ప్రియాంకా గాంధీ లఖ్‌నవూ ర్యాలీ ‘నకిలీ ఫొటో’ తెలంగాణది : Fact Check

ఫొటో సోర్స్, SM Viral Image Grab
- రచయిత, ఫ్యాక్ట్ చెక్ బృందం
- హోదా, బీబీసీ న్యూస్
వీధి అంతా జనసందోహంగా కనిపిస్తున్న ఉన్న ఒక ఫొటోను సోషల్ మీడియాలో పెద్దఎత్తున షేర్ చేస్తున్నారు. అది సోమవారం ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖ్‌నవూలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీలు నిర్వహించిన ర్యాలీ ఫొటో అని పేర్కొంటున్నారు.
ఈ ఫొటోలో కాంగ్రెస్ జెండాలు కనిపిస్తున్నాయి. కానీ, అది 2018 డిసెంబర్‌లో తీసిన చిత్రం.
ఈ ఫొటోను కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ప్రియాంక చతుర్వేది కూడా ట్విటర్‌లో సోమవారం షేర్ చేశారు, కానీ తర్వాత దాన్ని తొలగించారు. అనంతరం లఖ్‌నవూ ర్యాలీకి సంబంధించిన వాస్తవ ఫొటోను పోస్ట్ చేశారు.

ఫొటో సోర్స్, priyankac19/twitter
కాంగ్రెస్ అధికారిక సోషల్ మీడియా పేజీల్లోనూ ఆ పాత ఫొటోను షేర్ చేసి, తర్వాత తొలగించారు.
యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కేశవ్ చంద్ యాదవ్, ఉత్తర్‌ప్రదేశ్ మహిళా కాంగ్రెస్ ట్విటర్ ఖాతాలతో పోస్ట్ చేసిన ఆ ఫొటో ఇంకా అలాగే ఉంది.
సోమవారం లఖ్‌నవూలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఆయన సోదరి ప్రియాంకా గాంధీ ర్యాలీ తీశారు.
లఖ్‌నవూ విమానాశ్రయం నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వరకు 15 కిలోమీటర్ల దూరం 5 గంటల పాటు ఆ ర్యాలీ సాగిందని బీబీసీ లఖ్‌నవూ ప్రతినిధి సమీరాత్మజ్ మిశ్రా చెప్పారు.

ఫొటో సోర్స్, azharflicks/twitter
ఆ ఫొటో ఎక్కడిది?
షేర్ అవుతున్న ఆ పాత ఫొటో 2018 డిసెంబర్ 5న నాటిది. మాజీ క్రికెటర్, కాంగ్రెస్ నేత మహమ్మద్ అజారుద్దీన్ ఆ పొటోను ట్విటర్‌లో షేర్ చేశారు. "సొంత రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం ప్రత్యేక అనుభూతినిస్తోంది. ప్రజల మద్దతు చాలా అద్భుతంగా ఉంది" అని అజారుద్దీన్ రాశారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రజాకూటమి తరఫున పలు ప్రచార కార్యక్రమాల్లో అజారుద్దీన్ పాల్గొన్నారు.
ఆ ఫొటో లఖన్‌వూలో జరిగిన కాంగ్రెస్ రోడ్ షోకు సంబంధించిందే అంటూ.. "టీమ్ రాహుల్ గాంధీ", "కాంగ్రెస్ లావో, దేశ్ బచావో" పేర్లతో ఉన్న ఫేస్‌బుక్ గ్రూపుల్లో షేర్ చేశారు.
"ఇదీ.. రాహుల్ గాంధీకి ఉన్న జనాదరణ" అంటూ అనేక మంది ఈ ఫొటోను షేర్ చేశారు.
కాంగ్రెస్ నేతల తీరు చూస్తే నవ్వొస్తోందంటూ.. బీజేపీ ఎంపీ కిరణ్ ఖేర్ షేర్ ఈ ఫొటోను షేర్ చేశారు.
"లఖ్‌నవూలో ప్రియాంకా గాంధీకి ప్రజలు నీరాజనాలు పలుకుతున్నట్లుగా ఉన్న ఫొటోను కాంగ్రెస్ షేర్ చేసినట్లు కనిపిస్తోంది. కానీ, గోడల మీద తెలుగు పోస్టర్లు ఉన్నట్లు అందులో కనిపిస్తోందని నాకు కొందరు చెప్పారు. అది నిజమే అయితే, హాస్యాస్పదమే" అని ఆమె పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీ పాత ఫొటోలతో ప్రచారం చేసుకుంటోందని పలు మితవాద మద్దతుదారుల ఫేస్‌బుక్ గ్రూపుల్లో ఈ పొటోను షేర్ చేశారు.
ఇవి కూడా చదవండి:
- సీబీఐ మాజీ తాత్కాలిక డైరెక్టర్ నాగేశ్వరరావుకు రూ.లక్ష జరిమానా
- మనకు సూర్యరశ్మి ఎంత అవసరం? డీ విటమిన్ కోసం ఎండలో ఎంత సేపు ఉండాలి?
- విజయ్ మాల్యా: ఇంతవరకూ భారత్ ఎంతమంది దోషులను దేశానికి తీసుకురాగలిగింది
- డమ్మీ తుపాకీతో రెస్టారెంట్‌కు వచ్చిన 'కిమ్'
- అరుణాచల్ ప్రదేశ్: భారత్-చైనా మధ్య గొడవ ఎందుకు, దీని చరిత్రేంటి?
- #MyVoteCounts: 'గ్రామీణ విద్యార్థుల సమస్యలు తీర్చేవారికే నా ఓటు'
- ‘ప్రియాంక గాంధీ అందమే ఆమెకు శత్రువా?’: అభిప్రాయం
- చంద్రబాబు నాయుడు: ‘12 గంటల దీక్షకు 11 కోట్లు ఖర్చు’ నిజానిజాలేంటి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)








