బ్రిటన్ బ్రెగ్జిట్ మంత్రి డేవిడ్ డేవిస్ రాజీనామా

ఫొటో సోర్స్, REUTERS/SIMON DAWSON
యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగటానికి సంబంధించిన శాఖ ‘బ్రెగ్జిట్’ మంత్రి డేవిడ్ డేవిస్ రాజీనామా చేశారు.
ప్రధానమంత్రి థెరెసా మే తన బ్రెగ్జిట్ ప్రణాళికకు మంత్రివర్గం మద్దతు కూడగట్టిన మరుసటి రోజు బ్రెగ్జిట్ మంత్రి రాజీనామా చేయటం గమనార్హం.
థెరెసా ప్రణాళిక ‘ఉదారంగా’ ఉందన్న విమర్శలు వచ్చాయి. ఈ ప్రణాళికను సోమవారం పార్లమెంటు సభ్యుల ముందుకు తీసుకెళ్లనున్నారు.
బ్రెగ్జిట్ మంత్రిగా డేవిస్ 2016లో నియమితులయ్యారు. యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగటం గురించి చర్చలు జరపటం ఆయన బాధ్యత. డేవిస్ రాజీనామా చేసిన కొద్ది సేపటికే జూనియర్ మంత్రి స్టీవెన్ బేకర్ కూడా రాజీనామా చేశారు.
ప్రస్తుత విధానం తీరుతెన్నులు, ఎత్తుగడలు చూస్తే అది యూరోపియన్ యూనియన్‌కు సంబంధించిన కస్టమ్స్ యూనియన్, సింగిల్ మార్కెట్‌ను వీడే అవకాశాలు తక్కువగా ఉన్నట్లు కనిపిస్తోందని ప్రధానమంత్రి థెరెసాకు రాసిన రాజీనామా లేఖలో డేవిస్ వ్యాఖ్యానించారు.
ప్రభుత్వ చర్చల విధానం.. ‘‘రాయితీల కోసం ఈయూ నుంచి మరిన్ని డిమాండ్లు రావటానికి దారితీయదని అంగీకరించలేకపోతున్నా’’నని ఆయన పేర్కొన్నారు. ‘‘ఈ పాలసీ దిశ.. చర్చల్లో మనల్ని బలహీనమైన స్థితిలో నిలుపుతుంది’’ అని అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, CROWN COPYRIGHT
థెరెసా ఆయనకు ఇచ్చిన సమాధానంలో.. ‘‘శుక్రవారం నాడు మంత్రివర్గంలో మనం అంగీకరించిన ప్రణాళిక గురించి మీరు చేసిన అభివర్ణనలతో నేను ఏకీభవించటం లేదు’’ అని చెప్పారు.
ఆయన వైదొలగటం పట్ల తాను ‘‘విచారం’’గా ఉన్నానని.. కానీ ‘‘ఈయూ నుంచి మనం విడిపోయే క్రమాన్ని రూపొందించటంలో ఆయన చేసిన కృషికి కృతజ్ఞతలు చెప్తున్నా’’నని పేర్కొన్నారు.
‘రాజీనామా తప్ప మార్గం లేదు’
బీబీసీ పొలిటికల్ ఎడిటర్ లారా క్యూన్స్‌బర్గ్
డేవిడ్ డేవిస్ బ్రెగ్జిట్ మంత్రి పదవికి రాజీనామా చేస్తారని చాలా నెలలుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. చివరికి ఆయన రాజీనామా చేశారు.
ప్రభుత్వం మీద ఆయన అసంతృప్తి విషయం అందరికీ తెలిసిందే. ఈయూతో తను కోరుకున్న దానికన్నా బలహీనమైన సంబంధాలు నెలకొల్పటానికి ప్రధానమంత్రి థెరెసా మంత్రివర్గంతో చెకర్స్ ఒప్పందం చేసుకున్న తర్వాత ఆయన తన వైఖరిని సమర్థించుకునే పరిస్థితిలో లేరు.
ఆదివారం ప్రధాని నివాసాన్ని సందర్శించిన అనంతరం ఇక తను వైదొలగటం మినహా ప్రత్యామ్నాయం లేదని ఆయన నిర్ధారణకు వచ్చారు. ఆయన రాజీనామా అనూహ్యమైనది కాకపోయినప్పటికీ.. ప్రభుత్వ బ్రెగ్జిట్ వ్యూహం ఎంత భద్రమైనదన్న దానిపై సందేహాలు రేకెత్తిస్తోంది.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








