ఈమె భారత్-పాక్ ప్రేమికుల్ని కలిపారు, అత్యాచార బాధితుల్ని స్వదేశాలకు చేర్చారు

ఫొటో సోర్స్, KEYSTONE-FRANCE/GAMMA-RAPHO VIA GETTY IMAGES
- రచయిత, పార్థ్ పాండ్య
- హోదా, బీబీసీ ప్రతినిధి
1947 ఆగస్టులో ఓ పక్క భారత్ స్వాతంత్ర్యం పొందిన ఆనందంలో ఉంటే, మరోపక్క పాకిస్తాన్-భారత్ మధ్య శవాలతో నిండిన రైళ్లు ప్రయాణించాయి. విభజన రెండు దేశాల్లోనూ భారీ మతపరమైన హింసకు పునాది వేసింది.
ఊర్వశీ బుటాలియా రాసిన ‘ది అదర్ సైడ్ ఆఫ్ సైలెన్స్’ పుస్తకంలో దాదాపు 75వేల మంది మహిళలను ఆ సమయంలో అపహరించినట్లు పేర్కొన్నారు.
అలాంటివాళ్లలో చాలామందిని కమలాబెన్ పటేల్ అనే ఓ గుజరాతీ మహిళ రక్షించారు. హిందువుల, సిక్కుల ఇళ్లలో చిక్కుకున్న ముస్లిం మహిళలను, ముస్లింల ఇళ్లలో చిక్కుకున్న హిందూ మహిళలను ఆమె తప్పించారు.
1947-1953 మధ్య పాకిస్తాన్ నుంచి దాదాపు 9వేల మంది మహిళలను మృదులా సారాబాయ్ అనే మరో మహిళతో కలిసి ఆమె సురక్షితంగా బయటపడేశారు. అంతమందిని వాళ్లెలా కాపాడగలిగారో వివరిస్తూ 1979లో ‘మూల్ సోటా ఉక్డేలా’ పేరుతో రాసిన పుస్తకంలో కమలాబెన్ వివరించారు.
గాంధీజీ స్థాపించిన సబర్మతీ ఆశ్రమంలో కమలా బెన్ 1925-1929 మధ్య గడిపారు. విభజన సమయంలో మహిళలను కాపాడే బాధ్యతను తీసుకునే నాటికి ఆమె వయసు 35.

దేశ విభజన సమయంలో వస్తువుల్ని మార్చుకున్నట్లుగా మనుషుల్ని మార్చుకునేవారు. శారీరకంగా, మానసికంగా మహిళలు ఎన్నో సమస్యలు అనుభవించారు. వేలాది మహిళలపై అత్యాచారం జరిగింది. మరెంతో మంది అపహరణకు గురయ్యారు.
అత్యాచారాల నుంచి తప్పించుకునేందుకు పంజాబ్‌లోని మియాన్వలీ గ్రామ మహిళలంతా బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఆ గ్రామానికి వెళ్లిన కమలాబెన్‌కు బావిలో చాలామంది మహిళల మృతదేహాలు కనిపించాయి. ఆ క్షణమే అలాంటి ఆడవాళ్లను ఎలాగైనా కాపాడాలని ఆమె నిర్ణయించుకున్నారు.
విభజన రోజులలో జరిగిన అల్లర్ల సమయంలో చాలామంది మహిళలను కానుకలుగా ఇచ్చిపుచ్చుకునేవారు. ఇంకొందరు ఆడవాళ్లను అమ్మకానికి పెట్టేవారు. చాలామంది చేతులు మారాక ‘యజమానులు’ వీళ్లను వీధుల్లో వదిలేసేవారు. అలాంటి వారందరినీ రక్షించి పునరావాస కేంద్రాలకు తరలించే బాధ్యతను కమలాబెన్ తీసుకున్నారు. కానీ ఆ శిబిరానికి తరలించే క్రమంలో కూడా చాలామంది అత్యాచారానికి గురైనట్లు ఆమె చెబుతారు.
ముస్లిం మహిళలను అపహరించిన హిందువులు వాళ్ల చేతులుపైన ‘ఓమ్’ అని పచ్చబొట్టు వేయించేవారు. ముస్లింలు కూడా తాము అపహరించిన హిందు స్త్రీల చేతులమీద తమ మతానికి చెందిన ముద్ర వేసేవారు.

ఇలాంటి మహిళలను కాపాడే క్రమంలో కమలాబెన్ అనేక సవాళ్లను ఎదుర్కొన్నారు. మహిళలను కాపాడిన తరువాత పశ్చిమ పంజాబ్‌లోని కొందరు సిక్కులు తమ ఆఫీసుకు వచ్చి, ‘వాళ్లు ముస్లింలే. వాళ్లను హిందువులుగా మార్చి మేం పెళ్లి చేసుకున్నాం. ఒకవేళ వాళ్లను తిరిగి మాకు ఇవ్వకపోతే కనీసం పాకిస్తాన్ నుంచి వచ్చిన హిందూ మహిళలనైనా మాకు ఇవ్వండి’ అని అడిగేవారని కమలాబెన్ చెబుతారు.
అలాంటి సవాళ్లను ఎదుర్కొంటూనే భారత్‌తో పాటు పాకిస్తాన్ నుంచి ఎంతో మంది మహిళలను స్వచ్ఛంద కార్యకర్తల సాయంతో సురక్షిత శిబిరాల్లోకి చేర్చడంలో సఫలమయ్యారు. అలా తమ దగ్గరకు వచ్చిన మహిళలు, పిల్లలు చాలామంది సరైన తిండి లేక ఎముకల గూడులా కనిపించేవారని, కొందరైతే చికిత్స అందేలోపే శిబిరాల్లో మృతిచెందేవారని ఆమె చెబుతారు.
ఈ హింసా కాలంలో జరిగిన అత్యాచారాల కారణంగా చాలామంది పెళ్లి కాని యువతులు తల్లులయ్యారు. ఆ పిల్లలను ‘వార్ బేబీస్’ అని పిలిచేవారు. ఈ పెళ్లికాని తల్లులు తిరిగి తమ కుటుంబాల దగ్గరకు వెళ్లే సమయంలో మరో మానసిక యుద్ధం చేయాల్సొచ్చేది. అటు పిల్లల్ని వదిలిపెట్టకుండా కుటుంబ సభ్యులు ఆ యువతుల్ని ఇంట్లోకి అనుమతిచ్చేవారు కాదు. అలాగని ఆ యువతులు పిల్లల్ని వదిలిపెట్టడానికీ ఇష్టపడేవారు కాదు.
అప్పట్లో అధికారుల మధ్య ‘ఈ పిల్లలు భారతీయులా లేక పాకిస్తానీలా? అనే విషయంపై చాలా చర్చలు జరిగేవి. ‘శిబిరాల్లో ఈ యువతులు తమ పిల్లలతో కలిసే ఉండేవారు. కానీ తిరిగి వాళ్లు తమ కుటుంబ సభ్యుల దగ్గరకు వెళ్లాలంటే ఈ పిల్లల్ని వదిలేయాల్సిందే. ఇంటికి వెళ్లాక కూడా పిల్లలకు దూరమైన వేదనను బహిరంగంగా వ్యక్తపరిచే అవకాశం వీరికి ఉండేది కాదు. దాంతో చాలామంది తాము బిడ్డకు జన్మనిచ్చామనే విషయాన్నే మరచిపోయి నరకాన్ని అనుభవించేవారు’ అంటారు కమలా.

ఇలా హింస కారణంగా కుటుంబాలకు దూరమైన మహిళలతో పాటు విభజన కాలంలో భారత్-పాక్‌లకు చెందిన ప్రేమికులను కూడా కమలాబెన్ ఒక్కటి చేశారు.
రావల్పిండికి చెందిన ప్రేమ అనే యువతి పాకిస్తాన్ ఆర్మీకి చెందిన తుఫైల్ అనే కెప్టెన్‌ను ప్రేమించింది. కానీ వేరే మతం వారిని పెళ్లి చేసుకోవడానికి ఇద్దరి కుటుంబ సభ్యులూ ఒప్పుకోలేదు. దేశ విభజన తరువాత వారు మరింత దూరమయ్యారు.
ఇస్మత్ అనే మరో వ్యక్తి జీతూ అనే అమ్మాయితో పారిపోయి స్వర్ణ దేవాలయంలో పెళ్లి చేసుకున్నాడు. కానీ వాళ్ల కుటుంబాలు ఆ ఇద్దరినీ విడదీశాయి. ఇలాంటి ఎన్నో జంటలు సాయం కోసం కమలాబెన్‌నే ఆశ్రయించేవారు. ఆమె కూడా రెండు దేశాలకూ చెందిన అనేక జంటలను కలపగలిగారు. కానీ ఆ బంధాల్లో కొన్ని విషాదాంతమయ్యాయని ఆమె అంటారు.

‘ఇప్పటి వరకు ఒక తరం మాత్రమే విభజన తాలూకు విషాదానికి దూరంగా పెరుగుతోంది. కానీ ఇప్పటికీ నాటి గాయాలు చాలామందిని వేధిస్తూనే ఉన్నాయి. నాడు మనుషులపైన, మహిళలపైన జరిగిన అకృత్యాలను ఎవరూ అంత సులువుగా మరచిపోలేరు’ అన్న మాటలు కమలాబెన్ పుస్తకంలో కనిపిస్తాయి.
విభజన జరిగిన రెండు దశాబ్దాల వరకు తన అనుభవాలను పుస్తకం రూపంలోకి తీసుకొచ్చే ధైర్యం చేయలేకపోయానని అంటారు కమలాబెన్. కానీ ఆ ఘోరమైన కథలు ప్రపంచానికి తెలియాలనే ఉద్దేశంతోనే వాటికి అక్షర రూపమిచ్చినట్టు ఆమె చెబుతారు.
(కమలాబెన్ రాసిన ‘మూల్ సోటా ఉక్డేలా’ అని పుస్తకంలోని అంశాల ఆధారంగా రాసిన కథనం)
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








