అరుణాచల్ ప్రదేశ్: భారత్-చైనా మధ్య గొడవ ఎందుకు, దీని చరిత్రేంటి?

ఫొటో సోర్స్, Getty Images
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం అరుణాచల్ ప్రదేశ్‌లో పర్యటించడంపై చైనా అభ్యంతరం వ్యక్తం చేసింది.
ఇది వివాదాస్పద ప్రాంతం అని, ఇక్కడ ఎలాంటి కార్యకలాపాలు జరిగినా అవి సరిహద్దుల్లో సమస్యలను మరింత తీవ్రం చేయవచ్చని పేర్కొంది.
అక్కడ ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించకుండా దూరంగా ఉండాలని భారత్‌కు సూచించింది.
ప్రధాని మోదీ ఇక్కడ నాలుగు వేల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. సరిహద్దు రాష్ట్రాలను అనుసంధానించడానికి బీజేపీ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది.
భారత ప్రభుత్వం హైవే, రైల్వే, విమానాశ్రయాలను బలోపేతం చేయడంపై దృష్టి పెట్టిందని ఈ సందర్భంగా మోదీ తెలిపారు. అరుణాచల్ ప్రదేశ్‌ను గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేసినప్పటికీ, తమ ప్రభుత్వం ఈ అంశాలపై చాలా ఉత్సాహంగా ముందుకు వెళ్తోందని చెప్పారు.
చైనా సూచనలపై భారత విదేశాంగ మంత్రిత్వశాఖ అభ్యంతరం వ్యక్తం చేసింది. అరుణాచల్ ప్రదేశ్ తమ దేశంలో ఒక భాగం అని చెప్పింది. దీనిపై ఒక ప్రకటన విడుదల చేసిన విదేశాంగ శాఖ "భారత నేతలు అప్పుడప్పుడు అరుణాచల్ ప్రదేశ్ వెళ్తుంటారు. దేశంలోని మిగతా రాష్ట్రాల్లో వారు ఎలా పర్యటిస్తారో ఇవి కూడా అంతే" అని తెలిపింది.

ఫొటో సోర్స్, Getty Images
ప్రధాని మోదీ అరుణాచల్ పర్యటనపై మాట్లాడిన చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి చున్యింగ్ "చైనా, భారత్ సరిహద్దు వివాదంపై మా వైఖరి మొదట్లో లాగే ఉంది. ఇందులో ఎలాంటి మార్పూ లేదు. అరుణాచల్ ప్రదేశ్ అనే దానికి చైనా ప్రభుత్వం ఎప్పుడూ గుర్తింపు ఇవ్వలేదు. భారత నేతలు అరుణాచల్‌లో పర్యటించడాన్ని మేం చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం" అన్నారు.
రెండు దేశాల ప్రయోజనాలు, ద్వైపాక్షిక సంబంధాలు దృష్టిలో పెట్టుకుని, ఎలాంటి సరిహద్దు వివాదాలూ రాకుండా భారత్ మా ఆందోళనలను కూడా గౌరవించాలి" అన్నారు.
అరుణాచల్ ప్రదేశ్ 'దక్షిణ టిబెట్' అని చైనా చెబుతోంది. భారత్- చైనా మధ్య సరిహద్దు వివాదాలపై ఎన్ని సమావేశాలు జరిగినా.. ఇప్పటివరకూ ఈ సమస్య మాత్రం అపరిష్కృతంగానే ఉంది.
రెండు దేశాల మధ్య 3500 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. సరిహద్దు వివాదం వల్ల రెండు దేశాలు 1962లో యుద్ధం కూడా చేశాయి. కానీ ఇప్పుడు కూడా సరిహద్దులో ఉన్న కొన్ని ప్రాంతాలు రెండు దేశాల మధ్య అప్పుడప్పుడు ఉద్రిక్తతలకు కారణం అవుతున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
అరుణాచల్‌పై చైనా ఏం చెబుతోంది?
అరుణాచల్ ప్రదేశ్‌తో పాటు ఉన్న భారత దేశ సౌర్వభౌమాధికారానికి అంతర్జాతీయ గుర్తింపు ఉంది. అంతర్జాతీయ చిత్రపటాల్లో కూడా అరుణాచల్ ప్రదేశ్‌ను భారత్‌లో భాగంగా చూపిస్తున్నారు. చైనా మాత్రం టిబెట్‌తోపాటు అరుణాచల్ ప్రదేశ్ కూడా తమదే అంటోంది. ఈ ప్రాంతం దక్షిణ టిబెట్ అంటోంది.
మొదట్లో అరుణాచల్ ప్రదేశ్ తవాంగ్ ఉత్తర భాగం మాదేనని చైనా చెప్పేది. ఇక్కడ భారత దేశంలోనే అతిపెద్ద బౌద్ధ మందిరం ఉంది.
అసలు వివాదం ఏంటి?
చైనా-భారత్ మధ్య మెక్‌మోహన్ రేఖను అంతర్జాతీయ సరిహద్దు రేఖగా భావిస్తారు. కానీ చైనా దాన్ని కొట్టిపారేస్తోంది. టిబెట్‌లో అత్యధిక భాగం భారత్ అధీనంలో ఉందని ఆరోపిస్తోంది.
1950వ దశకం చివర్లో టిబెట్‌ను తనలో కలుపుకున్న తర్వాత చైనా, అక్సాయ్ చీన్ నుంచి సుమారు 38 వేల చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకుంది. ఈ ప్రాంతం లదాఖ్‌కు సంబంధించినది. చైనా ఇక్కడ నేషనల్ హైవే 219 నిర్మించింది. అది దీనిని తూర్పు ప్రాంతం షింజియాంగ్‌కు జోడిస్తుంది. భారత్ మాత్రం దీన్ని అక్రమంగా స్వాధీనం చేసుకున్నారని అంటోంది.

ఫొటో సోర్స్, @NARENDRAMODI
అరుణాచల్ ప్రదేశ్ చరిత్ర
అరుణాచల్ ప్రాచీన చరిత్ర గురించి అంత స్పష్టమైన వివరాలు లేవు. అరుణాచల్, అసోం పక్కనే ఉంటుంది. ఇక్కడ పురాతన ఆలయాలు ఉన్నాయి. ఇక్కడ టిబెట్, బర్మా భుటాన్ సంస్కృతి ప్రభావం కూడా ఉంటుంది. 16వ శతాబ్దంలో తవాంగ్‌లో నిర్మించిన ఆలయం ఈ ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చింది.
బౌద్ధులకు ఇది చాలా పవిత్ర స్థలం. ప్రాచీన కాలంలో భారత్-టిబెట్‌ను ఏలిన పాలకులు టిబెట్- అరుణాచల్ ప్రదేశ్ మధ్య ఒక నిర్ధారిత సరిహద్దులను ఏర్పాటు చేయలేదని చెబుతారు. కానీ దేశం-రాష్ట్రం భావనలు రావడంతో దీని సరిహద్దుల చర్చ మొదలైంది.
1912 వరకూ టిబెట్, భారత్ మధ్య ఎలాంటి స్పష్టమైన సరిహద్దు రేఖా లేదు. ఈ ప్రాంతాలపై మొఘలులు, ఆంగ్లేయులకు నియంత్రణ కూడా లేదు. భారత్, టిబెట్ ప్రజలకు కూడా ఒక స్పష్టమైన సరిహద్దు రేఖ గురించి కూడా కచ్చితంగా తెలీదు.
బ్రిటన్ పాలకులకు దానితో ఎలాంటి ఇబ్బందీ రాలేదు. తవాంగ్‌లో బౌద్ధ మందిరం కనిపించినపుడు సరిహద్దు రేఖపై అంచనాలు మొదలయ్యాయి. 1914లో సిమ్లాలో జరిగిన సమావేశానికి టిబెట్, చైనా, బ్రిటన్, భారత్ ప్రతినిధులు హాజరయ్యారు. అందరూ కలిసి ఒక సరిహద్దు రేఖను నిర్ణయించారు.

ఫొటో సోర్స్, @NARENDRAMODI
1914లో టిబెట్ స్వతంత్రంగా ఉన్నా బలహీనమైన దేశం. భారత్‌లోని బ్రిటిష్ పాలకులు తవాంగ్, దక్షిణ భాగాన్ని భారత్‌లో భాగంగానే భావించారు. దానిని టిబెటన్లు కూడా అంగీకరించారు. కానీ అది చైనాకు కోపం తెప్పించింది. చైనా ప్రతినిధులు దానికి ఒప్పుకోలేదు. సమావేశం నుంచి వెళ్లిపోయారు. 1935 తర్వాత నుంచి ఆ ప్రాంతం మొత్తం భారత చిత్రపటంలోకి వచ్చింది.
చైనా టిబెట్‌ను ఎప్పుడూ స్వతంత్ర దేశంగా భావించలేదు. 1914 సిమ్లా ఒప్పందంలో కూడా అది అందుకు ఒప్పుకోలేదు. చివరికి 1950లో చైనా టిబెట్‌ను పూర్తిగా తన అధీనంలోకి తెచ్చుకుంది. టిబెట్ బౌద్ధులకు చాలా ముఖ్యమైన తవాంగ్ కూడా దేశంలో భాగంగా ఉండాలని చైనా కోరుకుంటోంది.
1962లో చైనా, భారత్ మధ్య యుద్ధం జరిగింది. అరుణాచల్ భౌగోళిక స్థితి పూర్తిగా భారత్‌కు అనుకూలంగా ఉంటుంది. అందుకే చైనా 1962లో యుద్ధంలో గెలిచినా తవాంగ్ నుంచి వెనక్కు వెళ్లిపోయింది. ఆ తర్వాత భారత్ ఈ ప్రాంతంపై పూర్తిగా తమ పట్టు సాధించింది.
ఇవి కూడా చదవండి:
- #MeToo: 'పని మనుషులపై లైంగిక వేధింపులు.. లక్షల్లో బాధితులు'
- చంద్రబాబు ధర్మపోరాట దీక్ష ఇప్పుడు దిల్లీలో ఎందుకు చేస్తున్నారు, టీడీపీకి ఏపీ భవన్ సెంటిమెంట్ ఉందా
- విజయ్ మాల్యా: ఇంతవరకూ భారత్ ఎంతమంది దోషులను దేశానికి తీసుకురాగలిగింది
- నమ్మకాలు-నిజాలు: బిడ్డకు తల్లిపాలు మంచివా? పోతపాలు మంచివా?
- ‘‘గో బ్యాక్ మోదీ’ అంటే గుజరాత్ పొమ్మని అర్థం - చంద్రబాబు
- సీబీఐకి అంతర్రాష్ట్ర పోలీసు హోదా ఎవరిచ్చారు?: అభిప్రాయం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)








