రాహుల్ గాంధీని గల్ఫ్ మీడియా ‘పప్పూ’ అని పిలిచిందా?: Fact Check

రాహుల్ గాంధీ

ఫొటో సోర్స్, UGC

దుబాయి‌లోని ఒక వార్తా పత్రిక.. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీని అవమానించినట్లు కొన్ని పోస్టులు పలు మితవాద సోషల్ మీడియా పేజీల్లో వైరల్ అవుతున్నాయి.

రాహుల్‌గాంధీ ఇటీవలి దుబాయి పర్యటనలో భారత దేశానికి ''తలవంపులు తెచ్చారు'' అన్నది ఆ పోస్టుల సారాంశం.

తమ వాదనను సమర్థించుకుంటూ ఆ పేజీలు గల్ఫ్ న్యూస్ దినపత్రిక మొదటి పేజీలను షేర్ చేస్తున్నాయి. ''పప్పు లేబుల్'' అనే శీర్షికతో రాహుల్ గాంధీ చిత్రాన్ని ఆ పేజీలు చూపుతున్నాయి.

రాహుల్‌ని ఎద్దేవా చేయటానికి ఆయన కేరికేచర్‌తో పాటు ''పప్పు'' అనే పదాన్ని గల్ఫ్ న్యూస్ పత్రిక తన కథనంలో ఉపయోగించిందని ఆ పేజీలు చెబుతున్నాయి.

రాహుల్ గాంధీ, పప్పు

ఫొటో సోర్స్, UGC

తెలివిగా మడత పెట్టిన ఆ పత్రిక మొదటి పేజీలతో పాటు కొన్ని వ్యాఖ్యలు ఇలా ఉన్నాయి:

''విదేశాల్లో స్వదేశాన్ని అవమానించే వారికి ఈ తరహా గౌరవం దక్కుతుంది. గల్ఫ్ న్యూస్ అనే వార్తాపత్రిక ఒక కథనంలో రాహుల్‌గాంధీని 'పప్పు' అని అభివర్ణించింది.''

''భారతదేశాన్ని 65 సంవత్సరాలు పరిపాలించిన ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడు విదేశీ గడ్డ మీద మాట్లాడుతూ భారతదేశంలో అవినీతి, పేదరికం పాతుకుపోయాయని చెప్పినపుడు.. 65 ఏళ్లలో వాళ్లు ఏం చేశారనేది ఆలోచించాలి.''

గతంలో రాహుల్‌గాంధీని ఎగతాళి చేయటానికి పలువురు బీజేపీ నాయకులు ''పప్పు'' అనే పదం ఉపయోగించారు.

ఆ వార్తాపత్రిక నిజంగా రాహుల్‌గాంధీని అవమానించిందా? అంటే, వాస్తవం వేరేలా ఉంది.

''పప్పు ముద్ర రాహుల్‌ని ఎలా మార్చింది'' అన్నది ఆ పత్రిక రాసిన పూర్తి శీర్షిక. ఆ శీర్షికతో పాటు ప్రచురించిన రేఖా చిత్రం (కేరికేచర్) నిజానికి రాహుల్ గాంధీ సంతకం చేసి ఆమోదించిందని ఆ వార్తాపత్రిక పేర్కొంది.

రాహుల్ గాంధీ, పప్పు

ఫొటో సోర్స్, UGC

మరి, ఆ శీర్షికలో ''పప్పు'' అనే పదాన్ని వాడాలని ఆ పత్రిక ఎందుకు ఎంచుకుంది?

''పప్పు ముద్ర'' గురించి తనను అడిగిన ఒక ప్రశ్నకు ప్రతిస్పందనగా రాహుల్ చెప్పిన మాట అది.

రాహుల్ ఇచ్చిన సమాధానం ఇదీ:

''నాకు లభించిన అత్యుత్తమ బహుమతి 2014. మరెక్కడా నేర్చుకోలేనంతగా దాని నుంచి నేను నేర్చుకున్నాను. నా ప్రత్యర్థులు నా జీవితాన్ని ఎంత ఎక్కువ కష్టమయంగా చేస్తే.. ఎంత ఎక్కువ కఠినంగా చేస్తే.. అది నాకు అంత మంచిది. దీని (పప్పు ముద్ర) వల్ల నేను కలతచెందను. నా ప్రత్యర్థుల విమర్శలను నేను అభినందిస్తాను. వాటి నుంచి నేర్చుకుంటాను.''

అంటే.. రాహుల్‌ని అవమానించటానికి ఆ పత్రిక ఆ పదాన్ని ఉపయోగించలేదని స్పష్టమవుతోంది. రాహుల్ గాంధీని తమ పత్రిక అవమానించిందన్న వాదనలు బూటకమని వివరణ ఇస్తూ కూడా ఆ పత్రిక ఒక కథనం పోస్ట్ చేసింది.

రాహుల్ గాంధీ, పప్పు

ఫొటో సోర్స్, uGC

రాహుల్ గాంధీ గత వారంలో దుబాయి పర్యటనలో ప్రవాస భారతీయులను కలిశారు. ఒక స్టేడియంలో వారితో నిర్వహించిన సభలో ప్రసంగించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన విదేశీ పర్యటనల సందర్భంగా ప్రవాస భారతీయుల సమావేశాల్లో ప్రసంగించినట్లే రాహుల్ కూడా ప్రసంగించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)