ఏడాది తర్వాత రాజలాంఛనాలతో థాయ్‌లాండ్ రాజు అంత్యక్రియలు

ఫొటో సోర్స్, AFP
ఏడాది క్రితం మరణించిన థాయ్‌లాండ్ రాజు ఫుమిఫోన్ అదున్యడే అంత్యక్రియలు ప్రారంభమయ్యాయి.
88 ఏళ్ల వయసున్నఆయన గత ఏడాది అక్టోబర్ 13న మృతి చెందారు.
బౌద్ధ సంప్రదాయం ప్రకారం ఆయన శవపేటికను ఒక రథంలో ఉంచి, రాజప్రాసాదం నుంచి అంత్యక్రియలను నిర్వహించే ప్రదేశానికి ఊరేగింపుగా తీసుకువెళతారు.
ఆయన కుమారుడు, ప్రస్తుత థాయ్‌లాండ్ రాజు మహా వచీరాలోంగ్‌కా తండ్రి చితికి నిప్పంటిస్తారు.

రాజు కోసం 'స్వర్గం'
తమ రాజుకు కన్నీటి వీడ్కోలు చెప్పడానికి థాయ్ ప్రజలు దారి పొడవునా పెద్ద ఎత్తున బారులు తీరారు.
ఆయన శవపేటికను మోయడానికి ఉపయోగిస్తున్న రథాన్ని 18వ శతాబ్దం నుంచి ఉపయోగిస్తున్నారు. 14 టన్నుల బరువున్న ఆ రథాన్ని 200 మందికి పైగా సైనికులు లాగుతారు.
ఆయన అంత్యక్రియల కోసం సుమారు ఏడాదిగా రాజప్రాసాదానికి దగ్గరలో స్వర్గాన్ని పోలిన భవన సముదాయాన్ని నిర్మించారు.
అనేక పౌరాణిక పాత్రలు, శుభసూచకమైన జంతువుల బొమ్మలతో దాన్ని అలంకరించారు.

తమ ప్రియతమ నేతకు కడసారి వీడ్కోలు పలికేందుకు చాలా మంది కొన్ని రోజుల క్రితమే రాజధానికి వచ్చేశారు.
అంత్యక్రియలకు దేశం నలుమూలల నుంచి సుమారు రెండున్నర లక్షల మంది హాజరవుతారని అంచనా.
సుమారు 40 దేశాల ప్రతినిధులు ఈ అంత్యక్రియలకు హాజరవుతున్నారు.
రాజు వచీరాలోంగ్‌కా రాత్రి సరిగ్గా 10 గంటలకు (భారత కాలమానం ప్రకారం రాత్రి 8.30 గంటలకు) తన తండ్రి చితికి నిప్పంటిస్తారు.

ఫొటో సోర్స్, AFP
అనేక రాజకీయ సంక్షోభాలు, తిరుగుబాట్ల నుంచి థాయ్‌లాండ్‌ను కాపాడారని, దేశాన్ని సుస్థిరత వైపు నడిపించారని రాజు ఫుమిఫోన్‌కు పేరుంది.
ఆయన మృతికి సూచకంగా గత ఏడాదిగా సంతాప దినాలుగా పాటిస్తున్నారు.
రాజు అంత్యక్రియలను అత్యంత నిష్టగా నిర్వహిస్తారు. రాచరికానికి ఎలాంటి అవమానం జరిగినట్లు అనిపించినా కఠినమైన శిక్షలు విధిస్తారు.
అంత్యక్రియలు ముగిశాక రెండు రోజుల పాటు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తారు.

ఫొటో సోర్స్, EPA
మా ఇతర కథనాలు:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








