‘నీళ్లు తాగాలంటే భయమేస్తోంది’ : గుంటూరు ప్రజలు

ఫొటో సోర్స్, SURYA
''నీళ్లు తాగాలంటేనే భయమేస్తోంది..!'' ఇదీ.. గుంటూరు బాధితుల ఆందోళన.
గుంటూరులో కలుషిత నీరు తాగి ఇప్పటికి నలుగురు మరణించారు. వంద మందికిపైగా ఆసుపత్రిలో చికిత్స పొందారు.
గుంటూరులోని మున్సిపల్ కుళాయిల్లో వచ్చే నీరు తాగి ఆనందపేట, అలీ నగర్.. ఇతర ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మనుషుల ప్రాణాలు తీస్తున్న కలుషిత నీటి గురించి బీబీసీ.. గుంటూరు కలెక్టర్ కోన శశిధర్‌తో మాట్లాడింది.
కలెక్టర్ శశిధర్ మాట్లాడుతూ.. ''మర్చి 5న నీరు కలుషితం అయింది. డ్రైనేజీ పైపులు, త్రాగునీటి పైపులు పక్కపక్కనే ఉండడంతో మంచినీటిలో ఆ మురుగు నీరు కలిసుంటుంది. పాత గుంటూరులోని తాగునీటి పైపులైన్లు 60-70 సంవత్సరాల క్రితం వేసినవి. వాటిని కూడా మరమ్మతులు చేయించాం'' అని అన్నారు.

ఫొటో సోర్స్, SURYA
పాత లైన్లకు సకాలంలో మరమ్మతులు చేయనందుకు 8 మంది మున్సిపల్ ఇంజినీర్లు, శానిటేషన్ కార్మికులను విధుల నుంచి తొలగించినట్లు కోన శశిధర్ బీబీసీకి తెలిపారు.
ప్రబలుతున్న డయేరియా గురించి జిల్లా వైద్య,ఆరోగ్య శాఖ అధికారి(డీఎంహెచ్ఓ)ని కలిసింది.
నర్సింగ్ కాలేజీ విద్యార్థినుల ద్వారా ప్రజలకు డయేరియా గురించి అవగాహన కల్పిస్తున్నట్లు డీఎంహెచ్ఓ జె.యాస్మిన్ బీబీసీకి తెలిపారు.
''నర్సింగ్ కాలేజీ విద్యార్థినులను ఇంటింటికీ పంపి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. కొనుక్కునే నీటిని కూడా వేడి చేసుకుని తాగాలని చెబుతున్నాం. ఇప్పటివరకూ 105 మంది ప్రభుత్వాసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉంది'' అని యాస్మిన్ అన్నారు.

ఫొటో సోర్స్, SURYA
రమేష్ కుటుంబం గుంటూరులోని ఆనంద పేటలో నివాసం ఉంటున్నారు. మున్సిపల్ కుళాయి నీళ్లు తాగి, ఆయన కుటుంబంలో ఇద్దరు ఆసుపత్రి పాలయ్యారు. ''నీళ్లు తాగాలంటేనే భయంగా ఉంది. ఈ పైపులైన్ల గురించి మేము చాలా సార్లు మున్సిపల్ అధికారులకు చెప్పాం. కానీ ఇంతవరకూ వాళ్లు మరమ్మతులు చేయలేదు'' అని బీబీసీతో అన్నారు.
గుంటూరు జిల్లాకు ప్రాముఖ్యతనిచ్చి డ్రైనేజీ పనులు చేపట్టేందుకు సహకారం అందిస్తామని ప్రభుత్వం తెలిపినట్లు కలెక్టర్ కోన శశిధర్ అన్నారు.
''గుంటూరు నగరంలో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ కోసం ఇప్పటికే 903 కోట్ల రూపాయలను ప్రభుత్వం కేటాయించింది. పనులు కూడా ప్రారంభమయ్యాయి. మరోవైపు.. పాత డ్రైనేజీ పైపుల మరమ్మతులకు 10 కోట్ల రూపాయలను కేటాయించారు. దీనికి సంబంధించి టెండర్లు పిలిచాము. పనులు మొదలుపెడతాం'' అని శశిధర్ అన్నారు.
ఇవి కూడా చదవండి
- బెంగళూరు నీరు లేక ఒట్టిపోతుందా?
- బెంగళూరు సహా ఈ 11 నగరాల్లో నీటికి కటకటే!
- #BBCSpecial: ‘వ్యభిచారంలోకి మమ్మల్నిలా తోసేసినారు..’
- ‘బ్రిటన్‌లో రష్యా విష ప్రయోగం’
- జిన్‌పింగ్: నాడు పార్టీలో ప్రవేశం లేని వ్యక్తి.. నేడు జీవితకాల అధ్యక్షుడిగా ఎలా మారారు?
- దండి మార్చ్: గాంధీతో కలిసి నడిచిన తెలుగు వ్యక్తి ఎవరు?
- 2022 నాటికి రైతులకు రెట్టింపు ఆదాయం: మోదీ కల నిజమయ్యేనా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)








