ఖతార్ వలస కార్మికులకు కనీస వేతనాలు

ఫొటో సోర్స్, AFP
వలస కార్మికుల విషయంలో ఖతార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై వారికి కనీస వేతనాలు ఇవ్వాలని తొలిసారిగా నిర్ణయించింది. దీంతో పొట్టకూటి కోసం అక్కడికి వెళ్లిన భారతీయులకు ప్రయోజనం కలగనుంది.
నిజానికి కార్మికుల శ్రమ దోపిడీ ఆపాలని అంతర్జాతీయ కార్మిక సంస్థ - ఐఎల్వో ఇదివరకే ఖతార్‌ను హెచ్చరించింది. కార్మికుల హక్కుల రక్షణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో నవంబర్‌లోగా చెప్పాలని గడువు విధించింది. ఈ అంశంపై సమీక్షించేందుకు ఐఎల్వో సమావేశం కాబోతోంది. దాంతో ఐఎల్వో సమావేశానికి ఒకరోజు ముందు ఖతార్ ఈ నిర్ణయం ప్రకటించింది.
2022లో ఖతార్ రాజధాని దోహాలో ఫుట్‌బాల్ ప్రపంచ కప్ పోటీలు జరగనున్నాయి. అందుకోసం జరుగుతున్న నిర్మాణ పనుల్లో వేలాది మంది వలస కార్మికులు పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ దేశ కార్మిక చట్టాలపై అంతర్జాతీయ సమాజం దృష్టి సారించింది.
మా ఇతర కథనాలు:

ఫొటో సోర్స్, Getty Images
ఖతార్‌లో వలస కార్మిక చట్టాలు అత్యంత కఠినంగా ఉంటాయి. అక్కడ దశాబ్దాలుగా 'ఖఫాలా' అనే కార్మిక విధానం అమల్లో ఉంది.
దీని ప్రకారం వలస కార్మికులెవరైనా ఉద్యోగం మానేయాలంటే ముందు యజమాని అనుమతి తీసుకోవాలి. అంతేకాదు, దేశం వదిలి వెళ్లాలన్నా యజమాని పర్మిషన్ తప్పనిసరి.
అయితే, గతేడాది డిసెంబర్‌లో 'ఖఫాలా' విధానాన్ని రద్దు చేస్తున్నట్లు ఖతార్ ప్రకటించింది. ఇప్పుడు మరికొన్ని నిబంధనలను సడలించిందని కార్మిక సంఘాలు చెబుతున్నాయి. వాటి ప్రకారం..
- జాతితో సంబంధం లేకుండా అందరికీ కనీస వేతనాలు ఇవ్వడం
- ఖతార్ వదిలి వెళ్లడంపై కార్మికులకు స్వేచ్ఛ (ఇదివరకు యజమానులు అనుమతిస్తేనే వెళ్లాలి)
- వలస కార్మికులకు ధ్రువీకరణ పత్రాలను కంపెనీలు కాకుండా ప్రభుత్వమే జారీ చేస్తుంది.
- కార్మికులు-కంపెనీల మధ్య జరిగే పని ఒప్పందాలను కేంద్ర సంస్థ నిత్యం పర్యవేక్షిస్తుంది.
- పనిచేసే చోట ఉద్యోగుల కమిటీలు ఏర్పాటు చేస్తారు. ఫిర్యాదుల పరిష్కారానికి చర్యలు తీసుకుంటారు.
అయితే, కార్మికుల సంక్షేమం కోసం చేయాల్సింది ఇంకా చాలా ఉందని ఐసీటీయూ ప్రధాన కార్యదర్శి బుర్రో అన్నారు. త్వరలో ఖతార్ కార్మిక మంత్రితో ఈ అంశంపై చర్చిస్తామని చెప్పారు.
మా ఇతర కథనాలు:
కొత్త నిబంధనలు ఎప్పటి నుంచి అమలు చేస్తారో మాత్రం స్పష్టత ఇవ్వలేదు. ఖతార్‌లో సుమారు 20లక్షల మంది వలస కార్మికులు ఉంటారని అంచనా. వీరిలో 90 శాతం మంది ఆసియా దేశాల వాళ్లే. వీరంతా నిర్మాణ రంగంలో కూలీలుగా పనిచేస్తున్నారు. తెలుగు రాష్ర్టాల నుంచీ ఇక్కడకు ఎక్కువ మంది వెళ్తుంటారు. ఇక్కడ 6.6 లక్షల మంది భారతీయులున్నట్లు అంచనా.
2022 వరల్డ్ కప్ నిర్మాణ పనుల్లో సుమారు 1200 మంది కార్మికులు చనిపోయినట్లు 2013లో విడుదల చేసిన ITUC నివేదిక చెబుతోంది. ఇది ఎంతవరకు కరెక్టన్నది నిర్ధరించడం కష్టంగా మారింది. అయితే, మృతుల సంఖ్య ఇంకా ఎక్కువే ఉండొచ్చని 2015లో బీబీసీ చేసిన విశ్లేషణలో తేలింది.
ప్రపంచంలోనే అత్యంత ధనిక దేశం ఖతార్. ఈ దేశ విస్తీర్ణం హైదరాబాద్ కంటే కాస్త అటుఇటుగా రెట్టింపు ఉంటుంది. జనాభా మాత్రం హైదరాబాద్‌లో సగమే ఉంటుంది.
మా ఇతర కథనాలు:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








