ట్రంప్-కిమ్‌లు నడి సముద్రంలో కలుస్తారా?

ఫొటో సోర్స్, AFP
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌తో భేటీ కావడానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అంగీకరించిన విషయం తెలిసిందే. కానీ ఆ సమావేశానికి సంబంధించి తమకు ఇప్పటిదాకా ఎలాంటి సమాచారం ఉత్తరకొరియా నుంచి అందలేదని దక్షిణ కొరియా చెబుతోంది.
అణ్వాయుధాల అభివృద్ధిని ఆపేయడానికి కూడా కిమ్ సిద్ధమైనట్లు దక్షిణ కొరియా అధికారులు పేర్కొన్నారు.
అమెరికా-ఉత్తర కొరియా అధ్యక్షుల మధ్య సమావేశం ఎక్కడుంటుందీ, దాని ఎజెండా ఏంటనే దానిపై కూడా ఇప్పటిదాకా ఎలాంటి స్పష్టతా రాలేదు.
‘‘అమెరికాతో చర్చలకు సంబంధించి ఉత్తర కొరియా అధికారులు ఆచితూచి అడుగేస్తున్నారు కాబోలు. అందుకే వారి వైఖరిని తెలియజేయడానికి ఇంకాస్త సమయం పట్టొచ్చు’’ అని దక్షిణ కొరియా మినిస్ట్రీ ఆఫ్ యూనిఫికేషన్ అధికార ప్రతినిధి పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఉత్తర కొరియా - అమెరికా మధ్య చర్చలు శాశ్వత శాంతికి ఓ అత్యుత్తమ అవకాశమని దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే అభిప్రాయపడ్డారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో చర్చలు జరిపిన దక్షిణ కొరియా అధికారులు.. చైనా, జపాన్ నేతలతోనూ చర్చించే పనిలో ఉన్నారు. ఇందులో భాగంగా దక్షిణ కొరియా అధ్యక్షడు మూన్ జే భద్రతా సలహాదారు చుంగ్ ఐ-యోంగ్, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్‌ను కలవనున్నారు.
దక్షిణ కొరియా ఇంటెలిజిన్స్ చీఫ్ సుహ్ హూన్, జపాన్ ప్రధాని షింజే అబేతో భేటీ కానున్నారు.
ఉత్తర కొరియాకు ఆర్థిక సాయం చేసే చివరి దేశంగా చైనాను భావిస్తారు. మరొపక్క అమెరికాకు మిత్ర దేశమైన జపాన్‌కు ఉత్తర కొరియా నుంచి అనేకసార్లు మిలటరీ బెదిరింపులు అందాయి. అందుకే ఈ రెండు దేశాలతోనూ చర్చలకు ప్రాధాన్యం సంతరించుకుంది.

ఫొటో సోర్స్, Getty Images
ఊహించని పరిణామం
ఉత్తర కొరియా-అమెరికాల మధ్య గంభీరమైన వాతావరణం నెలకొన్న దశలో రెండు దేశాల అధ్యక్షులూ కలవనున్నట్లు వెలువడిన ప్రకటన అనేక దేశాలను ఆశ్చర్యానికి గురిచేసింది.
ఇప్పటిదాకా పదవిలో ఉండగా ఏ అమెరికా అధ్యక్షుడూ ఉత్తర కొరియా అధ్యక్షుడిని కలవలేదు. దాంతో ఈ చర్చలు శాంతికి దారితీసే అవకాశం ఉందని అంతా భావిస్తున్నారు.
ఎక్కడ కలవొచ్చు?
అధ్యక్షులిద్దరూ ఎక్కడ కలుస్తారనేదానిపై ఇంకా స్పష్టమైన సమాచారం వెలువడలేదు.
వాషింగ్టన్: ట్రంప్ సిద్ధపడినా, కిమ్ దానికి అంగీకరించకపోవచ్చు.
ప్యాంగ్యాంగ్: కిమ్ సిద్ధపడినా, ట్రంప్ అంగీకరించకపోవచ్చు.
పాన్‌ముంజోన్: దక్షిణ కొరియాలో ఉండే ప్రాంతం కాబట్టి ఆ దేశానికి ఎక్కువ ప్రాధాన్యత లభిస్తుంది.
బీజింగ్: చర్చలపై చైనా ప్రభావం చూపే అవకాశం ఉంటుంది.
అంతర్జాతీయ సముద్ర జలాలు: ఇది తటస్థ వేదిక కాబట్టి ఇక్కడైతే ఎవరి ప్రభావం ఉండకపోవచ్చు.

ఫొటో సోర్స్, Reuters
ప్యాంగ్యాంగ్‌కు ఏం కావాలి?
ఒకవేళ అనుకున్నట్టుగానే సదస్సు ఏర్పాటైతే, మే చివర్లో ట్రంప్, కిమ్‌లు భేటీ అయ్యే అవకాశం ఉంది. దానికి ముందు కిమ్, దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్‌తో చర్చలు జరుపుతారు.
ఈ చర్చల అనంతరం ఉత్తర కొరియా అణ్వాయుధాల అభివృద్ధికి దూరమవుతుందా? లేక అంతర్జాతీయంగా తమపై నెలకొన్న ఆంక్షల నుంచి కొంతకాలం పాటు ఉపశమనాన్ని కోరుతుందా? అనే దానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కిమ్‌ను కలవాలన్న ట్రంప్ నిర్ణయాన్ని సీఐఏ డైరెక్టర్ మైక్ పోంపియో సమర్థించారు. కిమ్‌ను కలవడంలో ఉన్న రిస్క్ గురించి ట్రంప్‌కి అవగాహన ఉందనీ, ఉత్తర కొరియాతో ఎలా వ్యవహరించాలనేదానిపై ప్రభుత్వం దృష్టి సారిస్తుందనీ ఆయన పేర్కొన్నారు.
మరోపక్క శనివారం ఓ ర్యాలీలో ట్రంప్ మాట్లాడుతూ, ఉత్తర కొరియా శాంతి దిశగా పయనిస్తుందున్న నమ్మకం తనకు ఉందనీ, అలా జరగని పక్షంలో తాను చర్చల నుంచి వైదలొగడానికి సిద్ధంగా ఉన్నాననీ చెప్పారు.
ప్రభుత్వంలోని కీలకమైన అధికారులను సంప్రదించకుండానే కిమ్‌ని కలవాలనే నిర్ణయాన్ని ట్రంప్ ప్రకటించినట్లు అమెరికా మీడియా పేర్కొంది. ఆ దేశ విదేశాంగ మంత్రి రెక్స్ టిలర్‌సన్ కూడా ట్రంప్ సొంతంగానే ఆ నిర్ణయాన్ని తీసుకున్నట్లు ధృవీకరించారు.
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








