బ్రెగ్జిట్: ప్రధాని థెరెసాకు ఘోర పరాజయం... ఒప్పందాన్ని తిరస్కరించిన ఎంపీలు, అవిశ్వాస తీర్మానానికి రంగం సిద్ధం

థెరెసా మే
ఫొటో క్యాప్షన్, బ్రిటన్ ప్రథాని థెరెసా మే

బ్రిటన్ ప్రధానమంత్రి థెరెసా మే బ్రెగ్జిట్ ఒప్పందం 230 ఓట్ల తేడాతో దారుణంగా ఓటమి పాలైంది. బ్రిటన్ ప్రభుత్వ చరిత్రలోనే ఇది ఘోర పరాజయం.

యూరోపియన్ యూనియన్ నుంచి వైదొలిగేందుకు నిర్దేశించిన నిబంధనలకు సంబంధించిన ఈ ఒప్పందాన్ని ఎంపీలు 432-202 తేడాతో తిరస్కరించారు.

లేబర్ పార్టీ నేత జెరెమీ కార్బిన్ ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టారు. అందులో థెరెసాకు మెజారిటీ సభ్యుల మద్దతు లభించకపోతే మళ్ళీ ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

బ్రిటన్ కాలమానం ప్రకారం బుధవారం సాయంత్రం 7 గంటలకు అవిశ్వాస తీర్మానం జరిగే అవకాశం ఉంది.

వీడియో క్యాప్షన్, థెరెసా బ్రెగ్జిట్ ఒప్పందాన్ని 202 సమర్థిస్తే, 432 మంది వ్యతిరేకించారు

ఈయూతో నిష్క్రమణ ఒప్పందానికి సంబంధించి రెండేళ్ళకు పైగా ప్రతిపాదనలు సిద్ధం చేస్తూ వచ్చిన థెరెసాకు ఈ ఓటమి తీవ్రమైన ఎదురుదెబ్బ.

ఈ ఒప్పంద ప్రతిపాదనలకు కనుక పార్లమెంటు ఆమోదం లభించి ఉంటే ఈయూ నుంచి బ్రిటన్ వచ్చే మార్చి 29 నుంచి సజావుగా నిష్క్రమించే వీలుండేది. ఆ తరువాత ఇరు పక్షాల వాణిజ్య ఒప్పందాల నిర్వహణకు 21 నెలల గడువు అమల్లోకి వచ్చి ఉండేది.

వీడియో క్యాప్షన్, అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడుతున్న లేబర్ పార్టీ నేత జెరెమీ కార్బిన్

మామూలుగా బ్రెగ్జిట్ ఓటింగ్ డిసెంబర్‌లోనే జరగాలి. కానీ, ఎంపీల మద్దతు కూడగట్టుకునేందుకు థెరెసా మరింత సమయం తీసుకున్నారు.

ఇప్పటికీ, మార్చి 29 నుంచి ఈయూ నుంచి బ్రిటన్ విడిపోవాలనే చూస్తోంది. కానీ, బ్రెగ్జిట్ ఒప్పందానికి మద్దతు కూడగట్టడంలో థెరెసా మే దారుణంగా ఓడిపోవడంతో ఆ ప్రక్రియ ఏ తేదీ నుంచి ఎలాంటి విధి విధానాలతో జరుగుతుందన్నది మళ్ళీ సందేహంలో పడింది.

విమానాశ్రయం

ఫొటో సోర్స్, Getty Images

థెరెసా మే ప్రతిపాదించిన ఒప్పందం మరీ కఠినంగా ఉందని భావిస్తున్న ఎంపీలు బ్రెగ్జిట్‌ను పూర్తిగా ఆపేందుకు లేదా ఎలాంటి ఒప్పందం లేకుండా బయట పడేందుకు మరోసారి ప్రజాభిప్రాయ సేకరణ (రెఫరెండం) నిర్వహించాలని భావిస్తున్నారు. ఇప్పుడు వారు సహజంగానే తమ ప్రయత్నాలకు మరింత పదును పెట్టే అవకాశం ఉంది. బలహీనపడిన ప్రధాని కూడా ఇప్పుడు వారి వాదన ఏమిటో వినడానికి సుముఖత వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)