భారతీయ భాషలు: దేశంలో నమోదైన మాతృ భాషలు 19,569 - హిందీ కింద వర్గీకరించిన మాతృభాషలు ఎన్ని?

హిందీ

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, పృథ్వీరాజ్
    • హోదా, బీబీసీ తెలుగు

ప్రతి మైలుకీ నీరు మారిపోతుంది.. ప్రతి నాలుగు మైళ్లకీ భాష మారిపోతుంది. సువిశాల భారతదేశంలో భాషల భిన్నత్వానికి అద్దం పట్టే ప్రాచీన నానుడి ఇది.

భారతదేశంలో పదేళ్లకి ఒకసారి నిర్వహించే జనాభా లెక్కల సేకరణలో భాగంగా ప్రజల మాతృభాషల వివరాలు కూడా సేకరిస్తారు. ఇలా సేకరించిన వివరాలను భాషాశాస్త్ర సిద్ధాంతాలను అన్వయించి.. ఆయా మాతృభాషలను కొన్ని ప్రధాన భాషలుగా వర్గీకరిస్తారు.

ఇలా సేకరించి, క్రోడీకరించిన గణాంకాల ప్రకారం.. 2011లో దేశ జనాభాలో అత్యధికంగా 43.63 శాతం మంది (దాదాపు 53 కోట్ల మంది) హిందీ ప్రధాన భాషగా మాట్లాడేవారు ఉన్నారు.

అయితే.. హిందీ భాషా వర్గం కింద చేర్చిన మాతృభాషల్లో హిందీ మాతృభాషగా చెప్పినవారు 32.22 కోట్ల మంది ఉంటే.. భోజ్‌పురి (5 కోట్ల మందికి పైగా), ఛత్తీస్‌గఢీ (1.6 కోట్ల మందికి పైగా), మగధి (1.2 కోట్ల మందికి పైగా), రాజస్థానీ (2.5 కోట్ల మందికి పైగా) తదితర 60 పైగా భాషలు ఉన్నాయి.

మరో విశేషమేమిటంటే.. 1971 నాటికి హిందీ భాషా వర్గం కిందే ఉన్న మైథిలి భాషను 1991లో వేరుచేసి ప్రత్యేక భాషగా వర్గీకరించారు. ఇప్పుడు మైథిలి (1.35 కోట్ల మంది) కూడా షెడ్యూల్డు భాషల జాబితాలో 13వ స్థానంలో ఉంది.

ఇక భాషా పరంగా హిందీ తర్వాత రెండో స్థానంలో బెంగాలీ (9.72 కోట్ల మంది), మూడో స్థానంలో మరాఠీ (8.30 కోట్ల మంది) ఉన్నారు. భాషా ప్రాతిపదికన తెలుగు ప్రజలు (8.11 కోట్ల మంది) నాలుగో స్థానంలో నిలిచారు.

తెలుగు భాషా వర్గం కింద 8.11 కోట్ల మంది ఉండగా.. వారిలో తెలుగు మాతృభాషగా ఉన్న వారు 8.09 కోట్ల మంది అయితే.. మిగతా 20 లక్షల మంది వదరి, ఇతర భాషలు మాతృభాషగా ఉన్న వారు ఉన్నారు.

భారతదేశానికి ఒక జాతీయ భాషగా హిందీ ఉండాలంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవల చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో భారతీయ భాషలు, వాటి విస్తృతి మీద మరోసారి చర్చ జరుగుతోంది.

ఈ నేపథ్యంలో ప్రభుత్వ గణాంకాల ప్రకారం దేశంలో భాషలు, వాటి విస్తృతి, ఆయా భాషల వర్గీకరణలు ఎలా ఉన్నాయనేది పరిశీలిద్దాం.

హిందీ

ఫొటో సోర్స్, Getty Images

మొత్తం నమోదైన మాతృభాషలు.. 19,569

దేశంలో భాషలు, అవి మాట్లాడే ప్రజల సంఖ్యకు సంబంధించి 2011 జనగణన ఆధారంగా భారత రిజిస్ట్రార్ జనరల్ తాజాగా రూపొందించిన నివేదికలో ఈ వివరాలు ఉన్నాయి.

ఈ నివేదికలో మాతృభాష అంటే.. ఒక వ్యక్తి బాల్యంలో అతడితో అతడి తల్లి మాట్లాడే భాషగా నిర్వచించారు. ఒకవేళ బాల్యంలో తల్లి లేనట్లయితే ఆ వ్యక్తి కుటుంబంలో ప్రధానంగా మాట్లాడే భాషను మాతృభాషగా పరిగణిస్తున్నట్లు పేర్కొన్నారు.

2011 జనగణన ప్రకారం.. దేశంలో 19,569 మాతృభాషలు నమోదయ్యాయి. భాషాశాస్త్ర సిద్ధాంతాల ఆధారంగా వీటిని పరిశీలించి.. మొత్తం 1,369 మాతృభాషలుగాను, మరో 1,474 'వర్గీకరించని' ఇతర మాతృభాషలుగానూ కుదించారు.

హిందీ

ఫొటో సోర్స్, Getty Images

పది వేల మంది పైగా జనం ఉన్న మాతృభాషలు 270

ఈ విధంగా వర్గీకరించిన మాతృ భాషలన్నిటినీ మళ్లీ వడపోసి.. 10,000 మంది, అంతకన్నా ఎక్కువ మంది మాట్లాడే 270 గుర్తించగల మాతృభాషలు జాబితాను రూపొందించారు.

ఆ 270 భాషలను.. రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూలులో చేర్చిన 22 అధికారిక భాషల కింద మరోసారి వర్గీకరించి.. 123 మాతృభాషలు ఆయా ప్రధాన భాషల కింద చేర్చారు.

మిగిలిన 147 మాతృభాషలను 'షెడ్యూలులో చేర్చని' ప్రధాన భాషలుగా పేర్కొంటూ 99 భాషల కింద వర్గీకరించి మరో జాబితాలో చేర్చారు.

ఇక 10,000 కన్నా తక్కువ మంది మాట్లాడే మాతృభాషలను.. వాటికి సంబంధించిన ప్రధాన భాషా వర్గాల్లో 'ఇతర భాషలు'గా పేర్కొన్నట్లు చెప్పారు.

జనగణన నివేదిక ప్రకారం.. భారతదేశ జనాభాలో 96.71 శాతం మంది 22 షెడ్యూల్డు భాషల్లో ఏదో ఒకటి తమ మాతృభాషగా చెప్పారు. మిగతా 3.29 శాతం మంది ఇతర భాషలను తమ మాతృభాషలుగా పేర్కొన్నారు.

నాలుగో స్థానంలో తెలుగు ప్రజలు

తెలుగు మాట్లాడే ప్రజలు 2011 జనాభా లెక్కల నాటికి 8.11 మంది ఉన్నారు. భాషా ప్రాతిపదికన నాలుగో స్థానంలో నిలిచారు.

నిజానికి 1961 జనాభా లెక్కల్లో హిందీ తర్వాత రెండో స్థానంలో తెలుగు నిలిచింది. కానీ.. ఆ తర్వాత పదేళ్లకు 1971 నాటికి స్వల్ప తేడాతో బెంగాలీ రెండో స్థానంలోకి రాగా.. తెలుగు మూడో స్థానానికి పడిపోయింది.

2001 వరకూ మూడో స్థానంలోనే ఉన్న తెలుగు ప్రజల సంఖ్య 2011 నాటికి నాలుగో స్థానానికి తగ్గిపోయింది. మరాఠీ ప్రజలు స్వల్ప తేడాతో మూడో స్థానానికి పెరిగారు.

2011 నాటికి తమిళులు (6.90 కోట్లు) ఐదో స్థానంలో, గుజరాతీలు (5.54 కోట్లు) ఆరో స్థానంలో, ఉర్దూ మాట్లాడేవారు (5 కోట్లు) ఏడో స్థానంలో ఉన్నారు.

కోటి మంది కన్నా తక్కువ మంది ఉన్న షెడ్యూల్డు భాషల్లో సంతాళీ, కశ్మీరీ, నేపాలీ, సింధీ, డోగ్రీ, కొంకణి, మణిపురి, బోడో, సంస్కృతం భాషలు ఉన్నాయి.

2011 జనగణన ఆధారంగా రూపొందించిన భాషలు, జనాభా నివేదిక ప్రకారం:

  • 1981లో అస్సాంలో అస్థిర పరిస్థితుల కారణంగా జనగణన నిర్వహించలేదు. దీనివల్ల ఆ ఏడాది షెడ్యూల్డు భాషల జనాభా లెక్కల్లో అస్సాం జనాభా లెక్కలు లేవు.
  • తమిళనాడుకు సంబంధించిన 1981 జనగణన రికార్డులు వరదల్లో కొట్టుకుపోవటంతో ఆ వివరాలు అందుబాటులో లేవు.
  • 1991లో జమ్మూకశ్మీర్‌లో అస్థిర పరిస్థితుల కారనంగా జనగణన నిర్వహించలేదు. దీంతో అప్పటి కశ్మీరీ, డోగ్రీ భాషలు మాట్లాడే వారి వివరాలు లేవు.

సంస్కృతం మాట్లాడేవాళ్లలో పదేళ్లకోసారి భారీ హెచ్చుతగ్గులు

దేశంలో కేవలం 24,821 మంది మాట్లాడుతున్నామని చెప్పిన సంస్కృతం.. షెడ్యూల్డు భాషల్లో చిట్టచివరిన 22వ స్థానంలో ఉంది. అయితే.. గత ఐదు జనగణనల్లో సంస్కృతం తమ మాతృభాషగా చెప్పిన వారి సంఖ్యలో భారీ మార్పులు కనిపిస్తున్నాయి.

ఈ భాష కింద 1971లో 2,212 మంది ఉంటే.. 1981లో 6,106కు పెరిగింది.

ఆ తర్వాత పదేళ్లలో 1991 నాటికి ఆ సంఖ్య ఒక్కసారిగా 49,736కు పెరిగిపోయింది. మళ్లీ 2001 నాటికి 14,135కు పడిపోయింది. 2011 జనాభా లెక్కల్లో అది 24,821 మందికి పెరిగింది.

ఇక దేశంలో జాతీయ స్థాయిలో రెండు అధికార భాషల్లో ఒకటైన ఇంగ్లిష్ షెడ్యూల్డులో చేర్చని జాబితాలో ఉంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)