ప్రెస్‌రివ్యూ: తిట్టారంటే ఇక కటకటాలే!

ఫొటో సోర్స్, TELANGANACMO/FACEBOOK
తెలంగాణలో నోటికొచ్చినట్లు తిడితే ఇక కటకటాలు లెక్కించక తప్పదు. నేరుగానే కాదు.. సామాజిక మాధ్యమాల ద్వారా అయినా సభ్యత మరిచి ఇతరులను దూషిస్తే, కించపరిస్తే జైలుకు వెళ్లాల్సిందే అని 'ఆంధ్రజ్యోతి' పేర్కొంది.
కేసు నమోదు చేయడానికి కోర్టు అనుమతి తీసుకోవడం వంటి సంప్రదాయాలేమీ పాటించనక్కర్లేదు. ఫిర్యాదు అందిన వెంటనే నేరుగా పోలీసులు కేసు నమోదు చేస్తారు. సదరు వ్యక్తిని అరెస్టు చేస్తారు.
ఈ మేరకు ఐపీసీ చట్టంలోని సెక్షన్లు 506, 507 కింద పేర్కొన్న నేరాలను కోర్టు అనుమతి లేకుండానే (కాగ్నిజబుల్) విచారించదగినవిగా తెలంగాణ ప్రభుత్వం గుర్తించింది. సంబంధిత ఫైలుపై సీఎం కేసీఆర్ గురువారం సంతకం చేశారు.
పరుష పదజాలంతో దూషించడం, బెదిరించడం, తిట్టడం, కించపరచడం వంటి ప్రత్యక్ష బెదిరింపులు సెక్షన్ 506 (నేరపూరిత బెదిరింపు) కిందకు వస్తాయి.
నేరాన్ని ప్రేరేపించడం వంటి పరోక్ష బెదిరింపులు సెక్షన్ 507 (క్రిమినల్ ఇంటిమిడేషన్ బై అనానిమస్ కమ్యూనికేషన్) పరిధిలోకి వస్తాయి అని ఆంధ్రజ్యోతి తెలిపింది.

ఫొటో సోర్స్, chandrababu naidu/FACEBOOK
ఆంధ్రాకు అలీబాబా
భారత దేశంలో తమ రెండో డేటా సెంటర్‌ను నవ్యాంధ్రలో ఏర్పాటు చేస్తామని అలీబాబా క్లౌడ్ ప్రకటించింది. ఈ ఏడాదిలోనే ఈ కేంద్రాన్ని ప్రారంభిస్తామని తెలిపింది అని ఆంధ్రజ్యోతిపేర్కొంది.
గురువారం దావోస్‌లో అలీబాబా క్లౌడ్ అధ్యక్షుడు సైమన్ హూ బృందంతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక చర్చలు జరిపారు. మీతో భేటీకోసం ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్నాను.
అలీబాబా ఇ-కామర్స్ రంగంలోనే దిగ్గజ సంస్థగా భావించాం. సాంకేతిక రంగంలోనూ మీరు మేటి అని అర్థమైంది. భారతీయులు ఐటీలో ఎంతో నిపుణులు.
ప్రతి పది మంది ఐటీ నిపుణుల్లో నలుగురు భారతీయులే అని పేర్కొన్నారని ఆంధ్రజ్యోతి తెలిపింది.

ఫొటో సోర్స్, KTR/FACEBOOK
వరంగల్‌లో టెక్‌మహీంద్రా
తెలంగాణ రాష్ర్టానికి పెట్టుబడులు రప్పించేందుకు మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి మేరకు వరంగల్‌లో ప్రముఖ టెక్ దిగ్గజం టెక్‌మహీంద్రా ముందుకొచ్చింది అని నమస్తే తెలంగాణ పేర్కొంది.
మొదటిదశలో 500 మందికి ఉపాధి కల్పించే విధంగా సంస్థను నెలకొల్పుతామని టెక్‌మహీంద్రా చైర్మన్ ఆనంద్‌మహీంద్రా ప్రకటించారు. దావోస్‌లో నిర్వహిస్తున్న ప్రపంచ ఆర్థిక వేదికలో.. ఆనంద్‌మహీంద్రాతోపాటు పలువురు ప్రముఖ పారిశ్రామికవేత్తలతో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు.
తెలంగాణ-మహీంద్రా సంస్థల మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేయాలని.. వరంగల్ పట్టణంలో టెక్‌మహీంద్రా కార్యకలాపాలు ప్రారంభించాలని ఆనంద్‌మహీంద్రా, కంపెనీ సీఈవో సీపీ గుర్నానీని మంత్రి కేటీఆర్ కోరారు అని నమస్తే తెలంగాణ తెలిపింది.

ఫొటో సోర్స్, VIJAYASANTHI/FACEBOOK
'ఉద్యమ కేసీఆర్ వేరు..ఇప్పటి కేసీఆర్ వేరు'
అధిష్ఠానం ఆదేశిస్తే తప్ప వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే ఆసక్తి లేదని సినీనటి, కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి స్పష్టం చేశారని 'ఈనాడు' తెలిపింది.
తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలన్నదే నా లక్ష్యం, ఎన్నికల్లో పోటీ చేయనని చెబితే..రాహుల్‌గాంధీ మాత్రం చేయాల్సిందేనన్నారు.
మోదీ.. అడ్వాణీకి వెన్నుపోటు పొడిచి ప్రధానమంత్రి అయ్యారు. కనీసం అడ్వాణీకి పార్టీ అధ్యక్ష పదవైనా ఇవ్వాల్సింది.ఇది చాలా బాధాకరం.
ఉద్యమ సమయంలో కేసీఆర్ వేరు.. ఇప్పుడు చూస్తున్న కేసీఆర్ వేరు. పవన్‌కల్యాణ్ ఏపీలో ప్రత్యేక హోదా కోసం కొట్లాడితే అక్కడి ప్రజలకు న్యాయం జరుగుతుంది. తెలంగాణలో భాజపా పనైపోయింది అని విజయశాంతి వ్యాఖ్యానించారని ఈనాడు పేర్కొంది.

ఫొటో సోర్స్, WIKIPEDIA
లడ్డూ కావాలా నాయనా!
శ్రీవారి భక్తులకు కోరినన్ని అదనపు లడ్డూలు అందించేందుకు టీటీడీ చర్యలు చేపట్టిందని 'సాక్షి' కథనం ప్రచురించింది.
ఇటీవల టీటీడీ రూ.25 ధరతో విక్రయించే చిన్నలడ్డూ (175 గ్రాములు) రూ.50, కల్యాణోత్సవం లడ్డూ రూ.100 నుండి రూ.200, వడ ప్రసాదం రూ.25 నుండి రూ.100కి పెంచిన విషయం తెలిసిందే.
దీంతో బ్లాక్‌లో లడ్డూల విక్రయాలు తగ్గుముఖం పట్టాయి. అయినా, డిమాండ్‌కు తగ్గట్టుగా సరఫరా జరగడంలేదు.
రూ.50 ధర ఉన్న లడ్డూకు డిమాండ్ ఎక్కువగా ఉంది. దీంతో అదనపు లడ్డూల 30 వేల సంఖ్యను 50వేలకు పెంచాలని టీటీడీ యోచిస్తోందని సాక్షి పేర్కొంది.
ఇవి కూడా చదవండి:
- ప్రధాని మోదీ దావోస్ ఎందుకు వెళ్తున్నారు?
- దావోస్‌లో మోదీ: ప్రపంచం ముందున్న సవాళ్లు ఇవే!
- పెరుగు తింటే వందేళ్లు జీవిస్తారా?
- BBC SPECIAL: అంధులు క్రికెట్ ఎలా ఆడతారు?
- నా కోరికకు, నా వైకల్యానికీ ఏ సంబంధమూ లేదు
- బంగ్లాదేశ్ యుద్ధంలో 'రా' చీఫ్ రామేశ్వర్నాథ్దే కీలక పాత్ర!
- అభిమానుల అండ ఒక్కటే సరిపోతుందా?
- దక్షిణాదిలో నిరసన స్వరాలు.. బాలీవుడ్లో మౌన రాగాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)








