జగన్‌తో కేటీఆర్ భేటీ: రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా ఉండాలంటే ఈ బలం ఇంకా పెరగాలి: జగన్

కేటీఆర్, జగన్మోహన్ రెడ్డి

ఫొటో సోర్స్, Twitter

టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, వైఎస్ఆర్‌సీపీ అధ్యక్షుడు జగన్మోహన రెడ్డి బుధవారం మధ్యాహ్నం భేటీ అయ్యారు. కేటీఆర్, ఆ పార్టీ నాయకులు వినోద్ కుమార్, పల్లా రాజేశ్వర రెడ్డి, శ్రవణ కుమార్ రెడ్డి హైదరాబాద్ లోటస్ పాండ్ దగ్గర్లో ఉన్న జగన్ ఇంటికి వెళ్లారు.

ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో భాగంగా చర్చించేందుకు వారిని జగన్ ఇంటికి వెళ్లమని కేసీఆర్ ఆదేశించినట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయ అధికారి మీడియాకు సమాచారం ఇచ్చారు. రాజకీయ కారణాలతో కేటీఆర్, జగన్ కలవడం ఇదే మొదటిసారి.

రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా నిలబడాలంటే రాష్ట్రాలన్నీ కలవాల్సిన అవసరం ఉందని జగన్ అన్నారు. కేటీఆర్‌తో భేటీ తర్వాత జగన్, కేటీఆర్‌తో కలిసి విలేఖర్లతో మాట్లాడారు.

రాష్ట్రాల హక్కులు కాపాడాలంటే ఈ బలం ఇంకా పెరగాలన్నారు. అప్పుడే కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్రాలకు అన్యాయం చేయాలనే ఆలోచననుంచి వెనకడుగు వేస్తాయని తెలిపారు.

'' ఫోన్లో కేసీఆర్ మాట్లాడాక తారక్ వచ్చి చర్చించారు. ప్రత్యేక హోదా అనేది పార్లమెంటులో ఇచ్చిన హామీ. దానికే దిక్కులేకుండా పోయింది. ప్రతి రాష్ట్రం పరిధిలో ఉన్న ఎంపీల సంఖ్యతో పోలిస్తే బలం సరిపోదు. పక్కరాష్ట్రం నుంచి కూడా కలిస్తే... 42 మంది ఒకేసారి ప్రశ్నిస్తే అప్పుడు రాష్ట్రానికి మేలు జరిగే అవకాశం పెరుగుతుంది. దీనికోసం కేసీఆర్ చేస్తున్న ఈ ప్రయత్నం హర్షించదగిన విషయం. తర్వాత చర్చలకు కేసీఆర్ వస్తానన్నారు.'' అని జగన్ అన్నారు.

ఇప్పుడు చర్చించిన విషయాలను పార్టీలో చర్చించి ముందుకు తీసుకెళ్తామని తెలిపారు. ఇవి ప్రాథమిక చర్చలేనని తర్వాత ఇలాంటి చర్చలు ఇంకా జరుగుతాయని వివరించారు.

అంతకు ముందు కేటీఆర్ మాట్లాడుతూ.. ''దేశరాజకీయాల్లో గుణాత్మక మార్పురావాలి. కేంద్రం అన్ని అధికారాలు గుప్పిట్లో పెట్టుకుంది. సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం. అందుకే ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుచేయాలనుకుంటున్నాం'' అని చెప్పారు.

''ఇతర రాష్ర్టాల నేతలు మమతాబెనర్జీ, నవీన్ పట్నాయక్, స్టాలిన్, కుమార స్వామి, అజిత్ జోగిలను కూడా గతంలో కలిశాం. జాతీయ రాజకీయాలు రాష్ట్రాల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఉండాలనేదే మా అభిమతం. త్వరలో కేసీఆర్ కూడా జగన్ ను కలుస్తారు. ఏపీకి హోదాపై మా వైఖరిని ఇప్పటికే స్పష్టం చేశాం. ఇచ్చిన హామీని నెరవేర్చాలనే చెప్పాం. ఇరు రాష్ట్రాల ప్రయోజనాలు, కలసి ఎలా పోరాడాలనే దానిపై తర్వాత చర్చించి నిర్ణయిస్తాం.'' అని వివరించారు.

ఫెడరల్ ఫ్రంట్‌లో జగన్ చేరతారా?

కేసీఆర్ ఇప్పటి వరకూ ఫెడరల్ ఫ్రంట్ గురించి దేవెగౌడ, మమతా బెనర్జీ, నవీన్ పట్నాయక్, స్టాలిన్ వంటి నాయకులను కలిశారు. అయితే వారెవ్వరూ తాము ఫెడరల్ ఫ్రంట్‌లో చేరతామని స్పష్టంగా ప్రకటించలేదు. అటు కేసీఆర్ కూడా తనది తాత్కాలిక ఎన్నికల కూటమి కాదని, జాతీయ స్థాయిలో విధానాలను సమూలంగా మార్చే ప్రయత్నమని, అన్ని కూటముల్లాగా ఫెడరల్ ఫ్రంట్‌ని చూడవద్దని చెబుతూ వచ్చారు. 2019 లోక్ సభ ఎన్నికలు తన లక్ష్యం కాదని బయటకు చెబుతూ వచ్చినా, అందరూ కచ్చితంగా ఎన్నికల ప్రమాణంలోనే ఈ ఫ్రంట్‌ని కొలుస్తున్నారు.

కానీ, ఇప్పటి వరకూ కలిసిన నాయకులు, వాళ్లు చేరడం చేరకపోవడం ఒక ఎత్తు. కానీ జగన్‌ను కలవడం ఒక ఎత్తు. ఆంధ్ర - తెలంగాణల మధ్య ఉన్న భావోద్వేగ అంశాల కారణంగా జగన్ ఎలాంటి వైఖరి తీసుకుంటారు? ప్రత్యక్షంగా ఫ్రంట్‌లో చేరతారా? లేకపోతే అందరిలాగానే 'మళ్లీ చర్చిస్తాం' అంటారా అన్నది తేలాలి.

కేసీఆర్

ఫొటో సోర్స్, KalvakuntlaChandrashekarRao/fb

రిటర్ను గిఫ్ట్ గురించేనా?

జగన్ - కేటీఆర్ సమావేశం కేవలం ఫెడరల్ ఫ్రంట్‌కే పరిమితం అవుతుందని ఎవరూ అనుకోవడం లేదు. కచ్చితంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల గురించి వారు చర్చించే అవకాశం ఉంది. తమను శాసన సభ ఎన్నికల్లో ఇబ్బంది పెట్టిన చంద్రబాబుకు తిరుగు బహుమానం ఇచ్చితీరతామన్న కేసీఆర్ ప్రకటన ఒక సంచలనం. ఆ రిటర్న్ గిఫ్ట్ ఏంటి? ఎప్పుడు ఏ రూపంలో ఉంటుందనే దానిపైనే అందరి ఉత్కంఠ. ఆ క్రమంలోనే ఈ సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది.

'జాతీయ రాజకీయాలపై దృష్టి పెడతాం' అని కేసీఆర్ అంటున్నారు. అయితే మిగతా అన్ని రాష్ట్రాలూ వేరు, ఏపీ వేరు. అందుకే ఈ వ్యవహారాన్ని అంత సూక్ష్మంగా చూడాల్సి వస్తోంది. ప్రస్తుతానికి చంద్రబాబు శత్రువులందరూ కేసీఆర్ మిత్రులే. ఆంధ్రలో బాబును నిలువరించగలిగేది జగనే అని బలంగా నమ్ముతున్న కేసీఆర్... జగన్‌కు అన్ని రకాలుగానూ సహకరించడానికి సిద్ధపడ్డారని తెలుస్తోంది.

కానీ, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కేసీఆర్ ప్రత్యక్షంగా జోక్యం చేసుకుంటే పరిస్థితి ఎలా ఉంటుంది? జనం ఎలా తీసుకుంటారు? అనేది కూడా ముఖ్యమే. కేసీఆర్‌కు ఆంధ్రాలో అభిమానులు ఉన్నారు, ఆయన పాలనను మెచ్చుకునే వారున్నారు. వారు స్వాగతాలు చెప్పడం, ఫ్లెక్సీలు పెట్టడం, పాలాభిషేకాలు వంటివి చేస్తున్నారు. కేటీఆర్‌ను హైదరాబాద్‌లోని ఆంధ్ర యువత బాగా అభిమానిస్తుంటారు. కానీ అవన్నీ వేరు, ఎన్నికలు వేరు. కేసీఆర్ లేదా కేటీఆర్‌ ప్రత్యక్షంగా ఆంధ్రలో ప్రచారానికి వస్తే పరిస్థితి ఎలా ఉంటుంది? ప్రజలు ఎలా తీసుకుంటారన్నది కీలకమైన ప్రశ్న.

చంద్రబాబు నాయుడు, జగన్, కేసీఆర్, పవన్ కల్యాణ్

ముగ్గురు మోదీలు

తెలుగుదేశం పార్టీ మాత్రం ఈ అవకాశాన్ని బలంగా వాడుకోవాలని చూస్తోంది. తనపై ముగ్గురు మోదీలు (మోదీ, జగన్, కేసీఆర్) దాడి చేస్తున్నారంటూ పదే పదే చంద్రబాబు చెబుతూ వస్తున్నారు. కేసీఆర్ మాత్రం తాను మోదీకి వ్యతిరేకం అని చెబుతున్నారు. జగన్ దీనిపై పెదవి విప్పలేదు. కాకపోతే, ఒకప్పుడు జగన్‌కి ఓటు వేస్తే రాహుల్‌కి వేసినట్టే అన్న బాబు ఇప్పుడు జగన్‌కి ఓటు వేస్తే మోదీకి వేసినట్టే అనడాన్ని గుర్తు చేస్తోంది వైయస్సార్సీపీ.

కేసీఆర్‌తో కలవడం విషయంలో కూడా ఇప్పటికే వైయస్సార్సీపీ, టీడీపీ మధ్య మాటల యుద్ధం జరిగింది. చంద్రబాబే కేసీఆర్ చేతులు పట్టుకుని మరీ పొత్తు కోసం అడిగారని వైయస్సార్సీపీ నాయకులు విజయసాయి రెడ్డి ఆరోపించారు. దానిపై స్వయంగా వివరణ ఇచ్చిన చంద్రబాబు, దిల్లీతో కలిసి పోరాడదామని మాత్రమే తాను అన్నానని చెప్పారు. ఈ విషయంపై పవన్ కల్యాణ్ కూడా ఆసక్తికర కామెంట్లు చేశారు. చంద్రబాబుపై ప్రతీకారంతోనే జగన్‌కి కేసీఆర్ మద్దతిస్తున్నారని, ఇలాంటి రాజకీయాలు ఇంకెన్నాళ్లని ఆయన ఒక బహిరంగ సభలో కామెంట్ చేశారు.

వైయస్సార్సీపీకి టీఆర్ఎస్ నైతిక మద్దతు ఉందనేది వాస్తవం. కానీ అది నైతిక మద్దతు స్థాయి దాటి, మరే రూపంలో ఉంటుందనేది ఈ సమావేశం తరువాత తేలుతుందా? ఇంకా సమయం పడుతుందా అనేది మాత్రం చూడాలి.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)