పాకిస్తాన్ జైల్లో 22 మంది ఉత్తరాంధ్ర మత్స్యకారులు : వీరి విడుదల ఇప్పటికిప్పుడు సాధ్యమేనా?

- రచయిత, బీబీసీ తెలుగు డెస్క్
- హోదా, సహకారం: ఇస్లామాబాద్ నుంచి బీబీసీ ప్రతినిధి షుమైలా జాఫ్రీ
పాక్ కోస్టుగార్డ్ అరెస్టు చేసిన ఆంధ్ర ప్రదేశ్ మత్స్యకారులను విడిపించడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది.
ప్రస్తుతం కరాచీ జైలులో ఉన్న ఏపీ మత్స్యకారులు 21 మందిని వీలైనంత త్వరగా స్వస్థలానికి తీసుకొచ్చేందుకు దిల్లీలోని ఏపీ భవన్ అధికారులు ప్రయత్నిస్తున్నారు.
శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందిన మత్స్యకారులను పాక్ కోస్టుగార్డ్స్ అరెస్టు చేసిన విషయాన్ని దిల్లీలోని ఏపీ భవన్ కమిషనర్ డాక్టర్ అర్జా శ్రీకాంత్ ధ్రువీకరించారు.
బీబీసీతో మాట్లాడిన ఆయన "మేం పాకిస్తాన్‌లోని ఇండియన్ ఏంబసీ అధికారులతో మాట్లాడాం. పాక్ అధికారులు అరెస్టు చేసిన మత్స్యకారుల విడుదలకు చర్యలు తీసుకోవాలని లిఖితపూర్వకంగా కోరాం" అని చెప్పారు.
"మత్స్యకారులను కోర్టులో హాజరు పరిచిన తర్వాత వారిని కరాచీ జైలుకు తరలించినట్లు మాకు చెప్పారు. ఆ జైలుకు వెళ్లి మత్స్యకారులను ఒకసారి కలవాలని కూడా మేం ఏంబసీ అధికారులను కోరాం" అని శ్రీకాంత్ వివరించారు.
మత్స్యకారులను వీలైనంత త్వరగా పాక్ జైలు నుంచి విడిపించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని, ప్రభుత్వ ఖర్చులతో వారిని స్వస్థలానికి చేరుస్తామని ఏపీ భవన్ కమిషనర్ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
మత్స్యాకారుల అరెస్టులు మామూలే
మత్స్యకారుల అరెస్టు విషయాన్ని పాకిస్తాన్‌లోని బీబీసీ ప్రతినిధి కూడా ధ్రువీకరించారు.
పాకిస్తాన్ మత్స్యకారుల సంఘం ఛైర్మన్ మహమ్మద్ అలీ షాతో మాట్లాడిన బీబీసీ ప్రతినిధి షుమైలా జాఫ్రీ కొన్ని రోజుల క్రితం వారిని అరెస్టు చేసినట్లు తెలిసిందని చెప్పారు.
కంటెంట్ అందుబాటులో లేదు
మరింత సమాచారం కోసం Facebookఇతర వెబ్‌సైట్లలో సమాచారానికి బీబీసీ బాధ్యత వహించదు.పోస్ట్ of Facebook ముగిసింది
"పాక్ జలాల్లో గస్తీ కాసే ఆ దేశ కోస్ట్ గార్డ్స్ సరిహద్దులు దాటి వచ్చిన భారత మత్స్యకారులను అరెస్టు చేయడం ఎప్పుడూ జరిగేదే. గుజరాత్ తీరం నుంచి వచ్చిన తాజాగా అరెస్టు చేసిన మత్స్యకారులను కూడా వారు కోర్టులో హాజరు పరిచిన తర్వాత జైలుకు తరలించినట్లు తెలిసింది" అని షుమైలా తెలిపారు.
"అక్రమంగా సరిహద్దులు దాటి వచ్చిన ఎవరైనా కొన్ని నెలలు పాక్ జైల్లో శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. భారత, పాక్ ప్రభుత్వాలు పరస్పరం ఖైదీల మార్పిడి నిర్ణయం తీసుకునేవరకూ వారు అక్కడే ఉంటారు" అన్నారు.
హిందీ మాట్లాడలేని మత్స్యకారులను ప్రత్యేకంగా చూడడం ఏమీ ఉండదని షుమైలా తెలిపారు.

మత్స్యకారులు సరిహద్దు ఎప్పుడు దాటారు
శ్రీకాకుళం, విజయనగరం జిల్లాకు చెందిన మత్స్యకారులు బుధవారం అరేబియా సముద్రంలో చేపల వేటకు వెళ్లారని, భారత జలాలు దాటి వెళ్లి పాకిస్తాన్ కోస్ట్ గార్డుకు చిక్కినట్టు సమాచారం.
మొత్తం 21 మంది మత్స్యకారుల్లో శ్రీకాకుళం జిల్లాకు చెందిన 13 మంది, విజయనగరం జిల్లాకు చెందిన ఆరుగురు ఉన్నారని మిగతా ఇద్దరు ఎవరనేదానిపై స్పష్టత లేదు.
బాధితుల సెల్ ఫోన్లు పనిచేయకపోవడంతో రెండు రోజులైనా వారి క్షేమ సమాచారాలు తెలీక కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.
గుజరాత్‌లోని వీరావల్ నుంచి వీరంతా 22 రోజుల క్రితం నాలుగు పడవలతో అరేబియా సముద్రంలో చేపల వేటకు బయల్దేరారు. మరో రెండు రోజుల్లో ఒడ్డుకు చేరుతామనగా వీరంతా పాక్‌లో బంధీలయ్యారు.
జీపీఎస్ విధానం ద్వారా సరిహద్దు తెలుసుకునే అవకాశం ఉన్నా మూడు బోట్లు పొరపాటున సరిహద్దులు దాటి పాక్ కోస్టుగార్డులకు చిక్కాయి.
పాకిస్తాన్ మారీటైమ్ సెక్యూరిటీ ఏజెన్సీ(పీఎంఎస్ఏ) 22 మంది భారత మత్స్యకారులను అదుపులోకి తీసుకుందని పీటీఐ కూడా తెలిపింది.
గుజరాత్‌లోని వీరావల్ నుంచి వెళ్లిన పడవల్లోని మత్స్యకారులు పాక్ కోస్టుగార్డుకు చిక్కినట్టు జాతీయ జాలరుల ఫోరం(ఎన్ఎఫ్ఎఫ్) సెక్రటరీ మనీష్ లోధారీ తెలిపారని పీటీఐ చెప్పింది.
కుసుమ్, అన్నపూర్ణ, కాజల్ అనే మూడు పడవలను పాక్ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంది.

విషాదంలో జాలరుల కుటుంబ సభ్యులు
భారత జలాల్లోనే ఉండిపోయిన నాలుగో పడవలోని ఆరుగురు మాత్రం క్షేమంగా తిరిగి ఒడ్డుకు చేరుకున్నారు.
తిరిగి వచ్చిన వారి సమాచారం ప్రకారం మూడు పడవల్లో మొత్తం 21 మంది ఉన్నట్లు తెలుస్తోంది. చేపల వేట సమయంలో కేవలం వైర్ లెస్ సెట్ల ద్వారా మాత్రమే మాట్లాడుకునే వీలుంటుందని మత్స్యకారులు తెలిపారు.
ఒక్కో చేపల వేటలో ఏడెనిమిది మంది మత్స్యకారులు ఉంటారని వీరు మూడేసి గంటల చొప్పున 24 గంటలూ చేపల వేటలోనే ఉంటారని క్షేమంగా బయటపడ్డ మత్స్యకారులు చెప్పారు.
పొగమంచు వల్ల కూడా సముద్రంలో అప్పుడప్పుడు సరిహద్దులు దాటి వెళ్లిపోవడం జరుగుతుంటుందని వీరు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి:
- డిజైనర్ బేబీస్: జన్యు సవరణ శిశువుల సృష్టి ఆమోదయోగ్యమేనా
- తిరుమలలో తన మతం గురించి సోనియా ఏం చెప్పారు?
- హార్లిక్స్: విటమిన్ D కి మూలం శాకాహార పదార్థాలా, మాంసాహార పదార్థాలా?
- ఇతను ప్రపంచంలోనే అత్యంత ఒంటరి మానవుడు
- ప్రాణాలు నిలుపుకోడానికి.. మతం మారుతున్నారు!
- అడాల్ఫ్ హిట్లర్ - ఓ యూదు చిన్నారి: ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన స్నేహం
- సీబీఐకి ఆంధ్రప్రదేశ్లో నో ఎంట్రీ... దీని పర్యవసానాలేమిటి?
- సింగర్ బేబీ: రెహమాన్ మెచ్చిన ఈ కోయిల పాట ఇలా మొదలైంది
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








