ప్రపంచంలో అత్యంత వేగవంతమైన భాష తెలుగే: ఆస్ట్రేలియా ప్రొఫెసర్ పరిశోధన

ఫొటో సోర్స్, Getty Images
ప్రపంచవ్యాప్తంగా సుమారు 7 వేల భాషలు మాట్లాడుతున్నారు. మాండరిన్ భాషను వందకోట్ల మందికి పైగా మాట్లాడుతుంటే, కేవలం ఒకే ఒక్కరికి మాత్రమే తెలిసిన భాషలు 46 భాషలున్నాయి. అంటే ఆయా భాషల్లో మాట్లాడేవారు ప్రస్తుతం ఒక్కరు మాత్రమే మిగిలి ఉన్నారు.
ఇన్ని వేల భాషల్లో అత్యంత సమర్థమైన భాష ఏదన్నది కనుగొనేందుకు కొందరు పరిశోధకులు అధ్యయనం చేశారు. ఇందులో భాగంగా ఏ భాషను వేగంగా మాట్లాడుతారో తెలుసుకునేందుకు ప్రయోగం చేశారు.
ఆస్ట్రియాలోని క్లాగెన్‌ఫర్ట్ యూనివర్సిటీ లింగ్విస్టిక్ ప్రొఫెసర్ గెర్ట్రాడ్ ఫెంక్-ఒక్జలాన్ మాట్లాడే విషయానికి వస్తే ప్రపంచంలో ఏ భాష అత్యంత వేగంగా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేశారు.
ఈ పరిశోధనలో దక్షిణ భారతదేశంలో 8 కోట్ల మందికి పైగా మాట్లాడే తెలుగు భాష అత్యంత వేగంగా మాట్లాడే భాషగా తేలింది.

ఫొటో సోర్స్, facebook
ఈ పరిశోధన కోసం ఫంక్ ఓక్జ్లాన్ 51 భాషలు మాట్లాడే ఆయా ప్రాంతాలవారిని ఒకే ప్రాంతానికి తీసుకొచ్చారు. ఆ భాషల్లో 19 ఇండో-యూరోపియన్ భాషలు, 32 నాన్ ఇండో యూరోపియన్ భాషలు ఉన్నాయి.
అందరికీ 'సూర్యుడు మెరుస్తున్నాడు'. 'నేను టీచర్‌కు థాంక్స్ చెప్పాను'. 'స్ప్రింగ్ కుడివైపున ఉంది'. 'తాతగారు నిద్రపోతున్నారు' లాంటి కొన్ని సులభమైన పదాలను వారి వారి భాషల్లో అనువదించమన్నారు.
ఆ తర్వాత అందరూ తాము అనువదించిన పదాలను సాధారణ వేగంతో చదవాలని చెప్పారు.
అన్ని భాషల్లోకి తెలుగు భాషలో ఆ పదాలను త్వరగా చెప్పగలిగారు. దాంతో ప్రపంచంలో అత్యంత వేగంగా మాట్లాడే భాషగా తెలుగు భాషను గుర్తించారు, ఈ పోటీలో జపనీస్ తెలుగు కంటే కొద్దిగా వెనకబడింది.
ఇక ఈ జాబితాలో థాయ్‌లాండ్, వియత్నామీస్ చిట్టచివరన నిలిచాయి.

ఫొటో సోర్స్, Getty Images
సమాచార సాంద్రత
అన్ని భాషల ప్రధాన ఉద్దేశం సమాచారం ఇచ్చిపుచ్చుకోవడమే. ఒక నిమిషానికి ఎక్కువ పదాలు చదివినంత మాత్రాన ఆ భాష ద్వారా ఎక్కువ సమాచారం చేరవేస్తున్నట్టు మనం భావించలేం.
ఒక సమాచారాన్ని వేర్వేరు భాషలు ఎంత బాగా అందిస్తున్నాయి అని గుర్తించే ప్రయత్నం చేశారు.
లాజికల్‌గా సంబంధం ఉన్న ఐదు వాక్యాలను పరిశోధకులు ఇంగ్లిష్, ఫ్రెంచ్, స్పానిష్, ఇటాలియన్, జపనీస్, మాండరిన్, చైనీస్, జర్మన్‌లో అనువదించారు.
తర్వాత ఆయా భాషలవారిని 59 మందిని ఆహ్వానించి రాసిన వాక్యాలను చదవమని చెప్పారు.
ఒక్కో అక్షరం చదువుతూ వారు అందించే సగటు సమాచారాన్ని, మామూలుగా మాట్లాడేటపుడు వారు సెకనుకు మాట్లాడే సగటు అక్షరాల సంఖ్యను లెక్కపెట్టారు.
ఈ లెక్కల ప్రకారం వేగంగా మాట్లాడినంత మాత్రాన ఆ సమాచారాన్ని అత్యున్నత స్థాయిలో అనువదించలేకపోయారనే నిర్ణయానికి వచ్చారు,.
జపనీస్ మాట్లాడేవారు సెకనుకు 8 అక్షరాలు చెబితే, చైనీస్ కేవలం ఐదు అక్షరాలే చెప్పగలిగారు. కానీ, మాండరిన్‌తో పోలిస్తే జపనీస్‌లో ఒక అక్షరం సగం సమాచారం మాత్రమే ఇవ్వగలిగింది.
ఇక సమాచారం వేగం విషయానికి వస్తే ఇంగ్లిష్ అన్నిటికంటే అగ్రస్థానంలో నిలిచింది. దాని తర్వాత స్థానంలో ఫ్రెంచ్, జర్మన్ నిలిచాయి.

ఫొటో సోర్స్, Getty Images
సమాచార బదిలీ
లియాన్‌లో పరిశోధకులు తమ అధ్యయనాన్ని మరింత విస్తరించేందుకు ఆ జాబితాలో మరో 11 భాషలను చేర్చారు. ఈ 18 భాషలు పది రకాల భాషా వర్గాలకు చెందినవి.
భాష సగటు మాట్లాడే వేగం విషయానికి వస్తే థాయ్‌లో సెకనుకు 4.7 అక్షరాలు, జపనీస్ 8.03 అక్షరాలు చదవచ్చు.
సమాచారం చేరవేసే విషయానికి వస్తే, ఒక్కో అక్షరం చేరవేసే సగటు సమాచారం, అంటే సమాచార సాంద్రత జపనీస్‌కు తక్కువ ఉన్నట్టు తలింది.
అత్యధిక సమాచార సాంద్రత ఉన్న గ్రూప్ భాషల్లో నిలిచినప్పటికీ, థాయ్ చాలా నెమ్మదిగా మాట్లాడే భాషగా నిలిచిందని న్యూజీలాండ్ కాంటెర్‌బరీ యూనివర్సిటీలో పరిశోధకులు యూన్ మి ఓ చెప్పారు.
మాట్లాడే వేగం లేదా సమాచారం చేరవేయడాన్ని పోల్చి చూస్తే మన భాషలన్నీ చాలా వరకూ ఒకే సమాచార వేగం కలిగున్నాయని ఆమె తెలిపారు.
వివిధ భాషలను మనం ఎంత వేగంగా లేదా మెల్లగా మాట్లాడుతాం అనే విషయంతోపాటు, వేర్వేరు భాషల్లో ఒక అక్షరం ద్వారా ఎంత సమాచారం చేరవేస్తున్నాం అనేది కూడా మేం పరిశీలించాం అని మి ఓ చెప్పారు.
ఈ పరిశోధన ప్రకారం మానవ భాషల్లో సమాచారం అందించే వేగం (సెకనుకు చేరవేసే సగటు సమాచారం) సెకనుకు సుమారు 39 బిట్స్ ఉంటుంది.

ఫొటో సోర్స్, Getty Images
అంతుపట్టని సమాధానాలు
అత్యంత సమర్థమైన భాష ఏదో గుర్తించాలని పరిశోధకులు ఇప్పటికీ ప్రయత్నిస్తున్నారు. కొందరు గణిత మోడల్స్ ఉపయోగిస్తున్నారు.
ఎంఐటి లాంగ్వేజ్ ల్యాబ్‌కు చెందిన ప్రొఫెసర్ టెడ్ గిబ్సన్ లాంటి పండితులు ప్రస్తుతం జరుగుతున్న పరిశోధనలో కచ్చితమైన సమాధానాలు తెలియాల్సి ఉందని చెప్పారు.
"ఈ అద్యయనం చాలా కష్టం. ఎందుకంటే.. మేం భాషా రూపాలనే కాదు, వాటి అర్థాన్ని కూడా ఉపయోగిస్తున్నాం. అలా పరిశోధన చేయడం చాలా కష్టం. కొంతమంది కొన్ని ప్రయోగాలు చేశారు. కానీ మేం ఆ ప్రశ్నకు ఇంకా సమాధానం తెలుసుకోలేకపోతున్నాం" అని టెడ్ బీబీసీకి చెప్పారు
"సమీప భవిష్యత్తులో ఏది సమర్థమైన భాష అనేది మనం తెలుసుకోవచ్చనే భావిస్తున్నాం కానీ అత్యంత శక్తివంతమైన భాష ఏది అనే ఇంకో ప్రశ్న ఉంది. కానీ, దానికి సమాధానం చెప్పడం చాలా సులభం" అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ప్రపంచంలో శక్తివంతమైన భాష
అబుదాభి పరిశోధకులు కై చాన్.. భాష శక్తి ఎలా ఉంటుంది అనేదానిపై పరిశోధనలు చేశారు. ఆయన తన పరిశోధనలో ఐదు పారామీటర్స్ ఉపయోగించారు.
అవి:
1. భౌగోళికశాస్త్రం- ప్రపంచమంతా ప్రయాణించే సామర్థ్యం
2.ఆర్థికశాస్త్రం - ఆర్థిక వ్యవస్థలో భాగం అయ్యే సామర్థ్యం.
3.కమ్యూనికేషన్- చర్చలను కొనసాగించే సామర్థ్యం.
4.నాలెడ్జ్ అండ్ మీడియా - మీడియాను ఆకట్టుకునే సామర్థ్యం.
5.డిప్లొమసీ- అంతర్జాతీయ సంబంధాల్లో నిర్వహించే సామర్థ్యం.
పైన ఇచ్చిన ఐదు పారామీటర్స్ బట్టి అత్యంత శక్తివంతమైన భాష ఇంగ్లిష్ అని పరిశోధకులు ఒక నిర్ణయానికి వచ్చారు. దాని తర్వాత మాండరిన్, ఫ్రెంచ్, స్పానిష్, అరబిక్ నిలిచాయి.
చైనా భారీ ఆర్థిక విజయాన్ని పరిగణనలోకి తీసుకున్నప్పటికీ, 2050 వరకూ ఇంగ్లిష్ అత్యంత శక్తివంతమైన భాషగా నిలిచి ఉంటుందని ఆయన చెప్పారు. కానీ, అప్పటికి స్పానిష్ మూడో స్థానానికి చేరుకుంటుందని. ఫ్రెంచ్, అరబిక్ తర్వాత రెండు స్థానాలు ఆక్రమిస్తాయని అంటున్నారు.
ఇవి కూడా చదవండి:
- హిందూ అబ్బాయి, ముస్లిం అమ్మాయి.. తమ ప్రేమను నిలబెట్టుకున్నారు
- #MeToo: 'పని మనుషులపై లైంగిక వేధింపులు.. లక్షల్లో బాధితులు'
- 'కార్డు'లను కరెన్సీనోట్లుగా మార్చేందుకు సైబర్ నేరగాళ్లు ఏం చేస్తున్నారంటే..
- మెనోపాజ్: ఇంతటితో స్త్రీ జీవితం అయిపోదు.. దాంపత్యానికి పనికిరాననీ అనుకోవద్దు
- పర్సును వెనక జేబులో పెట్టుకుంటే వెన్నుకు ఏమవుతుంది?
- చంద్రుని మీద మొలకెత్తిన చైనా పత్తి విత్తనం
- అమ్మాయిల కన్యత్వానికి, సీసా సీల్‌కు ఏమిటి సంబంధం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








