FACT CHECK: ఆస్ట్రేలియా బీరు సీసాలపై హిందూ దేవుళ్ళ బొమ్మలు

ఫొటో సోర్స్, TWITTER
- రచయిత, ఫ్యాక్ట్ చెక్ టీమ్
- హోదా, బీబీసీ న్యూస్
ఆస్ట్రేలియాలోని ఒక బీర్ వాణిజ్య ప్రకటన కాపీ సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతోంది. దానిపై హిందూ దేవుడైన వినాయకుడి ఫొటోను ఉపయోగించారు.
దక్షిణ భారతదేశంలోని చాలా వాట్సప్ గ్రూప్స్‌లో ఈ ప్రకటన వైరల్ అయింది. మద్యం సీసాపై హిందూ దేవతల బొమ్మలు ఉపయోగిస్తూ హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నాయని అందరూ ఆరోపిస్తున్నారు.
కొంతమంది ట్విటర్ యూజర్స్ ఈ ఫొటోను ట్వీట్ చేస్తూ పీఎం నరేంద్ర మోదీ, విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ సహా చాలా మంది పెద్ద నేతలకు దీనిపై ఫిర్యాదు చేశారు. సీసాపై ఉన్న గణేష్ ఫొటో తొలగించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
చాలా మంది ఈ ప్రకటనను ఆస్ట్రేలియా మాజీ ప్రధాని మాల్కమ్ టర్న్‌బుల్‌కు కూడా ట్యాగ్ చేశారు. దానిని జారీ చేసిన కంపెనీపై చర్యలు తీసుకోవాలని కోరారు.
వైరల్ అవుతున్నఈ ప్రకటనలో ఉన్న వివరాలను బట్టి ఆస్ట్రేలియాకు చెందిన బ్రూక్‌వెల్ అనే బీర్ కంపెనీ త్వరలో ఒక కొత్త డ్రింక్ మార్కెట్లోకి తీసుకొస్తోంది.
దానిపై వినాయకుడి ఫొటో ఉంది. హాలీవుడ్ మూవీ 'పైరేట్స్ ఆఫ్ కరిబియన్'లో ఒక పాత్రలా ఆ ఫొటో రూపురేఖలను మార్చారు.
సోషల్ మీడియాలో చాలా మంది ఈ ప్రకటన నిజం కాదని భావిస్తున్నారు. ఎవరో ఈ ప్రకటనను ఫొటోషాప్ ద్వారా అలా మార్చి ఉంటారని అనుకుంటున్నారు.
కానీ, మా పరిశోధనలో ఈ ప్రకటన వాస్తవమేనని తేలింది. బ్రూక్‌వెల్ యూనియన్ అనే ఆస్ట్రేలియా బీరు కంపెనీ త్వరలో ఒక కొత్త డ్రింక్ తీసుకొస్తోంది. దాని బాటిల్‌పైనే ఇలా గణేష్ ఫొటోను ఉపయోగించారు.

ఫొటో సోర్స్, TELEGRAPH.CO.UK
పాత వివాదం
ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్(సిడ్నీ)లో ఉన్న ఈ కంపెనీ 2013లో కూడా ఇలాగే బీరు బాటిళ్లపై గణేష్, లక్ష్మీదేవి ఫొటోలను ఉపయోగించి వివాదాల్లో చిక్కుకుంది.
ఆ సమయంలో ఈ కంపెనీ బాటిల్‌పై లక్ష్మీదేవి ఫొటోను వేసి, దానికి వినాయకుడి తలను పెట్టారు. సీసాపైన ఆవు, దుర్గాదేవి వాహనమైన పులిని కూడా ముద్రించారు.
2013లో ఈ వివాదిత ప్రకటనపై ఒక అంతర్జాతీయ హిందూ సంస్థ అభ్యతరం వ్యక్తం చేసినట్టు 'ద టెలిగ్రాఫ్' కథనం ప్రచురించింది. "డబ్బు సంపాదన కోసం హిందూ మత విశ్వాసాలతో పరాచికాలు ఆడడం దిగజారుడు తనమని, అలాంటి చర్యలను చూస్తూ ఊరుకోం" అని సంస్థ అన్నట్లు తెలిపింది.
బ్రూక్‌వెల్ యూనియన్‌కు వ్యతిరేకంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కూడా హిందూ సంస్థ హెచ్చరించిందని ఈ రిపోర్టులో తెలిపారు.
సమాచార ఏజెన్సీ పీటీఐ "కంపెనీ లక్ష్మీదేవి ఫొటోను ఉపయోగించడాన్ని ఆస్ట్రేలియాలో ఉంటున్న భారతీయులు కూడా వ్యతిరేకించారు.
వివాదం పెద్దదవడంతో బీర్ కంపెనీ తమ దేశంలోని భారతీయులను క్షమాపణలు కోరుతూ ఒక ప్రకటన జారీ చేసింది" అని తెలిపింది.

ఫొటో సోర్స్, ECONOMIC TIMES
కంపెనీ ప్రకటనను 'డెయిలీ టెలిగ్రాఫ్' తన రిపోర్టులో ముద్రించింది.

ఫొటో సోర్స్, DAILYTELEGRAPH
అందులో "మేం గొడవ పడేవాళ్లం కాదు. ప్రేమించే వాళ్లం. అనుకోకుండా మా హిందూ సోదరుల మత విశ్వాసాలకు భంగం కలిగించినట్లు మాకు అనిపించింది. మేం ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నాం. కొన్ని కొత్త డిజైన్లు కూడా వెతుకుతున్నాం. వీలైనంత త్వరగా బాటిళ్లకు కొత్త బ్రాండింగ్, కొత్త డిజైన్ సిద్ధం చేస్తాం" అని తెలిపారు.
హిందూ సంస్థల ప్రయత్నాలు
బీర్ కంపెనీ వెబ్‌సైట్‌లో వినాయకుడి ప్రతిమ ఎగురుతూ కనిపిస్తుందని దాని ముఖం మధ్యమధ్యలో భారత క్రికెటర్ సచిన్ తెందూల్కర్ ముఖంలా మారుతుందని కూడా కొన్ని కథనాలు వచ్చాయి.

ఫొటో సోర్స్, ThE SYDNEY MORNING HERALD
బీర్ బాటిళ్లపై దేవతల ఫొటోలు తొలగించాలని చాలా మంది ఆన్‌లైన్లో కూడా పిటిషన్లు దాఖలు చేశారు.
2015లో కొన్ని మత సంస్థలు బ్రూక్‌వెల్ యూనియన్‌పై ఆస్ట్రేలియాలో ప్రకటనలపై నిఘా పెట్టే సంస్థకు ఫిర్యాదు చేశాయి.
ఫిర్యాదు చేసి రెండేళ్లవుతున్నా కూడా బీర్ కంపెనీ తన బాటిళ్లపై అభ్యంతరకరమైన లేబుళ్లు అలాగే ఉంచుతోందని, తమ వెబ్‌సైట్‌లో హిందూ దేవతల ఫొటోలను తీసేయలేదని, సంస్థపై వీలైనత త్వరగా నిషేధం విధించాలని మత సంస్థలు కోరాయి.

ఫొటో సోర్స్, MUMBRELLA
అయితే, బ్రూక్‌వెల్ యూనియన్ ఇప్పటికీ బీర్ బాటిళ్లపై ఉన్న హిందూ దేవుళ్ల లేబుళ్లను, వెబ్‌సైట్‌లో ఉన్న ఫొటోలను మార్చలేదు.

ఫొటో సోర్స్, BROOKVALE UNION
సమీప భవిష్యత్తులో బాటిళ్లపై ప్యాకింగ్ మార్చే అవకాశం ఏదైనా ఉందా? అని ఈ మెయిల్ ద్వారా బీబీసీ ఆ కంపెనీని ప్రశ్నించింది. కానీ కంపెనీ మాత్రం దానికి ఎలాంటి సమాధానం ఇవ్వలేదు.
ఇవి కూడా చదవండి:
- బ్రిటన్ రాణి కంటే సోనియా సంపన్నురాలా...
- సంక్రాంతి ముగ్గుల చరిత్ర: మొదటి ముగ్గు ఎవరు వేశారు? రంగవల్లి ఎలా పుట్టింది?
- రియాలిటీ చెక్: నికితా వీరయ్య నిర్మలా సీతారామన్ కూతురేనా...
- చంద్రుని మీద మొలకెత్తిన చైనా పత్తి విత్తనం
- అమ్మాయిల కన్యత్వానికి, సీసా సీల్‌కు ఏమిటి సంబంధం
- బీబీసీ రియాలిటీ చెక్: అది భార్యాబిడ్డల అమ్మకం కాదు.. ‘ కులాచారం’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








