వాలంటైన్స్ డే: హిందూ అబ్బాయి, ముస్లిం అమ్మాయి.. తమ ప్రేమను నిలబెట్టుకున్నారు

- రచయిత, దివ్య ఆర్య
- హోదా, బీబీసీ ప్రతినిధి
19 ఏళ్ల ముస్లిం యువతి ఆయేషా, హిందూ మతానికి చెందిన తన ప్రేమికుడు ఆదిత్య కోసం బెంగళూరు నుంచి దిల్లీ వెళ్లారు. వేరువేరు మతాలకు చెందిన వారి ప్రేమ ఎలా నిలబడింది?
ఆయేషా, ఆదిత్యలకు ఫేస్‌బుక్‌లో పరిచయం ఏర్పడింది. అప్పటికి వాళ్లు మేజర్లు కూడా కాదు. అప్పుడు ఫేస్‌బుక్‌లో పెట్టిన ప్రొఫైల్ ఫొటో, పేరు ఆయేషావి కావు. కానీ, ఆదిత్యతో మాట్లాడిన ఆ మాటలు మాత్రం ఆమెవే.
రెండేళ్లపాటు మాట్లాడుకున్నారు. కానీ, ముఖాలు చూసుకోలేదు. ఆయేషాది బెంగళూరు, ఆదిత్యది దిల్లీ. ఇద్దరు ఎదురుదెరుగా చూసుకోకుండానే దగ్గరి స్నేహితులయ్యారు.
ఆయేషాకు ఇప్పటికి ప్రేమ మీద పెద్దగా నమ్మకం ఉండేది కాదు. అందుకే, మాటల ద్వారా ఆదిత్యలోని ప్రేమ నిజమైనదేనా? అని పరీక్షిస్తుండేది.
ఒకసారి పొరపాటున ఆయేషా తన కళ్ల ఫొటోను పంపించింది. ఆ తర్వాత ఆదిత్య బెంగళూరులోని కాలేజీలో వాలిపోయారు. కొన్నాళ్లకు ఆయేషాను కలిశారు. అప్పటి దాకా ఫేస్‌బుక్‌లో అతని పేరు ఇరామ్ ఖాన్ అని ఉండేది.
"అప్పటి వరకు మేము ఎన్నడూ కలుసుకోలేదు. తను ముస్లిం అమ్మాయి అని, నేను హిందూ అని నాకు ముందు నుంచీ తెలుసు. అయితే మా ప్రేమకు మతం ఎన్నడూ సమస్యగా మారలేదు. కానీ, మా కుటుంబాలు అంగీకరించలేదు" అని ఆదిత్య చెప్పారు.

ఫొటో సోర్స్, Aditya
మతం మార్చుకోకుండా పెళ్లి చేసుకోవడం కుదరదని ఇద్దరి తల్లిదండ్రులూ తేల్చిచెప్పారు. కానీ, వీళ్లకు తమ గుర్తింపులను వదులుకోవడం ఇష్టం లేదు.
ఇంటి నుంచి పారిపోవాలని ఆయేషా నిర్ణయించుకున్నారు. కుటుంబ సభ్యులు ఆపేందుకు ప్రయత్నించినా, తప్పించుకుని ఆదిత్యతో కలిసి ఆమె దిల్లీకి వచ్చేశారు. దిల్లీలో సహజీవనం చేశారు.
"అయిదు నెలల పాటు గదిలోపలే ఉండిపోయాం. బయటకు ఎక్కడికి వెళ్లాలనా మా మతాలు వేరు కాబట్టి, ఎవరైనా వచ్చి మమ్మల్ని చంపేస్తారేమోనని భయంగా ఉండేది." అని ఆయేషా చెప్పారు.
అదే సమయంలో ఒక ముస్లిం అమ్మాయిని ప్రేమించిన 23 ఏళ్ల హిందూ యువకుడు అంకిత్ సక్సేనా దిల్లీలో హత్యకు గురయ్యారు.
ఆ కేసులో యువతి కుటుంబ సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. ఆ కేసు ఇంకా నడుస్తోంది. అలాంటి పరిస్థితి తమకూ వస్తుందేమోనని ఆయేషా భయపడుతూ ఉండేవారు.
అప్పుడు, వారి దాంపత్యం సజావుగా సాగాలంటే ఉద్యోగం సంపాదించడం అత్యవసరం. చట్టబద్ధంగా వివాహం చేసుకోవడం మరో ముఖ్యమైన విషయం.
అప్పుడు ఇంటర్నెట్ వారి జీవితాన్ని కొత్త మలుపు తిప్పింది. ఇంటర్నెట్‌లో రాణు కుల్‌శ్రేష్ఠ, ఆసిఫ్ ఇక్బాల్ దంపతుల గురించి తెలుసుకుని వారి వద్దకు వెళ్లారు. వాళ్లు కూడా మతాంతర వివాహం చేసుకున్నవారే.
వాళ్లు 2000 ప్రత్యేక వివాహ చట్టం కింద పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు 'ధానక్' అనే ఓ స్వచ్ఛంద సంస్థను నడుపుతున్నారు. ఆ సంస్థ ద్వారా ఆయేషా, ఆదిత్యా లాంటి దంపతులకు సురక్షిత ఆశ్రయం కల్పించడంతో పాటు, 'ప్రత్యేక వివాహ చట్టం' కింద పెళ్లిళ్లు చేసుకునేందుకు సాయపడుతున్నారు.

ప్రత్యేక వివాహ చట్టం
1954 ప్రత్యేక వివాహ చట్టం కింద, వేరు వేరు మతాలకు చెందిన వారు తమ మతాలను మార్చుకోకుండానే చట్టబద్ధంగా వివాహం చేసుకోవచ్చు.
అయితే, ఇద్దరూ తప్పనిసరిగా మేజర్లు అయ్యుండాలి. వారికి మరెవరితోనూ వివాహ బంధం ఉండకూడదు. అలాగే, ఇద్దరూ మానసికంగా పెళ్లికి సిద్ధపడి ఉండాలి.
ఈ వివాహం కోసం జిల్లా స్థాయిలో ఉండే మ్యారేజ్ అధికారికి నోటీసు ఇవ్వాలి. పెళ్లికి ముందు కనీసం 30 రోజులుగా దంపతులిద్దరూ అదే పట్టణంలో నివాసం ఉండాలి.
ఆ నోటీసును అధికారులు బహిరంగంగా ప్రదర్శిస్తారు. ఆ నెల రోజుల్లో అబ్బాయి, అమ్మాయి తరఫు కుటుంబ సభ్యులు తమ అభ్యంతరాలను, ఫిర్యాదులను వెల్లడించవచ్చు.
ఎలాంటి అభ్యంతరాలు రాని పక్షంలోనే వారి వివాహం సాక్ష్యుల సమక్షంలో అధికారులు రిజిస్టర్ చేస్తారు.
ఆయేషా, ఆదిత్య అధికారులను పలుమార్లు కలిశారు. 'ధానక్' సంస్థకు చెందిన పలువురు దంపతులు కూడా కలిశారు. వివాహం జరిగింది. కొత్త జీవితం ప్రారంభించారు.
నెమ్మదిగా వారవిలో భయం దూరమైంది. ఆయేషా ఉద్యోగానికి వెళ్లడం ప్రారంభించారు.
"మొదట్లో మతాంతర వివాహం చేసుకుని కలిసి బతుకుతున్నా.. కొన్నేళ్లకైనా ఎవరైనా వచ్చి మమ్మల్ని హత్య చేస్తారేమో అని భయమేస్తుండేది. కానీ, రాణు, ఆసిఫ్‌లను చూసిన తర్వాత వాళ్లలా మేము కూడా సంతోషంగా బతకడం అసాధ్యమేమీ కాదు అనిపించింది" అని ఆయేషా చెప్పారు.

ఫొటో సోర్స్, Aditya
ఆత్మ విశ్వాసమే అసలు బలం
పెళ్లి చేసుకోవాలనుకునే అమ్మాయి, అబ్బాయిల్లో ఆత్మవిశ్వాసం ఉండటం చాలా ముఖ్యమని రాణు అంటున్నారు.
"తమ పిల్లలను అర్థం చేసుకునేందుకు తల్లిదండ్రులు ప్రయత్నించాలి. తమ పిల్లలను నమ్మాలి. అప్పుడు, బయటి ఎవరేమనుకున్నా, ఎలాంటి పరిస్థితులు ఉన్నా పెద్ద సమస్య కాదు" అని అంటారు రాణు.
కొన్నాళ్లకు ఆదిత్య తన తండ్రి వ్యాపారంలో భాగస్వామి అయ్యారు. మతం మార్చుకోకున్నా ముస్లిం అయిన ఆయేషాను కోడలిగా తన తండ్రి అంగీకరిస్తారన్న విశ్వాసం, నమ్మకం ఆదిత్యకు ఉండేది.
వాస్తవానికి భారత్‌లో తల్లిదండ్రులు కొడుకుల పట్ల మృదువుగా వ్యవహరిస్తుంటారు. సమాజంలో 'గౌరవం అనే భారం' అమ్మాయిల భుజాల మీదే ఎక్కువగా ఉంటుంది.
"అబ్బాయిలను తమ వంశానికి వారసులుగా చూస్తారు. అందుకే, వారికి కుటుంబంలో స్వేచ్ఛ కాస్త ఎక్కువగా ఉంటుంది. అదే అమ్మాయిలకు మీద అనేక షరతులు పెడుతుంటారు" అని రాణు అంటున్నారు.
తమ జీవితంలో ఇది అత్యంత క్లిష్టమైన దశ, 'ప్రత్యేక వివాహ చట్టం' కింద పెళ్లి చేసుకుని, సొంతకాళ్ల మీద నిలబడాలంటే అనేక బంధుత్వాల మధ్య, కలల మధ్య సమతూకం పాటించాల్సి ఉంటుందని ఆదిత్య అంటారు.
ఇప్పుడు ఇద్దరికీ 21 ఏళ్లు వచ్చాయి. ఇద్దరికీ ఇద్దరి మీద పరస్పరం నమ్మకం ఉంది.
"ఆదిత్య నా హీరో. ఆయనే నాకు ధైర్యం" అంటున్నారు ఆయేషా.
ఆయేషాతో బంధాన్ని నిలబెట్టుకునేందుకు తనతో తానే పోరాడాల్సి వచ్చిందని ఆదిత్య చెప్పారు. ఆ పోరాటంలో అతడు గెలిచారు.
రెండో పోరాటం కుటుంబంతో, సమాజంతో. ఇప్పుడు ఇద్దరూ కలిశారు కాబట్టి, ఇక ఆ యుద్ధంలోనూ వాళ్లు విజయం సాధిస్తారు.
ఇవి కూడా చదవండి:
- Fact Check: ప్రియాంకా గాంధీ లఖ్‌నవూ ర్యాలీ ‘నకిలీ ఫొటో’ తెలంగాణది
- ఎల్ చాపో గజ్మన్: ప్రపంచంలోనే అత్యంత పేరుమోసిన నేరస్తుడిపై ముగిసిన విచారణ
- తెలుగు సంస్కృతి దారిలో బ్రిటన్: నెలసరి మొదలైందా... చలో పార్టీ చేసుకుందాం
- హైదరాబాద్‌లో ఈ అమ్మాయి బైక్ విన్యాసాలు చూస్తే.. కళ్లు తిరుగుతాయ్
- అమెరికాలో ‘అత్యంత పేద పట్టణం’ ఎలా ఉందో చూడండి
- ప్రేమికులు ప్రేమలో పడటానికి, వారిలో రొమాన్స్‌కు కారణం ఇదే
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)








