ప్రధాని మోదీని రాహుల్, ప్రియాంక పొగిడారా? :Fact Check

ఫొటో సోర్స్, Getty Images
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, జనరల్ సెక్రటరీ ప్రియాంకా గాంధీలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ప్రశంసించారని చూపుతున్న ఒక వీడియో కొన్ని ఫేస్‌బుక్ పేజీల్లో వైరల్ అయింది.
దేశ భవిష్యత్తు మోదీ మీదే ఆధారపడి ఉందని ఆ వీడియోలో రాహుల్, ప్రియాంకలు చెబుతున్నట్లుగా ఉంది.
కంటెంట్ అందుబాటులో లేదు
మరింత సమాచారం కోసం Facebookఇతర వెబ్‌సైట్లలో సమాచారానికి బీబీసీ బాధ్యత వహించదు.పోస్ట్ of Facebook ముగిసింది
వీడియో మొదటి సగం భాగంలో "మీ దేశం కోసం ఓటేయండి, సోనియా గాంధీకి కాదు. మీ పిల్లల భవిష్యత్తు కోసం ఓటు వేయండి" అని ప్రియాంకా గాంధీ అంటున్నట్లుగా వినవచ్చు.
రెండో భాగంలో "మీ భవిష్యత్తు నరేంద్ర మోదీ చేతుల్లోనే ఉంది.. మీకు మంచి భవిష్యత్తు కావాలాంటే మోదీకి మద్దతివ్వండి, ఆయన మీకు భవిష్యత్తు ఇస్తారు" అని రాహుల్ గాంధీ అంటున్నట్లుగా ఉంది.
ఈ వీడియోలను ఫేస్‌బుక్, వాట్సాప్ గ్రూపుల్లో వేలాది మంది చూశారు.
అయితే, మా పరిశీలనలో ఈ వీడియోలు నకిలీవని తేలింది. వారి ప్రసంగాల నుంచి కొన్ని మాటలను కత్తిరించి, అతికించారని వెల్లడైంది.
2019 ఫిబ్రవరి 11న ప్రియాంకా గాంధీ క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశించాక దేశంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. తూర్పు ఉత్తర్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ ప్రచార బాధ్యతలు ఆమెకు అప్పగించారు.
ఆమెను లక్ష్యంగా చేసుకుని మితవాద ఫేస్‌బుక్ గ్రూపులు, ట్విటర్ హ్యాండిల్స్ అదే పనిగా అసత్య ప్రచారాలు చేస్తున్నాయి. ప్రియాంకా గాంధీ మద్యం మత్తులో పాత్రికేయులతో, ప్రజలతో అనుచితంగా ప్రవర్తించారంటూ ఇటీవల ఒక వీడియోను షేర్ చేశారు. కానీ, ఆ వీడియోలో వాస్తవం లేదని బీబీసీ పరిశీలనలో తేలింది.
నకిలీ వార్తలను వ్యాప్తి చేయడం మితవాద గ్రూపులకే పరిమితం కాదు, కొందరు కాంగ్రెస్ నేతలు కూడా అలాంటి నకిలీ పోస్టులు పెడుతున్నారు.
డిసెంబర్ 5న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి సంబంధించిన ఓ ఫొటోను.. ప్రియాంకా, రాహుల్ గాంధీలు లఖ్‌నవూలో నిర్వహించిన ర్యాలీకి సంబంధించిందంటూ సోషల్ మీడియాలో కాంగ్రెస్ నేతలు షేర్ చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
ప్రియాంకా గాంధీ వీడియో
2014లో చిత్రీకరించిన ఓ వీడియో నుంచి ప్రియాంకా గాంధీ మాటలను కత్తిరించారని మా పరిశీలనలో తేలింది. మొత్తం 6 నిమిషాల నిడివి ఉన్న వాస్తవ వీడియోను 2014 ఏప్రిల్ 22న కాంగ్రెస్ పార్టీ అధికారిక యూట్యూబ్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఆ వీడియోలోనూ ప్రియాంకా బీజేపీని విమర్శించారే తప్ప, ప్రశంసించలేదు.
2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాయ్‌బరేలీలో నిర్వహించిన ర్యాలీలో ప్రసంగించారు. భారత దేశంలోని వైవిధ్యం గురించి, అభివృద్ధి, నిరుద్యోగ సమస్యల గురించి ఆమె మాట్లాడినట్లు ఆ వీడియోలో ఉంది.
"మీరు సోనియా గాంధీకి ఓటు వేస్తారని నాకు తెలుసు. నాకు అనుమానం లేదు. ఎందుకంటే, మీ అభివృద్ధి కోసం ఆమె ఎంత అంకితభావంతో పనిచేస్తారో మీరు చూశారు." అని ప్రియాంక అన్నారు.
ఆ తర్వాత "మీ దేశం కోసం ఓటు వేయండి, సోనియా గాంధీ కోసం కాదు. మీ పిల్లల భవిష్యత్తు కోసం వోటు వేయండి. ఉపాధి అవకాశాలు కల్పించే వారికి, దేశాభివృద్ధికి కృషి చేసేవారికి ఓటు వేయండి" అని కూడా చెప్పారు.

ఫొటో సోర్స్, Social media
రాహుల్ గాంధీ వీడియో
వైరల్ అయిన రాహుల్ గాంధీ వీడియోను 2017 జనవరి 12న దిల్లీలోని తల్కతోరా మైదానంలో చేసిన సుదీర్ఘ ప్రసంగం నుంచి కత్తిరించారు. వాస్తవ వీడియో 39 నిమిషాలు ఉంది. యూట్యూబ్‌లో అది ఇప్పటికీ ఉంది.
రాహుల్ ఏమన్నారు?
"నరేంద్ర మోదీ నవ భారతాన్ని నిర్మిస్తున్నానని అంటారు. ఎప్పుడూ భవిష్యత్తు గురించి, గతం గురించే మాట్లాడతారు కానీ, ప్రస్తుత దేశం గురించి పట్టించుకోరు. అందరూ పనికిరాని వ్యక్తులే అని, తానే దేశాన్ని అభివృద్ధి చేస్తానని ఆయన అనుకుంటారు. మన దేశం అంతగా చెడిపోయి ఉందా?" అని రాహుల్ ప్రశ్నించారు.
ఇవి కూడా చదవండి:
- Fact Check: ప్రకాశ్ రాజ్ క్రైస్తవ మతంలోకి మారడం నిజమేనా, వాస్తవం ఏంటి?
- మోదీ హయాంలో గంగానది నిజంగానే శుభ్రమైందా
- FactCheck: రాహుల్ గాంధీని గల్ఫ్ మీడియా ‘పప్పూ’ అని పిలిచిందా?
- Fact Check: ఈ వైరల్ ఫొటోలు నిజానికి భారత సైనికులవి కాదు
- దేశీ వాట్సప్ షేర్ చాట్ ఎందుకంత పాపులర్ అయింది?
- ఈ ఫోటో మీ మానసిక ఒత్తిడిని చెప్పేస్తుందా? అసలు నిజమేంటి?
- పెయిడ్ న్యూస్: ఎన్నికల వేళ వార్తల వ్యాపారం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








