అమెరికా, మెక్సికోల మధ్య గోడ కట్టేందుకు దేనికైనా సిద్ధమే: డోనల్డ్ ట్రంప్

ఫొటో సోర్స్, EPA
మెక్సికో సరిహద్దుల్లో అమెరికాలో గోడ నిర్మిస్తామని డోనల్డ్ ట్రంప్ పునరుద్ఘాటించారు. ఇందుకోసం అత్యవసర అధికారాలను కూడా వినియోగించుకోవడాన్ని ఆయన సమర్థించుకున్నారు. ఈ 'గోడ ఎంతో ప్రయోజనకరం' అని వ్యాఖ్యానించారు.
మెక్సికో సరిహద్దుల్లో గోడ ఏర్పాటు ప్రధానాంశంగా గతంలో ట్రంప్ ఎన్నికల ప్రచారం సాగింది. అయితే, అధ్యక్షుడి నిర్ణయాన్ని అధికార దుర్వినియోగంగా డెమోక్రాట్లు అభివర్ణించారు.
గోడ నిర్మాణానికి కావాల్సిన నిధుల ప్రణాళికతో పాటు ఇటీవల జరిగిన ప్రభుత్వ కార్యాలయాల షట్ డౌన్ ఘటన పునరావృతం కాకుండా ఉండేలా ప్రతిపాదించిన బిల్లుపై ఆయన సంతకం చేశారు.
గోడ నిర్మాణానికి నిధులు మంజూరు చేసేందుకు కాంగ్రెస్ నిరాకరించడంతో ట్రంప్ ఈ జాతీయ అత్యవసర స్థితి ప్రణాళికను ప్రకటించారు.
అయితే, సీనియర్ డెమోక్రటిక్ నేతలు ఈ ప్రణాళికపై కోర్టుకు వెళ్తామంటున్నారు.
ఈ నిర్ణయం గోడ నిర్మాణానికి కావాల్సిన వేల కోట్ల రూపాయిల నిధులను ఖర్చు చేసేందుకు ట్రంప్‌కు తోడ్పడుతుంది.

ఫొటో సోర్స్, Getty Images
ట్రంప్ ఏమన్నారు?
జాతీయ అత్యవసర స్థితి ప్రకటించడం వల్ల గోడ నిర్మాణానికి కావాల్సినదాంట్లో 8 బిలియన్ డాలర్ల నిధులు ఖర్చు పెట్టేందుకు తనకు అనుమతి లభిస్తుందని ట్రంప్ వైట్‌హౌస్ వేదికగా ప్రకటించారు.
మాదక ద్రవ్యాల వ్యాపారాన్ని నిరోధించేందుకు ఏర్పాటు చేయనున్న మిలటరీ ప్రాజెక్టు నిధులను మళ్లించి దీనికి వినియోగించే అవకాశం ఉంది.
మెక్సికో, అమెరికా సరిహద్దుల్లో 3,200 కిలోమీటర్ల మేర గోడ నిర్మించేందుకు మొత్తం 23 బిలియన్ డాలర్లు ఖర్చు అవుతుందని అంచనా.
ట్రంప్ నిర్ణయానికి సెనటర్ మెక్ కన్నెల్ మద్దతిస్తుండగా, స్పీకర్ పెలోసీ దీన్ని ప్రమాదకర చర్యగా అభివర్ణిస్తున్నారు.
సుప్రీంకోర్టులో పరిష్కారం దొరుకుతుంది: ట్రంప్
'దేశ దక్షిణ సరిహద్దుల్లో భద్రత సంక్షోభంలో ఉంది. మాదకద్రవ్యాల సరఫరా, ముఠాల దాడి జరుగుతోంది. ఇవన్నీ అనుమతించేదే లేదు' అని ట్రంప్ స్పష్టం చేశారు.
'గోడ నిర్మాణ వల్ల దేశానికి ప్రయోజనం ఉంటుందని అందరికీ తెలుసు' అని పేర్కొన్నారు.
తన నిర్ణయాన్ని కోర్టులో సవాలు చేస్తారని, సుప్రీం కోర్టులో దీనికి పరిష్కారం లభిస్తుందని అంచనా వేస్తున్నట్లు ట్రంప్ చేప్పారు.
డెమోక్రాట్ల స్పందన ఏమిటి?
ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ, డెమెక్రటిక నేత, సెనెటర్ చక్ చుమెర్.. ట్రంప్ ప్రకటనపై స్పందిస్తూ 'ట్రంప్ నిర్ణయాన్ని కాంగ్రెస్‌లోనూ అలాగే, కోర్టులోనూ సవాల్ చేస్తాం' అని ఒక ప్రకటనలో తెలిపారు.
'శాసన విధాన ప్రక్రియ ద్వారా అమలు కాకపోవడంతో నిరాశ చెందిన అధ్యక్షుడు ప్రత్యేక అధికారాలు చేజిక్కించుకునేందుకు తీసుకున్న నిర్ణయం ఇది' అని పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
జాతీయ అత్యవసర స్థితి అంటే?
దేశంలో సంక్షోభ పరిస్థితులు ఏర్పడినప్పుడు జాతీయ అత్యవసర చట్టాన్ని విధిస్తారు. దేశ దక్షిణ తీరంలో వలస సంక్షోభం ఏర్పడిందనే కారణంతో ట్రంప్ ఈ చట్టాన్ని వినియోగిస్తున్నారు. అయితే, వలసపై విశ్లేషించే నిపుణులు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
ఏటా అక్రమ వలసదారులు భారీ స్థాయిలో అమెరికాకు వస్తున్నారు. వీసా కాలపరిమితి ముగిసినప్పటికీ వెళ్లడం లేదు.
జాతీయ అత్యవసర స్థితి విధించడం వల్ల అమెరికా అధ్యక్షుడికి ప్రత్యేక అధికారాలు వస్తాయి. రాజకీయ ప్రక్రియ లేకుండానే ఆర్మీ లేదా విపత్తు ఉపశమనకు కేటాయించిన నిధులను మళ్లించే అధికారం లభిస్తుంది.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








