‘అమ్మా, నాన్నా.. డోంట్ వర్రీ' అంటూ తల్లిదండ్రులకు లేఖలు రాసిన గుహలోని బాలలు

ఫొటో సోర్స్, facebook/ekatol
రెండు వారాలుగా థాయ్‌లాండ్ గుహలో చిక్కుకుపోయిన పిల్లలు తమ తల్లిదండ్రులకు లేఖలు రాశారు. 'డోంట్ వర్రీ… వి ఆర్ ఆల్ స్ట్రాంగ్' అని వారికి తమ క్షేమ సమాచారం అందించారు.
ఫ్రైడ్ చికెన్ సహా, తమకు ఎలాంటి ఆహారం తినాలని ఉందో స్వదస్తూరితో రాసిన ఈ లేఖల్లో తల్లిదండ్రులకు వివరించారు ఆ బాలలు.
"టీచర్, మేం బయటకు వచ్చిన తర్వాత మాకు ఎక్కువ హోంవర్క్ ఇవ్వద్దంటూ" వాళ్లు తమ టీచర్‌ను కూడా వేడుకున్నారు. తనను క్షమించాలని తల్లిదండ్రులను కోరుతో మరో లేఖ రాశాడు ఈ బాలల ఫుట్‌బాల్ కోచ్.
జూన్ 23న కోచ్‌తో కలిసి గుహను చూడ్డానికి వెళ్లిన 12 మంది పిల్లలు వరద నీళ్లు రావడంతో లోపలే చిక్కుకుపోయారు.
"ఇప్పుడు అందరూ బాగానే ఉన్నారు. సహాయ బృందాలు మమ్మల్ని బాగా చూసుకుంటున్నాయి" అని కోచ్ ఎక్కపోల్ చంటవాంగ్ తల్లిదండ్రులకు పంపిన లేఖలో రాశారు.
"నేను పిల్లలను బాగా చూసుకుంటానని మీకు మాట ఇస్తున్నా. మాకు సాయం చేయడానికి వచ్చిన అందరికీ థాంక్స్. ఇలా జరిగినందుకు నన్ను క్షమించండి" అని పేర్కొన్నారు.
కంటెంట్ అందుబాటులో లేదు
మరింత సమాచారం కోసం Facebookఇతర వెబ్‌సైట్లలో సమాచారానికి బీబీసీ బాధ్యత వహించదు.పోస్ట్ of Facebook ముగిసింది
పిల్లలతో తల్లిదండ్రులను మాట్లాడించడానికి గుహ లోపలికి ఫోన్ లైన్ వేయాలనుకున్న అధికారుల ప్రయత్నాలు విఫలమయ్యాయి. దీంతో తల్లిదండ్రులు రాసిన లేఖలను పిల్లలకు అందించారు గజ ఈతగాళ్లు. మొదటి సారి కుటుంబ సభ్యుల నుంచి లేఖలు అందుకున్న పిల్లలు వాటికి జవాబు రాశారు.

ఫొటో సోర్స్, AFP/ROYAL THAI NAVY
గుహలో పరిస్థితి ఎలా ఉంది?
గత సోమవారం సహాయ బృందాలు గుహలో చిక్కుకుపోయిన పిల్లల ఆచూకీని గుర్తించాయి. వారంతా గుహ ప్రవేశ ద్వారం నుంచి దాదాపు 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిన్న ప్రాంతంలో ఒక రాయిపైన ఉన్నట్టు చెప్పాయి.
అప్పటి నుంచి థాయ్ బృందాలు, అంతర్జాతీయ ఈతగాళ్లు లోపల ఉన్న వారికి ఆహారం, ఆక్సిజన్, మందులు అందిస్తూ వస్తున్నారు. కానీ లోపల ఆక్సిజన్ స్థాయి అంతకంతకూ తగ్గిపోవడం సహాయ బృందాలకు ఆందోళన కలిగిస్తోంది. లోపల 21 శాతానికి బదులు ఇప్పుడు 15 శాతం ఆక్సిజన్ మాత్రమే ఉన్నట్టు వారు చెప్పారు.
మరోవైపు గుహలోకి గాలి పంపించడానికి ఒక ఎయిర్ పైప్ వేశామని థాయ్ అధికారులు చెబుతున్నారు.
శుక్రవారం లోపల ఉన్న వారికి ఆక్సిజన్ ట్యాంకులు అందించడానికి వెళ్లిన ఒక మాజీ డైవర్ చనిపోవడంతో పిల్లల పరిస్థితిపై ఆందోళన మరింత పెరిగింది.
పిల్లలను సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు సైన్యం, పౌరుల సహాయ బృందాలు ఆగకుండా పనిచేస్తూనే ఉన్నాయి. ఆదివారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో గుహలో మరిన్ని నీళ్లు నిండచ్చని అంతా భయపడుతున్నారు.

ఫొటో సోర్స్, EPA
అధికారులు పిల్లలను మొదట గుహలోపలే ఉంచి వర్షాకాలం ముగిసేవరకూ వేచిచూద్దామని అనుకున్నారు. అంటే నాలుగు నెలల తర్వాత వారిని బయటకు తీసుకురావాలని భావించారు. కానీ గుహలో ఆక్సిజన్ స్థాయి తగ్గిపోతుండడంతో వారిని కాపాడేందుకు ఇతర మార్గాలు వెతుకుతున్నారు.
గుహలో ఉన్న పిల్లలకు నడవగలిగే బలం ఉన్నప్పటికీ, వారు సురక్షితంగా ఈదలేకపోవచ్చని చాంగ్ రాయ్ గవర్నర్ సందేహాలు వ్యక్తం చేశారు.
పిల్లల ఆరోగ్య పరిస్థితి సాధారణ స్థితికి వచ్చిందని. లోపలికి వెళ్తున్న డైవర్లు వారికి ఎలా ఈదాలి, ఎలా శ్వాస నిలుపుకోవాలి అనేది నేర్పిస్తున్నారని ఆయన తెలిపారు.
ఇటు బయట ఉన్న సహాయ బృందాలు నేరుగా గుహలోకి చేరుకోడానికి వందకు పైగా రంధ్రాలు వేశాయి. వాటిలో 18 రంధ్రాలు ఉపయోగపడుతున్నాయి. వీటిలో ఒక రంధ్రం 400 మీటర్ల లోతులో వేశారు. కానీ పిల్లలు ఉపరితలానికి 600 మీటర్ల అడుగున ఉన్నట్టు అధికారులు భావిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- కొత్తగా పుట్టిన గ్రహం.. ఫొటోకి చిక్కింది
- సోషల్ మీడియా: కావాలనే యూజర్లను వ్యసనపరుల్ని చేస్తున్న కంపెనీలు
- ఇరాన్ మీడియా భాషలో 'ఫ్యామిలీ' అంటే..
- పవన్ కల్యాణ్‌తో విడాకుల తర్వాత రేణూదేశాయ్ జీవితం ఎలా గడిచింది? బీబీసీ తెలుగు ఇంటర్వ్యూ
- అప్పట్లో ఫుట్‌బాల్ అంటే హైదరాబాద్.. హైదరాబాద్ అంటే ఫుట్‌బాల్
- పాకిస్తాన్ అణుకేంద్రం గుట్టు ‘రా’ ఎలా కనిపెట్టింది?
- చెట్లు రహస్యంగా ఎలా మాట్లాడుకుంటాయో తెలుసా?
- భారత్‌లో 'వాట్సప్ హత్యలను' ఎవరు ఆపగలరు?
- టికెట్ కలెక్టర్ నుంచి ట్రోఫీ కలెక్టర్ వరకూ ఎంఎస్ ధోనీ జర్నీ
- స్పైడర్‌మ్యాన్ సహ సృష్టికర్త మృతి
- #లబ్‌డబ్బు: ఆన్లైన్లో ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేయండి ఇలా..
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








