‘నాలుగున్నరేళ్లు కష్టపడ్డాను.. నా కూలి నాకు ఇచ్చేయండి’- చంద్రబాబు: ప్రెస్‌రివ్యూ

ఫొటో సోర్స్, tdp.ncbn.official/fb
ఈ నాలుగున్నరేళ్లలో తాను చేయాల్సింది చేశానని, ఇక రానున్నది ప్రజల వంతేనని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారని ఆంధ్రజ్యోతి తెలిపింది. ''నా కష్టానికి కూలి ఇవ్వాల్సిన బాధ్యత ప్రజలదే'' అని చంద్రబాబు అన్నారు.
''ఇప్పుడిప్పుడే మెయిన్ రోడ్‌పైకి వచ్చాం. దీన్ని ఇలా కొనసాగించేందుకు మీరంతా (ప్రజలంతా) నాకు తోడుగా నిలవాలి. వచ్చే ఎన్నికల్లో నా వెనుక మీరుంటే 2029 కంటే ముందే ఏపీని ధనిక రాష్ట్రంగా మారుస్తా. దేశంలోనే ప్రథమ స్థానంలో ఉంచుతా’' అని ఆయన హామీ ఇచ్చారు.
''వచ్చే ఎన్నికల్లో టీడీపీ మళ్లీ రాకపోతే రాష్ట్రం దెబ్బ తింటుంది. మనం అనేక కార్యక్రమాలు చేపట్టాం. ఇంకా ఎన్నో ఆలోచనలు చేస్తున్నాం. ఇవన్నీ సాఫీగా కొనసాగాలంటే తిరిగి మనమే రావాలి. ఈ మాట ప్రతి చోటా ప్రజలు అంటున్నారు. ఈ నాలుగున్నరేళ్లలో అనేక సమస్యలు పరిష్కరించాం. గ్రామాలు, వార్డుల్లో మౌలిక వసతులు కల్పించాం. సిమెంటు రోడ్లు వేశాం. ఎల్‌ఈడీ లైట్లు పెడుతున్నాం. మరుగు దొడ్లు కడుతున్నాం. ఆపదలో అందరికీ అండగా ఉంటున్నాం. ఎన్నో అవార్డులు సాధించాం. కేంద్రం సహకారం లేకపోయినా ఎన్నో పనులు చేశాం. అదే కేంద్రం తోడ్పాటు ఉంటే ఇంకెన్నో చేసేవాళ్లం. ఈ విషయాలు జనంలోకి తీసుకెళ్లాలి. ఏమీ చేయని కేసీఆర్ (తెలంగాణ సీఎం) అన్ని సీట్లలో గెలిస్తే ఎన్నో చేసిన టీడీపీ ఎన్ని సీట్లలో గెలవాలి? వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో పాతిక ఎంపీ సీట్లు, 150 అసెంబ్లీ సీట్లు గెలుచుకోవడమే లక్ష్యంగా మనం కసితో పనిచేయాలి. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపైనా.. అన్యాయం చేసిన వారిపైనా పోరాడుతున్న టీడీపీకి అన్ని వర్గాలూ అండగా నిలవాలి. కుట్రలు చేస్తున్న ప్రతిపక్షాన్ని పక్కన పెట్టి మంచిని ఆశీర్వదించాలి'' అని ఆయన ప్రజలను కోరారు.
రాష్ట్రంలో ఇప్పటివరకు సాధించిన ప్రగతిని, ఆయా గ్రామాల్లో భవిష్యత్ అవసరాలను గుర్తించేందుకు ఉద్దేశించిన ఆరో విడత జన్మభూమి కార్యక్రమానికి చంద్రబాబు బుధవారం శ్రీకారం చుట్టారు. చిత్తూరు జిల్లాలోని సొంత నియోజకవర్గం కుప్పంలో చీలేపల్లె పంచాయతీ పరిధిలోని వడ్డిపల్లెలో ఏర్పాటు చేసిన గ్రామసభను ప్రారంభించారు.
''కులాలు, మతాలు అన్నం పెట్టవు. రైతులంతా ఓ కులం, అర్హులంతా ఓ కులం, దాతలంతా ఓ కులంగా భావించాం. వచ్చే ఎన్నికల్లో ఓటేస్తారని భావించిన వారితో పాటు ఓటేయని వారికి కూడా న్యాయం చేశాం'' అని సీఎం చెప్పారు. మళ్లీ అవకాశమిస్తే మీ జీవితాల్లో మరింత వెలుగు తెస్తానని హామీ ఇచ్చారు.

ఫొటో సోర్స్, Getty Images
మోదీకి రూ.490 మనీఆర్డర్
దేశంలో మరో రైతు తన ఆక్రోశాన్ని వినిపించేందుకు మనీ ఆర్డర్ అస్త్రాన్ని ఎంచుకున్నాడని 'ఈనాడు' తెలిపింది. చెమటోడ్చి పండించిన 19 టన్నుల బంగాళాదుంపలకు కేవలం రూ.490 ప్రతిఫలంగా లభించడంతో ఆ మొత్తాన్నీ ప్రధాని నరేంద్ర మోదీకి పంపి తన నిరసనను తెలియజేశాడని రాసింది.
ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఆగ్రాకు చెందిన ప్రదీప్ శర్మ అనే రైతు ఈ పని చేశారు. రైతుల అగచాట్లను తెలియజెప్పేందుకే తాను ఆ డబ్బును ప్రధానికి మనీ ఆర్డర్ చేశానని ఆయన వెల్లడించారు.
ఆత్మహత్య చేసుకునేందుకు అనుమతించాలని కూడా ప్రధాని, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌లకు తాను లేఖలు రాశానని, సమస్యలను పరిష్కరించాలని ఉత్తర్‌ప్రదేశ్ ఉపముఖ్యమంత్రిని కలిసి అభ్యర్థించినా ఫలితం లేకపోయిందని ప్రదీప్ శర్మ వివరించారు.
బంగాళదుంపలను పండించేందుకు క్వింటాల్‌కు రూ.800 వరకు వ్యయమవుతుంటే.. ప్రభుత్వం కేవలం రూ.549 కనీస మద్దతు ధరను కల్పిస్తోందని వాపోయారు. అందుకే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు రైతులు వెళ్లడం లేదని అన్నారు.
ఇటీవల మహారాష్ట్రకు చెందిన ఓ రైతు కూడా 750 కేజీల ఉల్లిపాయలను విక్రయించగా వచ్చిన రూ.1,064 మొత్తాన్ని ప్రధానికి మనీ ఆర్డర్ చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
ఏపీలోనూ మహాకూటమిని ప్రజలు తిరస్కరిస్తారు: ప్రధాని మోదీ
ఆంధ్రప్రదేశ్ మార్పును కోరుకుంటోందని, తెలంగాణలో మాదిరిగానే ఆంధ్రప్రదేశ్‌లోనూ మహాకూటమిని ప్రజలు తిరస్కరించబోతున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారని ఈనాడు రాసింది.
ప్రస్తుత రాజకీయ నాయకత్వంపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని మోదీ ఆరోపించారు. నాడు కాంగ్రెస్‌ను టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ దుష్ట కాంగ్రెస్ అని అభివర్ణించగా...ఇప్పుడు టీడీపీ నేతలు దోస్త్ కాంగ్రెస్ అంటున్నారని ఎద్దేవా చేశారు.
దిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బుధవారం సాయంత్రం మచిలీపట్నం, నరసాపురం, కాకినాడ, విశాఖపట్నం, విజయనగరం లోక్‌సభ నియోజకవర్గాల పోలింగ్ బూత్ కార్యకర్తల (మేరా బూత్ సబ్ సే మజ్‌బూత్)ను ఉద్దేశించి మోదీ మాట్లాడారు.
''రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్‌తో టీడీపీ చేతులు కలపడంవల్ల తెలంగాణలో ఏమీ జరిగిందో మీ అందరికీ తెలుసు. ఆంధ్రప్రదేశ్‌లోనూ ఇదే మాదిరిగా జరగబోతోంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్రం అన్ని రకాలుగా కృషి చేస్తోంది'' అని మోదీ చెప్పారు.
''ఇతర రాష్ట్రాల్లో ఎక్కడా లేనివిధంగా పది జాతీయ సంస్థలను ఏపీలో కేంద్రం ఏర్పాటు చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో ఏం జరుగుతుందో నాకు తెలుసు. రాష్ట్రానికి తగిన సాయం అందిస్తున్నా చేయడంలేదని చెబుతుండడం తగదు. ఈ వ్యతిరేక ప్రచారాన్ని తిప్పికొట్టేలా బూత్ స్థాయి నుంచి ప్రజలకు వివరించాలి. రెవెన్యూ లోటు, వనరుల కొరతను అధిగమించేందుకు రూ.20 వేల కోట్ల వరకు కేంద్రం విడుదల చేసింది. కానీ.. రాష్ట్ర ప్రభుత్వం అందలేదని చెబుతోంది. ఈ డబ్బు ఎవరి జేబుల్లోకి వెళ్లింది. వెనుకబడిన జిల్లాల అభివృద్ధి కోసం రూ.1,000 కోట్లు కేంద్రం ఇచ్చింది. వీటికి తగినట్లు వినియోగ ధ్రువపత్రాలు(యూసీ)లు ఎందుకు ఇవ్వలేదు? రాష్ట్ర పాలనలో కుంభకోణాలు జరుగుతున్నాయి'' అని ప్రధాని అన్నారు.

ఫొటో సోర్స్, Twitter/Telangana CMO
కాళేశ్వరం ప్రాజెక్టు పనుల్లో వేగం పెంచాలి: కేసీఆర్
కాళేశ్వరం ప్రాజెక్టు పనుల్లో వేగంపెంచాలని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆదేశించారని, నిర్ణీత వ్యవధిలో పనులు పూర్తికావాల్సిందేనని స్పష్టంచేశారని నమస్తే తెలంగాణ తెలిపింది.
ఇందుకోసం అవసరమైన మేర యంత్రాలు పెరగాలని, కార్మికులను పెంచాలని సీఎం చెప్పారు. ప్రాజెక్టుల యాత్ర రెండోరోజయిన బుధవారం ముఖ్యమంత్రి కేసీఆర్ పలు ప్రాంతాలను సందర్శించి పనులను సునిశితంగా పరిశీలించారు. అధికారులకు అవసరమైన ఆదేశాలిచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనుల్లో కొన్ని చోట్ల పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా చెప్తూ.. అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఇప్పుడు రాజకీయ ఒత్తిళ్లేమీ లేవని, కానీ ముందుగా చెప్పిన ప్రకారం పనులను కొనసాగించి పూర్తిచేయాల్సిందేనన్నారు.
పనుల తీరుపై అధికారులను, వర్క్ ఏజెన్సీలను కేసీఆర్ నిలదీశారు. లక్ష్యసాధనకోసం అన్ని వనరులతో శ్రద్ధతో సకాలంలో పనులు పూర్తిచేయాలని నిర్దేశించారు.
కన్నెపల్లి- అన్నారం మధ్యలో నాలుగుచోట్ల ఆగి పనులను సునిశితంగా పరిశీలించిన ఆయన గ్రావిటీ కెనాల్ పక్కన బీటీ రోడ్డు వేయాలని ఆదేశించారు. మార్చి నెలాఖరుకల్లా అన్ని పనులు పూర్తికావాల్సిందేనని సీఎం స్పష్టీకరించగా.. కచ్చితంగా పూర్తిచేస్తామని ఇంజినీర్లు, వర్క్ ఏజెన్సీల ప్రతినిధులు చెప్పారు.
అన్నారం బరాజ్ పనులను పరిశీలించిన ముఖ్యమంత్రి అధికారులను ప్రశంసించారు. సుందిళ్ల పనులు కమిట్‌మెంట్ ప్రకారం కావడంలేదని ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తంచేశారు. నిర్లక్ష్యాన్ని సహించేదిలేదని హెచ్చరించారు. మూడు షిఫ్టుల్లో పనులు నడుపాలని, మార్చిలోగా పూర్తికావాలని, అవసరాన్ని బట్టి మళ్ళీ వస్తానని చెప్పారు. ఫిబ్రవరిలో అన్నారం పంపుహౌస్ పూర్తికావాలన్నారు.
మార్చి 31 నాటికి కాళేశ్వరం, ఎస్సారెస్పీ పునర్జీవ పథకం పంపుహౌస్ పనులు పూర్తిచేయాలని సీఎం ఆదేశించారు. రెండురోజుల విస్తృత పర్యటన ముగించుకుని బుధవారం రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న సుందిళ్ల బరాజ్, సుందిళ్ల, అన్నారం పంపుహౌస్‌ల అన్ని పను లు మార్చి నెలాఖరులోగా పూర్తిచేయాల్సిందేనని అధికారులకు, ఏజెన్సీలకు ముఖ్యమంత్రి స్పష్టంచేశారు. సుందిళ్ల పనులు వేగవంతంగా లేవని నవయుగ కాంట్రాక్టర్లపై ఆగ్రహించారు. పద్ధతి మార్చుకోవాలని, వేగం పెంచాలని హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి:
- ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీకి కాంగ్రెస్‌తో పొత్తు ఉంటుందా, ఉండదా
- పీవీ నరసింహారావు: ‘సంస్కరణల పితామహుడు’ చేసిన నేరం ఏంటి?
- ఎగ్జిట్ పోల్స్: ఎలా నిర్వహిస్తారు.. కచ్చితత్వం ఎంత
- ‘తాలిబన్ల ఆదాయం ఏటా రూ.లక్ష కోట్లు’.. నిజమేనా?
- కేసీఆర్ వ్యక్తిత్వం: మాటే మంత్రం
- కేసీఆర్ ప్రధాని అవుతారా?
- మోదీతో కేసీఆర్ భేటీ: ‘బ్రీఫింగ్ కోసమేనా?’ - చంద్రబాబు నాయుడు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








