ప్యాడ్ యాత్ర: "ఇక మేం పీరియడ్స్ గురించి ధైర్యంగా మాట్లాడతాం"

ఫొటో సోర్స్, sachhisaheli/facebook
- రచయిత, మీనా కోత్వాల్, మనీశ్ జాలు
- హోదా, బీబీసీ ప్రతినిధులు
రుతుస్రావం (పీరియడ్స్) .. ఇప్పటికీ చాలా దేశాల్లో బాహాటంగా మాట్లాడని విషయం ఇది. దీని గురించి ప్రజల్లో అనేక అపోహలు, మూఢనమ్మకాలు నాటుకుపోయి ఉన్నాయి.
ఆ మూఢ నమ్మకాలను దూరం చేసే ఆలోచనతో ఫిబ్రవరి 5న దిల్లీలోని 'పీరియడ్ ఫెస్ట్ జరిగింది. అందులో భాగంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు 'ప్యాడ్ యాత్ర' చేశారు.
వివిధ కళారూపాలు, ప్రదర్శనల ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు.
"నెలసరి ఎందుకొస్తుందని అమ్మాయిలు తరచూ అడుగుతుంటారు. అమ్మాయిలకు మాత్రమే ఎందుకొస్తుంది? ఆ సమయంలో నొప్పి ఎందుకొస్తుంది? వంటి చిన్నిచిన్న ప్రశ్నలు వేస్తుంటారు. ఈ ప్రశ్నలను దాటవేయకూడదు. వారికి విరించేందుకు ప్రయత్నించాలి. బాలికలకు చిన్న వయసులోనే చెప్తే తొందరగా అర్థం చేసుకుంటారు" అని ఈ కార్యక్రమంలో పాల్గొన్న గైనకాలజిస్టు డాక్టర్. సురభి సింగ్ వివరించారు.
"పీరియడ్స్ వచ్చినప్పుడు పూజ గదికి వెళ్లొద్దని, విగ్రహాలను తాకకూడదని, పచ్చడి డబ్బాలను ముట్టుకోవద్దని, తలస్నానం చేయొద్దని మా అమ్మ చెప్తుంది. ఆమెకు వాళ్ల అమ్మ చెప్పిందట. కానీ, అవన్నీ మూఢ నమ్మకాలని మా అక్క అంటుంది" అని ఒక విద్యార్థిని చెప్పారు.
"మొదటిసారి నా బట్టల మీద మరక కనిపించగానే భయమేసింది. మా అమ్మ చూసి అది చాలా ముఖ్యమని, అమ్మాయిలకు పీరియడ్స్ రావడం సహజమని, ప్రతి నెలా వస్తుందని చెప్పింది. పీరియడ్స్ సమయంలో చాలా షరతులు పెట్టేవారు" అని మరో యువతి విరించారు.
"మొదట్లో మా పేరెంట్స్‌తో మాట్లాడేందుకు సిగ్గుపడేదాన్ని. మా స్కూలులో పీరియడ్స్ గురించి చాలా చెప్పారు. ఇప్పుడు ఈ విషయం మీద మాట్లడేందుకు ఇబ్బంది లేదు" అని ఇంకో విద్యార్థిని చెప్పారు.

"ఓసారి నెలసరి రావడంతో తీవ్రమైన నొప్పి వచ్చింది. దుకాణంకెళ్లి ప్యాడ్ కొనుక్కురమ్మని అన్నయ్యను అడిగాను. అబ్బాయి ప్యాడ్ ఎలా తెస్తాడు? అని మా అమ్మ అంది. దాంతో, చివరికి నేనే వెళ్లాల్సి వచ్చింది" అని ఈ కార్యక్రమంలో ప్రదర్శన ఇచ్చిన యువతి గుర్తు చేసుకున్నారు.
"మొదట్లో చాలామంది విద్యార్థులు తమ ఆరోగ్య పరిస్థితి గురించి నాతో చెప్పేవారు. కానీ, పీరియడ్స్ గురించి మాత్రం మాట్లాడేవారు కాదు. కొన్ని శిక్షణా తరగతుల తర్వాత వాళ్లు ధైర్యంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు అన్ని విషయాలూ మాతో చర్చిస్తున్నారు" అని ఉపాధ్యాయురాలు సుజాత శర్మ చెప్పారు.

చిన్నతనంలోనే పిల్లలు ఏది చెప్పినా తొందరగా అర్థం చేసుకుంటారు కాబట్టి, పాఠశాల స్థాయిలోనే బాలికలకు నెలసరి గురించి అవగాహన కల్పించాలని గైనకాలజిస్టు సురభి అన్నారు.
"పీరియడ్స్ గురించి అమ్మాయిలతో మొదట చర్చించాల్సింది ఉపాధ్యాయులే. పీరియడ్స్ అంటే.. మన శరీరంలో వచ్చే అనేక సానుకూల మార్పులకు సంకేతమని బాలికలకు వివరించాలి. నెలసరి వస్తే ఎవరూ భయపడాల్సిన అవసరంలేదు. బాలికలు ఎప్పుడూ ప్యాంటీ, ప్యాడ్, పేపర్, పేపర్ సోప్ లాంటివి వెంట ఉంచుకుంటే ఇబ్బంది ఉండదు. పీరియడ్స్ రావడం మహిళల సమస్య కాదు. ఇది మనుషుల సమస్య" అని సురభి వివరించారు.
ఇవి కూడా చదవండి:
- పీరియడ్స్ సమయంలో సెక్స్ తప్పా? ఒప్పా?
- ‘పీరియడ్స్‌కు ముందు ఆమె మూడ్ హఠాత్తుగా మారిపోయేది...’
- పూజకు ముందు.. పీరియడ్లను వాయిదా వేసే పిల్ తీసుకుంటున్నారా?
- నమ్మకాలు-నిజాలు: బహిష్టు సమయంలో కడుపు నొప్పి వస్తే పిల్లలు పుట్టరా?
- గర్భనిరోధక పిల్ రోజూ వేసుకోవచ్చా.. ఇది అందరికీ ఎందుకు పని చేయదు
- ఆరోగ్యంపై హార్మోన్ల ప్రభావం గురించి మహిళలు తెలుసుకోవాల్సిన 5 విషయాలు
- ఒకచోట ఉండే మహిళలకు పీరియడ్స్ ఒకేసారి వస్తాయా?
- #UnseenLives: పీరియడ్స్ సమయంలోనూ మాతో ‘సెక్స్ వర్క్’ చేయించేవారు!
- ఎండోమెట్రియాసిస్: లక్షణాలు ఏంటి.. ఎంత ప్రమాదకరం?
- అమ్మాయిలు నలుగురిలో చెప్పుకోలేని ఆ విషయాలు!
- #UnseenLives: వెనక 40 మంది పురుషులున్నా, నేను ఆ మరకను దాచుకోలేదు
- అమ్మాయిలకు మీసాలు, గడ్డాలు ఎందుకొస్తాయి? సంతాన లేమికి పీసీవోడీకి సంబంధం ఏమిటి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)









