కువైట్‌ క్షమాభిక్షను వినియోగించుకోండి: తెలంగాణ ప్రభుత్వం

భారతదేశ పాస్‌పోర్ట్

ఫొటో సోర్స్, iStock

    • రచయిత, బళ్ల సతీశ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

కువైట్‌లో చిక్కుకుపోయిన విదేశీయ‌ల కోసం ఇటీవల ఆ దేశం క్ష‌మాభిక్ష ప్ర‌క‌టించింది.

వేర్వేరు కార‌ణాలతో చ‌ట్ట వ్య‌తిరేకంగా త‌మ దేశంలో ఉంటున్న విదేశీయుల‌కు ఎటువంటి శిక్ష‌, జ‌రిమానా లేకుండా తిరిగి స్వదేశానికి వెళ్లే అవ‌కాశం కల్పిస్తోంది.

ఉపాధి కోసం గ‌ల్ఫ్ దేశాల‌కు వెళ్లడం తెలుగు రాష్ట్రాల్లో సర్వసాధార‌ణం. అక్క‌డ ఇళ్ల‌ల్లో స‌హాయ‌కులుగా, వివిధ కంపెనీల్లో కార్మికులుగా, ప‌శువుల కాప‌ర్లుగా, నిర్మాణ రంగంలో ప‌నిచేయ‌డానికి పెద్ద సంఖ్యలో ఇక్కడి నుంచి వెళుతుంటారు. అయితే సరైన వీసా లేక‌పోవ‌డం, యాజ‌మాన్యంతో విబేధాలొచ్చి బ‌య‌ట‌కు వచ్చేవాళ్ల సంఖ్యా ఎక్కువే.

కువైట్ వెళ్లే వారికి వివిధ ప‌నుల కోసం భిన్నరకాల వీసాలు ఇస్తుంటారు. వాటిని కాద‌ని వేరే ప‌నుల‌కు వెళ్ల‌కూడ‌దు. అంటే ఇంట్లో స‌హాయ‌కులుగా ప‌నిచేయ‌డానికి వెళ్లిన వారు, అక్క‌డ ఇబ్బంది ఎదురై ఇంట్లోంటి బ‌య‌ట‌కు వ‌చ్చేస్తే వారిని నేరుగా వేరే ప‌నిలో పెట్టుకోకూడ‌దు. కానీ, చాలా మందికి దీనిపై అవ‌గాహ‌న ఉండ‌దు.

కువైట్ చిహ్నం

ఫొటో సోర్స్, Wikipedia

ఫొటో క్యాప్షన్, కువైట్ చిహ్నం

నిబంధనలు తెలియక జైలుపాలు

కంపెనీల్లో కార్మికులు ఒత్తిడి త‌ట్టుకోలేక‌, ప‌శువుల కాప‌ర్లుగా పనిచేసేవారు వాతావ‌ర‌ణం భ‌రించ‌లేక‌, ఇంట్లో ప‌నిచేసే వారు యజ‌మానుల‌తో ఇబ్బందులు ప‌డలేక త‌ప్పించుకుంటారు.

అటువంటి వారిలో చాలా మంది తెలిసో తెలియ‌కో వీసా నిబంధ‌న‌లు ఉల్లంఘిస్తారు.

ఇంకొంద‌రి విష‌యంలో యాజ‌మాన్యం పాస్‌పోర్టు, వీసా త‌మ ద‌గ్గ‌ర ఉంచేసుకుని వారికి తిరిగి ఇవ్వ‌కుండా వేధిస్తారు. దీనికితోడు పాస్‌పోర్టు, వీసా కాల‌ప‌రిమితి అయిపోవ‌డం మ‌రో స‌మ‌స్య‌.

కొంత‌మంది అక్క‌డి అధికారుల‌కు తెలియ‌కుండా దాక్కుంటారు. ఇలాంటి వారిని అక్క‌డ ప్ర‌భుత్వం అదుపులోకి తీసుకుంటుంది.

చ‌ట్ట వ్య‌తిరేకంగా ఉంటున్న వారు, చిన్న త‌ప్పుల‌కు జైలు పాల‌యినవారికి సాధార‌ణంగా రంజాన్ మాసంలో అక్కడి ప్రభుత్వం క్ష‌మాభిక్ష పెడుతుంది.

ఇది ప్ర‌తీ రెండేళ్లకోసారి జ‌రుగుతుండేది. కానీ, గత కొన్నేళ్లుగా కువైట్ ప్ర‌భుత్వం క్ష‌మాభిక్ష ప్రకటించలేదు. దీంతో పెద్ద సంఖ్య‌లో అక్ర‌మ వ‌ల‌సదారులు గ‌ల్ఫ్ జైళ్లలో మగ్గిపోతున్నారు.

భారతదేశ పాస్‌పోర్ట్

ఫొటో సోర్స్, Getty Images

అక్రమ నివాసితులకు మంచి అవకాశం

కువైట్ ప్ర‌భుత్వ నిర్ణ‌యానికి సంబంధించి తెలంగాణ ప్ర‌భుత్వం వ‌ద్ద ఉన్న స‌మాచారం ప్రకారం, ఆ దేశ‌ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆమ్నెస్టీ డిక్రీ 64/2018ని జ‌న‌వ‌రి 23న విడుద‌ల చేసింది. ఇది జ‌న‌వ‌రి 29 నుంచి ఫిబ్ర‌వ‌రి 22 వ‌ర‌కూ అమ‌ల్లో ఉంటుంది. దీని ప్ర‌కారం ఈ కింది వారు దేశం విడిచి వెళ్ల‌ిపోవ‌చ్చు.

1. అక్ర‌మ నివాసితులు, వీసా ముగిశాక ఉంటున్న‌వారు ఎటువంటి అనుమ‌తి, జ‌రిమానా లేకుండా దేశం విడిచిపెట్ట‌వ‌చ్చు. ఇటువంటి వారు మ‌ళ్లీ స‌రైన ప‌త్రాల‌తో, అన్ని అనుమ‌తుల‌తో తిరిగి కువైట్ రావాల‌నుకుంటే రావ‌చ్చు.

2. అక్ర‌మ నివాసితులు, వీసా ముగిశాక ఉంటున్న‌వారు కావాల‌నుకుంటే తగిన జ‌రిమానా చెల్లించి త‌మ వీసా పొడిగించుకుని కువైట్‌లో ఉండిపోవచ్చు.

3. రెసిడెన్సీ నిబంధ‌న‌లు ఉల్లఘించి నిషేధానికి గురైనవారు, కోర్టు కేసులు ఉన్న వారు ఇప్పుడు రెసిడెన్సీ ఎఫైర్స్ డిపార్టుమెంట్‌తో మాట్లాడి త‌మ‌కు వీసా వ‌చ్చే అవ‌కాశం ఉందేమో చర్చించుకోవచ్చు.

4. క్ష‌మాభిక్ష కాలం ముగిశాక ఈ స‌డ‌లింపు ఉత్త‌ర్వు చెల్ల‌దు. క్ష‌మాభిక్ష స‌మ‌యంలో దొరికిన వారిని వెంట‌నే ఆయా దేశాల‌కు త‌ర‌లిస్తారు. ఈ స‌మ‌యంలో దేశం విడిచి పెట్ట‌ని వారిపై జ‌రిమానా విధిస్తారు. వారికి వీసా ఇవ్వ‌కుండా, స్వదేశం పంపించేస్తారు. వారి తిరిగి ఇంకెప్పుడూ కువైట్ రాకుండా నిషేధిస్తారు.

తెలంగాణ ప్ర‌భుత్వ ఎన్ఆర్ఐ వ్య‌వ‌హారాల అధికారి ఇ. చిట్టిబాబు

ఫొటో సోర్స్, chittibabu/whatsaap

ఫొటో క్యాప్షన్, తెలంగాణ ప్ర‌భుత్వ ఎన్ఆర్ఐ వ్య‌వ‌హారాల అధికారి ఇ. చిట్టిబాబు

"కువైట్ ప్ర‌భుత్వం ఇచ్చిన ఈ అవ‌కాశాన్ని భార‌తీయులు ఉప‌యోగించుకోవాలి. జ‌రిమానా క‌ట్టి త‌మ నివాసాన్ని చ‌ట్ట‌బ‌ద్ధం చేసుకోవాలి లేదా తిరిగి స్వదేశం వ‌చ్చేయాలి. ఇందుకోసం భార‌త రాయ‌బార కార్యాలయం లేదా తెలంగాణ ప్ర‌భుత్వం సాధార‌ణ పరిపాల‌న‌లోని ఎన్ఆర్ఐ వ్య‌వహారాల శాఖ‌ను సంప్ర‌దించ‌వ‌చ్చు" అని తెలంగాణ ప్ర‌భుత్వ ఎన్ఆర్ఐ వ్య‌వ‌హారాల అధికారి ఇ. చిట్టిబాబు బీబీసీకి తెలిపారు.

కొల్లాబ‌త్తుల రాజు

ఫొటో సోర్స్, Raju/whatsaap

ఫొటో క్యాప్షన్, కొల్లాబ‌త్తుల రాజు

'అందరికి తెలియాల్సిన అవసరం ఉంది'

తెలుగు రాష్ట్రాలకు సంబంధించి చిన్న చిన్నతప్పులతో జైలుపాలైన వారు, పాస్‌పోర్టు కాలప‌రిమితి ముగిసిన వారు, అక్రమ నివాసితులు దాదాపుగా 20 నుంచి 30 వేల మంది కువైట్‌లో ఉంటారని కొల్లాబ‌త్తుల రాజు తెలిపారు.

రాజు గత 22 ఏళ్లుగా కువైట్‌లో ఉంటున్నారు.

"ఇలాంటి వారు డ‌బ్బులుంటే స్వదేశానికి తిరిగి వెళ్ల‌వ‌చ్చు. కొంద‌రికి ఎంబ‌సీ, స్వ‌చ్ఛంద సంస్థ‌లు స్వదేశానికి వెళ్లడానికి టికెట్ ఖర్చులు ఇస్తాయి. ఏడేళ్లుగా కువైట్ ప్ర‌భుత్వం క్ష‌మాభిక్ష ఇవ్వ‌లేదు. వీసా ప్ర‌కారం వ‌చ్చే అనుమ‌తిని ఇక్క‌డ అకామా అంటారు. అది లేకుండా ఉండ‌టం స‌రికాదు. మేం ఇప్ప‌టికే దీని గురించి ప్ర‌చారం ప్రారంభించాం. ఇటువంటి నిబంధన వ‌చ్చింద‌ని చాలా మందికి తెలియదు. వారికి చెప్పాలనేదే మా ప్ర‌య‌త్నం" అని కొల్లాబ‌త్తుల రాజు తెలిపారు.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.