ఫిన్లండ్‌లో విఫలమైన కనీస ఆదాయ పథకం: ‘ఆనందంగానే ఉన్నాం.. కానీ ఉద్యోగం రాలేదు’

ఫిన్లండ్ యువతులు

ఫొటో సోర్స్, Getty Images

నిరుద్యోగులకు రెండేళ్లపాటు కనీస ఆదాయం కల్పిస్తే, వారు తమ ఆర్థికావసరాలతో రాజీపడకుండా మంచి ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తారంటూ ఫిన్లండ్ ప్రభుత్వం 2017లో నిరుద్యోగ భృతి ప్రకటించింది. కానీ ఆ పథకం, నిరుద్యోగులను ఉద్యోగాలకు చేరువ చేయలేకపోయింది.

2017 జనవరి నుంచి 2018 డిసెంబర్ వరకు రెండేళ్లపాటు నిరుద్యోగులకు నెలకు 560 యూరోలు(భారతీయ కరెన్సీలో రూ. 45 వేలు) చొప్పున భృతి ఇచ్చింది. వారికి సరిపోయే ఉద్యోగం వెతుక్కోవడానికి కాస్త సమయం దొరుకుతుందని ఫిన్లండ్ ప్రభుత్వం భావించింది.

కానీ దీనివల్ల ఆ దేశంలో ఉద్యోగుల సంఖ్య మాత్రం పెరగలేదు. ప్రభుత్వం ఇస్తున్న ఈ డబ్బుతో తాము చాలా ఆనందంగా ఉన్నామని, తమకు ఒత్తిడి ఎక్కువగా లేదని నిరుద్యోగులు చెబుతున్నారు.

2017లో ఫిన్లండ్ ఈ పథకాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేసింది. యూరప్ ఖండంలో ఇలాంటి షరతుల్లేని కనీస ఆదాయ పథకాన్ని ప్రవేశపెట్టిన మొట్టమొదటి దేశం ఫిన్లండ్.

ఈ పథకాన్ని 'సోషల్ ఇన్సూరెన్స్ ఇన్స్టిట్యూషన్'(కేలా) అనే ప్రభుత్వ సంస్థ నిర్వహించింది. 2,000 మందిని ఎంపిక చేసి వారికి నెలనెలా భృతి ఇచ్చింది.

ప్రపంచం దృష్టిని ఆకర్షించిన ఈ పథకం ఫలితాలు ఎన్నో ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి.

ఫిన్లండ్‌లో మహిళ

ఫొటో సోర్స్, Getty Images

కనీస ఆదాయం అంటే ఏమిటి?

'యూనివర్సల్ బేసిక్ ఇన్‌కమ్' అంటే, అందరికీ నెలకు కనీస రాబడి ఉండటం. కానీ ఫిన్లండ్ ప్రభుత్వ విధానం కాస్త వేరు. ఆ ప్రభుత్వం నిరుద్యోగులకు మాత్రమే కనీస ఆదాయం కల్పించింది.

ఈ కనీస ఆదాయం స్థానంలో 'కనీస అవసరాలు' అన్న మరో అంశం కూడా ఇక్కడ ప్రస్తావించతగ్గదే. అంటే ప్రజలకు నెలనెలా డబ్బు ఇవ్వకుండా, విద్య, వైద్యం, రవాణా లాంటి కనీస సౌకర్యాలను ఉచితంగా కల్పించడం.

ఈ ఆలోచన కొత్తదేమీ కాదు. 503 సంవత్సరాల క్రితం.. అంటే 1516సం.లో తన పుస్తకంలో సర్ థామస్ మోర్.. ఈ విషయాన్ని వివరించారు.

ఇలాంటి పథకాలు ప్రపంచవ్యాప్తంగా ఆచరణలో ఉన్నాయి. పశ్చిమ కెన్యా గ్రామాల్లో నివసించే పెద్దలకు 12ఏళ్లపాటు నెలకు రూ.1,500 ఇస్తున్నారు.

ఈ పథకం 2028 వరకు కొనసాగుతుంది. తమ దేశ పౌరుల ఆదాయం గురించి ఇటలీ ప్రభుత్వం కూడా ప్రణాళికలు రచిస్తోంది.

ఫిన్లండ్ కనీస ఆదాయ పథకం వివరాలు
ఫొటో క్యాప్షన్, ఫిన్లండ్ కనీస ఆదాయ పథకం వివరాలు

నిరుద్యోగులకు ఆర్థిక భద్రత కలిగి నైపుణ్యాలను పెంచుకుంటారనే..

ఇలాంటి పథకం వల్ల, నిరుద్యోగులకు ఆర్థిక భద్రత కలుగుతుందని, ఈ రెండేళ్ల కాలంలో వారికి అవసరమైన వృత్తి నైపుణ్యాలను నేర్చుకోగలుగుతారన్నది కొందరి అభిప్రాయం. మనుషుల ఉద్యోగాలను రొబోట్లు మింగేస్తున్న కాలంలో (ఆటోమేషన్) ఇలాంటి పథకాలు చాలా అవసరమని అభిప్రాయపడుతున్నారు.

'కేలా' సంస్థకు చెందిన అధ్యయనకారుల్లో ఒకరైన మిస్కా సిమనాయ్నెన్ బీబీసీతో మాట్లాడుతూ ''సామాజిక భద్రతా సంస్కరణలో భాగంగా, ఈ పథకం ఎలాంటి ఫలితాలను ఇస్తుందోనని ఇంతకాలం ప్రభుత్వం వేచి చూసింది..'' అన్నారు.

ఫలితం ఉందా?

ఫలితం అన్నది.. 'పని చేయడం' అనేదానిపై ఆధారపడి ఉంది. నిరుద్యోగులకు ఉపయోగపడుతుందని ఫిన్లండ్ ప్రభుత్వం భావించిన ఈ పథకం విజయవంతమైందా..? అంటే, లేదనే చెప్పాలి.

ప్రస్తుతం నిరుద్యోగ భృతిని పొందుతున్న ట్యోమస్ బీబీసీతో మాట్లాడుతూ.. ''నేను ఇప్పటికీ నిరుద్యోగినే.. కనీస ఆదాయ పథకం నా జీవితాన్ని మార్చేసిందని చెప్పలేను. మానసికంగా భరోసా ఇచ్చింది కానీ ఆర్థికంగా నా జీవితాన్ని పెద్దగా మార్చలేదు'' అన్నారు.

ఫిన్లండ్‌లోని ప్రజలు

ఫొటో సోర్స్, Getty Images

లోపాలు ఏమిటి?

అందరికీ కనీస సంపాదన అన్నది.. కొందరు వ్యక్తుల వ్యక్తిగత సంపదను, వారి కొనుగోలు శక్తిని, మరోవైపు పేదలను చర్చలోకి తీసుకువస్తుంది.

''ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేయడానికి ప్రాథమికమైన సంస్కరణలు తీసుకురాకుండా అందరికీ కనీస ఆదాయం అంటే, అది.. పగిలిన గోడలకు ప్లాస్టర్ వేసినట్లే ఉంటుంది'' అని ఆర్థికవేత్త గ్రేస్ బ్లేక్లీ అన్నారు.

ఇది చాలా ఖర్చుతో కూడుకున్న పథకం అని, 'ఏమీ చేయకుండా ఉన్నందుకు అందుకుంటున్న వేతనం'లా ఈ పథకం కనిపిస్తోంది అంటూ.. ఫిన్లండ్ రాజకీయవర్గాల భావన.

తర్వాతి ప్రణాళిక ఏమిటి?

ప్రస్తుతం, ఈ కనీస ఆదాయ పథకం ఫలితాలను విశ్లేషించడంలో కేలా అధ్యయనకారులు బిజీగా ఉన్నారు. ఈ పథకం విఫలమైందని ఆలోచించడానికి కూడా తనకు ఇష్టం లేదని, సిమనాయ్నెన్ అన్నారు.

''ఇది జయాపజయాల అంశం కాదు. ఫలితం ఏదైనా, అది వాస్తవం. ఈ ఫలితాలు.. పథకాన్ని అమలు చేయడానికి ముందు, మావద్ద లేని సమాచారాన్ని అందిస్తాయి'' అన్నారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)