సీబీఐకి అంతర్రాష్ట్ర పోలీసు హోదా ఎవరిచ్చారు?: అభిప్రాయం

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, మాడభూషి శ్రీధర్, మాజీ కేంద్ర సమాచార కమిషనర్ , బెన్నెట్ యూనివర్సిటీ ప్రొఫెసర్
- హోదా, బీబీసీ కోసం
పశ్చిమబెంగాల్ పోలీసులు, సీబీఐ అధికారుల మధ్య జరిగిన ఘటనలు సుప్రీం కోర్టుకు చేరుకున్నతరువాత, సీబీఐ అఫిడవిట్ల ద్వారా చెప్పిన అంశాల్లో ఎక్కడా కోల్‌కతా పోలీసు కమిషనర్.. శారదా కుంభకోణానికి సంబంధించిన సాక్ష్యాలను నాశనం చేసినట్టు ఆరోపించకపోవడం గమనించాల్సిన అంశం.
కోల్‌కతా పోలీసు కమిషనర్ రాజీవ్ కుమార్... శారదా స్కాం నిందితుడి డైరీని దాచారని, దర్యాప్తులో దొరికిన పెన్ డ్రైవ్ ఇవ్వలేదని, ఇంకేవో కాగితాలు చూపలేదని సీబీఐ, బీజేపీ నేతలు, బెంగాల్ ప్రభుత్వ వ్యతిరేకులు కోర్టు బయట అనేక ఆరోపణలు చేశారు.
మీడియాలో వెల్లడింపులు, ఖండనలు, ఆవేశపూరిత చర్చలు జరిగాయి. కానీ, సుప్రీం కోర్టులో వారు ఆ ఆరోపణలు చేయకపోవడం అందుకు రుజువు ఇవ్వలేకపోవడం కీలకమైన అంశాలు. అంటే ఆ మాటలకు ఆధారాలు లేవని సుస్పష్టం. ఒకప్పుడు సిట్ దర్యాప్తు బృందం నాయకుడు, ఇప్పుడు కోల్‌కతా పోలీసు కమిషనర్ రాజీవ్ కుమార్ శారదా స్కాం సాక్ష్యాలను తీసివేసినట్టు పరోక్షంగానైనా సాక్ష్యం ఉందా? అని సుప్రీంకోర్టు అడిగింది. ఉంటే చూపండి తీవ్రమైన చర్యలు తీసుకుంటామని కూడా చెప్పింది.
కానీ, సీబీఐ తరఫున వాదించిన ప్రముఖ న్యాయనిపుణుడు అటార్నీజనరల్ వేణుగోపాల్ తన వాదనలో ఆయన సాక్ష్యాలు మాయం చేస్తారేమోనని అన్నారు. దీన్ని బట్టి ఈ ఆరోపణల వెనుక నిజానిజాలను బేరీజు వేసుకోవచ్చు.

ఫొటో సోర్స్, Getty Images
పశ్చిమబెంగాల్ ప్రభుత్వం, పోలీసు కమిషనర్ పక్షాన ప్రముఖ న్యాయవాది, కాంగ్రెస్ నాయకుడు అభిషేక్ మను సింఘ్వీకి ఎక్కువగా వాదించాల్సిన అవసరమే లేకపోయింది. రాజీవ్ కుమార్ సాక్ష్యం మాయం చేస్తున్నట్టు ఫిర్యాదులేమయినా వచ్చాయా, ఆధారాలు ఉన్నాయా, ఆయనపైన ఎఫ్.ఐ.ఆర్. నమోదు చేశారా? నిందితుడని నిర్ధారించారా? లేక సెక్షన్ 201 ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం సాక్ష్య విధ్వంస నేరారోపణ ఏమయినా చేయడానికి ప్రాథమిక దర్యాప్తు సిద్ధంగా ఉందా? అనేవి ప్రశ్నలు.
ఈ ప్రశ్నలు వేసే అవకాశం సింఘ్వీకి రానేలేదు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులే సాక్ష్యాలు మాయం చేసిన ఆధారాలు చూపండి తీవ్ర చర్యలు తీసుకుంటాం అన్నా సీబీఐ నుంచి పెద్దగా ప్రతిస్పందన లేదు. ఎలక్ట్రానిక్ ఫాంలో ఉన్న సాక్ష్యాలను ధ్వంసం చేస్తారని సీబీఐ అనుమానం వ్యక్తం చేస్తే ఎలక్ట్రానిక్ రూపంలో ఉన్న సాక్ష్యాలు ధ్వంసం చేసినా మళ్లీ వెలికి తీయవచ్చుకదా అని కూడా న్యాయమూర్తులు అన్నారు.
దాని అర్థం ఏమిటి? రాజీవ్ కుమార్ దర్యాప్తు అధికారేనా లేక శారదా మోసాలలో నిందితుడా? లేక ప్రస్తుత బీజేపీ నాయకుడు, తృణమూల్ కాంగ్రెస్ మాజీ ఉపాధ్యక్షుడు ముకుల్ రాయ్ వలె నిందితుడిని తప్పించడానికి సహకరించినాడన్న ఆరోపణలు గానీ విమర్శలు గానీ ఏవైనా ఎదుర్కొంటున్నాడా? నిజంగా ఆయన సాక్ష్యాలను మాయం చేసి ఉంటే, ఇంతదాకా సీబీఐ ఎందుకు నిశ్చర్యలతో ఆశ్చర్యపరుస్తుందా? కాస్త ఆలోచిస్తే అసలు నిజాలు గోచరిస్తాయి. అందుకే రాజీవ్ కుమార్ ను అరెస్టు చేయడానికి వీల్లేదని సుప్రీంకోర్టు సీబీఐకి స్పష్టంగా ఆదేశాలు జారీ చేసింది.

ఫొటో సోర్స్, Getty Images
ఇదీ నేపథ్యం...
సీబీఐ 40 మందితో కమిషనర్ ఇంటి మీద దాడికి వెళ్లడం గురించి, బెంగాల్ పోలీసులు వారిని అరెస్టు చేయడం గురించి ఆలోచిస్తే అంతరార్థాలను అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈ మురికి సంఘటనలో అటు కేంద్రం, ఇటు రాష్ట్రం రాజ్యాంగ సంఘర్షణకు దిగిన సందర్భంలో సుప్రీంకోర్టు చాలా సమతుల్యమైన తీర్పు చెప్పి తన విశ్వసనీయతను నిలబెట్టుకున్నది.
బీజేపీ నాయకులు ఇది మమతా బెనర్జీకి చెంపపెట్టు అని గర్జించారు. నైతిక విజయం మాదేనని మమతా బెనర్జీ అన్నారు. రాజీవ్ కుమార్ ను మరో చోట ప్రశ్నించవచ్చు అని ఆదేశించి సీబీఐ పరువు దక్కించిన సుప్రీంకోర్టు, అరెస్టు చేయడానికి వీల్లేదని ఆదేశించి రాజీవ్ కుమార్ ప్రతిష్ట పెంచింది. ఇక రాజకీయంగా ఆలోచిస్తే, శారదా మోసంలో తిలా పాపం తలా పిడికెడు బీజేపీకి, టీఎంసీకి దక్కుతుంది. దొందూదొందే అని తేలుతుంది.
కాకపోతే దర్యాప్తు బాధ్యతలను సీబీఐకి సుప్రీంకోర్టు ఆదేశం ద్వారా బదిలీ అయింది కనుక బంగా ప్రభుత్వాన్ని విమర్శించే అవకాశాలు తక్కువ. సీబీఐ అరెస్టు చేసి, ప్రశ్నించి సాక్ష్యాలు సేకరించి అనుమానించి వదిలేసిన ముకుల్ రాయ్ ని తమ పార్టీలో తీవ్ర ప్రయత్నాల ద్వారా చేర్చుకున్నబీజేపీ, ఆ తరువాత సీబీఐ దర్యాప్తు వేగాన్ని మందగింపజేసారన్ననిందను తుడిచిపెట్టుకోవడం దాదాపు అసాధ్యం.
శారదా మోసాల అధినేత సుదీప్తో సేన్ కోలకతా నుంచి పారిపోవడానికి సహకరించాడని సేన్ డ్రైవర్ ఇచ్చిన వాంగ్మూలం ఇంకా సీబీఐ రికార్డుల్లో ఉండే ఉంటుంది. అయినా ఆయన బీజేపీకి అత్యంత ప్రియుడైనాడు. అవినీతికి ఎవరు వ్యతిరేకంగా పోరాడుతున్నారు? ఎవరు అనుకూలంగా పావులు కదుపుతున్నారు? ఎవరిపాపం పెద్దది? ఎవరిది చిన్నపాత్ర?

ఫొటో సోర్స్, Getty Images
శారదా కుంభకోణంలో ఎవరున్నారు?
శారదా గ్రూప్ కంపెనీల బడా మోసాల అసలు సిసలు కథ చాలా సంక్లిష్టమైంది. 2000 సంవత్సరంలో సుదీప్తో సేన్ అనే బడా వ్యాపారి మధ్యతరగతి మానవుల నుంచి డిపాజిట్లు రాబట్టడానికి ఎక్కువ వడ్డీ ఆశ చూపారు. ఇంకా ఏవేవో లాభాలుంటాయని నమ్మించారు. ఇదివరకెవరూ ఇవ్వనంతగా ఏజెంట్లకు 25శాతం కమిషన్ ఇస్తూ పొంజీ స్కీం తరహాలో వేలకోట్ల కొద్దీ డబ్బు వసూలు చేసారు. కలెక్టివ్ ఇన్వెస్ట్ మెంట్ స్కీం అని సెబీ ఈ వ్యాపారాన్ని వర్గీకరిస్తూ, 50 మంది కన్న ఎక్కువ మంది నుంచి డిపాజిట్లు వసూలు చేస్తే అందుకు కంపెనీ ఆర్థిక స్థోమత తెలిపే ప్రాస్పెక్టస్‌ను బ్యాలెన్స్ షీట్‌లు ప్రచురించాలనీ మరెన్నో ఇతర జాగ్రత్తలు తీసుకోవాలనీ, షరతులు పాటించాలనీ చెప్పింది.
ఈ నియమాలను ఉల్లంఘించిందని సెబీ విమర్శించింది. సెక్యూరిటీ డిబెంచర్లు, రిడీమబుల్ ప్రిఫెరన్షియల్ బాండ్లు జనానికి అమ్మడం మొదలు పెట్టింది. ఇవన్నీ ఉల్లంఘనలే అని సెబీ నోటీసులు ఇచ్చింది. టూరిజం ప్యాకేజీలు, ఆటోమొబైల్ తయారీ, రియల్ ఎస్టేట్, టైం షేర్ క్రెడిట్ కాపిటల్ వంటి రకరకాల పథకాలతో జనం నుంచి వసూళ్లు ముమ్మరం చేసింది. ఒక్కొక్కరు రూ.50 వేల చొప్పున అనేక మంది పెట్టుబడులు పెట్టారు. రూ. 17 లక్షల మంది డిపాటిజ్ చేస్తే, శారదా గ్రూప్ ఖజానాలో సొమ్ము రెండు వేల కోట్లు దాటింది. చిట్ ఫండ్ ల పేరు మీద కూడా డబ్బు వసూళ్ల వ్యాపారం చేశారు.
చిట్ ఫండ్ లను రాష్ట్రాల చట్టాల ద్వారా క్రమబద్దీకరిస్తారు. బెల్లం చుట్టూ ఈగలు మూగినట్టు పదవిలో ఉన్న రాజకీయ నాయకులు శారదా చుట్టూ చేరుకున్నారు. ఆ రాజకీయ పెద్దలతో సంబంధాలు పెంచుకుంటూ, సినిమాల్లో కూడా పెట్టుబడులు పెడుతూ, మీడియా సంస్థలను కూడా సంపాదిస్తూ రాజ్యసభ సభ్యుడు సినీ హీరో మిథున్ చక్రవర్తిని బ్రాండ్ ఎంబాసిడర్‌గా పెట్టుకుని అంతర్రాష్ట్ర పరిధిలో విపరీతంగా విస్తరించిందీ గ్రూప్. నక్సలైట్ ప్రభావిత ప్రాంతాల్లో అంబులెన్స్‌లు, మోటార్ సైకిళ్లును ఈ సంస్థ సమకూర్చితే ప్రభుత్వం వీటిని పంచింది. పోలీసులకు కాపలాకోసం అనేక మోటారు సైకిళ్లు కొనిచ్చారు. ఇదీ వీరి ప్రజాసేవ. టీఎంసీ ఎంపీ కునాల్ ఘోష్ నాయకత్వంలో రూ.988 కోట్లలతో మీడియా కంపెనీ స్థాపించి, 1500 మంది జర్నలిస్టులను నియమించుకున్నారు.
అయిదు భాషల్లో 8 దినపత్రికలు ప్రచురిస్తూ వచ్చారు. కునాల్ ఘోష్‌కు నెలకు రూ.16 లక్షల జీతం ఇచ్చిందీ కంపెనీ. పెట్టుబడికి పుట్టిన ఇటువంటి పత్రికలు కట్టుకథలే కదా చెప్పేది. ఒక ఎంపీ ఇటువంటి లాభదాయకమైన ప్రయివేటు వ్యాపారాలు చేస్తూ ఉంటే ఎంపీ పదవికి అనర్హుడు కావాలని రాజ్యాంగం చెబుతున్నది. ఇక ఈ వ్యాపారం చట్ట వ్యతిరేకమయితే సదరు ఎంపీ పార్లమెంటులో కాదు జైల్లో ఉండాల్సిన నేరం కూడా. మరో టీఎంసీ ఎంపీ శ్రీంజయ్ బోస్, రాష్ట్ర రవాణా మంత్రి మదన్ మిత్ర కూడా ఈ వ్యాపారాల్లో చేరారు. ఇంతమంది ఈ నేరాల్లో భాగస్వాములైతే వారు ప్రజాప్రతినిధులుగా కొనసాగడం మన ప్రజాస్వామ్యాన్ని ఒక ప్రహసనంగా మార్చడమే.

ఫొటో సోర్స్, Getty Images
సీబీఐ, ఈడీ అనేక మందిని ప్రశ్నించాయి. టీఎంసీ ఎంపీ అర్పితా ఘోష్, అసోంలో కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన హిమంతా బిస్వాశర్మలను, శర్మ భార్య రింకీని విచారించారు. మదన్ మిత్ర, శ్రింజయ్ బోస్, కునాల్ ఘోష్ లను అరెస్టు చేసింది సీబీఐ. తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మేల్యే, ఎంపీలు, పోలీసు అధికారులు పలువురిని ప్రశ్నించారు. వారిలో తృణమూల్ కీలక నాయకుడు ముకుల్ రాయ్, పశ్చిమ బంగా మాజీ డీజీపీ ఒకరు, అసోం గాయకుడు సినీ నిర్మాత, ఒడిశా మాజీ అడ్వకేట్ జనరల్ కూడా ఉన్నారు. అసోం మాజీ డీజీపీ శంకర్ బారువా ఇంటి మీద దాడి చేసి, ప్రశ్నించిన తరువాత ఆయన అవమానం భరించలేక ఆత్మహత్య చేసుకున్నారు.
2012లో సెబీ, తమ అనుమతి లేకుండా జనం నుంచి డబ్బు వసూలు చేయడం ఆపేయాలని నోటీసు ఇచ్చింది. వచ్చే డబ్బు కంటే పోయే డబ్బెక్కువ అవుతుండంతో శారదా వ్యాపారాలు గందరగోళం వైపు దారితీశాయి. ఏప్రిల్ 2013లో ఫిర్యాదుల వెల్లువ మొదలైంది. బిధాన్ సభ పోలీసుస్టేషన్‌లో వందలాది కేసులు నమోదయినాయి. ఇంత చేసినా ఎవరికీ అనర్హత రాలేదు. ఎవరి డబ్బూ స్వాధీనం చేసుకోలేదు. బాధితులెవ్వరికీ డబ్బు వాపస్ రాలేదు.
ప్రధాన నిందితుడు సుదీప్తో సేన్ ప్రభుత్వానికి 18 పేజీల ఉత్తరం రాసి కోల్‌కతా నుంచి పారిపోయారు. కొందరు రాజకీయ నాయకులు ఒత్తిడి చేయడం వల్ల అడ్డదిడ్డంగా పనికిరాని ప్రాజెక్టులలో పెట్టుబడులు పెట్టవలసి వచ్చిందని ఆ కారణంగా తన వ్యాపారం కుప్పకూలిందని ఆ ఉత్తరంలో రాసాడాయన, ఆ మహానుభావుల పేర్లు కూడా చెప్పాడు. ఆయన డైరీలు, లాప్ టాప్‌లు, పెన్ డ్రైవ్ లు పరిశీలిస్తే ఎంతమంది పెద్దల జాతకం బయటపడుతుందో చెప్పలేం. ఈ పని ఎవరూ చేయడం లేదు.
ఏప్రిల్ 20, 2013న సుదీప్తో సేన్, దేవయానీ ముఖర్జీలు ఇద్దరినీ అరెస్టు చేశారు. తరువాత పరిశోధనలో ఈ కంపెనీలు దుబాయ్, దక్షిణ ఆఫ్రికా, సింగపూర్‌లలో కూడా వ్యాపారాలు చేశాయని తేలింది. అసోం పోలీసులు, ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్‌ల దర్యాప్తుతో పాటు, పశ్చిమ బంగా ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు కమిషన్ చివరకు ఏం సాధించారో తెలియదు.
అనేక రాష్ట్రాలలో వ్యాపించిన ఈ భారీ మోసాల దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. ముందుగా సీబీఐ పకడ్బందీగా దర్యాప్తు సాగించి దడదడ లాడించింది. కానీ, ఆ తరువాత దర్యాప్తు మందగించింది. కాలయాపన మొదలైంది. సాక్ష్యాల సేకరణ వాయిదా పడి, ఉత్తరాలు రాసుకోవడం మొదలైంది - మరీ ముఖ్యంగా ముకుల్ రాయ్ వంటి కీలకమైన నేతలు బీజేపీకి వచ్చిన తరువాత సిట్ అధికారుల నుంచి రికార్డులు తీసుకున్నప్పటికీ అనేక పత్రాలు ఇంకా రావలసి ఉందనీ, దాదాపు 18 సార్లు వారికి ఉత్తరాలు రాసినా వారు రాలేదని, అనారోగ్యంతో సహా అనేక కుంటిసాకులతో వాయిదాలు వేశారని సీబీఐ సుప్రీం కోర్టుకు విన్నవించింది. సిట్ సీబీఐ వర్గాలకు అనుకూలమైన చోట సమావేశమవుదాం అంటున్నారు. కానీ, సహకారం అందడం లేదని, రాజీవ్ కుమార్‌కు 2017-18 మధ్య పద్నాలుగు నెలల కాలంలో అయిదు నోటీసులు రాజీవ్ కుమార్‌కు పంపినా రాలేదని సీబీఐ ఆరోపణ. రాజీవ్ కుమార్‌తో సహా మరో ముగ్గురు అధికారులతో మాట్లాడడానికి తమకు అనుమతినివ్వాలని ఆగస్టు 23, 2018న సీబీఐ పశ్చిమ బంగా ప్రభుత్వాన్ని కోరింది. ఐజీ రైల్వేస్ తమల్ బసు, పదవీ విరమణ చేసిన వినీత్ గోయల్, పల్లబ్ కాంతి ఘోష్‌లను విచారించాలని సీబీఐ లేఖ రాసింది. రాకేష్ ఆస్తానా కోల్‌కతా వచ్చి వెళ్లిన తరువాత ఈ విధంగా అనుమతి కోరారని వార్తాకథనాలు వచ్చాయి.
ఏయే పెద్దలకు ఎంతెంత ముట్టజెప్పిందీ రాసిన సుదీప్తోసేన్ డైరీ, నిందితుల ఇంటరాగేషన్ వీడియోలు కొన్ని, సేన్ బ్యాంక్ లాకర్లలో దొరికిన వస్తువులు, సీబీఐకి స్వాధీనం చేయలేదని ఆరోపిస్తున్నారు. ఇవి నిజాలే అయితే తీవ్రమైన నేరాలే. ఇవి నిజాలే అయితే ఇంతదాకా సీబీఐ మౌనం పాటించడానికి కారణాలేమిటి? అనుమానించవలసిందే కదా!
ఈ కేసులో రాష్ట్రానికి బాధ్యతలు అంతగా లేవు. కారణం విచారణకు బదిలీ కావడమే. ఒకవేళ సీబీఐ ఉత్తరాలు అంది ఉంటే, తమ దగ్గరి సాక్ష్యాలను అందజేయడం వారి బాధ్యత. తమ దగ్గర ఏమీ లేకపోతే, ఆ విషయం స్పష్టంగా చెప్పడం కూడా వారి బాధ్యత.
బీజేపీ వ్యతిరేక ర్యాలీని భారీ జనంతో నిర్వహించిన ఒకటి రెండు రోజుల్లోనే సీబీఐ అధికారులు 40 మందితో పోలీసు కమిషనర్ ఇంటికి వెళ్లడం అనుమానాలకు దారితీస్తుంది. నిజంగానే రాజీవ్ కుమార్‌ను అరెస్టు చేస్తే, జనమంతా ఆయనే నేరం చేసి ఉండవచ్చనుకుంటారు. బెయిల్ వచ్చి విచారణ జరిగి నిజం తేలేలోగా అనుమానాలు చెలరేగి రాజీవ్ పరువు, రాష్ట్రం పరువు గంగపాలయ్యే ప్రమాదం ఉంది. దాన్నుంచి రక్షించుకోవడం కోసం మమతా బెనర్జీ చేయవలసిన పనులన్నీ చేసినట్టు కనబడుతూనే ఉంది. ఆ సీబీఐ అధికారులనందరినీ అరెస్టు చేయడమే కాకుండా కోల్‌కతాలో సీబీఐ జాయంట్ డైరెక్టర్ పంకజ్ శ్రీ వాస్తవ ఇంటిని బెంగాల్ పోలీసులు చుట్టుముట్టారని, కుటుంబాన్ని బందీ చేశారని సుప్రీంకోర్టుకు సీబీఐ పశ్చిమ బంగా సంఘటనపై విన్నవించింది.

ఫొటో సోర్స్, Reuters
ఇదంతా చట్టపరమైన సంగ్రామం. దీని వెనుక రాజకీయ ప్రయోజనాలు, బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ రాజకీయ వైరుధ్యాలు, రాబోయే లోకసభ ఎన్నికలలోగా తమ సమర్థతను, మంచితనాన్ని అవినీతి వ్యతిరేకతను చాటుకోవడానికి వీలైనంత త్వరగా సంచలన చర్యలు తీసుకోవాలనే వేగిరపాటు వంటివి ఎన్నో కనిపిస్తాయి. అన్నింటికన్న ముఖ్యమైంది.. కోల్‌కతాలో దాడికి సీబీఐ ఎంచుకున్న సమయం. అంతకుముందే కోల్‌కతాలో భారీ జన ప్రదర్శనతో బీజేపీపై మమతా బెనర్జీ రాజకీయ సమరం సాగించడం, ప్రతిపక్షాల మహాకూటమి సంకేతాలు చాలా పటిష్టంగా కనబడడం కూడా కీలకమైన అంశాలు.
సీబీఐ దర్యాప్తులు, ఇంటరాగేషన్లు, అరెస్టులు, మధ్యలో పలుకుబడి ఉన్న కొందరు పెద్ద నాయకులు రాష్ట్ర అధికార పార్టీ నుంచి కేంద్ర అధికార పార్టీలోకి ఫిరాయించడం ప్రజల్లో అనేక అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. శారదా మోసాల సూత్రధారి సుదీప్తోసేన్ కోల్‌కతా నుంచి పారిపోవడానికి సహాయపడిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో అత్యంత పలుకుబడి కలిగిన నాయకుడు, ఉపాధ్యక్షుడు, మమతా బెనర్జీకి సన్నిహితుడు ముకుల్ రాయ్ సీబీఐ విచారణకు గురై, అరెస్టయిన తరువాత బీజేపీలో చేరడం ఈ అనుమానాలను బలపరుస్తుంది.
అసోంలో ఈ వ్యాపారాలతో సంబంధం ఉన్నట్టు అనుమానాలకు గురైన మరొక నాయకుడు హిమంత్ బిస్వా శర్మను ఎందుకు బీజేపీలో చేర్చుకున్నారు?
ఇవి రాజకీయంగా బీజేపీ సమాధానాలు చెప్పవలసిన ప్రశ్నలు. ఇక సీబీఐ అధికార పంజరంలో చిక్కుకున్న చిలక. ఏ అర్థరాత్రయినా ఉద్యోగం ఊడిపోవచ్చు. దర్యాప్తు చేస్తున్న అధికారులు దేశంలోని నలుమూలలకు విసిరి వేయబడవచ్చు.
ఐపీఎస్ అధికారులు తమకు విధేయులుగా పనిచేయాలని బీజేపీ కేంద్రంలో ఆశించినట్టే, తృణమూల్ కాంగ్రెస్ కూడా రాష్ట్రంలో ఆశిస్తుంది.

ఫొటో సోర్స్, Getty Images
సంవిధానానికి సవాళ్లు
సంవిధాన సవాళ్లు కూడా ఒకటి రెండున్నాయి. శాంతి భద్రతలు నేర నివారణ రాష్ట్రాల బాధ్యత. రాష్ట్ర పోలీసు బాధ్యత. శారదా, వ్యాపం వంటి భారీ మోసాలు ఆర్థిక స్కాముల అవినీతిలో హస్తం ఉన్న రాజకీయ నాయకులు రాజ్యం చేస్తూ ఉంటే పోలీసులు స్వతంత్రంగా దర్యాప్తు చేయలేరు. కానీ, కేంద్రంలో అధికారం చెలాయించే రాజకీయ పార్టీ, రాష్ట్రంలో కీలకమైన నేతలను తమ పార్టీలోకి లాక్కోవడానికి, వారి అవినీతిని వాడుకుని దర్యాప్తు చేసే కేంద్ర పోలీసు హోదాలో ఉన్న సీబీఐని పంపుతుంటే ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పు అని ఎవరు తేల్చుతారు?
డిల్లీ స్పెషల్ ఎస్టాబ్లిష్‌మెంట్ చట్టం కింద ఏర్పాటయిన సీబీఐకి అంతర్రాష్ట్ర పోలీసు హోదా ఎవరిచ్చారు? రాజ్యాంగంలో సీబీఐ ప్రస్తావన లేదు. పార్లమెంటు ఇవ్వలేదు, రాష్ట్రాలు అంగీకరించలేదు. కానీ, ఇటువంటి కేసులను సీబీఐకి అప్పగించండి అంటూ ఆదేశాలు జారీ చేయడం ద్వారా సుప్రీం కోర్టు సీబీఐకి లేని అంత ర్రాష్ట్రీయ ఔన్నత్యాన్ని అంటగట్టింది. రాష్ట్రాల్లో రాజకీయ నాయకులు కూడా ప్రత్యర్థులను బలిచేయడానికి సీబీఐ దర్యాప్తు కావాలని కోరడం ద్వారా లేని అధికారాన్ని సీబీఐకి అంటగట్టాయి. సీబీఐ ఒక పెనుభూతంగా మారింది. దాన్ని జై పాతాళ భైరవి అంటూ రాజకీయ మాంత్రికులు వాడుకుంటున్నారు. సంవిధానమూ లేదు, విధానమూ లేదు. దీనికి ఎవరు సమాధానమిస్తారు?
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








