ITReturns: ఈ రోజే ఆఖరు.. ఆన్‌లైన్‌లో రిటర్న్స్ దాఖలు చేయండి ఇలా

ఫైనాన్సియల్ ఇయర్ 2017-18 కి సంబంధించి ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్నులు దాఖలు చేయాల్సిన సమయం వచ్చేసింది. ఆల్రెడీ ఫైల్ చేస్తున్న వాళ్లకు ఈ విషయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే చాలా మందికి ఈ విషయాల్లో అనేక సందేహాలుంటాయి. ఐటీఆర్ ఫారం 1 ఆన్‌లైన్ ఫైలింగ్ ప్రాసెసింగ్ గురించి ఈ వారం లబ్ డబ్బులో చూద్దాం.
కొంతమంది ఐటీ రిటర్న్‌లు ఫైల్ చేసేందుకు చార్టర్డ్ అకౌంటెంట్ సహాయం తీసుకుంటారు. కానీ కొంతమంది స్వయంగా ఫైల్ చేస్తారు. ఇలా స్వయంగా ఆన్‌లైన్‌లో ఫైల్ చేయడం పెద్ద కష్టమేమి కాదు.
భారతదేశంలో ట్యాక్స్ కడుతున్న అతి కొద్ది మందిలో మీరూ ఒక భాగం. అది గర్వంగా చెప్పుకోవాలి. క్రమం తప్పకుండా నిజాయతీగా ట్యాక్స్ కట్టే వారందరికీ సలామ్.
ఐటీ రిటర్నులు దాఖలు చేస్తే లాభాలు
ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసే వారికి అనేక లాభాలుంటాయి.
అందులో మొదటిది.. టాక్స్ రిఫండ్ క్లెయిమ్ చేసుకోవచ్చు. టాక్స్ రిటర్న్ ఫైల్ చేసి ఈ ఫండ్ క్లెయిమ్ చేయాలి.
రెండోది.. గృహ, విద్య, వాహన రుణాలు పొందడం చాలా సునాయాసమవుతుంది.
మూడు.. మీ కొత్త ఇల్లు రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా సులభతరమవుతుంది.
నాలుగోది.. మీరు వీసా పొందటం ఈజీ అవుతుంది.
ఇక ఐదో అడ్వాంటేజ్ ఏంటో చూద్దాం. ఇది లైఫ్ ఇన్సూరెన్స్‌కు సంబంధించినది. మీరు జీవిత బీమా తీసుకోవాలంటే మీ ఐటీఆర్ కాపీ సమర్పిస్తే ప్రాసెస్ ఈజీ అయిపోతుంది.

ఎప్పట్లోపు దాఖలు చేయాలంటే..
కొన్ని ముఖ్యమైన అంశాలు కూడా దృష్టిలో ఉంచుకోవాలి. మీరు సమయానికి ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయాలి. లేదంటే జరిమానా పడుతుంది. ఈ సంవత్సరం ఆగస్టు 31 లోపు రిటర్న్స్ ఫైల్ చేయకపోతే జరిమానా కట్టాల్సి ఉంటుంది.
అలాగే మీరు ఇప్పటిదాకా టాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయకపోతే వెంటనే చేయండి. అయితే మీకు కొద్దిగా ఎక్కువ వడ్డీ కూడా పడుతుంది. కట్టాలి మరి. తప్పదు. అయితే ఈ వడ్డీలు, జరిమానాల గోల వద్దనుకుంటే సమయానికి రిటర్న్స్ దాఖలు చేసేయండి.
అయితే రిటర్న్స్ దాఖలు చేసేటపుడు మీరు ఏవైనా ముఖ్యమైన లావాదేవీల వివరాలను చేర్చడం మరచిపోయారా? మరేం ఫర్వాలేదు. రివైజ్డ్ రిటర్న్స్‌లో మళ్లీ ఆ వివరాలు చేర్చవచ్చు.

అసలు ఆదాయపు పన్ను రిటర్న్స్ అంటే ఏంటి?
ఇన్ని సార్లు ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అని అంటున్నారు.. అసలు ఈ రిటర్న్స్ అంటే ఏంటి అనే సందేహం కొంతమందికి రావొచ్చు. మాకు తెలుసులే ఐటీ రిటర్న్స్ అంటే ఏంటో అని మీలో కొంతమంది అనవచ్చు. ఇది మీ కోసం కాదు.. తెలియని వారికోసం..
ఐటీ రిటర్న్స్ అనేది ఆదాయపు పన్ను శాఖకు సంబంధించిన డాక్యుమెంట్. అందులో మీ ఆదాయం, మీకు బిజినెస్ ఉంటే అందులో వచ్చిన లాభాలు, నష్టాలు, ఇంకా ఏమైనా లావాదేవీలు ఉంటే ఆ వివరాలన్నీ ఉంటాయి. సింపుల్‌గా చెప్పాలంటే అంతే.

ఎలా దాఖలు చేయాలి?
ఇక దాన్ని ఎలా దాఖలు చేయాలి అంటే.. ముందుగా మీకు ఏ ఐటీఆర్ ఫారం సరిపోతుందో చూసుకోవాలి. అంటే మీరు జీతం పొందే ఉద్యోగులనుకోండి, లేదా మీ ఆదాయం మొత్తం ఏడాదికి యాభై లక్షల రూపాయల కంటే తక్కువ ఉందనుకోండి మీరు ఐటీఆర్ ఫారం 1 నింపాలి. అలా వ్యాపారస్తులు, స్వయం ఉపాధి పొందుతున్న వ్యక్తులు.. ఇలా రకరకాల మార్గాల్లో ఆదాయం పొందే వారికి రకరకాల ఫారాలు ఉన్నాయి.
మీరు ఐటీఆర్ ఫారాన్ని ఇంగ్లిష్ లేదా హిందీలో దాఖలు చేయవచ్చు.
ఇవి దగ్గర పెట్టుకోండి
అయితే రిటర్న్స్ ఫైల్ చేసే ముందు ఈ పది పత్రాలు రెడీగా ఉంచుకోవాలి.
- ఫారం 16
- శాలరీ స్లిప్
- బ్యాంకులు లేదా పోస్ట్ ఆఫీసుల నుంచి వడ్డీలకు సంబంధించి సర్టిఫికెట్
- ఫారం 16 ఏ / ఫారం 16 బీ / ఫారం 16 సీ
- ఫారం 26ఏఎస్
- పన్నులపై సేవింగ్స్‌కు సంబంధించిన ఆధార పత్రాలు
- సెక్షన్ 80 డీ - 80యూ కి సంబంధించిన మినహాయింపు పత్రాలు
- బ్యాంకు/ ఎన్‌బీఎఫ్‌సీల నుంచి గృహ రుణ గుర్తింపు పత్రం
- క్యాపిటల్ గెయిన్స్ వివరాలు
- ఆధార్ కార్డు వివరాలు



ఆన్‌లైన్‌లో ఐటీ రిటర్నులు దాఖలు చేయటం ఎలా?
ఆదాయపు పన్ను రిటర్న్స్ ఆన్‌లైన్‌లో కూడా దాఖలు చేయవచ్చు. అలా చేయాలంటే ముందు ఆదాయపు పన్ను శాఖ వెబ్‌సైట్‌లో రిజిస్టర్ అవ్వాలి. ఆ తరువాత ఈ-ఫైలింగ్ సెలెక్ట్ చేసి, టాక్స్ రిటర్న్స్ సెలెక్ట్ చేసి, అసెస్‌మెంట్ ఇయర్ 2018-19లో ఐటీఆర్ 1 ఫారాన్ని నింపాలి.
ఆ ఫారం దాఖలు చేసే విధానాన్ని కూడా ఎంచుకోవాలి. ఇందులో ఆన్‌లైన్‌లోనే ఫారాన్ని నింపి, ఆన్‌లైన్‌లోనే దాఖలు చేసే ఆప్షన్ ఎంచుకోవచ్చు.
ఇక్కడే మీరు మీ ఐటీ రిటర్న్ ఏ విధంగా వెరిఫై చేస్తారో కూడా సెలెక్ట్ చేయాలి. ఇవి రెండు రకాలు. ఆధార్ లేదా నెట్ బ్యాంకింగ్. ఈ రెండూ కాదనుకుంటే ఐటీఆర్ వెరిఫికేషన్ ఫారంపై సంతకం చేసి బెంగుళూరు సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్‌కు పోస్టు చేయాలి. ఐటీఆర్ వెరిఫికేషన్ అనేది మొత్తం ప్రాసెస్‌లో చివరి స్టెప్.
ఐటీఆర్ ఆన్‌లైన్ ఫైలింగ్‌కు సంబంధించి మీరు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన ఏడు అంశాలు..
- సాధారణ సూచనలు
- ఆదాయం సమాచారం
- మినహాయింపు వివరాలు
- ఆదాయపు పన్ను గణన
- టీడీఎస్, ఇతర పన్ను చెల్లింపుల సమాచారం
- మీ బ్యాంకు వివరాలు
- ధృవీకరణ
కాబట్టి కంగారు పడకుండా మీ ఆదాయపు పన్ను రిటర్న్స్ ఫైల్ చేయండి. అది కూడా సమయానికి చేయండి. గుర్తుంది కదా ఆగస్ట్ 31 లోపు ఫైల్ చేయాలి.
ఇవి కూడా చూడండి:
- లబ్..డబ్బు: దొంగతనాలు , ఫ్రాడ్ల నుంచి ఎలా రక్షించుకోవాలి?
- లబ్..డబ్బు: డిస్కౌంట్లు, ఆఫర్ల వలలో పడుతున్నారా?
- #లబ్‌డబ్బు: గోల్డెన్ వీసా అంటే ఏంటి? ఇది పొందడం ఎలా?
- చైనా యువతుల లైవ్ స్ట్రీమింగ్.. ఆదాయం నెలకు రూ.23 లక్షలు
- చైనా: సినీ నటుల పారితోషికాలపై పరిమితి విధించిన ప్రభుత్వం
- 2022 నాటికి రైతులకు రెట్టింపు ఆదాయం: మోదీ కల నిజమయ్యేనా?
- టీడీపీ, వైసీపీ, టీఆర్ఎస్లకు నిధులు ఇలా వచ్చాయ్
- ప్లాస్టిక్‌తో పెట్రోల్ తయారు చేస్తున్న హైదరాబాదీ ప్రొఫెసర్
- పాకిస్తాన్: పదేళ్లకే స్టార్టప్ పెట్టింది.. ప్రపంచాన్ని రక్షిస్తానంటోంది!!
- బీసీసీఐ ప్రపంచంలోనే అత్యంత సంపన్న క్రీడా సంస్థా?
- నార్వే: జీతాల దాపరికంలేని దేశం
- బీజేపీ ఆస్తుల్లో 6 రెట్ల పెంపుదల
- పెట్రోల్ ధర ఎందుకు పెరుగుతోంది?
- అమెరికా ఆంక్షలు ఎత్తివేస్తే ఉత్తర కొరియాలో సామాన్యుడికి ఏంటి?
- కప్పు కాఫీ తాగాలంటే నాలుగు కట్టల డబ్బు కావాలి!
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









