూ.6.7 కోట్లు ఆర్జించారు.
- జాన్ హంప్రీస్, టుడే కార్యక్రమ ప్రెజెంటర్: 2016/2017 లో రూ.5.4 కోట్ల నుంచి రూ.5.8 కోట్లు ఆర్జించారు.
- హ్యూ ఎడ్వర్డ్స్, బీబీబీ న్యూస్ ప్రెజెంటర్: 2016/2017 లో రూ.4.96 కోట్ల నుంచి రూ.5.4 కోట్లు ఆర్జించారు.
- జాన్ సోపెల్, బీబీసీ ఉత్తర అమెరికా ఎడిటర్: 2016/2017 లో రూ.1.8 కోట్ల నుంచి రూ.2.25 కోట్లు ఆర్జించారు.
అయితే వీరు ఎంత మేరకు తమ వేతనాలను తగ్గించుకుంటున్నారో మాత్రం ప్రస్తుతం సమాచారం లేదు.
ఎంటర్‌టెయిన్మెంట్ పరిశ్రమలో పోటీ తీవ్రంగా పెరిగితే, వార్తల విషయంలో పరిస్థితి దానికి వ్యతిరేకంగా ఉందని బీబీసీ మీడియా ఎడిటర్ అమోల్ రాజన్ తెలిపారు.
ప్రస్తుతం వేతనాల కోతకు అంగీకరించిన వారి విషయంలో చాలా ఏళ్ల క్రితం ఉదారమైన ఒప్పందాలు జరిగాయని అన్నారు. మారిన పరిస్థితుల నేపథ్యంలో వేతనాల్లో కోత తప్పడం లేదని వివరించారు.

ఈ నెల ప్రారంభంలో హంప్రీస్, సోపెల్‌ల మధ్య వేతన అసమానతలపై సంభాషణను రికార్డు చేసి, దానిని విడుదల చేయడం వివాదాస్పదమైంది.
తమ సంభాషణలో వారిద్దరూ, క్యారీ గ్రేసీ తన పదవిలో కొనసాగేందుకు తమ వేతనంలో ఎంత భాగం ఆమెకు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారంటూ జోకులు వేసుకున్నారు.
అయితే దీనిపై బీబీసీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.
గ్రేసీ త్వరలో ఎంపీల సెలెక్ట్ కమిటీ ముందు హాజరు కానున్నారు. అనంతరం బీబీసీ డైరెక్టర్ జనరల్ టోనీ హాల్, ఆయన డిప్యూటీ అన్నీ బుల్‌ఫోర్డ్‌లు కూడా సెలెక్ట్ కమిటీ ముందు హాజరవుతారు.
సెలెక్ట్ కమిటీ వారితో వేతనాల్లో లైంగిక వివక్షను నిర్మూలించడానికి తీసుకుంటున్న చర్యలపై చర్చిస్తుంది.
ఇప్పటివరకు బీబీసీలో వేతన అసమానతలపై మూడుసార్లు విచారణ జరిపారు.
- అన్ని పెద్ద సంస్థలలో తప్పనిసరిగా చేపట్టాల్సిన విచారణకు అనుగుణంగా గత అక్టోబర్‌లో ఒక నివేదికను విడుదల చేసారు. దానిలో దేశవ్యాప్తంగా వేతన అసమానతలు సగటున 18.1 శాతం ఉండగా, బీబీసీలో అది 9.3 శాతం ఉన్నట్లు తేలింది.
- ఒక జడ్జి నేతృత్వంలోని ఆడిట్ రిపోర్ట్, వేతనాల విషయంలో బీబీసీలో ఒక పద్ధతి ప్రకారం లైంగిక వివక్ష ప్రదర్శిస్తున్నట్లు తమ దృష్టికి రాలేదని తెలిపింది.
- ఆన్-ఎయిర్ ప్రెజెంటర్లు, ఎడిటర్లు, కరస్పాండెంట్ల వేతనాల విషయంలో బీబీసీ అనుసరించే విధానాన్ని వచ్చే వారం విడుదల చేయనున్నారు.
బీబీసీ సెక్రటరీ జనరల్ లార్డ్ హాల్ 2020 నాటికల్లా వేతనాల్లో అసమానతలు నిర్మూలించి, బీబీసీ ఇతర సంస్థలకు ఆదర్శంగా నిలుస్తుందని హామీ ఇచ్చారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)








