రక్తదానం, వీర్యదానం సరే, మల దానం గురించి విన్నారా? ‘సూపర్ పూ డోనర్స్' అంటే తెలుసా?

ఫొటో సోర్స్, Alzira G Della Ragione
- రచయిత, మిచెల్ రాబర్ట్స్
- హోదా, హెల్త్ ఎడిటర్, బీబీసీ ఆన్‌లైన్
స్పెర్మ్ డొనేట్ చేయడం గురించి మీరు వినే ఉంటారు. కానీ మీరెప్పుడైనా 'మానవ వ్యర్థం' లేదా 'మలం దానం' చేయడం గురించి విన్నారా. కాస్త వింతగా అనిపించింది కదా. కానీ ఇది నిజం.
31 ఏళ్ల క్లావుడియా కంపెనెలా బ్రిటన్‌లోని ఒక యూనివర్సిటీలో స్టూడెంట్ స్పోర్ట్స్అడ్మినిస్ట్రేటర్. ఆమె ఖాళీ సమయాల్లో తన మలం దానం చేస్తుంటారు.
"నా స్నేహితులు కొందరికి ఇది కాస్త వింతగా, చికాగ్గా అనిపించింది. కానీ నేను దాని గురించి పట్టించుకోను. దీన్ని దానం చేయడం చాలా సులభం, నేను జరుగుతున్న వైద్య పరిశోధనలకు సాయం చేయాలనుకుంటున్నా. దానికి ఏదైనా ఇవ్వడం నాకు సంతోషంగా ఉంది" అని ఆమె చెప్పారు
నిజానికి, ఆమె మలంలో 'మంచి బగ్స్' ఉన్నాయి. అందుకే ఆమె మలాన్ని వేరే రోగి పేగుల్లోకి పంపించి అతడికి చికిత్స చేస్తారు.
క్లావుడియాకు తను దానం చేస్తున్నది ఎంత ఉపయోగపడుతుందో తెలుసు. అందుకే ఆమె తన వ్యర్థాలు డొనేట్ చేస్తున్నారు. కానీ ఆమె మలం అంత ప్రత్యేకం ఎందుకు.
కొంతమంది మలంలో ఉండే బాక్టీరియా సాయంతో వేరే రోగుల కడుపులోని పేగులను సరి చేయవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
సూపర్ 'పూ డోనర్స్'
క్లావుడియా తను ఒక 'పూ డోనర్' కావాలని అనుకుంటున్నట్టు చెప్పారు. ఎందుకంటే వేగన్ల మలం మంచి బగ్స్‌తో ఉండవచ్చనే విషయం గురించి నేను చదివానని తెలిపారు.
కానీ వేగన్ల మలం మిగతా ఆహారం తినేవారికంటే మెరుగ్గా ఉంటుందని చెప్పడానికి ఇప్పటివరకూ ఎలాంటి ఆధారాలూ లేవు. అయినా ఏ పదార్థాలు తింటే మలం అలా 'మంచి బగ్స్'తో వస్తుంది అనేదానిపై శాస్త్రవేత్తలు రీసెర్చ్ చేస్తున్నారు.
డాక్టర్ జస్టిన్ ఓసులివన్ ఆక్లాండ్ యూనివర్సిటీలో ఒక మాలిక్యులర్ బయాలజిస్ట్(పరమాణు జీవశాస్త్రవేత్త). ఆయన 'సూపర్ పూ' డోనర్స్ సిద్ధాంతంపై పనిచేస్తున్నారు.
'సూపర్ పూ' అంటే ఏంటి?
మనిషి పేగుల్లో లక్షల సంఖ్యలో మంచి, చెడు బ్యాక్టీరియా ఉంటుంది. ఈ సూక్ష్మక్రిములు మనుషుల్లో వేరువేరుగా ఉంటాయి.
అయితే వైద్యరంగంలో ఒకరి మలాన్ని ఇంకొకరి పేగుల్లోకి మార్చడం అనేది కొత్త పరిశోధన. కానీ కొన్ని అధ్యయనాల్లో వెల్లడైన ఆధారాలు మలం దానం చేయడం ద్వారా కూడా సంపాదించుకోవచ్చు అని సూచిస్తున్నాయి.
డాక్టర్ జస్టిన్ ఒసులివన్ "ఇది ఎలా జరుగుతుంది అనేది మనం తెలుసుకోగలిగితే, ఈ మల ట్రాన్స్‌ప్లాంట్ మరింత సక్సెస్ అయ్యేలా దానిని మెరుగుపరచవచ్చు. సూక్ష్మజీవులకు సంబంధించిన అల్జీమర్, మల్టిపుల్ స్క్లెరోసిస్, ఆస్తమా లాంటి వ్యాధులకు కూడా దానిని పరీక్షించవచ్చు.
వెస్ట్ హెర్ట్ ఫోర్డ్ షైర్ హాస్పిటల్స్ గాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ జాన్ లాండీ తమ ఆస్పత్రిలోని మల ట్రాన్స్‌ప్లాంట్ యూనిట్‌కు సాయం చేస్తుంటారు.
"అసలు ఎవరైనా సూపర్ పూ డోనర్ ఎలా అవుతారు, ఎందుకు అవుతారు" అనేది మాకు ఇప్పటివరకూ అర్థం కాలేదు అని ఆమె చెప్పారు.
"మేం ఎప్పుడూ మా డోనర్ ఆరోగ్యంగా ఉన్నారా, వారికి ఏవైనా వ్యాధులు ఉన్నాయా అని నిర్ధారించుకుంటాం. కానీ వారి సూక్ష్మజీవులు ఎలా ఉన్నాయో తెలుసుకోడానికి వాటన్నిటినీ పరీక్షించం".
"కానీ అలాంటి పరీక్ష కూడా చేయాలి అని నాకు అనిపిస్తోంది".

ఫొటో సోర్స్, Alzira G Della Ragione
మలంలో బాక్టీరియా
డాక్టర్ ఓసులివన్ పరిశోధన ప్రకారం ఒక వ్యక్తి మలంలో ఉండే సూక్ష్మ క్రిముల్లో చాలా రకాల ప్రయోజనాలు అందించేవి కూడా ఉంటాయి. ఆయన ఈ పరిశోధనను 'ఫ్రంటియర్స్ ఇన్ సెల్యులర్ అండ్ ఇన్ఫెక్షన్ మైక్రోబయాలజీ'లో ప్రచురించారు.
మల ట్రాన్స్‌ప్లాంట్ ఫలితాలను చూస్తే వ్యర్థాలు దానం చేసిన దాత మలంలో ఉన్న చాలా రకాల సూక్ష్మక్రిములు చాలా ముఖ్యమైనవిగా నిరూపితం అయ్యాయి. ఏ రోగుల్లోకి ఈ మలం విజయవంతంగా పంపించగలిగారో వారి శరీరంలో మెరుగైన రకరకాల మైక్రోబయోమ్ అభివృద్ధి చెందాయి.
కానీ ఈ పరిశోధనలో దాత మలం రోగికి ఎంత బాగా మ్యాచ్ అవుతుంది అనేదానిపై కూడా ట్రాన్స్‌ప్లాంట్ సక్సెస్ అనేది ఆధారపడి ఉంటుందని తేలింది.
ఇది కేవలం మలంలో ఉన్న బ్యాక్టీరియాపైనే ఆధారపడదు.
ఫిల్టర్ చేసిన మలం ట్రాన్స్‌ప్లాంట్ చేసినపుడు మాటిమాటికీ విరేచనలు కావడం వల్ల కూడా కొన్ని కేసుల్లో మంచి ఫలితాలు లభించాయి. ఆ రోగి మలంలో జీవించి ఉన్న బాక్టీరియా బయటికి వచ్చేసినా, అందులో ఉన్న డీఎన్ఏ, వైరస్ అలాగే అందులోనే ఉన్నాయి.
"ట్రాన్స్‌ప్లాంట్ చేసిన బ్యాక్టీరియా, ఇతర సూక్ష్మజీవులను సజీవంగా ఉంచడంపై, వాటి మెటబాలిక్ పనితీరుపై ఈ వైరస్‌ల ప్రభావం ఉండచ్చు" అని డాక్టర్ ఓసులివన్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
లండన్ ఇంపీరియల్ కాలేజీలో మైక్రోబయోమ్ నిపుణులు డాక్టర్ జూలీ మెక్‌డొనాల్డ్ మల ట్రాన్స్‌ప్లాంట్స్ సక్సెస్ రేటును పెంచే విషయంపై అధ్యయనం చేస్తున్నారు.
ప్రస్తుతం ఎక్కువ మంది దానం చేస్తున్న మలాన్ని 'క్లోస్ట్రిడియమ్ డిఫిసిల్' అనే ఇన్ఫెక్షన్ కారణంగా పేగుల్లో ఏర్పడే ప్రమాదకరమైన స్థితికి చికిత్స చేయడానికి ఉపయోగిస్తున్నారు.
యాంటీ బయాటిక్స్ వాడడం వల్ల రోగి కడుపులోని 'మంచి బగ్స్' తుడిచిపెట్టుకుని పోయినపుడు, ఈ ఇన్ఫెక్షన్ రోగి కడుపును కబ్జా చేసేస్తుంది. పేగులు బలహీనంగా మారిన రోగికి ఇది ప్రాణాంతకం అవుతుంది.
ఏదైనా ప్రత్యేకమైన పరిస్థితుల్లో, అంటే వ్యాధుల వల్ల కోల్పోయిన వాటిని భర్తీ చేయడానికి మలం ట్రాన్స్‌ప్లాంట్ చేయవచ్చని డాక్టర్ జూలీ మెక్‌డొనాల్డ్ పరిశోధనలు సూచించాయి.
"మేం మా ప్రయోగశాలలో ట్రాన్స్‌ప్లాంట్ అసలు ఎలా పనిచేస్తుంది, ఇలా మలం ఇవ్వడాన్ని మనం ఎప్పుడు ఆపేయవచ్చు అనేది తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నాం" అని ఆమె చెప్పారు.
రోగి మలాన్ని ఇంజెక్షన్ ద్వారా ఇవ్వడానికి బదులు, వారికి మల ఆధారిత చికిత్స మాత్రమే అందించవచ్చు. దాని వల్ల ఆ చికిత్స చేయించుకునేవారికి పెద్దగా అభ్యంతరాలు కూడా ఉండవు.
అలా చేయడం వల్ల మలం దానం గురించి ఉన్న రకరకాల అపోహల గురించి వారు బయటపడే అవకాశం లభిస్తుంది.
"జనం దీని గురించి తమ ఆలోచనలు మార్చుకోవాలి. 'మలం దానం', లేదా 'పూ డోనర్' కావడం గురించి ఆలోచించాలి" అని క్లావుడియా అన్నారు.
"మలం దానం చేయడం నిజంగా చాలా సులభం కూడా. మీరు దాని గురించి ఆలోచిస్తుంటే మీ దగ్గర్లో ఉన్న ఆస్పత్రిలో సంప్రదించవచ్చు".
"నాకు ఆస్పత్రిలో ఒక స్పెషల్ డబ్బా ఇస్తారు. అందులో నేను నా మలం సేకరిస్తాను. తర్వాత నేను పనికి వెళ్తున్నప్పుడు ఆ డబ్బాను ఆస్పత్రిలో ఇచ్చేసి వెళ్లిపోతాను. దీనికోసం మీరు కొన్ని అడుగులు ఎక్కువ వేయాల్సి ఉంటుంది అంతే" అన్నారు.
క్లావుడియా ఇప్పుడు బ్లడ్ డోనర్ కూడా కావాలని ఆలోచిస్తున్నారు. "నేను ఇప్పటివరకూ నా రక్తం ఇవ్వలేదు. కానీ నేను అది కూడా ఇవ్వాలని అనుకుంటున్నా" అన్నారు.
ఇవి కూడా చదవండి:
- ఆమె చనిపోతే రెండో బాలిక కూడా చనిపోతారు
- అఘోరాలు ఎవరు... ఎందుకలా శవాల మధ్య గడుపుతారు...
- ఈ మహిళలు చైనాలో లైవ్ సెక్స్‌క్యామ్ రాకెట్ కోరల నుంచి ఎలా తప్పించుకున్నారంటే..
- డేటింగ్ చేయడానికి కూడా లీవులు ఇస్తారా...
- పదేళ్లుగా కోమాలో ఉన్న మహిళ ప్రసవం... మగ నర్సుని అరెస్ట్ చేసిన పోలీసులు
- ప్రియాంకా గాంధీని 'భయ్యాజీ' అని ఎందుకంటారు
- ఈ బాలుడు పడుకుంటే.. అతని ప్రాణానికే ముప్పు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









