బర్త్‌డే పార్టీ కోసం గుహలోకి వెళ్లి చిక్కుకుపోయారు

ఫొటో సోర్స్, Getty Images
జలదిగ్బంధ 'థామ్ లువాంగ్' గుహలో చిక్కుకున్న బాలుర ఫుట్‌బాల్ టీంను రక్షించేందుకు థాయిలాండ్ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకొంటోంది. అందులో భాగంగా మొట్టమొదట బాలలను ఒక్కరొక్కరికగా సురక్షితంగా బయటకు తీసుకొస్తున్నారు.
అయితే... పదిహేను రోజులుగా ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేసిన ఈ ఉదంతంలో అనేక ప్రశ్నలు వినిపిస్తున్నాయి. బాలురు ఆ గుహలోకి ఎందుకు వెళ్లారు..? ప్రమాదకర పరిస్థితుల్లో ఎలా చిక్కుకున్నారు వంటి ప్రశ్నలు అందరినీ వేధిస్తున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
ఈ బాలురు గుహలోకి ఎందుకు వెళ్లారు..?
గుహలో చిక్కుకోవడానికి ముందు జూన్ 23న ఉదయం ఈ బాలుర ఫుట్‌బాల్ జట్టు ప్రాక్టీస్ చేస్తున్న లైవ్ వీడియోను వారి అసిస్టెంట్ కోచ్ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. ఆ తరువాత మధ్యాహ్నం 3 గంటలకు గుహ ముఖద్వారం వద్ద 11 సైకిళ్లు ఉన్నట్లు 'థాయ్ లువాంగ్ -ఖున్నమ్ నాంగ్నాన్ నేషనల్ పార్క్' సిబ్బంది గుర్తించారు. ఫుట్‌బాల్ టీం కనపడకుండా పోయినట్లు రాత్రి 10 గంటలకు పోలీసులు తేల్చారు. అక్కడికి కొద్ది గంటల తరువాత రాత్రి ఒంటి గంట(జూన్ 24) నుంచి గాలింపు చర్యలు ప్రారంభించారు.
తమ జట్టులోని ఒక సభ్యుడి పుట్టినరోజు కోసం ఆయన్ను సర్‌ప్రైజ్ చేసేలా పార్టీ ఏర్పాట్లు చేసేందుకు వీరంతా గుహలోకి వెళ్లినట్లు చెబుతున్నారు.
వీరితోపాటు ఆ రోజు గుహలోకి వెళ్లని 'గేమ్' అనే అబ్బాయి దీనిపై స్థానిక మీడియాతో మాట్లాడుతూ... తాము ఇంతకుముందు మూడుసార్లు అందులోకి వెళ్లినట్లు చెప్పారు. అయితే, వర్షాకాలంలో ఎప్పుడూ వెళ్లలేదని ఆయన తెలిపారు.
''నాకు ఆ రోజు ఆరోగ్యం సరిగా లేకపోవడంతో నేను వెళ్లలేదు. మేం ఈ గుహలోకి ఎప్పుడు వెళ్లినా అవసరమైనవన్నీ తీసుకుని వెళ్తాం. ముందుగానే భోజనం చేసి అందులోకి వెళ్తాం, వెళ్లేటప్పుడు టార్చిలైట్లు మాతో పాటు తీసుకెళ్తాం. ఎవరైనా ఫిట్‌గా లేకపోతే వారిని తీసుకెళ్లం. శిక్షణలో భాగంగానే తామంతా అందులోకి వెళ్తుంటామని.. త్వరలో తమ టీం మేట్ ఒకరి పుట్టిన రోజు ఉండడంతో అక్కడ ఏర్పాట్లు చేసేందుకు వీరంతా వెళ్లారనుకుంటున్నాను'' అని గేమ్ చెప్పాడు.

ఫొటో సోర్స్, Getty Images
ఎలా చిక్కుకుపోయారు..?
ఫుట్‌బాల్ టీం గుహలోకి వెళ్లిన తరువాత కుంభవృష్టి మొదలైంది. కొండలపై నుంచి వర్షం నీరు వరదలా ముంచెత్తి గుహ ముఖద్వారంలోంచి నీరు లోపలికి వచ్చేసింది.
ఒక్కసారిగా నీరు నిండిపోవడంతో వీరంతా కాస్త ఎత్తయిన ప్రాంతానికి చేరి ప్రాణాలు రక్షించుకునే ప్రయత్నంలో గుహలో ఇంకా లోపలికి వెళ్లి చిక్కుకుపోయారు.
ఈ 'థామ్ లువాంగ్' గుహ థాయిలాండ్‌లోనే అత్యంత పొడవైన గుహ. ఇది మొత్తం 10,316 మీటర్ల పొడవున ఉంది. అంటే సుమారు 10 కిలోమీటర్ల మేర ఈ గుహ ఉందన్నమాట.

ఫొటో సోర్స్, Getty Images
పర్వతంగా మారిపోయిన రాకుమారి
'థామ్ లువాంగ్ ఖున్ నుమ్ నాంగ్ నాన్' గుహ గురించి స్థానికంగా ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. అసలు దానికా పేరు ఎందుకు వచ్చిందన్నది కూడా స్థానికులు కథలుకథలుగా చెబుతుంటారు. 'థామ్ లువాంగ్ ఖున్ నుమ్ నాంగ్ నాన్' అంటే... నదుల జన్మస్థలమైన పర్వతాన ఒక గొప్ప మహిళ నిద్రిస్తున్న గుహ అని అర్థం. దీని వెనుక ఓ కథ ఉందని చెప్తారు.
చియాంగ్ రూంగ్ నగరానికి(ప్రస్తుతం దక్షిణ చైనాలో ఉన్న జింగాంగ్ కావొచ్చు) చెందిన రాకుమారి ఓ అశ్వికుడి కారణంగా గర్భం దాల్చుతుంది. ఆ సంగతి తండ్రికి తెలిస్తే తమ ఇద్దరినీ చంపేస్తారన్న భయంతో ఆమె ప్రియుడితో కలిసి నగరాన్ని వదిలి దూరంగా పారిపోతుంది.
అక్కడ ఆమె ప్రియుడు ఆమెను ఒక రాతిపై కూర్చోబెట్టి తినడానికి ఏమైనా తేవడానికి వెళ్తాడు. అంతలో రాకుమారి తండ్రి తన మనుషులతో వచ్చి ఆమె ప్రియుడిని చంపేస్తాడు.
అతని కోసం చాలారోజుల పాటు ఎదురుచూసిన ఆమె చివరకు ఆయన్ను చంపేసుంటారని అర్థం చేసుకుని తాను కూడా కత్తితో పొడుచుకుని ప్రాణ త్యాగం చేస్తుంది.
ఆమె శరీరం ఒక పర్వతంలా మారిపోగా, కత్తి గాయం వల్ల కారిన రక్తం నదిలా మారుతుంది. ఆ నదిని 'నామ్ మేసాయ్' లేదా సాయ్ నది అని స్థానికంగా పిలుస్తారు. ఈ పర్వతంలోనే థామ్ లువాంగ్ గుహ ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
ఇంతకుముందు ఎవరైనా తప్పిపోయారా..?
ఇంతకుముందు కూడా ఈ గుహలో కొందరు తప్పిపోయారని స్థానికులు చెప్తున్నారు. 1986లో ఓ విదేశీ పర్యటకుడు గుహలో తప్పిపోయాడని.. ఏడు రోజుల తరువాత ఆయన్ను సురక్షితంగా రక్షించారని స్థానికులు చెబుతున్నారు. అయితే, అప్పుడు వర్షాలేమీ పడలేదని గుర్తు చేస్తున్నారు.
ఆ తరువాత 2016 ఆగస్టులో మెఫాలువాంగ్ యూనివర్సిటీకి చెందిన సుథిరోజ్ అనే మాజీ ప్రొఫెసర్ ఈ గుహలో ధ్యానం చేసుకోవడానికి వెళ్లి తప్పిపోయారు.
ఆయన కోసం ఎంత వెతికినా ప్రయోజనం లేకపోయింది. మూణ్నెళ్ల తరువాత ఆయనే బయటకొచ్చారని స్థానిక ప్రసారమాధ్యమాల రిపోర్టులు చెప్తున్నాయి.
మా ఇతర కథనాలు:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








