ఉత్తరాదిలో రెండు లక్షల మంది తెలుగు వారు ఏమయ్యారు?

ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం, వలసలు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, విఘ్నేశ్. ఎ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

2018లో కేంద్ర ప్రభుత్వం 2011 జనాభా సర్వే ఆధారంగా దేశ జనాభాపై పలు రకాల సమాచారాన్ని విడుదల చేసింది.

దీని ప్రకారం 2001 జనగణనతో పోలిస్తే, 2011లో ఉత్తర భారతదేశంలో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం మాట్లాడే వారి సంఖ్య తగ్గింది. అదే సమయంలో దక్షిణ భారతదేశంలో హిందీ మాట్లాడే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది.

2001 సర్వేలో, ఉత్తర భారతదేశంలో తెలుగు మాట్లాడే ప్రజల సంఖ్య సుమారు 27.2 లక్షలు ఉండగా, 2011 నాటికి ఆ సంఖ్య 25 లక్షలకు తగ్గింది. అదే కాలంలో ఉత్తర భారతదేశంలో తమిళం మాట్లాడే వారి సంఖ్య సుమారు 8.2 లక్షల మంది నుంచి 7.8 లక్షలకు, మలయాళం మాట్లాడేవారి సంఖ్య 8 నుంచి 7.2 లక్షలకు తగ్గింది.

అయితే దక్షిణాది రాష్ట్రాలలో హిందీ మాట్లాడే వారి సంఖ్య మాత్రం గణనీయంగా పెరిగింది.

2001 జనాభా లెక్కల ప్రకారం, దక్షిణాది రాష్ట్రాలలో 58.2 లక్షల మంది ఉత్తర భారతదేశానికి చెందిన వారు ఉండగా, ఈ పదేళ్లలో వారి సంఖ్య సుమారు 20 లక్షలు పెరిగి 77.5 లక్షలకు చేరింది.

ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం, వలసలు

ఫొటో సోర్స్, Getty Images

ఉపాధి అవకాశాలు

దక్షిణాది రాష్ట్రాలలో హిందీ మాట్లాడే వారి సంఖ్య పెరగడానికి ప్రధాన కారణం ఇక్కడ ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉండడమే.

ఆర్థికవేత్త జయరంజన్, ''దక్షిణ భారతదేశంలో చాలా ఉపాధి అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ దానికి తగినంత మంది కార్మికులు లేరు. భారతదేశంలోని పశ్చిమ, దక్షిణ ప్రాంతాలను భారతదేశ 'గ్రోత్ ఇంజిన్'లుగా పేర్కొంటారు. ఈ ప్రాంతాలలో పని చేసేందుకు చాలా మంది అవసరం ఉంది. దానిని ఉత్తరాది నుంచి వచ్చేవారు పూరిస్తున్నారు'' అని వివరించారు.

దక్షిణ భారతదేశంలో పని చేసేందుకు ఉత్తర భారతదేశానికి చెందిన వారు రాకుంటే, అది ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? అనే ప్రశ్నకు జవాబిస్తూ జయరంజన్, ''ప్రధానంగా వీరంతా నిర్మాణ రంగంలో పని చేస్తున్నారు. వీళ్లే లేకుంటే నిర్మాణ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతుంది'' అని తెలిపారు.

అదే సమయంలో దక్షిణ భారతదేశంలో ఉత్తర భారతీయుల సంఖ్య పెరగడంతో కొన్ని రకాల కొత్త ఉపాధి అవకాశాలు కూడా పుట్టుకొస్తున్నాయి. దీనికి ఉదాహరణ దక్షిణాది నగరాలలో ఉత్తర భారతదేశపు ఆహారానికి సంబంధించిన రెస్టారెంట్లు పెరగడం.

దీనిపై జయరంజన్, ''ఇవాళ తమిళ ప్రజలు విదేశాలకు విస్తరించారు. అదే విధంగా ఇతర ప్రాంతాల ప్రజలు కొత్త ప్రదేశాలకు వెళ్లినపుడు, వారు తమ వెంట ఆహారం, సంగీతం, సంస్కృతి తదితర అంశాలను కూడా తీసుకెళతారు'' అని విశ్లేషించారు.

ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం, వలసలు

ఫొటో సోర్స్, DIBYANGSHU SARKAR

పెరుగుతున్న వలస కూలీల సంఖ్య

తమిళనాడులోని పశ్చిమ ప్రాంతమైన కోయంబత్తూర్, తిరుపూర్‌లాంటి ప్రాంతాలు పారిశ్రామికంగా చాలా అభివృద్ధి చెందాయి.

ఇక్కడి వస్త్ర పరిశ్రమలలో బంగ్లాదేశ్, నైజీరియా నుంచి అక్రమంగా వలస వచ్చిన వారు కూడా కనిపిస్తారు. పలు సందర్భాలలో వారిని అరెస్ట్ చేశారు కూడా.

ప్రభుత్వ గణాంకాల ప్రకారం, కొన్నేళ్లుగా ఇక్కడ వలస కార్మికుల సంఖ్య గణనీయంగా పెరిగింది.

ఈ ప్రాంతపు పారిశ్రామిక మండలి ప్రకారం, గత కొన్ని దశాబ్దాలుగా ఈ ప్రాంతం నుంచి వస్త్రాల ఎగుమతి పెరిగింది.

వస్త్రాల ఎగుమతికి సంబంధించి తిరుపూర్‌ను 'భారతదేశపు వస్త్ర రాజధాని' అని కూడా పిలుస్తారు. తిరుపూర్ ఎగుమతుల సంస్థ ప్రకారం, 2016-17లో 26 వేల కోట్ల ఎగుమతులు జరిగితే, 2017-18లో 24 వేల కోట్ల రూపాయల విలువైన ఎగుమతులు జరిగాయి.

ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం, వలసలు

ఫొటో సోర్స్, Getty Images

తిరుపూర్ ఎగుమతుల సంస్థ అధ్యక్షుడు రాజా షణ్ముఖం, ''ఇక్కడ నిరంతరం కార్మికుల అవసరం ఉంటుంది. అంతే కాకుండా, క్రమక్రమంగా వారి అవసరం కూడా పెరుగుతోంది. వారి వల్ల మాకు మంచి లాభాలు కూడా వస్తున్నాయి. గతంలో వీరంతా ఏజెంట్ల ద్వారా వచ్చేవాళ్లు. కానీ ఇప్పుడు ఈ ప్రాంతం గురించి వారికి అవగాహన పెరగడంతో వాళ్లకు వాళ్లే వస్తున్నారు'' అని బీబీసీకి తెలిపారు.

''గతంలో ఉత్తర భారతదేశం నుంచి కార్మికులు ఒంటరిగా వచ్చేవాళ్లు. కానీ ఇటీవలి కాలంలో వాళ్లు తమ కుటుంబాలతో సహా వచ్చేస్తున్నారు. అయితే మేం వాళ్లందరికీ నివసించడానికి తగిన ఇళ్లను ఏర్పాటు చేయలేకపోతున్నాం. ఇక్కడ కార్మికులకు మౌలిక సదుపాయాలు సరిగా లేవు. ప్రభుత్వం ఈ విషయంలో తగిన శ్రద్ధ తీసుకోవాలి'' అని ఆయన సూచించారు.

ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం, వలసలు

ఫొటో సోర్స్, Getty Images

వీళ్లు తిరిగి వెళ్లరు..

ఇప్పుడు క్రమక్రమంగా ఉత్తర భారతదేశంలో కూడా పరిశ్రమల సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఉత్తర భారతదేశానికి చెందిన వీరంతా తమ సొంత రాష్ట్రాలకు వెళ్లిపోతే, అది దక్షిణ భారతదేశపు పరిశ్రమలపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది.

అయితే షణ్ముఖం మాత్రం,'' ఎవరైనా ఒకే ప్రదేశంలో పదేళ్ల పాటు ఉంటే, అదే వాళ్ల నివాస స్థలంగా మారిపోతుంది. నేడు ఇక్కడ కూలీలుగా ఉన్నవారు రేపు యజమానిగా మారొచ్చు. అందువల్ల వాళ్లు తిరిగి వెళ్లరు'' అని విశ్లేషించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)