భారత వైమానిక దళం అమ్ములపొదిలో చేరిన చినూక్ హెలికాప్టర్లు.. పెరిగిన బలం

- రచయిత, అర్వింద్ ఛాబ్రా
- హోదా, బీబీసీ ప్రతినిధి
భారత వైమానిక దళం తన హెలికాప్టర్ల బలగాన్ని మరింత బలోపేతం చేసుకుంది. చినూక్ హెలికాప్టర్లను ఈ రోజు వాయుసేనలో ప్రవేశపెట్టారు.
దేశానికి భద్రతాపరమైన సవాళ్లు చాలా ఉన్నాయని, సంక్లిష్టమైన భూభాగంలో వాయుమార్గంలో భారీ ఆయుధ సామగ్రి, ఇతరత్రా తరలించే సామర్థ్యాన్ని పెంచుకోవాల్సి ఉందని భారత వైమానిక దళ అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ బీఎస్ ధనోవా చండీగఢ్‌లో ఎయిర్ ఫోర్స్ 12 వింగ్‌లో చెప్పారు.
ఐఏఎఫ్‌లో చినూక్ హెలికాప్టర్ల చేరికతో సంక్లిష్టంగా ఉండే ఎత్తైన ప్రదేశాలకు వీటిని తరలించే సామర్థ్యం అసాధారణంగా పెరిగిందని ఆయన తెలిపారు.
సైనిక ఆపరేషన్లలో శతఘ్ని ఫిరంగి లాంటి భారీ ఆయుధాల తరలింపులోనే కాదు, సుదూర ప్రాంతాల్లో విపత్తు సహాయ చర్యల్లోనూ ఈ హెలికాప్టర్లు ఎంతగానో ఉపయోగపడతాయని ధనోవా వివరించారు.

2015లో ఆర్డర్ ఇచ్చిన భారత్
అమెరికాలోని బోయింగ్ సంస్థ నుంచి పదిహేను సీహెచ్-47ఎఎఫ్ చినూక్ హెలికాప్టర్ల కొనుగోలుకు భారత్ ఆర్డర్ ఇచ్చింది. ఈ మేరకు 2015 సెప్టెంబరులో ఒప్పందం కుదిరింది. వీటిలో నాలుగు హెలికాప్టర్లు సోమవారం భారత వైమానికదళంలో చేరాయి. మిగతా 11 హెలికాప్టర్లు వచ్చే ఏడాదిలోగా భారత్‌కు వచ్చే అవకాశముంది.
సరిహద్దుల్లో వ్యూహాత్మకంగా కీలకమైన రహదారుల నిర్మాణం, ఇతర ప్రాజెక్టుల్లోనూ చినూక్ హెలికాప్టర్లు ముఖ్య పాత్ర పోషిస్తాయని వైమానిక దళ అధికారులు చెబుతున్నారు.
సాధారణ సైనిక హెలికాప్టర్‌తో పోలిస్తే చినూక్ హెలికాప్టర్ ప్రత్యేకతలు ఏమిటంటే- ఇది పెద్దస్థాయిలో బరువును మోసుకెళ్లగలదు. దీనికి జంట రోటర్లు ఉంటాయి. అమెరికాలోని డెలవేర్‌లో చినూక్ హెలికాప్టర్లపై ఇటీవల నాలుగు వారాలపాటు శిక్షణ పొందిన భారత పైలట్ ఆశిష్ గహ్లావత్ ఈ విషయం తెలిపారు.

19 దేశాల్లో వాడుతున్న సైనిక బలగాలు
''సింగిల్ రోటర్ ఉండే హెలికాప్టర్లు వాడుతున్నాం. అయితే దీనికి ఇంజిన్లు కూడా రెండు ఉంటాయి. ఇదో అధునాతన సాంకేతిక పరిజ్ఞానం'' అని ఆయన చెప్పారు.
అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లో పనిచేసే సామర్థ్యం ఈ హెలికాప్టర్ సొంతమని, ప్రపంచంలోనే అత్యంత క్లిష్టమైన కొన్ని ప్రదేశాల్లో పనిచేసే భారత వైమానిక దళానికి ఇది కీలకమని అధికారులు పేర్కొంటున్నారు.
చినూక్ హెలికాప్టర్ల చేరికతో నియంత్రణ రేఖ వెంబడి ఎత్తైన ప్రదేశాల్లోకి త్వరితగతిన ఫిరంగులతోపాటు బలగాలను తరలించే సామర్థ్యం పెరుగుతుందని వారు చెబుతున్నారు.
గరిష్ఠంగా 11 టన్నుల పేలోడ్‌ను, 54 మంది బలగాలను తరలించగల సామర్థ్యం ఈ చాపర్‌కు ఉందని ఆశిష్ గహ్లావత్ దీనికి ఉన్న మూడు కొక్కేలను(హుక్స్) చూపిస్తూ చెప్పారు.
ఈ హెలికాప్టర్‌ను 19 దేశాల్లో సైనిక బలగాలు వాడుతున్నాయి. భారత్ ప్రస్తుతం ఆపరేషన్లలో సోవియట్ మూలాలున్న ఎంఐ-26 హెలికాప్టర్లను వాడుతోంది.
ఇవి కూడా చదవండి:
- పాక్‌పై వైమానిక దాడులు చేసిన పైలట్లు వీరేనా
- ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ డైరీ: కేఏ పాల్ నామినేషన్ నిరాకరణ
- నిజామాబాద్‌లో కవితపై 236 మంది ఎందుకు పోటీ చేస్తున్నారు..
- ప్రతి పేద కుటుంబానికి ఏడాదికి రూ. 72 వేల వరకు ఇస్తాం: రాహుల్ గాంధీ
- భారత్, దక్షిణాసియా అమ్మాయిలపై ఆస్ట్రేలియాలో లైంగిక వేధింపులు
- డోక్లాం: భారత్, చైనా మధ్యలో భూటాన్! ఇంతకీ భూటాన్ ప్రజలేమనుకుంటున్నారు?
- EXCLUSIVE: అంబేడ్కర్ వీడియో ఇంటర్వ్యూ
- భారత్-రష్యా: ఆయుధాలు, మసాలాలు కాకుండా ఇంకేం ఇచ్చిపుచ్చుకుంటున్నాయంటే..
- డోనల్డ్ ట్రంప్: రష్యాతో కుమ్మక్కు కాలేదన్న ముల్లర్ రిపోర్ట్
- కోడిని చంపకుండా కోడికూర: ఈ పరిశోధనలతో సాధ్యమేనా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








