ఇంటర్ సెక్స్: అమ్మాయిగా మార్చినా... అబ్బాయిగానే పెరిగిన ఒక వ్యక్తి కథ
అమ్మాయిగా మార్చాలని ప్రయత్నిస్తే అబ్బాయిగా పెరిగిన వ్యక్తి కథ ఇది.
జాన్ వయసు ఇప్పుడు 14 ఏళ్లు. అతడు పుట్టినప్పుడు తల్లి ఆన్ ఎంతో అయోమయానికి గురయ్యారు.
జాన్ సమస్య ఏంటని ఆమె డాక్టర్‌ను అడిగారు. ఆ బిడ్డ ఆడా లేక మగా అన్నది తెలియడం లేదని డాక్టర్ బదులిచ్చారు.
మరికొన్ని పరీక్షలు చేయాల్సి ఉందని కూడా సూచించారు.
జాన్‌కు పుట్టుకుతో పురుషాంగం, యోనిని పోలిన అవయవాలు రెండూ ఉన్నాయి.
డాక్టర్లు పురుషాంగాన్ని తొలగించి అమ్మాయిగా మార్చేయడమే మంచిదని భావించారు.
కానీ, జాన్ ఒక అబ్బాయిలా పెరిగాడు. అమ్మాయి లక్షణాలు అతనిలో కనిపించలేదు.

తాను అబ్బాయో, అమ్మాయో తేల్చుకోలేక జాన్ చాలా సార్లు ఆత్మహత్యకు ప్రయత్నించాడు.
కెన్యాలో ఇప్పటికీ ఇంటర్‌సెక్స్ సమస్యతో పుట్టిన పిల్లలను చంపేస్తున్నారు. అందుకే, ప్రభుత్వం లింగ సమస్య, ఇంటర్ సెక్స్ సర్జరీల మీద ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది.
ఐక్యరాజ్యసమితి అంచనాల ప్రకారం ప్రపంచంలో 1.7 శాతం మంది ఇలాంటి సమస్యలతో పుడుతున్నారు. అయితే, ఈ సమస్యకు అన్నివేళలా సర్జరీ అవసరం ఉండదు.
కానీ, మూత్ర విసర్జనలో సమస్యలు, క్యాన్సర్ వచ్చే ముప్పు ఉన్నప్పుడు సర్జరీ చేస్తారు.

ఇలాంటి సర్జరీలు దక్షిణ భూమండలం మీదే కాదు. బ్రిటన్, అమెరికా వంటి దేశాల్లోనూ ఇలాంటి చికిత్సలు చేస్తున్నారు.
అమెరికాకు చెందిన రోజీ కూడా ఇలాంటి సమస్యతోనే పుట్టారు. ఆమె తల్లితండ్రులకు కూడా చాలా మంది సర్జరీ చేయించాలని సూచించారు.
సర్జరీ చేయకపోతే చాలా సమస్యలు వస్తాయంటూ వారిని భయపెట్టారు. దాంతో, రోజీ తల్లితండ్రులు తీవ్రంగా ఒత్తిడికి లోనయ్యారు.
కానీ, ఆ తల్లితండ్రులు తమ బిడ్డకు సర్జరీ చేయించలేదు. రోజీ బాగానే ఉంది. అందరి పిల్లల్లానే ఆడుతూ పాడుతూ పెరుగుతోంది.
'అందరి పిల్లల్లానే మా బిడ్డ కూడా మాకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తోంది' అని రోజీ తల్లితండ్రులు చెప్పారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









